Menu

Werckmeister Harmonies – ఒక చింతన

పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా ఉపయోగపడుతుందని నాకనిపించింది. Tarkovsky సినిమాలు చూసినప్పుడు అనుభవానికి వచ్చిన ఈ ’వర్ణణాతీతమైన’ అనుభవం మరో దర్శకుని సినిమాల ద్వారా కలుగుతుందా? Tarkovesky లాగా ప్రతి సినిమా ను “ఇది నా సినిమా” అని చెక్కుచెదరని signtaure షాట్స్ తో సినిమా రూపొందించగలిగిన ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న నా ఆన్వేషణ Bela Tarr సినిమాలు చూడడంతో ముగిసిందనడంకంటే మరో సారి మొదలయిందని చెప్పాలి.వర్ణణాతీతం అని ఒక వైపు చెప్తూనే ఈ సినిమా గురించి మాట్లాడడం పెద్ద ఐరనీ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని టెక్నికల్ విషయాలు, facts, ఇతర సమీక్షలు/పరిచయాల నుంచి excerpts మాత్రమే ఇక్కడ పొందుపరిచి తద్వారా ఈ సినిమాని చూడమని మరింతమందిని ప్రోత్సాహించడమే ఈ వ్యాసం లక్ష్యం అని పాఠకులు గుర్తించవలసిందిగా మనవి. మీకు సీరియస్ సినిమాలంటే ఇష్టం వుండి, Tarkovsky, Antonioni, Fellini, Davind Lynch లాంటి cryptic సినిమాలు మీకు ఇష్టమైతే మీకీ సినిమాకూడా తప్పకనచ్చుతుంది. అలాంటి వాళ్ళకు నా సలహా ఎంటంటే ముందీ సినిమా చూసి ఆ తర్వాత ఈ వ్యాసం చదవితే మేలు.

కథ: తన సినిమాల్లో కథల గురించి చెప్తూ, Bela Tarr ఇలా అన్నారు,

“I despise stories, as they mislead people into believing that something has happened. In fact, nothing really happens as we flee from one condition to another … All that remains is time. This is probably the only thing that’s still genuine — time itself; the years, days, hours, minutes and seconds.”

అంత చక్కగా కథలంటే నాకు అసహ్యం అని చెప్పే దర్శకుడి సినిమాలో కన్వెన్షనల్ సినిమాలలాగా కథ ఇది అనీ చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ ఈ సినిమా László Krasznahorkai అనే హంగేరియన్ రచయిత రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది కాబట్టి ఎంతో కొంత కథ వుందనే చెప్పాలి. కానీ ఆ కథ కూడా అప్పటి హంగేరియన్ సమాజంలోని అంశాలను metaphorical గా స్పృశిస్తుంది తప్పితే ఒక హీరో వుంటాడు, ఒక విలన్ వుంటాడు టైప్ లో “కట్టె, కొట్టె తెచ్చె” అంత సులభంగా వుండదు. అంతా సింబాలిక్ గానే వుంటుంది.

ఇక కథాంశంలోకి వస్తే, హంగరీ లోని ఒక చిన్న ఊర్లో ఒక శీతాకాలపు సాయంత్రం నాడు సినిమా మొదలవుతుంది. ఊర్లోకి త్వరలో రాబోయే ఒక సర్కస్ లో ప్రపంచం లోనే అతి పెద్దదైన తిమింగళాన్ని, దాంతో పాటు ప్రిన్స్ అనే విచిత్రమైన వ్యక్తిని ప్రదర్శించబోతున్నారని ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకో తెలియదు ప్రజలు ఈ సర్కస్ గురించి వివిధ రకాలుగా చెప్పుకుంటారు. ఈ సర్కస్ రావడంతో తమ జీవితాల్లో దుష్పరిణామాలు ఏర్పడుతాయని చెవులు కొరుక్కుంటుంటారు. ఈ వింత చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చి, ఆ పట్టణపు నడిబొడ్డులో గుమిగూడడంతో ఆ పట్టణం శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని అందుకు చర్యలు తీసుకోవాలని ఒక యువతి ప్రయత్నాలు మొదలుపెడ్తుంది. అందుకు తన మాజీ భర్త సాయం కోరుతుంది. అతను కాదంటే, ఒకప్పుడు అతని కోరికపై ఇళ్ళు వదిలిన ఆమె, మరలా పెట్టే బేడా సర్దుకుని అతనింటికి తిరిగి చేరుతుందని బెదిరిస్తుంది కూడా. ఈ లోగా జనాలు అదుపు తప్పి పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తారు. ఇదంతా మనం వలుష్కా అనే పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. టూకీగా చెప్పాలంటే ఇదీ ఈ సినిమాలోని అంశం.

నా అభిప్రాయం: ముందే చెప్పినట్టు ఈ సినిమా కథ/అంశం ఒక్కసారి సినిమా చూడడంతో అర్థం కాదు. అలా అని నాలుగైదు సార్లు చూస్తే అర్థమవుతుందన్న గ్యారంటి ఏమీ లేదు. ఈ సినిమా చూసే ముందు కావాలనే నేను ఈ సినిమా గురించి ఏమీ రీసెర్చ్ చెయ్యలేదు. కేవలం ఇది ఒక మంచి సినిమా, కల్ట్ సినిమా అని మాత్రం తెలుసుకొన్నాను. అంతకు మించి మరేమీ తెలియదు. కాకపోతే ఈ సినిమా చూశాక చదివిన ఇతర సమీక్షలు, హంగరీ చరిత్ర ఈ సినిమాను మరోసారి చూసేలా చేసాయి. అప్పుడు ఈ సినిమా లో చర్చించిన అంశాలు కొంచెం క్లియర్ గా అర్థమయ్యాయి.

ఈ సినిమా మొదలవ్వడం ఒక పబ్ లో మొదలవుతుంది. బాగా మందు తాగి కిక్కేక్కిసిన కొంతమందికి మన Solar System ఎలా ని చేస్తుందనే విషయాన్ని వలుష్కా వాళ్లకి పరిచయం చేస్తాడు. అందుకు ఒకతన్ని సూర్యుడుగాను, మరొకతన్ని భూమి గానూ, ఇంకొకతన్ని చంద్రుని గానూ పాత్రలిచ్చి వారి చేత సూర్యగ్రహణం ఎలా జరుగుతుందో చేసి చూపిస్తాడు.

ఈ సినిమాలో ఈ గ్రహణం అనే అంశం మరి కొన్ని సార్లు కూడా వస్తుంది. ఈ గ్రహణం అనేది అప్పట్లో(1989) హంగరీలో త్వరలో రాబోతున్న విప్లవానికి సింబాలిజం అనిపించింది. అలా అనిపించడానికి కారణాలు:

 • ఈ సినిమాకి ఆధారమైన పుస్తకం ప్రచురించిన కాలం1989.
 • 1989 లో రష్యన్ మిలిటరీ దళాలు హంగరీ ని వదిలివెళ్ళడం మొదలయింది.

అలాగే పబ్ లో గ్రహణం గురించి వివరిస్తూ వలుష్కా ఇలా అంటాడు,

“The sky darkens, then goes all dark.The dogs howl, rabbits hunch down, the deer run in panic, run, stampede in fright. And in this awful, incomprehensible dusk, even the birds … the birds too are confused and go to roost. And then … complete silence. Everything that lives is still. Are the hills going to march off? Will heaven fall upon us?”

ఈ డైలాగ్ ద్వారా త్వరలో రాబయే విప్లవం(కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా) ఒక గ్రహణం (విప్లవం హింసాత్మకం కావొచ్చు కాబట్టి) లాంటిది. అయితే అంత మాత్రాన ఉద్యమం తర్వాత అంతా చీకట్లు అలముకుంటాయా? అని ఇక్కడ వలుష్కా ప్రశ్నిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ముఖ్యాంశం ఏంటో తెలుసుకోడానికి నాకుపయోగపడ్డ మరో సీన్-Gyorgy అనే పాత్ర చెప్పే ఒక మోనోలాగ్. ఈయన మోనోలాగ్ ద్వారానే ఈ సినిమాకా పేరెందుకు పెట్టారో కూడా అర్థమయింది.ఈ సినిమాలో Gyorgy ఒక మ్యూజికాలజిస్ట్.అతని మాటల ప్రకారం ఈ ప్రపంచంలో ప్రస్తుతం వున్న చాలా ఫిలసాఫికల్ సమస్యలకు కారణం Werckmeister అనే పదిహేడవ శతాబ్దపు సంగీత శాస్త్రజ్ఞుడు. ఈయన 1687-1691 ల మధ్యలో రచించిన పుస్తకాల్లో ప్రస్తావించిన ’well temperament’  అనే అంశంలో సంగీత వాద్యాలను సరిగా ట్యూన్ (శృతి) చేసే పద్ధతులను పేర్కొన్నారు. ఇప్పటకీ అందరూ ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు కూడా! అయితే Werckmeister సిద్ధాంతపరిచిన ఈ ట్యూనింగ్ సిస్టమ్ తప్పని, మనందరం అది వాడుతున్నాం కాబట్టే మనకీ సమస్యలనీ అభిప్రాయపడతాడు Gyorg.

ఆ మోనోలోగ్ వీడియో ఈ క్రింద చూడవచ్చు.

ఈ సీన్లో ప్రస్తావించింది సంగీత శాస్త్రం లోని అంశాలైనప్పటికీ నాకెందుకో అది కమ్యూనిస్టు సిధ్ధాంతాలకు సింబాలిజమ్ అనిపించింది.  కమ్యూనిస్ట్ సిధ్దాంతంలో పేర్కొన్న equality అనే అంశం Werckmeister సిద్ధాంతపరిచిన ఈ ట్యూనింగ్ సిస్టమ్ కు సింబాలిజం అని నా అభిప్రాయం.

ఈ సినిమాలోని రెండు ముఖ్యమైన సీన్లను విశ్లేషించడం ద్వారా నాకర్థమయిన విషయాలు కొన్ని ఇక్కడ ప్రస్తావించాను. ఇదే సరైన విశ్లేషణ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఒక వేళ మీరు సినిమా చూసుంటే మీ అబిప్రాయాలు ఇక్కడ చెప్తే చర్చించవచ్చు.

ఈ సినిమా గురించి మరి కొన్ని అంశాలు:

 • సాధారణంగా ఏ సినిమాకైనా టైటిల్స్ వేసేటప్పుడు దర్శకుని పేరు చివర్లో సింగిల్ కార్డ్ లో వేస్తారు. కానీ ఈ సినిమాలో దర్శకుడు, రచయిత, ఎడిటర్ల పేర్లు ఒకే కార్డులో కలిపి వేశారు. అలా చేయడం ద్వారా సినిమాలోని టెక్నీషియన్స్ కి దర్శకునితో సరైన స్థానం కల్పించారు Bela Tarr. గతంలో Citizen Kane సినిమాకి కూడా Orson Wells ఇలాగే చేశారు.
 • ఈ సినిమా పూర్తి బ్లాక్ అండ్ వైట్ లో వుంటుంది. బెలా టర్ ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండడం విశేషం. అసలు ఈ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్ లో వుండివుంటే అంతగా బావుండేవి కాదని నా అభిప్రాయం.
 • ఈ సినిమా లో ముఖ్యంగా ప్రస్తావించవలసిన అంశాల్లో ఒకటి. స్టడీ క్యామ్ కెమెరా, ట్రాకింగ్ షాట్స్ స్టడీ చేయాలనుకునే వాళ్ళకు ఈ సినిమా మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు.అన్నట్టు ఈ సినిమాకి ఏడుగురు సినిమాటోగ్రాఫర్ లు పనిచేశారట!
 • ఈ సినిమా నిడివి 145 నిమిషాలు. అదేం గొప్ప విషయం కాదనుకోండి. కాకపోతే 145 నిమిషాల ఈ సినిమాలో ఉన్నవి కేవలం 39 షాట్లు.ఈ సినిమాలో మొదటి షాట్ 11 నిమిషాలపైనే వుంటుంది. నిజానికి ఫిల్మ్ రోల్  ఏకధాటిగా 11 నిమిషాలే రికార్డు చేయగలగడం అనే పరిమితి ఉంది కానీ అలా కాకుంటే ఒకే షాట్ లో సినిమా నిర్మించి వుండేవాడేమో Bela Tarr.
 • Bela Tarr సినిమాలు ఇలాంటి లాంగ్ టేక్స్ కి పెట్టింది పేరు. ప్రపచంలో పది ఉత్తమ లాంగ్ టేక్స్ లెక్కపెడితే అందులో Bela Tarr సినిమాల్లోవి మూడు నాలుగైనా వుంటాయి. ఒక విధంగా ఈ సినిమాలో లాంగ్ టేక్స్ కి ఇన్స్పిరేషన్ ఈ సినిమాకు ఆధారమైన నవలనుంచే వచ్చి వుండొచ్చు. ఈ నవలలో కూడా పారాగ్రాఫులూ గట్రా లేకుండా ఒక్కో అధ్యాయమూ పది పదిహేను పేజీలు సాగుతుందట!
 • Director Béla Tarr spent almost a year finding the right square for some scenes in the film.
 • During the shooting the temperature dropped to -15 degrees Celsius.
 • In September 2007, film critic Roger Ebert added the film to his “Great Movies” list, making it third of only four post-2000 films in the list, the others being Ripley’s Game, Pan’s Labyrinth, and Babel.
 • ఇక చివరిగా ఈ సినిమాలోని సంగీతం చాలా బావుంది. సినిమా చూసినప్పుడు నాకనిపించలేదు కానీ Jeremy Heilman అనే ఫిల్మ్ క్రిటిక్ గమనించిన ఈ అంశం నాకు నచ్చింది. ఈ సినిమా సంగీతం గురించి ఆయనేమటారంటే,”The only questionable moments in the film come when Tarr uses a score to underline his emotional impact. Since the film argues all music is inherently false, the score seems to be used ironically, at best (unless I am just tone deaf and it was meant to come from György’s specially tuned piano).

ముగింపు: చివరిగా చెప్పొచ్చేదేమిటంటే చాలా రోజులుగా ప్రపంచం అలక్ష్యం చేస్తూ వచ్చిన అత్యుత్తమ సినిమా దర్శకుడు Bela Tarr. వినోదం కోసం ఈయన సినిమలు చూడడం కష్టమే అయినా ఒక అద్భుత అనుభూతి పొందడానికి మాత్రం ఈయన సినిమాలు చూడొచ్చు. ఈ మధ్యనే ఈయన సినిమాలు DVD రూపంలోనూ అందుబాటవుతున్నాయి కనుక Bela Tarr సినిమాల ద్వారా ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టండి.

3 Comments
 1. cric September 18, 2009 /
 2. su September 19, 2009 /