Menu

Soul Kitchen – ‘ఆత్మ’గల వంటిల్లు

 

సోల్ కిచెన్ – ‘ఆత్మ’గల వంటిల్లు.   🙂    ఆత్మ అనగానే ఏదో దెయ్యాల సినిమా అనుకుంటున్నారా అబ్బే కాదండీ.. ఇదో సరదా కథ. బలమైన కథనం…సన్నని భావోద్వేగాలు ఉన్న హాస్య భరిత సినిమా ఇది.

” నేను నాకు సినిమా తీయాలని అనిపించినపుడు మాత్రమే సినిమాలు తీస్తాను.అదీ  ఆప్పటి  మూడ్ ని  బట్టి . ఇప్పటివరకూ  ‘ఎడ్జ్ ఆఫ్ హెవెన్‘  లాంటి సీరియస్ సినిమాలుతీసాను. సీరియస్నెస్ కి బానిస అయ్యా. ఎడ్జ్ ఆఫ్ హెవెన్ తీస్తుండగా  స్నేహితుడయిన సినిమా నిర్మాత  చనిపోయాడు. అరునెలలు బాధ పడ్డాను.  కానీ జీవితం అన్నింటికీ అతీతమైనది. చావు జీవితంలో భాగం.   నవ్వటం జీవితానికి అవసరం  అనిపించింది. అందుకే  “సోల్ కిచెన్ తీసా ” అంటాడు దర్శకుడు.  ఓ సారి మిత్రుడి రెస్టారెంట్ కి వెళ్లాను. భలే సందడిగా ఉండే అక్కడ కస్టమర్లనీ ..వెయిటర్లనీ..ఓనర్నీ..ఇలా రక రకాల వ్యక్తులని గమనించాక ఒకరితో ఒకరు తమకే తెలియకుండా  ప్రేమగా  ఉన్నారనిపించింది. వాళ్ళంతా ఆ రెస్టారెంట్ ని ప్రేమిస్తున్నారనిపించింది. అప్పుడే సోల్ కిచెన్ కి బీజం పడింది అంటాడు.

కథ ఎలాంటిదయయినా దానిమూలాలు .స్పూర్తీ నిజ జీవితంలోనుంచే రావాలి అప్పుడే అది నేలవిడిచి సాము చేయదు. సో  నిజ జీవిత స్పూర్తి  తో రాసిన కథ కనక  బానే ఉండుంటుంది కదూ..

ఇహ కథలోకి తొంగిచూస్తే ….

హీరో ‘జినో’ ఒక గోడౌన్ లాంటి ప్రదేశాన్ని కొని అక్కడ రెస్టారెంట్ నడుపుతుంటాడు. పెద్దగా సాగదు వ్యాపారం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అదే గొడౌన్ లో ఒక రూంలొ ఒక ముసలాడు పడవ రిపేరింగ్ చేసుకుంటాడు. కానీ డబ్బులివ్వలేడు.అప్పుడప్పుడు ఒక రాక్ బాండ్ అక్కడ ప్రాక్టిసు చేసుకుంటుంది. కానీ డబ్బులివ్వదు. పన్ను కట్టలేదని టాక్స్ ఆఫీసర్స్ ఉన్న మ్యూజిక్ సిస్టం ని ఎత్తుకెళ్ళి పోతారు.
సరిగ్గా అప్పుడే   ప్రియురాలు పనిమీద  షెంగాయ్ వెళ్ళిపోతుంది. ఆమెని వీడలేడు..కానీ తప్పదు. తనకీ ఆమెతో వెళ్లాలని ఉంటుంది.   కానీ వెళితే తన రెస్టారెంట్ ఏమైపోవాలీ ??  అమెతో ‘స్కైపీ’ లో మాట్లాడుతుంటాడు. రెస్టారెంట్ ని అమ్మేసివెళదామంటే   అమ్మాలనిపించదు. లీజుకి ఇచ్చేద్దాం ఎవరికైనా అని ఆలోచిస్తుంటే,  జైలునించి లీవు తీసుకొని తమ్ముడు ఇలియాస్ వస్తాడు..అసలే  వ్యాపారం లేదు.. కానీ రెస్టారెంట్లో పని చేస్తున్నట్టు సర్టీఫికెట్ ఇవ్వు అంటాడు. తాను జైలు పక్షినని ఎవ్వరికీ చెప్పొద్దంటాడు. జినో  ‘ న్యూమన్’  ఒక చిన్ననాటి సహపాటిని కలుస్తాడు . అతడు ఈ రెస్టారెంట్ ని చూసి దానిమీద కన్నేస్తాడు. కొనేసి ఏదో పెద్ద భవనం కట్టాలని ఆశ పడతాడు. అప్పుడప్పుడూ అదేవిషయం అడుగుతుంటాడు.

ఓ రోజు  హీరో ఎదో బరువులు ఎత్తబోతే నడుంపట్టేసి   బాక్ పెయిన్ వస్తుంది. నడవలేడు..మెడీకల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు.కనక నయం చేయించుకోలేడు. అయితే ప్రియురాలు ఫిజియోథెరపిస్ట్  ‘అన్నా’  దగ్గరికి వెళ్లమని చెపుతుంది. నొప్పి తీవ్రత ఎక్కువ గా ఉండటం వల్ల నిలబడలేడు.. వండలేడు…అందుకే   ఇదివరకు మరో రెస్టారెంట్ లో పనిలోంచి తీసివేయబడిన ఒక సూపర్ స్టబార్న్ చెఫ్ శ్యాన్ ని పిలుస్తాడు. అతనొచ్చి మెనూ మారుస్తాడు…కొత్తమెనూ చూసి అదివరకొచ్చే నలుగురూ బయటికి వెళ్లి పోతారు. కస్టమర్లు ఉండరు ..పని లేదు. ఖాలీగా ఉండలేక వంటలు నేర్చుకుంటాడు  శ్యాన్ తో.

ఓ రోజు తన దొంగమిత్రులతో కలిసి   తమ్ముడు ఎత్తుకొచ్చేసిన మ్యూజిక్ సిస్టం తో మెల్లిగా సంగీతం మొదలెడతారు రెస్టారెంట్ లో..  రాక్ బాండ్ వంతపాడుతుంది. కస్టమర్లు ఒక్కోరు లోపలికి నడుస్తారు..ఫుడ్ ఆర్డరిస్తారు. శ్యాన్ వంటలకి గిరాకీ బాగా పెరుగుతుంది. రోజు రోజుకీ అక్కడ పండగ వాతావరణం చోటుచేసుకుంటుంది.  ఓ నాడు  శ్యాన్ ఒక వంటకంలో ఒక మసాలా దినుసు కలపటం వల్ల..అది అందరిలోనూ ఉత్సాహాన్నీ,  కామ ప్రవృత్తినీ ప్రేరేపిస్తుంది.

అంతా బావుందీ అనుకుంటుండగా  ప్రియురాలు కొంచం ఎడమొహంగా మాట్లాడుతుంది.  అనుమానం వేసి ఎలాగయినా షెంగాయ్ వెళ్లాలని అనుకుంటాడు. రెస్టారెంట్ మీద సర్వహక్కులూ తమ్ముడికిచ్చేసి విమానాశ్రయం చేరుకుంటాడు. అటు విమానాశ్రయంలో..ప్రియురాలు వేరే చైనా బాయ్ ప్రెండ్ తో ఎదురొస్తుంది తన అమ్మమ్మ చనిపోయిందని . పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.  ఇటు తమ్ముడు  న్యూమన్ తో పేకాడి ఆ రెస్టారెంట్ ని ఓడిపోతాడు. అలా హీరో తన రెస్టారెంట్ నీ…గాళ్ ప్రెండ్ నీ..ఆరోగ్యాన్నీ పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతాడు.  ఆ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడ్డాడు..తన రెస్టారెంట్ ని మళ్ళీ సొంతం చేసుకోగలిగాడా, ప్రియురాలు దక్కిందా   అనేది మిగతా సినిమా. నేను టూకీ గా చెప్పా.. సినిమాలో ఇంకా రక రకాల భావోద్వేగాలు ఫన్నీ వేలో చెప్పటం జరిగింది.

సినిమా లోని ఒక హీరో  Moritz Bleibtreu ఇంటర్వూలో చెపుతూ.. ‘  నాటకీయత జీవితంలోభాగం. కామిడీ ఊరికే రాదు. ఆ నాటకీయతనించే వస్తుంది. ఒక్కోరు ఒక్కోరకంగా హాస్యం సృష్టిస్తారు. కానీ హాస్యం వెనక లోతయిన భావాలుంటాయి. అవి బయటికి మాత్రం హాస్యంగా కనపడుతుంటాయి. ”  గొప్పగా చెప్పాడు కదూ. 🙂

మన యంగ్ అండ్ టర్కిష్ – జర్మన్ డైరక్టర్ Fatih Akın  ఈ సినిమా హీరో  ‘Adam Bousdoukos ‘ తో కలిసి రచించి,  దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టయిలిష్ గానూ,  మంచి ఉత్సాహంగా ఉండి అలరిస్తుంది. చూస్తుంటే మనకీ ఒక రెస్టారెంట్ ఉంటే బావుండేదనీ.. లేదా పెట్టేద్దామన్నంత ఆసక్తినీ కలిగిస్తుంది. నటీనటులు మాంచి హుషారుగా నటించారు. ముఖ్యంగా మన స్టబార్న్ కుక్  శ్యాన్  గా Birol Ünel  నచ్చాడు నాకు.       వెనీస్ ఫిల్మ్ పండగలో స్పెషల్ ప్రైజ్ ని సొంతం చేసుకున్నదీ సినిమా.

మంచి ఉల్లాసంగా ఉండి జీవం ఉన్న సినిమా ఇది.

* { తెలుగులో మనోళ్ళు కాపీ కొట్టారో..లేదో తెలియదు. కొడితే బానే పనికొస్తుందీ సినిమా !! 😛 }