Menu

కెంజి మిజొగుచి – పరిచయం

జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే కాకుండా అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. తమ తమ శైలిలో సినిమాలు రూపొందించి జపాన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన వీరు ముగ్గురూ ఒకరిని మించిన వారు మరొకరు. ప్రఖ్యాత ఫ్రెంచ్ సినీ విమర్శకుడైన Andre Bazin మిజోగుచి మరియు కురసావాలు గురించి ఇలాఅంటారు:

వీరిద్దరూ నాణేనికి చెరో వైపూ. చీకటేంటో తెలియకుండా మనకి వెలుగంటే ఏంటో తెలిసే అవకాశం వుందా? Mizoguchi నచ్చినంత మాత్రాన Kurosawa నచ్చకపోవడమనేది వారిద్దరినీ అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. అలా కాకుండా కేవలం Kurosawa నే ఇష్టపడేవాడు నిస్సందేహంగా గుడ్డివాడే. అలాగే కేవలం Mizoguchi నే నచ్చేవాడికి ఒక్క కన్నే వున్నట్టు లెక్క.

1898లో జపాన్ లో జన్మించిన మిజోగుచి దాదాపు 90 కి పైగానే సినిమాలు రూపొందించారు. కురొసావా లాగే యవ్వనంలో పాశ్చాత్య కళను అభ్యసించినప్పటికీ ఈయన కళా రూపాలన్నీ జపనీస్ సాంప్రదాయంతో నిండివుంటాయి. నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన మిజొగుచి 1922 లో తన తొలి సినిమాకు దర్శకత్వం వహించారు.

మిజొగుచి మొదటి సినిమాలు ప్రఖ్యాత జపనీస్ సాహిత్యం నుండి పొందిన ప్రేరణతో రూపొందించిన ఉద్విగ్న భరిత చిత్రాలుగా పేర్కొనవచ్చు. 1925 తర్వాత జపాన్ ప్రజల జీవితాలపై పట్టణీకరణ యొక్క ప్రభావాన్ని ప్రస్తావిస్తూ చిత్రాలను రూపొందించారు ఆయన. 1931 లో జపాన్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ తీసిన Nevertheless, They Go On (Shikamo karera wa yuku) సినిమాతో సినీ రంగం లో మొదటి శకాన్ని పూర్తిచేసారు మిజొగుచి.

1930 లలో జపాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు, సెన్సార్ చట్టం నుంచి తప్పించుకునేందుకు మిజొగుచి తన సినిమాల విషయమై చారిత్రక అంశాలపై దృష్టి మరల్చారు.అయినప్పటికీ అప్పుడప్పుడూ సమకాలీన సమస్యలపై కూడా ఈయన సినిమాలు దృష్టి సారించేవి. 1936 లో వచ్చిన Osaka Elegy (Naniwa ereji) మరియు Sisters of the Gion (Gion no shimai) సినిమాలు “జపనీస్ సంఘంలో స్త్రీ యొక్క స్థానం” అనే అంశం చుట్టూ నడుస్తాయి. ఈ సినిమాలు అప్పట్లో పెద్ద సంచలమే సృష్టించయి. Osaka Elegy సినిమానైతే ప్రభుత్వం నిషేధించింది కూడా. ఈ సినిమాలతో మిజొగుచి రాబోయే చిత్రాలకు ఒక శైళి ని ఏర్పరుచుకున్నారు. మిజోగుచి సినిమాలకు ట్రేడ్ మార్క్ లాంటి అంశాలైన ఎక్కువ నిడివి గల takes, నిశ్శబ్దంగా పారే ఒక ప్రవాహంలా పాత్రల చుట్టూ తిరిగే కెమెరా, ఒకే ఫ్రేములో పొరలు పొరలుగా కథా వస్తువలను పేర్చడం, దీప్త్తిమయమైన సినిమాటోగ్రఫీ లాంటి ఎన్నో అంశాలు ఈ చిత్రాలలో కనిపిస్తాయి.

ప్రపంచ యుధ్ధానికి ముందు మిజోగుచి చిత్రాలలో చెప్పుకోవాల్సిన చిత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ Osaka Elegy (Naniwa ereji) మరియు Sisters of the Gion (Gion no shimai) మరియు The Story of the Last Chrysanthemums (Zangiku monogatari) సినిమాలు మాత్రం ఆయన ప్రతిభ కు అద్దం పడతాయి.

ప్రపంచ యుధ్ధపు రోజుల్లో మిజోగుచి ప్రభుత్వ ఒత్తిడి మేరకు కొన్ని సినిమాలను రూపొందించడం జరిగింది. యుద్ధానంతరం మిజోగుచి తిరిగి మహిళా ప్రాధాన్యం కలిగిన సినిమాలతో తన సినీయానాన్ని కొనసాగించారు. ఆ కాలంలో ఈయన రూపొందించిన చిత్రాల్లో చెప్పుకోదగ్గది, Women of the Night (Yoru no onnatachi, 1948). యుధ్ధకాలంలో జపనీస్ మహిళలు వ్యభిచారంలోకి ఎలా త్రోయబడ్డారో అనే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

1948 వరకూ కెంజి మిజొగుచి రూపొంచిన సినిమాలు నాణేనికి ఒక వైపైతే 1948 తర్వాత తన జీవితపు చివరి ఆరేళ్ళలో ఐదు అధ్భుత కళాఖండాలను ప్రపంచానికి అందించాడు మిజొగుచి. ఈ కాలంలో రూపొందించిన Life of Oharu (Saikaku ichidai onna, 1952), Ugetsu ( Ugetsu monogatari, 1953),Gion Festival Music (Gion bayashi, 1953),Sansho the Bailiff (Sansho dayu, 1954) మరియు A Story from Chikamatsu (Chikamatsu monogatari, 1954) చిత్రాలు మిజొగుచి ఖ్యాతిని ప్రపంచ దేశాలన్నింటినీ చేరేలా చేసింది.

4 Comments
  1. Sowmya January 2, 2008 /
  2. koresh March 13, 2008 /
  3. chandrasen September 18, 2009 /
  4. cric September 18, 2009 /