Menu

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా
కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే అతని జీవితం! తిండి, నిద్రా, ఇల్లు, ఉద్యోగం, భార్య, కుటుంబం అన్నీ తన పరిశోధనల తర్వాతే. రాత్రి నిద్రపోడు. వేళకి తిండి తినడు. రాత్రంతా టైప్ రైటర్ చప్పుడు. ఇల్లంతా ఎలుకల గోల – ఇవీ ప్రతి రోజూ భార్య కంప్లైట్లు. కానీ వీటన్నింటినీ పట్టించుకునే పరిస్థుతుల్లో లేడు అతను. అతని ధ్యాసంతా అతని పరిశోధన మీదే!

దీపాంకర్ రాయ్ గత పది సంవత్సరాలుగా నిద్రాహారాలు మాని, భయంకరమైన కుష్టు వ్యాధి ని ఈ భూమ్మీద నుంచి సమూలంగా నిర్మూలించే టీకామందును తయారు చేసే పని లో అతను నిమగ్నమై ఉన్నాడు. అతని గురించి తెలియని వాళ్లేకాదు, అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా అతని పరిశోధన వృధా ప్రయాస అనుకున్నారు.
కానీ పదేళ్ల పాటు అతను పడ్డ శ్రమ ఫలించింది. కుష్టు వ్యాధి ని నివారించే మందును అతను కనుక్కోగలిగాడు. అందుకు అతని వద్ద పూర్తి సాక్ష్యాధారాలు లేనప్పటికీ, అలాంటి మందు కనుక్కోవడానికి చాలా సమీప దూరంలో అతనున్నాడని తెలుసుకున్నాడు. ఈ విషయం పత్రికల్లో సైతం ప్రముఖంగా ప్రచురింపబడింది. అంతే కాదు, ప్రఖ్యాత BBC ఛానెల్ లో సైతం దీపాంకర్ రాయ్ గురించి ప్రస్తావించింది

ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఒక భారతీయుడు ఇలాంటి గొప్ప పని సాధించాడంటే దేశం మొత్తం దీపాంకర్ రాయ్ ని కొనియాడారనుకుంటే అది పొరపాటే. ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే ఒక సామాన్య వైద్యుడు ఇలాంటి గొప్ప అద్భుతాన్ని ఆవిష్కరించాడంటే మిగిలిన వాళ్లకు మింగుడు పడలేదు. అతన్ని అవమానించారు. అతని పరిశోధనను అనుమానించారు. అంతా అభూతకల్పన అని కొట్టి పారేశారు. ఒక వేళ ఇలాంటి మందు కనుక్కోవడం సాధ్యమయ్యుంటే ఈపాటికి ఏ అమెరికాలోనో, ఇంగ్లండ్ లోనో మందు కనిపెట్టేసి ఉండేవారని పాత పాట పాడారు. అడుగడుగునా అవరోధాలు కల్పించారు. కానీ దీపాంకర్ వెనక్కి తగ్గలేదు. పోరాడాడు. కానీ అందరూ కలిసి కట్టుగా అతన్ని ఓడించే ప్రయత్నం చేశారు. కలకత్తా నుంచి అతన్ని ఒక మారుమూల గ్రామానికి బదిలీ చేశారు. అలాంటి పరిస్థుతుల్లో అతనికి తోడుగా నిలిచింది అతని భార్య సీమా. అతను మారుమూల పల్లెటూర్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళగా ఆమె కలకత్తా లోనే ఉంటూ అతని ప్రయోగశాల ను కంటికి రెప్పలా చూసుకుంది.

ek-doc-2

దీపాంకర్ రాయ్ ఎదుర్కొన పరిస్థుతులు, అతని పరిశోధనల గురించి మేధోవర్గం స్పందించిన తీరు చరిత్ర కి కొత్తేం కాదు. 500 ఏళ్లకు పూర్వమే గెలీలియో, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించినప్పుడూ ఇంతే జరిగింది. అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. గ్రాహంబెల్ టెలిఫోన్ కనుగొన్నప్పుడు కూడా ఆయనకు ఇలాంటి పరిస్థుతులే ఎదురయ్యాయి; ఆయన కనుగొన్న అధ్బుతాన్ని “బొమ్మలా ఆడుకోడానికి బావుంది కానీ దీంతో ఎవరికి అవసరం ఉంటుంది” అని తీసిపారేసారు కొంతమంది మేధావులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.
కీలక సన్నివేశం

గ్రామంలో వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ ని చూడ్డానికి ఒక వారాంతంలో కలకత్తా నుంచి వస్తుంది సీమా. దీపాంకర్ ఇంటి దగ్గర లేకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ బీచ్ దగ్గరకు వస్తుంది. బీచ్ ఒడ్డున ఆలోచనల్లో మునిగిపోయి ఒంటరిగా కూర్చుని ఉంటాడు. సీమా ని చూడగానే అతనిలో దుఖం ఉప్పెనలా ముంచుకొస్తుంది. తనని వదిలి వెళ్ళొద్దని ఆమె ని వేడుకుంటాడు. సీమా లేకుండా అసలేం పని చెయ్యలేకపోతున్నాడని, తన పరిశోధనా పత్రాలు ఇంకా పూర్తి కాలేదని బాధపడతాడు. సీమా అతన్ని ఓదారుస్తుంది. తను కలకత్తా తిరిగి వెళ్లకపోతే ల్యాబ్ లో పరిశోధనార్థం ఉంచిన జంతువుల ఆలనా పలనా చూసేవాళ్లు ఉండరని అతనికి నచ్చచెప్తుంది. ఇద్దరూ అక్కడ్నుంచి ఇంటి వైపు బయల్దేరుతారు.

ek-doc-3
ఇద్దరూ బీచ్ లో నడుస్తుండగా దీపాంకర్ సముద్రపు అలలను చూస్తూ, సైన్స్ లో ప్రశ్నలకు ఎప్పుడూ అంతే ఉండదనీ, సముద్రపు అలల్లాగే ఒకదాని తర్వాత ఒకటి- కొన్ని చిన్నవి, కొన్నిపెద్దవి నిరంతరం తన మదిలోఎగిసిపడుతూనే ఉంటాయని చెప్తాడు. ఆ ప్రశ్నలన్నింటికీ కాకపోయినా కనీసం కొన్నింటికయినా తన పరిశోధన ద్వారా సమాధానాలు వెతకాలనుకున్నాననీ చెప్తాడు. కానీ పరిస్థుతులు అందుకు అనుకూలించటం లేదని బాధపడతాడు. దీపాంకర్ బాధ ను అర్థం చేసుకున్న సీమా త్వరలోనే పరిస్థుతులు చక్కబడుతాయని అతనికి ధైర్యం చెప్తుంది.

ప్రతి రోజూ సాయంత్రం సముద్రపు ఒడ్డున రాత్రి చాలా సేపటి వరకూ కూర్చుని ఆకాశంలో తారలను చూస్తూ గడిపేస్తుంటానని చెప్తాడు దీపాంకర్. ఆకాశంలోని తారలను చూసినప్పుడల్లా అతనిలో కలిగే ఒక అవ్యక్తానుభూతిని గురించి ఆమెతో చెప్తాడు. “చీకట్లో మెరుస్తున్న నక్షత్రాలను చూసిప్పుడల్లా అవి నాకు ఏదో సందేశం చేరవెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఈ విశాల విశ్వం లోని లెక్కలేనన్ని రహస్యాలను చేధించాలని నాకు సవాలు విసుర్తున్నట్టుగా, మనుషులు తమ అజ్ఞానం, అసూయలతో తమలో తామే కొట్టుకుంటూ సమయం వృధా చేస్తున్నారని గేళి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది”, అంటాడు దీపాంకర్. విశ్వంలోని రహస్యాలను చేధించడానికి ఈ ప్రపంచంలో చాలా మంది సిద్ధంగా ఉన్నారనీ, కాకపోతే వారిని ప్రోత్సాహించకపోగా ఎల్లప్పుడూ వెనక్కి లాగడానికే ఈ ప్రపంచం ప్రయత్నిస్తుందని అంటాడు దీపాంకర్. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన పరిశోధన మాత్రం కొనసాగిస్తానని అంటాడు. అతని మాటలు విన్న సీమాకు భర్త మీద మరింత గౌరవం పెరుగుతుంది.

*****

ఆ తర్వాత కొన్ని రోజులకు దీపాంకర్ కి లండన్ లోని ఒక కంపెనీ నుంచి ఉత్తరం వస్తుంది. అతని పరిశోధన గురించి మరిన్ని వివరాలు కావాలని ఆ ఉత్తరం సారంశం. కానీ ఆ ఉత్తరం అతనికి చేరకుండా దాచేస్తారు. దీపాంకర్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆ కంపెనీ వాళ్లు వారి ప్రతినిధి ఒకరిని ఇండియా కి పంపిస్తారు. అమె తో తన పరిశోధన గురించి చర్చిస్తాడు దీపాంకర్. త్వరలోనే పరిశోధన పూర్తి చెయ్యమని ఆమె ప్రోత్సాహిస్తుంది. ఈ లోగా దీపాంకర్ కి తిరిగి కలకత్తా కి బదిలీ అవుతుంది. తన పరిశోధన పూర్తి చేస్తాడు. విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తన పరిశోధనా ఫలితాలు ప్రదర్శించడానికి అహ్వానం అందుతుంది. కానీ ఎప్పటిలాగే అతనికి అన్నీ ఎదురు దెబ్బలే! కొంత మంది డాక్టర్లు దీపాంకర్ ని వెళ్ళనివ్వకుండా చేస్తారు. ఈ లోగా జర్మనీ కి చెందిన మరో పరిశోధకుడు లెప్రసీ నివారించే మందు కనుగొన్నాడని పేపర్లో ప్రకటన వస్తుంది. ఈ విషయం తెలిసిన దీపాంకర్ మౌనంగా ఉండిపోతాడు. ఓటమి ని అంగీకరిస్తాడు.

జీవితంలో ఘోరంగా ఓడింపబడ్డ దీపాంకర్ కి లండన్ లోని కంపెనీ నుంచి తన పరిశోధనలను కొనసాగించాల్సిందిగా వచ్చిన ఆహ్వానం జీవితం మీద కొత్త ఆశలను చిగురింప చేయడంతో సినిమా ముగుస్తుంది.

*****

కొసమెరుపు: దీపాంకర్ రాయ్ కి జరిగిన అన్యాయం మరే పరిశోధకుడికీ జరగకూడదని ఈ సినిమా చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది; ఈ కథలోని నాయకుడు పరిస్థితి గుర్తుకువచ్చి మనసుకు బాధ కలిగిస్తుంది. కానీ ఇది కేవలం కల్పిత కథ కాదు. సుభాష్ ముఖోపాధ్యాయ అనే భారతీయ పరిశోధకుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. మనిషికి మనిషి చేసిన అన్యాయమే మానవ చరిత్ర అని అన్నాడో మహాకవి. అలా అన్యాయానికి గురైన వారిలో ముఖోపాధ్యాయ ఒకరు. భారతదేశంలోని మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి కర్తగా సుభాష్ ముఖోపాధ్యాయ నేడు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. 1978 లో ఆయన ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’ అనే ప్రక్రియ ద్వారా సంతాన లేమి సమస్యను తీర్చవచ్చని తన పరిశోధనల ద్వారా నిరూపించారు. కానీ అప్పటికి రెండు నెలలకు ముందే బ్రిటన్ కి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ జి ఎడ్వర్డ్స్ ప్రపంచంలోని మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ నీ సృష్టించారు.

ek-doc-4

ప్రపంచమంతా ఎడ్వర్డ్స్ ని వేనోళ్ల కొనియాడితే ఇక్కడ మన దేశంలో సుభాష్ ముఖోపాధ్యాయ కు ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదు. సుభాష్ ఆవిష్కరించిన అద్భుతం ఆయన పాలిట ఒక శాపంగా మారింది. బ్యూరోక్రసీ అనే భూతం అడగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు; సామాజికంగా వేధింపులూ ఎదురయ్యాయి. ఇన్ని కష్టాలూ ఎదురైనప్పటికీ సినిమా కాబట్టి డాక్టర్ దీపాంకర్ రాయ్ బతికిపోయాడు. కానీ నిజజీవితంలో సుభాష్ ముఖోపాధ్యాయ కి అంత అదృష్టం లేదు. మానసిక వేదనకు గురై 1981 జూన్ 19న సుభాష్ ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకుని ఈ పాడు లోకాన్నుంచి దూరంగా వెళ్ళిపోయారు.

2 Comments
  1. నాగరాజ్ November 17, 2013 /