Menu

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం.

సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి వెళ్లాడు తొమ్మిదేళ్ల ఆలీ. లోపల ఆలుగడ్డలు ఏరుకుని షాప్ అతని దగ్గరకొస్తే డబ్బులడిగాడు. ఖాతాలో రాసుకోమని అమ్మ చెప్పిందని బయటకు వచ్చి చూస్తే, అక్కడ వదిలేసి వెళ్లిన చెల్లి షూస్ కనిపించలేదు. కంగారు పడ్డాడు. హడావుడిగా అన్ని చోట్లా వెతికాడు. నిమిషం క్రితం అక్కడే ఉన్న షూస్ ఎలా మాయమయ్యాయో అతనికి అర్థం కాలేదు. పాపం ఆలీ కూరగాయల అంగడి లోపల ఉండగా బయట జరిగిన విషయం అతనికెలా తెలుస్తుంది?ఆలీ లోపల ఉండగా చెత్త ఏరుకునే ఒకడు షాప్ బయట ఉన్న చెత్తంతా పోగుచేసుకుని వెళ్తూ అక్కడే ఉన్న షూస్ ఉన్న సంచీ ని కూడా చెత్త అనుకుని తీసుకెళ్లిపోయాడు. ఇదేమీ తెలియని ఆలీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంటికి బయల్దేరాడు.

coh-1

ఆలీ ఇంటికి చేరుకోగానే చెల్లెలు జాహ్రా ఆశగా షూస్ గురించి అడిగింది. అబద్ధం చెప్పి అప్పటికప్పుడు ఎలాగో తప్పించుకున్నాడు కానీ కాసేపటికి చెల్లెలికి నిజం చెప్పేశాడు. జాహ్రా కి కోపం తన్నుకొచ్చింది. షూస్ లేకుండా స్కూల్ కి వెళ్లడం కుదరదు. కానీ షూస్ పోయిన విషయం తండ్రికి చెప్దామంటే, దినదిన గండంగా జీవితాన్ని ఈదుతున్న తండ్రి నిస్సహాయత వారికి తెలుసు ధైర్యం చేసి చెప్పినా తండ్రి కోపానికి తామిద్దరూ బలవ్వాల్సిందే తప్ప సమస్య కి పరిష్కారం దొరకదు. అన్నాచెల్లెల్లు రహస్యంగా చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆలీ తన షూస్ జాహ్రా కి ఇస్తాడు. ఉదయం పూట ఆ షూస్ వేసుకుని జాహ్ర స్కూల్ కి వెళ్తుంది. ఆమె స్కూల్ అయిపోయాక అదే షూస్ వేసుకుని ఆలీ మధ్యాహ్నం స్కూల్‍కి వెళ్తాడు. తన ఒప్పందానికి ఒప్పుకున్న సందర్భంగా చెల్లెలికి తన కొత్త పెన్సిల్ ని కానుకగా ఇచ్చాడు ఆలీ.

*****

ఒక ఆదివారం నాడు అన్నాచెల్లెల్లిద్దరూ కలిసి షూస్ ని శుభ్రంగా కడిగారు. ఉదయం పూట జాహ్రా, మధ్యాహ్నం ఆలీ ఒకే జత బూట్లతో సర్దుకుంటూ స్కూల్ కి వెళ్తున్నారు. వారి సమస్యకు అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని వారికి తెలుసు. టివి చూస్తున్నా, రోడ్ లో నడుస్తున్నా వారికి రంగురంగుల షూస్ మీదే ధ్యాస.

రోజులు గడుస్తున్నాయి. ప్రతి రోజూ ఆ అన్నాచెల్లెల్లిదరికీ కాలంతో పరుగు పందెమే. జాహ్రా స్కూల్ నుంచి తిరిగి రావడం ఆలస్యమైతే, ఆలీ స్కూల్ కి వెళ్లడం ఆలస్యమవుతుంది. స్కూల్ లో పరీక్షలు రాస్తున్న సమయంలోనూ ఆలీ కి షూస్ అందచెయ్యాలనే జాహ్రా ఆలోచన. ఒక రోజు జాహ్రా స్కూల్ నుంచి పరిగెత్తుకుని వస్తుండగా ఒక షూ మురికి కాలువలో పడి కొట్టుకొనిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరో సహాయం చెయ్యడంతో జాహ్రా షూస్ ని ఆలీ కి అందచేసింది.

ఈ సమస్య మొదలయినప్పటి నుంచీ ఆలీ చాలా సార్లు స్కూల్ కి ఆలస్యంగా వెళ్తున్నాడు. అది గమనించిన హెడ్‍మాస్టర్ ఆలీ కి వార్నింగ్ ఇచ్చాడు; మరో సారి లేట్ గా వస్తే స్కూల్ లోపలికి ప్రవేశించాల్సిన అవసరం లేదన్నాడు.

coh-2

అన్ని కష్టాల్లోనూ ఆలీ చదువుల్లో మాత్రం వెనకపడలేదు. కష్టపడి చదివి క్లాసు లో రెండో ర్యాంక్ సాధించాడు. ఆ సందర్భంగా క్లాస్ టీచర్ బహుమానంగా ఇచ్చిన పెన్ ని జాహ్రా కి ఇచ్చాడు ఆలీ. అప్పటివరకూ షూస్ విషయంలో అన్న మీద కోపంగా ఉన్న జాహ్రా అంతా మర్చిపోయింది.

ఇలా ఉండగా ఒక రోజు తన లాంటి షూస్ వేసుకున్న ఒకమ్మాయిని స్కూల్ లో చూసింది జాహ్రా. సాయంత్రం ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి బయల్దేరారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కుటుంబం పరిస్థితి తమకంటే హీనంగా ఉంది. ఆ అమ్మాయి తండ్రి అంధుడు. ఆ పరిస్థుతుల్లో ఉన్న వారిని షూస్ గురించి అడిగే ధైర్యం రాలేదు వారిద్దరికీ. ఇద్దరూ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చారు.

coh-3

*****

ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలీ ఆలోచిస్తుండగానే దేశ వ్యాప్తంగా జరిగే రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఆసక్తి గల వాళ్ళ కోసం స్కూల్ లో ఒక ప్రకటన వెలువడింది. ఆలీ కి ఆ రన్నింగ్ రేస్ లో పాల్గొనాలని ఉన్నప్పటికీ చిరిగిపోయిన తన షూస్ చూసుకుని ఆ ఆలోచన మానేస్తాడు.

స్కూల్ తరుపున రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపించిన వారిలోనుంచి కొంతమందిని ఎన్నుకోబడతారు. వారి పేర్లను స్కూల్ నోటీస్ బోర్డ్ లో పెట్టగా చూడడానికి వెళ్తాడు ఆలీ. నోటీస్ బోర్డ్ లో రన్నింగ్ రేస్ కి సంబంధించిన వివరాల్లో ఒక విషయం ఆలీ ని అమితంగా ఆకట్టుకుంటుంది. రేస్ లో మూడో బహుమతి గా వచ్చిన వారికి ఒక జత షూస్ బహుమతిగా ఇవ్వబడుతుందన్న విషయం తెలుసుకున్న ఆలీ మనసులో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఎలాగైనా పోటీలో పాల్గొని మూడో బహుమతి గెల్చుకోవాలనుకుంటాడు. స్కూల్ టీచర్ ని ఒప్పించి రేస్ లో పాల్గొనడానికి అనుమతి పొందుతాడు.

కీలక సన్నివేశం

రేస్ మొదలవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వందలాదిమంది లో ఒకడిగా పరిగెత్తడం మొదలుపెడతాడు. అతని లక్ష్యమే అతని తోడు. వందలాది మందిలో ఒకడిగా మొదలైన ఆలీ అలుపెరగకుండా పరిగెడ్తాడు. అందరినీ దాటుకుంటూ వేగంగా వెళ్లిపోతాడు. కాసేపటికి తిరిగి చూస్తే అందరికంటే ముందు ఉంటాడు. ఈ సమయంలో అతని లక్ష్యం మరోసారి గుర్తుకొస్తుంది. రేస్ లో మూడో వాడిగా వస్తే ఒక జత బూట్లు బహుమతిగా పొందుతాడు. ప్రస్తుతం ఆలీకి కావాల్సింది అదే! కావాలంటే అతను మొదటి స్థానంలో రాగలడు కానీ చెల్లెలి ముందు ఓడిపోయిన అతను గెలవాలనుకుంటే రేస్ లో ఓడిపోవాలి. అతని దృష్టంతా మూడో బహుమతి పైనే. రేస్ లో మొదటి బహుమతి గెల్చుకుంటే వచ్చే డబ్బుతో ఒక్క జత బూట్లు కాదు, ఇంకా చాలా కొనుక్కోవొచు. ఆ పసి మనసుకు ఈ విషయం తెలియదు. అతనికి కావాల్సిందేంటో మాత్రం తెలుసు. ఆలీ గెలవాలి; గెలుస్తూనే ఓడిపోవాలి. రెండూ ఒకే సారి జరగాలి.

coh-4

రేస్ చివరి ఘట్టానికి చేరుకుంటుంది. ఆలీ మూడో స్థానంలో ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తాడు. రేస్ లో చివరికి ఐదుగురు మాత్రమే మిగుల్తారు. ఇంకో 70 మీటర్లు దాటితే రేస్ లో ఎవరు గెలిచారో తెలిసిపోతుంది. ఐదుగురిలో ఒకడిగా ఆలీ పోటీపడ్తుంటాడు. మరో 30 మీటర్లు. పది మీటర్లు…..రేస్ ముగుస్తుంది. కానీ ఆలీ అనుకున్నట్టుగా జరగదు. ఎంత ప్రయత్నించినా అతను ఓడిపోలేకపోతాడు; దురదృష్టవశాత్తూ రేస్ లో మొదటి బహుమతి అతన్నే వరిస్తుంది. స్కూల్ టీచర్ అతన్ని భుజాల పైన ఎక్కించుకుని విజయగర్వంతో చుట్టూ తిప్పుతాడు. విలేకర్లు ఫోటోలు తీసుకుంటారు. అందరి దృష్టీ అతని పైనే, కానీ చుట్టూ ఏం జరుగుతున్నా ఆలీ ముఖంలో సంతోషమే ఉండదు. గెలిచి ఓడిపోయిన అతని పరిస్థితి ఎవరికి చెప్పుకోగలడు?

*****

బాల్యం ఒక విచిత్ర అనుభవం. పెద్దాయ్యక జీవితంలో ఉండే సమస్యలు అప్పుడు ఉండవు. మన ఆనందానికి సరిపడానే ఆలోచిస్తాం. కానీ పెద్దయ్యే కొద్దీ మన ఆనందంకంటే కూడా స్టేటస్ కోసమో, సమాజం కోసమో విపరీతమైన కోరికలు పెంచుకుంటాం. జీవితాన్ని జటిలం చేసుకుంటాం.

ఒకనాడు జహంగీర్ చక్రవర్తి పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో తన సైన్యంతో బయల్దేరాడు. మార్గమధ్యంలో మతగురువు వద్ద ఆశీస్సులు తీసుకోడానికి అగాడు. ఇంతలో అక్కడకు ఒక వృద్ధ భక్తుడు వచ్చాడు. తన దగ్గర ఉన్న ఒక్క రూపాయిని గురువు గారికి సమర్పించాలనుకుంటున్నాడని చెప్పాడు. గురువు ఆ వృద్ధుని భుజాలు పట్టుకుని పైకి లేపి ఆ రూపాయి తో తనకు అవసరం లేదని, అక్కడున్న భక్తుల్లో అవసరం ఉన్న వాళ్లకి ఇవ్వమన్నాడు. కానీ అక్కడున్న భక్తులెవరూ ఆ రూపాయి స్వీకరించలేదు. చివరికి ఆ వృద్ధుని పరిస్థితి అర్థం చేసుకున్న మతగురువు ఆ రూపాయిని పేదవాడైన జహంగీర్ కి ఇవ్వమని చెప్పాడు. అక్కడేం జరుగుతుందో అర్థం కాని జహంగీర్ గురువు వైపు తెరిపార చూశాడు. ఉన్న సామ్రాజ్యం చాలక పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోడానికి బయల్దేరిన జహంగీర్ ని మించిన పేదవాడు ఎవరూ అక్కడ లేరని, అలాంటి పేదవారికే అందరి సహకారం, ఆశీర్వచనం కావాలని గురువు వివరించడంతో జహంగీర్ నివ్వెరపోయాడు.

మనిషి దుఃఖానికి మూల కారణం కోరిక అని గౌతమ బుద్దుడు ఎప్పుడో చెప్పాడు. కానీ కోరికలనేవే లేకపోతే మనిషి ఈ రోజు ఇంత ప్రగతి సాధించేవాడు కాదేమో! కానీ కోరికలకూ హద్దులుండాలి. అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. A good life is the elimination of unnecessary.

నిజానికి ఓ మహాకవి అన్నట్టు “బాల్యమే మనిషికి తండ్రిలాంటిది”. మన బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే దానికి మించిన పాఠం ఉండదు. అలాంటి నిష్కల్మషమైన బాల్యాన్ని మనకి గుర్తుకు తెప్పించే సినిమా “Children of Heaven”.

కొసమెరుపు: రేస్ లో గెలిచినా తన చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాననే దిగులుతో ఇంటికి తిరిగివస్తాడు ఆలీ. ఉత్త చేతులతో వచ్చిన అన్నను చూసి దిగులుపడ్తుంది జాహ్రా. కానీ అప్పటికే వారి తండ్రి, ఇద్దరికీ చెరో జత రంగు రంగుల కొత్త షూస్ కొనుక్కుని ఇంటికి బయల్దేరాడన్న విషయం వారికి తెలియదంతే!