Menu

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ?

ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ.

ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా బ్రతుకుతుంటారు.

( మనలో మన మాట కానీ ఆ బ్రతకటానికి డబ్బు ఎక్కడనించి వస్తుంది ?? ) అదే విశ్వాసాలతో జీవితం గడుస్తుందా ???

వైకితా ఒక అనాధ..ఎక్కడా ఉండటానికి దిక్కులేక సన్యాసినిగా మారుతుంది. అక్కడి పాఠాలు వంటబట్టి ‘దేవుడి ప్రేమ’ని మించినది లేదు అనే దిశగా మనసుని మార్చుకొని ఉంటుంది.అనాధశ్రమంలో తన బాల్య స్నేహితురాలు ..యుక్తవయస్సులో ప్రేమికురాలైన అలీనా , జర్మనీలో బతుకుతూ వైకితా ప్రేమలేకుండా ఉండలేక జర్మనీ నించి ఆ ఆశ్రమానికి రావటంతో కథ మొదలవుతుంది.మనం ఇక్కడ ఒక కుటుంబంలా నివస్తుస్తున్నాం కానీ అలీనాకి ఎవ్వరూ లేరు. ఒంటరిదయ్యి పిచ్చిదవుతోంది. కొంతకాలం అలీనాతో జర్మనీ వెళ్ళొస్తా అని ఫాదర్ని అడుగుతుంది వైకితా. ” దైవానికి అంకితమైన వాళ్లు దైవం తోనే ఉండాలి. మామూలు జీవితంలోకి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్ళి రావటానికి వీల్లేదు. ఒక సారి వెళ్లాక మళ్ళి అదే మనిషిగా తిరిగి రాలేవు” అనే సరికి వైకితా ఆశలు అడుగంటిపోతాయి.

‘ పస్చిమ దేశాల్లో దైవంమీద విశ్వాసం పోయింది. పవిత్రత అనేది లేదు. పురుషులని పురుషులూ..స్త్రీలనీ స్త్రీలలూ వివాహం చేసుకోవటం సర్వసాధారణం అయిపోయింది. మత్తు పదార్థాలకి బానిసలయ్యారు. దైవ సన్నిధానాలు కూడా ఇదివరకులా లేవు. కారణంతో కూడిన ఏదయినా ఒప్పుకోదగినదే కాని ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. డబ్బు విలాసాలకి మరిగారు. పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు కుటుంబం, తల్లిదండ్రులు లేకుండా పెరుగుతున్నారు. సమాజంలో వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయని మళ్ళీ ఇతర కారణాలని వెతుకుతున్నారు. పిల్లలకి మంచి చెడూ చెప్పేవాళ్ళే కరువయ్యారు.’
భోజనం చేస్తూ ఫాదర్ చెప్పన ఈ మాటలు ఆ ప్రేమికురాళ్ళకి సూటిగా తగలేవే కదా !!

నేను ఫాదర్తో మాట్లాడాను. నీవెంట వస్తే నన్ను మళ్ళీ ఇక్కడికి రానివ్వరు.

మనిద్దరం జర్మనీలో కలిసి ఉన్నాక మళ్ళి ఇక్కడికి రావటం ఎందుకూ ??

అలీనా నేను వేరే దారి ఎంచుకున్నాను..దాన్ని వదిలి రాలేను.

ఏమిటా దారి ?

ఒంటరిగా ఉండకపోవటం..

నేనుండగా నీవు ఒంటరివి ఎలా అవుతావు..?

నిజమే..కానీ ఎవరి మనసులో దేవుడు ఉండడో వాళ్ళు ఎప్పటికీ ఒంటరే !

వైకితా నీవేం మాట్లాడుతున్నావ్ ? నీకు నేను ..నాకు నువ్వు ఉన్నాం, మనకెవ్వరూ అక్కర్లేదు.

అలాకాదు.. మనుషులొస్తారు పోతారు..దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. నీవు నన్నొదిలి వెళ్లాక నాకు చాలా కష్టంగా ఉండింది.కాని దేవుడు నాకు ఇక్కడ ఇల్లిచ్చాడు..వసతి కల్పించాడు.కుటుంబాన్ని ఇచ్చాడు

వైకితా నన్ను ప్రేమించట్లేదా ?

ప్రేమిస్తున్నాను కానీ ఇంతకు ముందులా కాదు. వేరేవిధంగా.. నా మనసులో ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు..అది ‘దేవుడు’.
వైకితా వైఖరి చూసి అలీనాకి దిక్కు తోచదు. తను ప్రేమించిన ..తనని ప్రేమించిన మనిషి మారిపోయింది. తనతో రాదు..తనతో ఇంతకు ముందులా ఉండదు.తనని ప్రేమించదు. దానికి కారణం ఆ చర్చ్ …ఆ ఫాదర్..ఆ పురాతన సాంప్రదాయం. అసలీ పద్దతులూ అవీ అన్ని వింతగా తోస్తుంది అలీనాకి. దేవుడు వీళ్లకే సొంతమా..మామూలుగా నివసించే వాళ్లకి దేవుడు లేడా ? లోకంలో మనుషులు బతుకుతున్న పద్దతి పాపకార్యమా ?? అలీనా ఆత్మహత్య చేసుకుందామా అని బావిమీదకెక్కుతుంది. దిగిరమ్మంటారు. వచ్చి వైకితాని కావలించుకుంటుంది.

ప్రేమకోసం తపించే మనిషికి ప్రేమ దొరక్కపోతే ఏమవుతుంది ? హార్మోనుల అసమతుల్యత ఏర్పడుతుంటే.. తద్వారా మానసిక విచలత్వం కలగకుండా ఉంటుందా, తన ప్రేయసిని దూరం చేసిన మనుషులని చూస్తే కోపం కట్టలు తెగదా.

తన ప్రేయసిని మార్చిన మనుషులు దయ్యాల్లా కనపడటంతో పిచ్చేక్కి వాళ్లమీదపడి కొడుతుంది..అప్పటికే మానసిక అసమతుల్యత, శారీరక అనారోగ్యం ఉన్నా అలీనాకి అది ఫిట్స్ గా మారుతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ Schizophrenia అని నిర్ధారణకి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ మానసిక ఒత్తిడి కలిగించవద్దని చెపుతాడు. హాస్పిటల్లో పెషెంట్స్ మద్య ఉండటం కంటే ఆశ్రమంలో శాంతిగా ఉండటం, ప్రార్థనచేసుకోవటం వల్ల మానసిక శాంతి లభిస్తుందనీ అంటాడు . కానీ ఆ అమ్మాయికి ఆ ఆశ్రమం, ఆ ప్రార్థనలు చూసే కదా ఒత్తిడి పెరిగింది. కానీ ఫాదర్ ఒప్పుకుంటాడా ? మనసులో దేవుడులేనివాళ్లని మనతో ఉంచుకోవటం కష్టం అంటాడు ఫాదర్. తన స్నేహితురాలి దిక్కులేని తనాన్ని చెప్పి ఎలాగోలా నచ్చచెపుతుంది వైకితా.
అలీనా ఆశ్రమానికి వస్తుంది.. తన ప్రియురాలిని ఎలాగైనా తీసుకెళ్లాలనే తపన..తనతోకలిసి ఉండాలనే ఆరాటంలో ఆమె కూడా మెల్లిగా భక్తిమార్గం ప్రయత్నిస్తుంది. కానీ వీలవుతుందా.. !!

తనమార్గం వదిలి అలీనాతో వెళ్లలేని వైకితా.. వైకితాని వదల్లేక ఆ సన్యాసమార్గం ఒంటికిపడక.. ఆరోగ్యం దెబ్బతిన్న అలీనా.. అంధవిశ్వాసాలతో జనాన్ని మూడత్వం లోకి నడిపించే ఫాదర్.. అతన్ని అనుసరిస్తున్న మిగతా సన్యాసినులు వీళ్ళందరి మధ్య నాటకీయమైన సన్నివేశాలు నడుస్తాయి.. అలీనా మాటలకీ,చేసే చేష్టలనీ చూసి ఆమెకి ‘దెయ్యం’ పట్టిందని భావిస్తారు. దాన్ని వదిలించే ప్రయత్నంలో చివరికి ఏం జరిగిందీ అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే !!

చాలా నిదానంగా నడిచే ఈ సినిమా మెళ్ళిగా మనల్ని అల్లుకు పోతుంది. చక్కని సంభాషణలు ఆలోచనలకి తెర తీస్తాయి. అలీనా గా cristina Flutur వైకిటా గా Cosmina Stratan అద్బుతమైన నటనని కనపరిచారు. పేదలు, ఏ దిక్కులేని వాళ్ళు తలఒగ్గి మాట్లాడుతారు. అలాగే మతవిశ్వాసం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక ఆత్మబలంతో మాట్లాడుతారు. రెండూ కలిపి అతి శాంతంగానూ సూటిగానూ ఆత్మవిశ్వాసంగానూ మాట్లాడాలి. అలా మాట్లడేవాళ్లకోసం బానే వెతికాను అంటాడు దర్శకుడు. ఆయన ఈ పాత్రకి ఎంచుకున్న Cosmina Stratan మొహమూ..హావభావాలు ఆ మాటలని పలికిన తీరు పాత్రకి సరిగ్గ అతికింది. అమె అందుకే కేన్స్ లో ఆమేకి ఉత్తమ నటి అవార్డు లభించింది.

Tatiana Niculescu Bran అనే ఆవిడ రుమేనియన్ రచయిత్రి. రుమేనియాలోని వాస్తవ పరిస్థితులని ఆధారం చెసుకొని డేడ్లీ కన్పెషన్ అనే నాన్ ఫిక్షన్ నవల రాసింది. అది ఆ దేశంలో ఒక సంచలనం స్రుష్టించింది. ఆ నవల ఆధారంగానే ‘క్రిస్తియన్ ముంచ్యూ’ screenplay కూర్చి దర్శకత్వం వహించాడు. కథ గురించీ ఆయన మాట్లాడుతూ

” ఇది వాస్తవ విషయాల ఆధరంగా అల్లుకున్న కథ. ఆ వాస్తవవిషయాలని సినిమా కథగా చేయటానికి నాకు కొంతకాలం పట్టింది. నేను మరో ఎక్సోరిసం -2 చేయాలనుకోలేదు. అలాగే ఎవ్వరినీ వేలెత్తి చూపాలనీ అనుకోలేదు.నేను ప్రజల గురించి వాళ్లు పడే అవస్థల గురించి, తమకే తెలియకుండా మనుషుల్లోకి వచ్చే హింసాత్మకత గురించి చెప్పదలచుకున్నాను. అందరికీ తట్టే కథలు చేయకపోవటం నాకు ముఖ్య విషయం. మంచి వెనక చెడు ఏవిధాంగా దాగి ఉంటుందీ అనేది ఈ కథాఇతివృత్తం. ఇది జరిగింది ఒక ప్రదేశంలోనే అయినా ప్రపంచంలోని పలు చోట్ల..రకరకాలుగా జరిగే విషయమే ఇది .”

ఈ దర్శకుడు ప్రస్తుత సమాజంలోని నైతిక అసంబద్ధత మీద కథని ఎంచుకుని సినిమాగా మలిచిన తీరు అసాధారణం. అందుకే ఆయనకి ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా అవార్డు దక్కింది.
జీవితంలోని పరుగుకి అలవాటు పడిన మనం, సినిమా అనేది కేవలం వినోదమే అనుకునే మనం, ఏమూలో సామాజిక సృహ ఉన్నా దాన్ని కోమాలోకి నెట్టేసే మనం ఒకసారి కాదు. ఒకటికి రెండు సార్లు ఈ సినిమా చూడాలి. అప్పుడుగానీ కథలోని ఘాడత,పాత్రల నటనాఔచిత్యం, దర్శకుడు కథని మలిచిన తీరు, చెప్పదలచుకున్న విషయం, అర్థం కావు మనకి.

మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకంలో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నూతనోత్సాహం ఇవ్వాలి జీవించడానికి. అంతే కాని ఏదో నేను చెపుతున్నాను , నమ్ము. నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం.. నాది పరలోకం ఈ లోకం తో పని లేదు అనే మతం ఎందుకూ పనికి రాని మతం.. ముక్తి అనీ, స్వర్గమనీ, ఆధ్యాత్మికమనీ ఏదో ప్రపంచాలున్నాయనీ నమ్మి ఈ ప్రపంచపు సౌందర్యాలకూ .. ఆనందాలకూ కళ్ళు మూసుకునే మూర్ఖులు,తమ స్వంత సౌఖ్యాన్ని ద్వంసం చేసుకునే అవివేకులూ చివరికి మరణం తరవాత అవేమీ లేకపోతే ఏమవుతారో !! ఆద్యాత్మిక ప్రపంచమనేదే ఉంటే, అది భౌతిక ప్రపంచానికి విరోధమైనది కాదు. ” – చలం