Menu

As it is in Heaven

కళ నెరిగి, అనుభవైకవేద్యంగా తెలుసుకుంటే- దైవాన్ని ఎరిగినట్లే.

పికాసో అనే చిత్రకారుడు ఒక రోజు సాయంత్రం సముద్రతీరాన నుంచొని ఒక తైలవర్ణచిత్రం చేస్తున్నాడు. అతను తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ యధాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా అని ఎందుకో అనుమానం కలిగి, ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు. అతడికే అర్థం కాని ఓ రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు పికాసో. ఆ చిత్రం మరెవరో వేశారనిపించింది కానీ, అది తాను వేసినట్లు అనిపించలేదు.

నిజమైన కళాకారుడు ఇలాంటి అనుభూతినే పొందుతారు. చిత్రాన్ని ఎవరో తన చేతులతో గీయించినట్లు కనిపిస్తుందే కానీ, తానే స్వయంగా చిత్రించినట్లు కనిపించదు. నిజానికి చిత్రకళే కాదు ఏ కళైనా ఇంతే. ఏ కళాకారుడికైనా ఇలాంటి అనుభవం ఏదో ఒక సమయంలో కలిగితీరుతుంది. తను సృష్టించిన కళాఖండం తన పని కాకపోగా, ఆ సృష్టి చేయడానికి తనో పరికరం మాత్రమే అనిపిస్తుంది.

అలాంటి ఒక కళాకారుడి కథే “As it is in Heaven”

*****

స్టేజ్ మీద ఒక సంగీత ప్రదర్శన జరుగుతోంది. ఆ ప్రదర్శనను నిర్వహిస్తున్న విద్వాంసుడు తన్మయత్వంలో మునిగిఉన్నాడు. సంగీతం ఉధృతమవుతోంది.

వేరే కాలంలో ఇంకో చోట. గాలి వేగంగా వీస్తోంది. దూరంగా ఎక్కడ్నుంచో వినిపిస్తున్న సంగీతం. ఏపుగా పెరిగిన గడ్డిలో ఒక పిల్లవాడు వయోలిన్ వాయిస్తున్నాడు. అతనికి కొంచెం దూరంలో గడ్డిలో దాక్కుని ముగ్గురు పిల్లవాళ్ళు అతని వైపే వస్తున్నారు. ఆ ముగ్గురూ ఆ పిల్లవాడిని సమీపించగానే భయంతో పారిపోవాలని చూశాడు. కానీ వాళ్లు అతన్ని వదల్లేదు. అతన్ని వెంబడించారు; పట్టుకుని నేలమీదకి తోసి దొరికిన చోటల్లా కొట్టారు.

స్టేజి మీద సంగీత విద్వాంసుడి ముక్కులోనుంచి రక్తం చిమ్ముకుంటూ వచ్చింది. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఆయన లేడు.

asitis-2
పరుపు పై పడుకుని ఉన్న ఆ పిల్లాడిని ముద్దు పెట్టుకుంది అమ్మ. “నీకేం కాదు నాన్నా. ఆ పిల్లలు నిన్ను ఇంకేమీ చెయ్యరు. నాన్న లేరని దిగులు పడకు నీకు నేనున్నాను” అని ధైర్యం చెప్పింది. “నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటానమ్మా” అన్నాడు ఆ పసివాడు. ఆ రాత్రే అతనొక కలగన్నాడు. తను పెద్దయ్యాక మంచి సంగీత విద్వాంసుడవ్వాలని, తన సంగీతంతో ప్రజల హృదయద్వారాలను తెరిపించాలనీ అనుకున్నాడు.

ఆ కలే అతని జీవితమైంది. ఎనిమిదేళ్ళప్పుడు పెద్దల ముందు వయోలిన్ వాయిస్తే శభాష్ అన్నారు. పల్లెటూరి నుంచి పట్నానికి తరలి వచ్చారు తల్లీ కొడుకులు. పధ్నాలుగేళ్ళప్పుడు ఒక సంగీత పోటీలో పాల్గొనడానికి వెళ్ళాడు. ఆ రోజే యాక్సిడెంట్ లో తల్లి మరణించింది. కానీ అతని భవిష్యత్తు గురించి ఆమె కన్న కలలు సజీవంగానే ఉంచాడు. సంగీతమే అతని జీవితమైంది. అనతి కాలంలోనే అతనో గొప్ప సంగీత విద్వాంసుడిగా ఎదిగాడు. జనాలు. అభిమానులు. అవకాశాలు. ఆటోగ్రాఫులు. అతని సంగీతం వినడానికి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు. ఎండా, వానా అని కూడా లెక్క చెయ్యకుండా ప్రజలు తనని చూడడానికి తాపత్రయపడ్డారు.

స్టేజి మీద సంగీతం పతాక స్థాయికి చేరుకుంది. సంగీతమే తానై, తానే సంగీతమై ఆ విద్వాంసుడు ఉర్రూతలూగుతుండగా ప్రదర్శన ముగిసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేజి అవతలకి నడుస్తూ మధ్యలో కుప్పకూలిపోయాడు.

తన సంగీతంతో ప్రజల హృదయ ద్వారాలను తెరిపించాలనుకున్న అతని హృదయం ఆగిపోయింది. వైద్యులు హార్ట్ ఎటాక్ అన్నారు. కొన్నాళ్ళు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడ్నుంచి మొదలయ్యాడో అక్కడికే బయల్దేరాడు. ముఖం చాటుచేసుకుని వదిలి వెళ్ళిన తన పుట్టి పెరిగిన ఊరికి ప్రయాణమయ్యాడు. దారి పొడుగునా చిన్ననాటి జ్ఞాపకాలే!

*****

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసుడు డేనియల్ తమ పల్లెటూరికి ఎందుకు వచ్చాడో ఆ ఊరి వాళ్ళకు అర్థం కాదు. ఆ ఊరిలోనే తను పుట్టి పెరిగానని చెప్పే ఉద్దేశం డేనియల్ కి ఉండకపోగా, ఊరి వాళ్లతో ఏ మాత్రం సంబధం లేకుండా ఒంటరి జీవితం గడుపుతుంటాడు. ఆ ఊరి చర్చిలో పనిచేసే పాస్టర్ డేనియల్ ని తన ఆతిధ్యం స్వీకరించాల్సిందిగా కోరుతాడు. కానీ డేనియల్ తనని ఒంటరిగా వదిలెయ్యమని అంటాడు.

కానీ కొద్ది కాలంలోనే డేనియల్ కి ఆ ఊరి వారితో కొద్ది కొద్దిగా పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ద్వారా ఆ ఊరిలోని ఒక ఔత్సాహిక గాయక బృందం గురించి తెలుసుకుంటాడు. ఒక రోజు తమ బృందగానానికి డేనియల్ ని అహ్వానిస్తారు ఆ ఊరి వాళ్ళు. డేనియల్ ఇష్టం లేకుండానే అక్కడకు వెళ్లి వారి ప్రదర్శన చూసి, “ఫర్వాలేదు బాగానే ఉంది” అని చెప్పి వచ్చేస్తాడు.

కానీ అతను వదలాలనుకున్నా అతని చిన్ననాటి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రజల హృదయద్వారాలను తెరిపించగలిగే సంగీతం గురించి అతను కన్న కలలు అతన్ని వేధిస్తాయి. అంతే కాకుండా చిన్నప్పుడు తనని కొట్టి హింసించిన కోనీ అనే అతను ఇప్పటికే అదే ఊరిలో నివసిస్తూ తన భార్య గాబ్రియెల్లా ను గృహహింసకు గురి చేయడం గమనిస్తాడు. ఒకానొక పరిస్థితిలో కోనీ ని ఎదుర్కొంటాడు కూడా! ఇదే సమయంలో పరిచయమైన లీనా కూడా అతనిలో నూతన ఉత్సాహాన్ని కలుగచేస్తుంది. ఆ గాయక బృందానికి సంగీతం నేర్పించడానికి ఒప్పుకుంటాడు.

గాయక బృందంలో వివిధ రాకల మనస్తత్వాలు ఉన్న మనుషులు వారి వారి సమస్యలతో జీవితం పై విసుగు చెంది ఉంటారు. డేనియల్ తన సంగీతంతో ఒక్కొక్కరిని ఉత్తేజితులని చేస్తాడు.

asitis-3

సంగీత విద్వాంసుడిగా తనకు జరిగిన ఒక అనుభవాన్ని నెమరు వేసుకుంటాడు డేనియల్. ఒక రోజు సంగీత ప్రదర్శన జరుగుతుండగా కరెంట్ పోయిందనీ, ఆ సమయంలో చిమ్మచీకటిలో వాయుద్యకారులందరూ మనసులన్నీ మమేకమై 58 సెకండ్ల పాటు వాయించిన ఆ సంగీతం మరోసారి తన జీవితంలో వినే అవకాశం ఉండదేమో అంటాడు. నిజమైన సంగీతం సృష్టింపబడదనీ, అది ఇదివరకే విశ్వమంతా వ్యాపించబడిఉందనీ చెప్తాడు డేనియల్. శ్రద్ధాసక్తితో ఆ సంగీతాన్ని గ్రహించగలగడమే ఆ రోజు జరిగిందనీ అంటాడు.
నిజమైన సంగీతం సృష్టింపబడదనీ, అది ఇదివరకే విశ్వమంతా వ్యాపించబడి ఉందనీ చెప్తాడు డేనియల్. విశ్వమంతా వ్యాపించి ఉన్న సంగీతాన్నిశ్రద్ధాసక్తితో గ్రహించగలగడమే అసలు రహస్యం అని చెప్తాడు.

రాను రాను ఆ బృందం సంగీతంలో కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. బృందంలోని ప్రతి ఒక్కరూ డేనియల్ అంటే అమితంగా ఇష్టపడతారు. కానీ డేనియల్ పద్ధతులు ఊరిలోని మిగిలిన వాళ్లకు నచ్చవు. సంగీతం నేర్పించడమనే సాకుతో ఆడవారిని లోబరుచుకుంటున్నాడని అతని మీద నింద మోపుతారు. కానీ డేనియల్ ఇవేవీ పట్టించుకోకుండా తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు.

కీలక సన్నివేశం

గాయక బృందంలో ఒకరైన గాబ్రియెల్లాని హింసిస్తుంటాడు ఆమె భర్త్ కోనీ. ఆ బృందంలో పాడరాదని, డేనియల్ తో అక్రమ సంబంధం ఉందేమోనని అనుమానిస్తూ ఆమెను అందరి ముందూ కొట్టి అవమానిస్తాడు. ఇది చూసి సహించలేకపోతాడు డేనియల్.

గాయక బృందం తమ సాధన కొనసాగిస్తూ ఉంటుంది. త్వరలో ఊరి వారందరి ముందు ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చెయ్యాలని అనుకుంటారు. ఆ ప్రదర్శన అనంతరం గాబ్రియెల్లా చేత ఒంటరిగా ఒక పాట పాడించాలని అనుకుంటాడు డేనియల్. కానీ గాబ్రియెల్లా అందుకు ఒప్పుకోదు. తను పాడితే కోనీ తన మీద ఇంకా కోపం పెంచుకుంటాడని అంటుంది. కానీ గాబ్రియెల్లా కోసమే రాసిన ఆ పాటను ఆమె చేతే పాడించాలని పట్టుబడతాడు డేనియల్.

ప్రదర్శన మొదలవుతుంది. ప్రేక్షకుల అంచనాలకు మించిన విధంగా వారి ప్రదర్శన ఉండడంతో హాలంతా కరతాళ ధ్వనులతో మ్రోగిపోతుంది.

గాబ్రియెల్లా వంతు వస్తుంది. అప్పటివరకూ తనలో అణిచివేయబడ్డ ఆక్రోశాన్ని ఆమె తన పాటగా పాడుతుంది.

asitis-4

It is now that my life is mine
I’ve got this short time on earth
And my longing has brought me here
All I lacked and all I gained .

I am here and my life is only mine
And the heaven I thought was there
I’ll discover it there somewhere
I want to feel that I’ve lived my life!

తన జీవితాన్ని అణిచివేసే ప్రతిదానికీ మనిషి ఎదురు తిరగవలసిందే. సంప్రదాయం మనిషిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి సంకోచింపజేస్తుంది. దాని ప్రభావం నుంచి బయటపడడానికి పాట ద్వారా గాబ్రియెల్లాలో అంతర్గతంగా స్వేచ్ఛను ప్రసాదిస్తాడు డేనియల్.

ఆ తర్వాత కొద్ది కాలానికే గాబ్రియెల్లా తన భర్తతో స్వేచ్ఛకోసం పోరాటం చేస్తుంది. ఈ విధంగా సృజనాత్మకతతో ఆమెలో పోరాటపటిమను కలుగచేస్తాడు డేనియల్.

ఒక్క గాబ్రియెల్లా జీవితంలోనే కాదు, ఆ ఊరిలోని ఎంతో మంది జీవితాలను తన సంగీతంతో మార్చగలుగుతాడు.

 

*****

నీచీ అంటాడు దేవుడు మరణించాడు అని. బహుశా దేవుడు మరణించలేదేమో! కేవలం మనిషిమీది నుంచి ముఖాన్ని చాటుచేసి ఉంటాడు. హోల్డెర్లిన్ అనే ఒక కవి తన పద్యంలో ఇలా అంటాడు.

“కాని, మిత్రమా, మనం చాలా ఆలస్యంగా వచ్చాం.
దేవతలు బ్రతికే ఉన్నారు, కాని మన తలలమీది
మరో ప్రపంచంలో”

పొంగిపొరలే సౌందర్యంతో ఈ భూమి ని సృష్టించిన దేవుడి కంటే గొప్ప కళాకారుడు ఎవరుంటారు? మనిషిని సృష్టించాక దేవుడికి ఈ లోకంలో ఉండబుద్ధి కాలేదు. మనిషి ఆలోచన, అతడి స్వార్థం, క్రౌర్యం, వంచన, అతడి దోపిడీ గుణం చూసి దేవుడు స్వర్గలోకానికి తరలిపోయాడు. కానీ అప్పుడప్పుడు అద్భుతమైన కళాఖండాలలో దేవుడు సాక్షాత్కరిస్తాడు. అలాంటి కళాఖండాలను సృష్టించిన కళాకారులకు ఈ భువి మీదే స్వర్గాన్ని చూసే అవకాశం కల్పిస్తాడు.

One Response