Menu

అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ ముఖాముఖి ని అనువదించి మనందరికీ అందచేసిన కొత్తపాళి గారికి ధన్యవాదాలు.

ప్ర: దృశ్యం, ధ్వని .. ఈ రెండిటికి సంబంధించి మీ మొట్టమొదటి జ్ఞాపకాలేమిటి?

అడూర్: నాకు గుర్తున్న అతి చిన్నప్పటి జ్ఞాపకం ఒక రాత్రి పూట పడవ ప్రయాణం. మా అత్త చనిపోయిన కబురు ఎవరో తెచ్చారు. ఆ కాలంలో మేం మా నాన్నగారి ఉద్యోగ క్వార్టర్సులో ఉండేవాళ్ళం, ఎక్కడో ఒక మారు మూల లంకలో. వార్త అందగానే మేం బయల్దేరాం. మా చుట్టూ నీరు నిలకడగా ప్రశాంతంగా ఉంది. తనలో ఆ చీకటి ఆకాశన్ని మసగ్గా ప్రతిఫలిస్తూ కొద్దిగా కాంతి, దృశ్యం అనే రూపునిచ్చింది. ఆ పడవ తెడ్లు నీళ్ళల్లో చేసిన చప్పుడు ఇంకా నా జ్ఞాపకాల్లో స్పష్టంగా ఉంది.

గతం యొక్క జ్ఞాపకాలకీ ట్రాజెడీలకీ ఏదో అవినాభావ సంబంధం అనుకుంటాను .. బాధ, అవమానం, కోల్పోవడం, దుఃఖం .. ఇలా.

చిన్నప్పుడు నాకు మంచి గురి ఉండేది. ఒక్క రాయి విసురుతో మావిడి, జీడి మావిడి కాయల్ని ఒడుపుగా పడగొట్టేవాణ్ణి. ఒకరోజు నేను బడికి పోతుంటే ఒక చెట్టు కొమ్మమీద ఒక గుడ్లగూబ కనబడింది. నాకేం పూనిందో తెలీదు, దానిమీదికి రాయి విసిరాను. అది కాస్తా చచ్చి కిందపడిపోయింది. ఆ బాధాకరమైన జ్ఞాపకం అప్పణ్ణించి నన్ను కుట్టికదుపుతూనే ఉంది. కొన్నికొన్నిటిని, మనం ఎంతగా కోరుకున్నా, వెనక్కెళ్ళి సరి చెయ్యలేము.

మా ఇల్లు ఒక పెద్ద తోట మధ్యలో ఉండేది. చుట్టూతా బోలెడు పళ్ళ చెట్లు. మామిడి, జీడిమావిడి, పనస, చింత .. నేనెక్కని చెట్టు లేదంటే అతిశయోక్తి కాదు. చెట్టెక్కంగానే భూమ్యాకర్షణ అనేదొకటుందని మర్చిపోయేవాణ్ణి. దాంతో, చెట్టెక్కినంత సహజంగానే కిందా పడేవాణ్ణి. ఇదెంత సాధారణ మయిందంటే మా అమ్మ ఒక సీసాలో మందునూనె ఉంచుకునేది, నే దబ్బున పడిన చప్పుడు వినగానే అది పుచ్చుకుని పరిగెత్తేందుకు.

జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కలు అన్నీ మా జీవితంలో భాగంగానే ఉండేవి. ఇంట్లో ఆవులు, కుక్కలు, పిల్లులు ఉండేవి. అన్నిటికీ పేర్లుండేవి .. అవి కూడా కుటుంబంలో సభ్యులే. లఫయెట్ అనే పేరున్న ఒక ముసలి కుక్క సంగతి నాకు బాగా గుర్తుంది. అందరూ అది చచ్చిపోబోతోందనే అనుకున్నారు. దాని జుట్టంతా రాలిపోయి, ఎప్పుడూ ఏదో ఒక మూల కునుకుతూ ఉండేది. అప్పుడే ప్రసవం అయిన మా అక్క ఆరోగ్యం కోసం చేసిన ఒక ఆయుర్వేదం మందు ఉండని మా అమ్మ ఆరోజు ఎండలో ఆరబెట్టింది. అకస్మాత్తుగా ఈ లఫయెట్ వచ్చి ఆ ఉండ మొత్తాన్ని మింగేసింది. అంతే. రెండు వారాల్లో ఆ కుక్క మళ్ళీ పట్టులాంటి జుట్టు పెరిగి హుషారుగా తిరగడం మొదలెట్టింది. ఆ లేహ్యం మహత్తన్న మాట!

ప్ర: మీకు కథకళి అంటే ఇష్టం కదా. గురు చెంగన్నూర్, కళామండలం గోపి వంటి కథకళి కళాకారులపై మంచి డాక్యుమెంటరీలు కూడ నిర్మించారు. కథకళి మీ చిన్నప్పటినించీ ఉండేదా?

అడూర్:మా పూర్వికుల ఇంట్లో తరచూ జరిగేవి ప్రదర్శనలు. కొన్ని తరాలుగా మావాళ్ళు కథకళిని పోషిస్తూ వచ్చారు. మా కుటుంబానికి స్వంతంగా ఒక కళియోగం (కథకళి బృందం) ఉండేది. కుటుంబ సభ్యుల్లో కూడా కళాకారులకి కొదవ లేదు. మా అమ్మకి వదిన ఒకామే అత్యంత ప్రసిద్ధుడైన కథకళి గాయకుణ్ణి పెళ్ళాడింది. మా అమ్మమ్మ ముగ్గురు భర్తల్లో ఒకరు (ముగ్గురూ అన్నదమ్ములే) మేజిక్ నేర్చుకున్నారు సరదాగా. ఆయన ఇలా కళాపోషకుడిగా వ్యవహరిస్తుండగా మిగతా ఇద్దరూ వ్యవసాయం, ఇలాంటి జీవన వ్యాపారాలు చూసుకునే వాళ్ళు.

నా మొదటి జ్ఞాపకం మా అమ్మ వొళ్ళో కూర్చుని ఒక ప్రదర్శన చూడ్డం. మా అమ్మకైతే అది తన జీవితంలో భాగమే. అందుకని నాకూ బాగా చిన్నప్పటినించే ఆ యిష్టం పుట్టుకొచ్చింది. అలా ఆవిడతో కూర్చుని ప్రదర్శన చూస్తూ, స్టేజిమీద ఏం జరుగుతున్నదో ఆవిడ చుట్టూపక్కల స్త్రీలకి వివరిస్తుంటే వింటుండేవాణ్ణి.

మా తరవాడు (ఉమ్మడికుటుంబం)లో ఆ రోజుల్లో మేకప్ తో వేసేవీ, మేకప్ లేకుండా వేసేవీ (దీన్ని చొల్లియాట్టం అంటారు) అన్ని రకాల కథకళి ప్రదర్శనలు బాగా చూస్తుండేవాళ్ళం. ఇంట్లో ఎవరన్నా ప్రత్యేక సందర్భం, ఎవరన్నా పెద్దవాళ్ళ పుట్టినరోజు లాంటిది జరిగితే ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. ప్రదర్శనకి అత్యవసరమైన ట్రూపు మాదగ్గరే ఉండేది. బయటినించి తెచ్చుకోవలసిందల్లా స్టార్సుని మాత్రమే. ఇప్పుడైనా పరిస్థితి అంతే. మా మామయ్య తయారు చేయించిన కిరీటాలు, వేషాలు చాలా మంచి మన్నిక గలవి. 50లలో తారాజువ్వలాగ పైకొస్తున్న స్టారు క్రిష్ణన్ నాయర్ ఎప్పుడైనా మాప్రాంతాల్లో ప్రదర్శనకి వస్తే మా ఇంటి కాస్ట్యూములు అరువిప్పించుకునే వాడు. ఆ రోజుల్లో , కిరీటాల్లో మెరిసే భాగాలు నీలి పురుగు (blue beetle) డొల్లల్తో చేసే వాళ్ళు, ఇప్పట్లాగా గిల్టు పేపరుతో కాదు. నూనె దీపాల కాంతిలో ఆ డొల్లలమీద మెరిసే మెరుపులు అద్భుతంగా ఉండేవి. కొత్త కిరీటం చెయ్యాలన్నప్పుడల్లా డజన్లకొద్దీ పనివాళ్ళు పొలాల్లోకి పోయేవాళ్ళు ఈ పురుగుల్ని పట్టుకోడానికి. దారుణం ఏంటంటే ఇటువంటి శ్రమా పరిశ్రమా వృధా అనే ఆలోచన పెరుగుతున్న నేపథ్యంలో నేను పెరిగి నా చదువు కొనసాగించాను. చెయ్యాల్సిన ఘనకార్యం ఏంటయ్యా అంటే పాశ్చాత్య నాటకం. దంతో నాకారు వాళ్ళమంతా అలాంటి నాటకాలు చదవడం, అధ్యయనం చెయ్యడం, రాయడం, ప్రదర్శించడం అనే చతుర్విధ పురుషార్ధాల్ని ఉపాసించడంలో లీనమయ్యుండేవాళ్ళం. ఎప్పుడూ మా దృష్టి పడమటి దిక్కుగానే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే అదెంత దురదృష్టమో అనిపిస్తుంది. జాగా .. కాలం .. వీటి మధ్య ఒక సంయమనం ఉండాలని మాలోకి జీర్ణించబడింది. దాన్ని మేమెంత పూర్తిగా నమ్మేశామంటే .. నోడౌట్స్ .. అసలు ఏమాత్రం అపనమ్మకమనేది లేకుండా. దాంతో కూడియాట్టం, కథకళీ మాకెందుకూ పనికిరానివి లాగా కనిపించసాగినయ్యి. మేం అప్పటికే వేరే రకం గీటురాయి నెంచుకున్నాం క్వాలిటీని కొలిచేందుకు. ఈ కళలేమో స్థలకాలాల పట్ల అలాంటి ద్రుఢమైన చట్రాన్ని ఒప్పేవి కావు, అందులో ఇమిడేవి కావు.

ప్ర: కానీ మీ సినిమాల్లో ఎక్కడా కథకళి ప్రదర్శనలు కనిపించవే?

అడూర్:నిజమే. కోడియెట్టంలో కళాకారులు తయారవడాన్ని చూపించాను కానీ .. దాని తరవాత జరిగేది కాదు. అదికూడా అక్కడ సందర్భాన్ని సూచిస్తూ .. ఒక మనిషి ఎలా రూపాంతరం చెందుతాడు .. ఒక మగవాడు ఒక స్త్రీపాత్రలోకి ఎలా రూపాంతరం చెందుతున్నాడు అని చూపించేందుకే ..

–ఇంకావుంది

One Response
  1. shree February 17, 2009 /