Menu

when we leave – ఓ స్త్రీ కథ

పిల్లాడికి ఆమె కథ చెపుతోంది.  పిల్లాడు ప్రశ్నలు సందించాడు.
అమ్మా మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ?
కొన్నిసార్లు వదిలి  దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్లని కనుగొంటాం..వాళ్ళ ప్రేమని  కనుగొంటాం “
” కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా ”  ఎప్పుడో తల్లి చెప్పిన మాటే తిరిగిచెప్పాడు వాడు.
అవును అంది తల్లి.
…………………………………………
బొమ్మగీస్తావా ?
లేదు
ఆడుకుంటావా ??
లేదు..
ఆకలేస్తోందా.?
లేదు.. నాకు ‘అమ్మమ్మని’  చూడాలని ఉంది.

……………………………………………

స్త్రీ కోరుకునేదేమిటి ??
కొంచం ప్రేమ..తనపట్ల, తన ఇష్టాలపట్ల, ఆలోచనల..అభిరుచుల..ఆనందాల పట్ల కొంచం  బాధ్యత.. అది దొరకని చోట స్త్రీ ఉంటుందా ??
అందుకే తనమీదా ..తన కొడుకుమీదా దురుసుగా ప్రవర్తించే భర్తని, అది తప్పనీ ఆ భర్తకు  చెప్పలేని ఆ కుటుంబాన్నీ   వదిలొచ్చేసింది ఆమె.
స్త్రీ కోరుకునేదేమిటి ??
అర్థం చేసుకునే తల్లిదండ్రులు.. కుటుంబం.
కానీ తనదీ అనుకున్న కుటుంబం తనది కాదని తెలిసింది. తల్లిదండ్రులు..తమ్ముడూ, చెల్లీ తమ స్వార్థం మే చూసుకున్నారు. కుటుంబ మర్యాదే ముఖ్యమనుకున్నారుతప్ప..
ఆమె ఒక్కతే అయితే ఎలాగయినా సర్ధుకోవచ్చేమో… కానీ ఆమెకో పిల్లాడున్నాడు.. వాడి పరిస్థితేమిటి ??
నిలువనీడలేని తమ పెద్దకూతురిని అర్థం చేసుకోలేకపోయారు. ఆమె కొడుకికి తాతా, మామా..అమ్మమ్మా..పిన్నీ అనే కుటుంబాన్ని ఇవ్వలేకపోయారు.
స్త్రీ కోరుకునేదేమిటి ?
ఒకింత స్వేచ్చ.. . ఒకింత స్నేహం.. ఒకింత ప్రేమ..ఒకింత గౌరవం..ఒకింత అలంబన..వెరసి ఒకింత సంతోషం..ఒకింత తృప్తి..ఒకింత జీవితం.
అవన్నీ తనకి తన రెండుకుటుంబాలూ ఇవ్వలేక పోయాయి. కానీ తను వాటికోసం స్వతంత్రంగా పోరాడింది. స్నేహితురాలి స్నేహ  సహాయంతో..
తనకంటూ ఒక ఉద్యోగం.. ఒక అపార్ట్మెంట్..ఒక ప్రేమించే హృదయం దొరికింది.
కానీ తనకీ తన కొడుకుకి ఒక కుటుంబం లేదనే బాధ..ఉండాలనే తపన..ఆ ఆరాటంలో  ఎన్ని అవమానాలకో..ఎన్ని తిరస్కారాలనో ఎదుర్కొని..  నీవు నా తమ్ముడివి…నీవు నా అమ్మవి.. నీవునా నాన్నవి..నీవునా చెల్లివి.. మీరు నా కుటుంబం
అని వాళ్లకి చెప్పటానికి ప్రయత్నించింది… కానీ కనపడని సమాజం ఇచ్చే పరువు మర్యాదల్లో  ప్రేమని అణిచిపెట్టిన వాళ్ళకి అది అర్థమవుతుందా ??
మొత్తం మీద ఆమె తండ్రీ ఆలోచనలో పడ్డాడు, తన తండ్రిని కలిశాడు ….కొడుకులతోనూ చర్చించాడు . ఏదో నిర్ణయానికి వచ్చాడు ..కానీ….
కానీ ఆమె తమ్ముళ్ళు తీసుకున్న నిర్ణయం వేరుగా ఉంది.
 ……………………………………………

అమ్మా  తాతయ్యకి వొంట్లో బాలేదా ??
అవును..
స్త్రీ కోరుకునేదేమిటి ?
కానీ ఆస్త్రీకి దొరికిందేమిటి ??
ఇది ఒక  స్త్రీ  వ్యథ
……………………………………………
” కానీ  వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా “
అవును ఓ గొప్ప  భావోద్వేగం..రెండుకన్నీటి చుక్కలని వదిలి వెళ్తుంది సినిమా !!
 ……………………………………………
కథ..కథనం. నటీనటుల ఎంపిక,,వాళ్ళనటనా  ఒక ఒప్పుకోదగ్గవి… ప్రధాన పాత్రలో  ‘ సీబాల్’ అమెకొడుకుగా  చిన్నారి ‘నిజాం శెల్లర్’ నటన చెప్పుకోదగ్గది.   మరి గొప్పవి ఏమిటంటే  దర్శకత్వం..సినిమాటోగ్రఫీ..ఎడిటింగ్..సంగీతం. అవి అసాధారణ స్థాయిని అందుకున్నాయి. అయితే  సినిమాకి సంభందించి ముఖ్య విభాగాలైన  ” కథా -దర్శకత్వం..సినిమాటోగ్రఫీ..ఎడిటింగ్”  నిర్వహించింది  ‘ స్త్రీ ‘లే అవటం ఆసక్తి కరమైన విషయం.
సినిమా అంటే భావోద్వేగాలు.. వాటిని మన మనసుల్లో రేకెత్తించి మనని స్పందిపచేయగల ఏ సినిమాకైనా అవార్డులు..రివార్డులు..అప్రిసియేషన్స్ వస్తాయి.రాక తప్పదు.