Menu

revanche – ప్రశాంతోద్వేగం.

ఒకరిమీద ఒకరికి ఉండే అపారమైన గౌరవం..ఇష్టాల కలగలుపే ప్రేమ.  ప్రేమకి క్షమించే గుణం ఉంటుంది.  ప్రేమకి అంగీకరించే గుణం ఉంటుంది.  ప్రేమ గుడ్డిది అని అంటారు ఎందుకంటే …ఎదుటివ్యక్తి మంచయినా చెడయినా  ఆ ప్రేమ కి తెలియదు, అలాగే  ప్రేమకోసం ఆ ప్రేమికులు ఏ దారిలో వెళుతున్నారో తెలియదు.  పక్కన ప్రేమించిన మనిషి ఉంటేనే ఎదురుగా ఉన్న లోకానికి అర్థం లేదా
ఆ ప్రపంచం  ఎందుకూ పనికి రానిదే !!
ఇది గొప్ప  కథ కాదు..విచిత్రమైన మలుపులూ లేవు. చాలా సరళమైన కథ. మెగ్గెప్పుడు వేసిందో..పువ్వెప్పుడు పూసిందో..కాయెప్పుడు కాసిందో తెలియదు. అలాగే జీవితంలో  మలుపులు ఎలా సంభవిస్తాయో తెలియదు.
అలెక్స్ అనే వ్యక్తి ఒక వ్యభిచారగృహంలో పని చేస్తుంటాడు. అక్కడ తమార అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ యజమానికి ఆమె మీద ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.
అందుకే ఆమెకి ఒక ఆఫర్ ఇస్తాడు. కానీ తమారా దానికి ఒప్పుకోదు. యజమాని ఆలోచించుకోమనిచెపుతాడు.
 తమారాకి  పాత అప్పులు ఉంటాయి. ఆ అప్పులుతీర్చాలన్నా..తామిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోయి హాయిగా బతకటానికి బాంక్ దోపిడీ చేయాలని అనుకుంటాడు అలెక్స్ .ఎందుకంటే తను ఇదివరకు దొంగతనాలు అలవాటే కనక. అదే విషయం తమారాతో చెపుతాడు. కానీ ఆమె అంగీకరించదు.
అలెక్స్ తాతయ్య హస్నర్, దగ్గరలోని ఒక ఊర్లో  ఉంటాడు. పెద్ద మైదానం అందులో   ఓ చిన్న ఇల్లు.. పెరట్లో రెండు ఆపిల్ చెట్లు.. ఓ నాలుగు పశువులని చూసుకుంటూ ఒంటరి జీవితం గడుపుతుంటాడు. తాను లేకుంటే వాటిని ఎవరు చూసుకుంటారు అనే దిగులు అతనికి.  దగ్గరలో ఉండే  సూసాన్ అనే ఆవిడ ఆ తాతయ్యని అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటుంది. తాతయ్య వినిపించే సంగీతం వింటూంటుంది.ఇద్దరూ కలిసి చర్చ్ కి వెళ్తూ ఉంటారు.
సూసాన్ భర్త పోలీసు ఆఫీసర్ రాబర్ట్.  పిల్లలు కలగక పోవటం ఆ ఆదంపతుల బాధ . దత్తత తీసుకుందామంటే రాబర్ట్ ఒప్పుకోడు. దత్తత తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. కన్నబిడ్డకాదు కనక వాడు ఎలాంటివాడో..ఎలా పెరుగుతాడొ కనుక్కొవటం కష్టం..కొన్నాళ్ళు చూద్దాం అని సర్థి చెపుతాడు. కానీ ఆమెకి తెలుసు అతనివల్ల ఆమె తల్లికాలేదని.
ఓ రోజు ఒక విటుడు తమారాని కొట్టటం చూసి భరించలేక అలెక్స్ అతనిపై చేయిచేసుకుంటాడు. కానీ యజమానే అలా చేయించాడనీ తన ఆఫర్ ఒప్పుకోటానికి అని తెలుసుకుంటాడు. తరవాత  అలెక్స్ ఆమె సామానంతా తానుకనుక్కున్న దొంగదారిలో తరలిస్తాడు. తమారా ఆ గృహం నించి బయటపడుతుంది. తన ఇంట్లో ఆమెని ఉంచటం కూడా సేఫ్ కాదని హోటల్లొ గది తీసుకుంటాడు. మొత్తానికి ఆమెని ఒప్పిస్తాడు, కానీ తానుకూడా దొంగతనానికి వస్తాననీ  కార్లో వేచిచూస్తాననీ చెపుతుంది. దొంగతనం సాఫీగానే జరిగి అంతా బానే జరిగిందీ అనుకుంటున్న సమయంలో నాటకీయంగా తమారా  చనిపోతుంది. అలెక్స్ బాధకి అంతు లేదు. ఎందుకంటే ప్రేమించిన మనిషిదూరమైతే గుండె చిద్రమవుతుంది.
కారునీ తమారా ని వదిలేసి బాధాతప్త హృదయంతో తాతయ్య ఊరు చేరుకుంటాడు. తాతయ్య పరిచయస్తురాలు సూసాన్ భర్తే తమారా చావుకు కారణం అని తెలుస్తుంది.
రాబర్ట్ కారుని కాల్చకుండా నేరస్తులని కాల్చాడన్న ఆరోపణలో విచారణ ఎదురుకుంటుంటాడు.
ప్రియురాలి వియోగాన్ని అతి కష్టంమీద భరిస్తూ చలికాలానికి కావలసిన కట్టెలు కొడుతూ ..తాతయ్యకి సహాయం చెస్తూ గడుపుతుంటాడు అలెక్స్. అప్పుడప్పుడూ సూసాన్ వస్తుంటుంది. చొరవగా అలెక్స్ ని పలకరిస్తుంటుంది. తాతయ్యకి తోడుగా ఉన్నందుకు అతన్ని మెచ్చుకుంటుంది.
అలెక్స్ ఓనాడు తాతయ్యతో కలిసి భోజనం చేస్తూ అడుగుతాడు.
మీఆవిడ ని మిస్ అవుతున్నావా ??
ఒంటరి జీవితం గడపటం దుర్భరమే కదా. కానీ నేనామెను మళ్ళీ కలుసుకుంటాను.ఆమె నాకోసం వేచి చూస్తోంది. తాతయ్య మనసులో వాళ్ల ఆవిడ మీద ఎంత ప్రేమో !ఒక పక్క అలెక్స్ రాబర్ట్ ని చంపాలా అనే అలోచన చేస్తుంటాడు. మరో పక్క రాబర్ట్  Department లో బుల్లెట్టు గురితప్పిందీ అంటే నమ్మటంలేదనీ తాను కావాలని కాల్చానని అనుకుంటున్నారని బాధపడుతుంటాడు. అదీకాక  సూసాన్ రాబర్ట్ ల మధ్య సన్నిహిత్యం తగ్గుతూంటుంది.ఓ నాడు  అలెక్స్ సూసాన్ని నిలదీసి ఇంటికి రావటం..ఈ కలుపుగోలుతనం..ఈ కేకులు తేవటం..ఇదంతా ఎందుకని ? తమని ఒంటరిగా వదిలేయమనీ  ఇంటికి రావటం చాలించమనీ. మొహంమీద చెప్పేస్తాడు. అయితే నీవే మా ఇంటికి రా అని అతన్ని ఇంటికి అహ్వానిస్తుంది. ఆమె ఉద్దేశ్యం అతనికి కొంచం అర్థమవుతుంది.
ఇంటికి వెళతాడు..
మీ ఆయనంటే నీకు బోర్ కొట్టిందా ??
లేదు అతను నా భర్త..
మరి ఎందుకు చేస్తున్నావ్..
నాకు కావాలి..
మరి మీదేవుడేమీ అనడా
అర్థం చెసుకుంటాడు.
హిహి  .. అర్థం చేసుకునే దేవుడు.
మంచి మిత్రుడిలాగా ఉండొచ్చుకదా.. మామూలుగా ఉంటే నీ సొమ్మేంపోయింది. ఎందుకలా మాట్లాడతావ్ ?
పిల్లలున్నారా ?
లేరు.
మరి పైన పిల్లల గది..
ఉన్నది .. కాని పిల్లలు లేరు.
నేను వెళుతున్నా.
నేవెందుకిలా ఉన్నావ్.. మొరటుగా మాట్లాడుతావ్..
నీకు తెలియకపోవటమే మంచిది.
మళ్ళి వస్తావా ?
తాతయ్య అలెక్స్ తో చెపుతాడు..
నీవు పెళ్లి చేసుకోవాలి. మగాడికి ఆడతోడు అవసరం లేదంటే అవశ్యకత లేని వ్యక్తి అయిపోతాడు.
నీవు పనిమంతుడివి . నీకు సునాయాసంగా దొరుకుతారు ఎవరో ఒకరు.
ఏదీ కట్టేలు కొట్టటం అమ్మాయిలని ఆకర్షిస్తుందా ??
కష్టపడి పని చేసేవాడిని అమ్మాయిలు గుర్తిస్తారు. నచ్చుతారు.
నా ప్రియురాలు చంపివేయబడింది. ఇదీ నేనిలా ఉండటానికి కారణం. చంపినవాడు మాత్రం హాయిగా బతుకుతున్నాడు. నేను అలా అతన్ని వదిలేయను. హాయిగా బతకనివ్వను.
సూసాన్ కి చెప్పెస్తాడు అలెక్స్.  ఇప్పుడు నీవు అర్థమయ్యావ్..నీ ప్రవర్తన అర్థమవుతోంది. నీ మొరటుతనం ఎందుకో  తెలుస్తోంది అని అతన్ని ఓదారుస్తుంది, కానీ పాపం సూసన్ కి తెలియని విషయం ఒకటుంది.
తాతయ్య ఆరోగ్యం రాను రాను క్షీణిస్తోంది. కాని అతని దిగులంతా తన ఇల్లూ పశువుల మీదే వాటిని ఎవరు చూసుకుంటారనే. అలెక్స్ తానిక్కడే ఉండి వాటిని సురక్షీతంగా చూసుకుంటానని చెప్పి ఆసుపత్రి లో జాయిన్ చేస్తాడు.
మిగతా కథ .. ……………………………చూస్తేనే బావుంటుంది. 🙂

సూరీడు  అడ్డుగాఉన్న మేఘాన్ని దాటేశాడు.  చక్కని ఎండ కాస్తున్నది. మధ్యాన్నపు గాలి కొంచం జోరుగా వీస్తున్నది. ఆపిల్ చెట్టి విరగకాసింది. అలెక్స్ బుట్టలో ఆపిల్స్ ఏరుకొచ్చాడు.
…………………………

జరుగుతున్న సంఘటలని ఎవరో కెమెరా తో రికార్డ్ చేసారా అన్నంత రియలిస్టిక్ గా  ఉంటుంది సినిమా . నటిసటులంతా అతి సహజంగా నటించేసారు.
బయటికి కరుకుగా కనపడుతూనే.. సున్నితహృదయుడిగా  Johannes Krisch నటన అతికినట్టు సరిపోయింది. అతని చూపు..మాటలు..శరీరభాష చక్కగా కుదిరాయి. స్టబర్స్ ఓల్డ్ మాన్ తాతయ్యని చూస్తే జాలి కలగక మానదు.
అద్బుతంగా తోచే విషయం.. అర్థం కాని ప్రశ్నా ఒకటె నాకు.
ఇంత సరళంగా ..సున్నితంగా ..హత్తుకునేట్టు దర్శకుడు ఎలా మలిచగలిగాడా అని ?
ఎంత అవగాహన ..ఎంత నిండుతనం.. ఎంత అనుభవం.. ఎంత నమ్మకం ఉండాలో దానికి.
ఓ కొలని గట్టున కూర్చుంటే.. ఆ నీళ్లపై నించి వచ్చి తాకే గాలి..ఊగుతున్న చెట్ల కొమ్మల శబ్ధం.. ఎక్కడో కూసే పిట్ట అరుపు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత శాంతంగా ఉంటుంది సినిమా.
బెర్లిన్ టొరంటో సినిమాపండగల్లో అవార్ఢులొచ్చాయి. ఆ ఏడు బెస్ట్ పారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కారుకి కూడా నామినేట్ చేయబడిందీ సినిమా.
ప్రేమకి అంగీకరించే గుణం ఉంటుంది. ప్రేమకి క్షమించే గుణం ఉంటుంది.

Chakradhar.