Menu

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు ప్రయాణం చేసి, బస్సుల్లో, రైల్లో అర్జెంటినాలో ప్రవేశించి బ్యూనస్ ఐర్స్ నుంచి కేప్ టౌన్ కి చేరుకుని అక్కడనుంచి ఒక నౌకలో బొంబాయి చేరుకున్నారాయన.

వినడానికి సినిమా కథలా ఉన్నా ఇది నిజం. జీవితంలోనే కాదు ఆయన చేసిన ప్రతిపనిలోనూ అదే సాహసం.

ఫిబ్రవరి 19, 1919 నెల్లూరులో తిక్కవరపు రామిరెడ్డి దంపతులకు సంపన్నుల కుటుంబంలో పుట్టి బెంగాళ్ లోని శాంతినికేతన్ లో చదువుకుందామని బయలుదేరి అక్కడ సప్న జోత్స్నా సంచారం చేస్తూ అనుకోకుండా కలకత్తా నగరంలోని చీకటి గదులలో పేద ప్రజల మధ్య గడిపిన సమయంలో నగరం తాలూకు ఉన్నత్త వ్యాపారసరళి, అట్టహాసపూరితమైన ప్రకటనలు, అమానుషమైన దోపిడీ, యంత్రాలాధిక్యతా, ప్రకృతిపట్ల తీవ్రమైన నిరాదరణా చూసి కదిలిపోయి శాంతినికేతన్ నుంచి బయటపడి అప్పటివరకూ చెలామణిలో ఉన్న భావకవిత్వాన్ని పక్కకి నెట్టేసి ఆధునిక కవిత్వానికి దారి చూపించారాయన. ఆయనే పఠాభి.

నా యీ వచన పద్యా
లనే దుడ్డుకర్రల్తో
పద్యాల్ నడుముల్ విరగ దంతాను చిన్నయ్ సూరి బాల
వ్యాకరణాన్ని చాల దండిస్తాను

అంటూ తిరగబడి

తగిలింపబడియున్నది జాబిల్లి
చైనా బజారు గగనములోన

మద్రాసు నగరమా! నీ మీద బ్లూబ్లాక్
సిరాలాగా పడింది రాత్రి

1939 లో అప్పటివరకూ ఆధునిక కవిత్వంలో అలవాటు కాని దృష్టితో దర్శించి సృష్టించిన ’ఫిడేల్ రాగాల డజన్’, దాని తర్వాత అచ్చయిన ’కయిత నా దయిత’ , ’పన్ చాంగం’ తో పఠాబి తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు సంఘ సంస్కారానికి ఒక వాహికగా మలుచుకోవచ్చని నమ్మి ఉత్తమ చిత్రాన్ని నిర్మించి సెన్సార్ వారితో పోరాడి, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సినిమాను ప్రదర్శించి, లోకర్నో చలనచిత్రోత్సవంలో అవార్డులనందుకుని, ఉత్తమ భారతీయ చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుని కర్నాటక రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికించిన ’సంస్కార’. దాని తర్వాత నిర్మించిన ’చండమారుత’, ’శృంగార మాస’ చిత్రాలతో భారతదేశ చలనచిత్ర చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

పఠాభి సాహితీ లోకంలో అగ్రశ్రేణి కవి. సినీ రంగంలో సాహస నిర్మాత, సమాంతర సినీ పతాకం ఎగురవేసిన దర్శకుడు. అంతే కాదు ఆయన గణిత శాస్త్రవేత్తకూడా.

నెల్లూరు లో పుట్టి అటునుంచి శాంతినికేతన్ కు, అక్కడనుంచి చైనా జపాన్ ల మీదుగా అమెరికాకు, అక్కడనుండి అనేక యితరదేశాలకు, ప్రాంతాలకు ప్రయాణించి మద్రాసు వొచ్చి, మధ్యలో సర్వకళాకోవిదురాల స్నేహలతను కలిసి ఈ రెండు ఉప్పొంగే నదులు ఒక్కటై బెంగుళూరు చేరి అక్కడ ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి, అనేక సృజనాత్మక సంఘటనలకు ఆలవాలమై, కేంద్రమై, పోరాట జీవితం గడిపి ’జీవితం మృత్యువుతో ముగిసిపోదని నా నమ్మకం’ అంటూ 2006 మే 13 న ఈ లోకాన్ని వదిలివెళ్ళినా ఎంతో మంది అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.

3 Comments
  1. Sowmya November 28, 2009 /
  2. శి. రా. రావు November 28, 2009 /