Menu

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు.

ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య తేడా ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు.

ఇరవై ఏళ్ళుగా సాదాసీదా జీవితం గడుపుతూన్న వతానబే, నిజానికి బతికున్న శవంలా జీవిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం కొన్నాళ్ళు ప్రవాహానికి ఎదురీది జీవనపోరాటం చేసే ప్రయత్నం చేశాడు కానీ ఇప్పుడు అతనిలో ఆనాటి భావేవాశము కానీ, ఆశయాలు కానీ కొసరంతైనా లేవు. అయినా కూడా మన కథానాయకుడు ఎప్పుడూ బిజీ, ఎల్లప్పుడూ చాలా బిజీ! ఏం చేస్తూ బిజీగా ఉంటాడయ్యా అంటే, ఎమీ చెయ్యకుండానే బిజీగా ఎలా ఉండాలి, తన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలి అని అతను ప్రయత్నిస్తుంటాడు. ఒక వేళ ఏదైనా పని వస్తే ఏం చేస్తాడయ్యా అంటే….తప్పించుకుంటాడు.

ఇలాంటి సమయంలో, తమ కాలనీ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మురికి నీరు చేరుకుని కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగచేస్తుందని, దయచేసి ఆ ప్రదేశంలో పార్క్ లేదా ఆట స్థలం ఏర్పాటు చేయవలసిందిగా అర్జీ పట్టుకుని వతానబే దగ్గరకు వచ్చారు కొంతమంది. ఇలాంటి సమయంలో మన కథానాయకుడు ఏం చేస్తాడో మీకు తెలిసిందే! ఇది మా డిపార్ట్‌మెంట్ కి సంబంధించిన విషయం కాదని, వారిని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ కి వెళ్ళమని చెప్పి తప్పించుకున్నాడు వతానబే!

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని ఊరికే అనలేదు. ఈ లోకం మొత్తం ఇలాంటి ధన్యులే అధికం; అర్జీ పట్టుకుని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ కి వెళ్ళిన కాలనీ వాసులకి అక్కడ మరో వతానబే తగిలాడు. ఇది మా పని కాదు అని మరో డిపార్ట్‌మెంట్ పేరు చెప్పారు. అలా ఎన్నోరోజుల పాటు అన్ని డిపార్ట్‌మెంట్ లు తిరిగి తిరిగి చివరికి వతానబే పని చేసే ఆఫీసుకే తిరిగి వచ్చారు వాళ్ళు. ఈ ప్రభుత్వాఫీసులు ఇంతేనని తిట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసిన ఒక ఆఫీసర్ వారి అర్జీ తీసుకుని వతానబే సీట్ దగ్గరకు వచ్చాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ రోజు వతానబే ఆఫీసుకి రాలేదు. ఆఫీసులో కలకలం రేగింది. ఎప్పుడూ లేనిది తమ బాస్ ఆఫీస్ కి రాలేదంటే ఏదో పెద్ద విశేషమే ఉండిఉండాలని వతానబే మీద జోకులేసుకున్నారు. నిజానికి ఆ రోజు వతానబే జీవితంలో పెద్ద విశేషమైనదే!

కడుపు నొప్పని హాస్పిటల్ కి వెళ్ళిన వతానబే కి క్యాన్సర్ అని తెలిసింది; మహా అయితే ఇంకో కొన్ని నెలలు మాత్రమే బతికుంటాడని స్పష్టం చేశారు వైద్యులు. ఈ వార్త విన్న వాతనబే మెదడు ఒక్కసారిగా మొద్దుబారింది. తను విన్నది జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టిందతనికి. అరవై ఏళ్ల తన జీవితం మరో ఆరు నెలల్లో ముగిసిపోతుందంటే నమ్మకం కలగలేదు. ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. కుర్చీలో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయాడు. అంధకారం అతన్ని చుట్టుముట్టేసింది.

ikiru-2

కాసేపటికి అతని కొడుకు కోడలు లోపలకి వచ్చారు. చీకట్లో కూర్చుని ఉన్న వతానబే ని వాళ్ళు గమనించకుండా తమ మాటల్లో తామున్నారు. తను ఇన్నాళ్ళూ కష్టపడి సంపాదించిన డబ్బులు కొట్టేయడం కోసం సొంత కొడుకే తన భార్యతో నీచంగా మాట్లాడం విని వతానబే దిగ్భ్రాంతికి గురయ్యాడు. క్యాన్సర్ చేసిన గాయంకంటే కొడుకు మాటలతో అతని హృదయం మరింతగా గాయపడింది. చిన్న వయసులోనే తన భార్య చనిపోగా, కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు తనకీ రోజు మిగిలిందేమిటి అనే ఆలోచన వతానబే లో మొదలయింది. ఎవరికీ ఏమీ కాకుండా పోయిన తన జీవితం గురించి ఆలోచించుకున్నాడు. కనీసం తన జీవితంలోని మిగిలిన రోజులైనా సుఖంగా గడపాలని నిర్ణయానికి వచ్చాడు.

కీలక సన్నివేశం

సుఖంగా గడపడమంటే ఏమిటో కూడా తెలియని వతానబే మొదట ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ పరిచయమైన ఒక రచయిత కి తన గురించి దిగులుగా చెప్పుకుంటాడు వతానబే. అతని పరిస్థిని అర్థం చేసుకున్న ఆ రచయుత వతానబే ని తీసుకుని జీవితపు మాధుర్యాన్ని చూపిస్తానని చెప్పి అతన్ని ఒక క్లబ్ కి తీసుకెళ్తాడు. అమ్మాయిలతో తిరుగుతూ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతూ రచయితతో రాత్రంతా గడుపుతాడు. అతనితో గడిపినా ఆ కాసేఫు వతానబేకి బాగానే అనిపిస్తుంది. కానీ తను కోరుకునే జీవితం ఇది కాదనే విషయం ఒక వైపు అతనికి తెలుస్తూనే ఉంటుంది. చివరికి ఆ క్లబ్ లో ఒకతను పియానో వాయిస్తుండగా వతానబే “జీవితం ఎంత అల్పమైనదో” అంటూ పాట పాడుతాడు.

Life is brief.
Fall in love, maidens,
before the crimson bloom fades from your lips
before the tides of passion cool within you,
for those of you, who know no tomorrow.

ఆ రాత్రి రచయితతో చూసిన జీవితం కొత్తగా అనిపించినా వతానబే కి సంతృప్తి మాత్రం కలగదు.

ikiru-3

ఆ తర్వాత రోజు, ఆఫీసులో తన వద్ద క్లర్క్ గా పని చేస్తున్న ఒక అమ్మాయి తన రాజీనామా పత్రం పై సంతకం కోసం వతానబే వద్దకు వస్తుంది. ఆమెలోని స్వచ్ఛమైన ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు వతానబే. తనకీ ఆమెలా బతకాలనే కోరిక కలుగుతుంది. ఆ సంతోషానికి గల కారణం ఏంటో తనకు చెప్పమంటాడు. దానికి ఆమె చెప్పిన కారణం చాలా చిన్నదైనా మొదటి సారిగా వతానబే లో ఒక మార్పు కలుగుతుంది. ఆమె మాటల్లో ఒక గొప్ప సత్యం అతనికి అవగతమవుతుంది. ఆ రోజే మరో కొత్త వతానబే అతనిలోనుంచి పుట్టుకొస్తాడు.

ఆ తర్వాత రోజు ఆఫీసుకి చేరుకోగానే తన డెస్క్ మీదున్న ఒక ఫైల్ బయటకు తీస్తాడు. అందులో కాలనీ వాసులు పెట్టుకున్న అర్జీ ని తీసి తన వద్ద పనిచేసే ఆఫీసర్లకు, కాలనీ లో ఒక ఆట స్థలం కట్టడానికి ఏర్పాట్లు చెయ్యమని ఆదేశిస్తాడు. ఇది మన డిపార్ట్‌మెంట్ పని కాదని ఆఫీసర్లు వారిస్తున్నా వారి మాటలు పట్టించుకోడు; ఈ పని మనమే చేసి తీరాలని చెప్పి ఆఫీసునుంచి బయటకు వెళ్లగా, వతానబే లో వచ్చిన మార్పు చూసి అఫీసులో అందరూ ఆశ్చర్యపోతారు.

కాలనీ లో నిర్మింపబడే పార్క్ వ్యవహారమంతా వతానబే స్వయంగా దగ్గరుండి చూసుకోవడమే కాకుండా, మరెన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటాడు. ఆ స్థలాన్ని కాజేసి అక్కడొక హోటల్ కట్టాలనుకున్న పెద్ద మాఫియా డాన్ ని సైతం వతానబే ఎదిరించి తననుకున్న పని పూర్తి చేస్తాడు. కానీ పార్క్ ఆవిష్కరణ సభలో మాత్రం ఎవ్వరూ వతానబే పేరు రానివ్వకుండా జాగ్రత్త పడతారు. ఎవరికి వారు అది తాము చేసిన పనిగా గొప్పలు చెప్పుకుంటారు. ఆ రోజు రాత్రి వతానబే పార్క్ లో కూర్చుని హాయిగా ఊయలూగుతూ “జీవితం ఎంత అల్పమైనదో” అంటూ పాడుతాడు.

life is brief
fall in love, maidens
before the raven tresses begin to fade
before the flame in your hearts flicker and die
for those to whom today
will never return

అలా పాడుతూ, పాడుతూ హాయిగా తన ఆఖరి శ్వాస విడుస్తాడు వతానబే.

ikiru-4
వతానబే మరణానంతరం నగరంలోని ప్రముఖులంతా హాజరుకాగా అతని సంతాప సభ జరుగుతుంది. వతానబే లో అనుకోకుండా వచ్చిన మార్పు గురించి ఆ సభలో అందరూ చర్చించుకుంటారు. మొదట్లో ఒక్కొక్కరికీ ఒక్కొక రకమైన అభిప్రాయం ఉంటుంది. కానీ పార్క్ నిర్మాణంలో వతానబే చూపించిన దృఢ సంకల్పం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.వారందరికీ కూడా ఆ రాత్రి ఒక సత్యం గోచరించినట్టవుతుంది.

కానీ ఒక గొప్ప సత్యాన్ని అనుభవం ద్వారానే తెలుసుకోగలం. ఈ సత్యం ఎల్లప్పుడూ అందరిముందూ ఉన్నప్పటికీ అది అర్థమయ్యేది కొందరికే. అలా అర్థం చేసుకున్న వాళ్ల జీవితాలు చూస్తే వారు జీవితంలో కొన్ని చిత్రమైన అనుభవాలు పొందిన వారై ఉంటారు; కొన్ని సాహసాలు, కొన్ని కష్టాలతో జీవితం గడిపి ఉండుంటారు. అలాంటి వాళ్లకే జీవితం తన రహస్యాలు వెప్తుంది; గుండె విప్పి మాట్లాడుతుంది. కానీ అన్నీ ఉండి వెచ్చగా, సుఖంగా ఉన్న అదృష్ట జీవులకు, ఉద్యోగమో, ధనసంపాదనో సర్వస్వంగా భావించే వారికి ఈ సత్యం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వారికి అర్థం చేసుకునే మనసు ఉండదు.

మనుషులందరికీ మనసుంటుంది. నిజమే! కానీ కొందరు దానిని గుర్తించనే గుర్తించరు. చాలామందికి దాని శక్తేమిటో అసలు తెలియదు. మనసు ఎంతో దూరం పోగలదు; ఎన్నో చేయగలదు. అది ఎంతో శక్తివంతమైనది. ఆచరణలోకి తీసుకొస్తున్న కొద్దీ ఒక్కోశక్తీ మనకు తెలిసి వస్తుంది. కానీ ఆ శక్తిని గుర్తించే అవకాశం రాకముందే చాలామంది జీవితపు చివరి దశకు చేరుకుంటారు.

కానీ ఎప్పుడో ఎవరికో ఇలాంటి అవకాశం కలుగుతుంది. అలాంటి వాళ్ళు తమ శక్తిని తెలుసుకుని జీవితపు సత్యాన్ని తెలుసుకుంటారు. జీవితమనే తెల్ల కాగితంపై తమ సంతకాన్ని వదిలివెళ్తారు. అలాంటి వారిలో ఒకరు వతానబే; మన కథానాయకుడు.

అర్థం లేని తమ జీవితాలకూ వతానబే జీవితం ప్రేరణ కలుగచేస్తుంది. వతానబే చేసినట్టే తాము కూడా తమ జీవితాల్ని మార్చుకోవాలని, ఇక నుంచి అందరూ తమ పనుల్ని తాము సక్రమంగా నిర్వర్తించాలనీ, బాధ్యతలనుంచి తప్పించుకోకూడదని అని ప్రమాణం చేస్తారు.

******

వతానబే మరణించిన కొన్నాళ్ళ తర్వాత….

తమ ఇంటి దగ్గరున్న మురిక్కాలువ రిపేర్ చెయ్యాలని అర్జీ పట్టుకుని ప్రభుత్వాఫీసుకు వస్తారు కొంతమంది. అది తమ పని కాదని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని సంప్రదించాలని ఎప్పటిలాగే తప్పించుకోజూస్తారు. ఇది గమనించిన ఒక క్లర్క్ ఆవేశంగా లేస్తాడు. వతానబే సంతాప సభలో చేసిన ప్రమాణాలను అందరికీ గుర్తు చెయ్యాలనుకుంటాడు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు అతన్నో వింత పశువులా చూడడంతో ఏం చెయ్యాలో తెలియక తన సీట్లో నిశబ్దంగా కూర్చుండిపోతాడు.

ప్రవాహానికి ఎదురీదిన వతానబే లేకుండానే ప్రపంచం నిరంతరంగా సాగిపోతోంది. ఎప్పటిలానే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటారు. వతానబే మాత్రం పార్క్ లో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఆనందపడతాడు.