Menu

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి

సెప్టెంబర్ 21, 1945.

నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే!

రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు.

ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా శవం దగ్గరకు వచ్చి కర్రతో నన్ను పొడిచి చూచాడు. ప్రాణం పోయిందని నిర్థారించుకుని నా దగ్గర ఏమైనా దొరుకుంతుందేమోనని వెతికి చూశాడు. నా దగ్గర చిల్లిగవ్వ కూడా దొరకదని అతనికి తెలియదు పాపం! చివరికి నా ప్యాంట్ జేబులో దొరికిన ఎర్ర రంగు పిప్పర్మెంట్ బిల్లల డబ్బాని తెరిచి ఆశగా చూశాడు. “ఆ డబ్బా నాది; నాకిచ్చెయ్” అని గట్టిగా అరిచి అతని దగ్గర లాక్కోవాలనే అనిపించింది. కానీ అప్పటికే దేహం వదిలేసిన అత్మను; తిరిగి నాలోకి ఎలా చేరగలను?

*****

నేను ఈ లోకం వదిలి వెళ్లడానికి కొన్ని నెలల ముందు….

grave-1

అమెరికన్ యుద్ధ విమానాలు జపాన్ దేశపు ఆకాశంలో పక్షుల గుంపుల వలె తిరుగుతూ, బాంబుల వర్షం కురిపిస్తోన్న సమయం. ఎక్కడ విన్నా నగరాలు నేలమట్టమయిపోతున్నాయన్న వార్తలే!
ఆ రోజు నాకింకా బాగా గుర్తుంది.

మా ఉరి పైనా అమెరికన్ విమానాలు దాడిచేయనున్నారనే వార్తలు రావడంతో, ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు బధ్రంగా నేల మాలిగలో దాచి పెడ్తున్నాను. అప్పటికే ప్రమాద ఘంటికలు మ్రోగించారు. ఊర్లోని వారందరూ బాంబు దాడినుంచి తమని తాము కాపాడుకోవడానికి బంకర్స్ కి తరలి వెళ్తున్నారు.

ఇంతలో అమ్మ వచ్చింది.

“సెటా, త్వరగా బయల్దేరు” అంది.

మా అమ్మకి తొందరెక్కువ. “ఇప్పుడే వచ్చేస్తున్నా” అని చెప్పాను.

“చెల్లి ని నీతోపాటే జాగ్రత్త గా తీసుకునిరా” అని చెప్పి నా చిట్టి చెల్లి సెట్సుకో ని నా దగ్గర వదిలేసి వెళ్లింది. అమ్మకి ఆరోగ్యమేం బాగోలేదు. ఆ మధ్యనో సారి గుండె నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ మందులిచ్చాడు. నాన్న యుద్ధానికి వెళ్ళినప్పటినుంచీ నేనే అమ్మనీ, సెట్సుకో ని జాగ్రత్తగా చూసుకునేవాడ్ని.

grave-2
అమ్మ అటు వెళ్లిందో లేదో యుద్ధ విమానాలు ఆకాశంలో స్వైర విహారం చేస్తూ బాంబుల దాడి కురిపించాయి. సెట్సుకో ని వీపు మీద ఎక్కించుకుని నేను కూడా బంకర్ వైపు బయల్దేరాను.

కానీ అక్కడ అప్పటికే బాంబుల వర్షం కురుస్తోంది. ఊరి జనాలు చెల్లా చెదరయ్యారు.
ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తెలియలేదు నాకు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను. చివరికి సెట్సుకో ని మోసుకుంటూ ఒక సముద్ర తీరానికి చేరాను. బతికి బట్టకట్టామనే సంతోషంలో ఉండగా సెట్సుకో దిగులుగా చెప్పింది – తన ఎడం కాలి చెప్పు ఎక్కడో పడిపోయిందని.

అమ్మ జాడ తెలియదు; చేతిలో చిల్లి గవ్వ లేదు. ఏం చెయ్యాలనే దిగులు నన్ను ఆక్రమించింది.

“సెటా! ఏం బాధ పడకు. నా దగ్గర డబ్బులున్నాయి. ఈ డబ్బులతో చెప్పులు కొనుక్కోవచ్చు” అని చెప్తూ తన దగ్గర ఉన్న చిన్ని పర్స్ లోనుంచి కొన్ని చిల్లర పైసలు తీసి అమాయకంగా చూపించింది సెట్సుకో. దాని అమాయకత్వం చూసి నా గుండె చెరువయ్యింది.

సెట్సుకో ని వీపు మీదే ఎక్కించుకుని నగరమంతా తిరిగాను. అక్కడ నగరం లేదు; నగరమున్న ఛాయలు మాత్రమే ఉన్నాయి.

దారిలో తెలిసిన వాళ్లు కనిపించి అమ్మ గురించి చెప్పారు. సెట్సుకో ని వాళ్ల దగ్గర వదిలి అమ్మ దగ్గరకు వెళ్లాను. బాంబు దాడిలో గుర్తుపట్టలేనంతగా గాయపడింది అమ్మ. ఆ విషయం నాలోనే దాచుకుని సెట్సుకో దగ్గరకు వచ్చాను. అమ్మ కావాలని ఏడుస్తూ అడిగింది. దానికెలా చెప్పను?

చిన్నపిల్ల కదా, మాట మళ్లిస్తే మర్చిపోద్దనుకున్నాను. వినలేదు; అదొట్టి మొండిఘటం. ఎంత చెప్పినా ఒకటే ఏడుపు. దాన్ని నవ్విద్దామని సర్కస్ చేశాను. అయినా వినలేదు. సెట్సుకో తో కలిసి మా అత్త వాళ్ళ ఇంటికి బయల్దేరాం.

మేము అత్త వాళ్లింటికి చేరిన కొద్ది రోజుల్లోనే అమ్మ మేము చేరలేని దూరాలకు తరలి వెళ్లిపోయింది. సెట్సుకో కి ఈ విషయం తెలియనీయలేదు. అమ్మ లేదన్న నిజాన్ని నాలోని దాచుకుని, త్వరలోనే అమ్మదగ్గరకు తీసుకెళ్తానని అబద్ధం చెప్తూ వచ్చాను.

*****

రోజులు గడిచిపోయాయి. అమెరికా మా దేశమైన జపాన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.

యుద్ధ సమయంలో అందరికీ కష్టాలే! అత్త వాళ్లింట్లో మాకూ కొత్త కష్టాలు మొదలయ్యాయి.

ప్రభుత్వం ఇచ్చిన అరకొర సరుకులతో అందరం సగం ఆకలితోనే నిద్రపోయే వాళ్ళం. రోజు రోజుకీ అత్త మాటల తూటాలు హృదయాన్ని గాయపరుస్తూనే ఉన్నాయి. ఇంటి నుంచి తెచ్చిన సరుకులు అడుగంటాయి. అమ్మ బట్టలు అమ్మి కొన్ని రోజులు కడుపు నింపుకున్నాం. అత్తతో గొడవ పడి నేనూ సెట్సుకో మా గదిలోనే ఒక కుంపటి పెట్టుకుని స్వంతంగా వండుకోవడం మొదలుపెట్టాం. చివరికి ఒక రోజు అత్తతో పెద్ద గొడవే జరిగింది. ఆ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. ఊరి బయట కొండ కింద ఉన్న రెండు బంకర్స్ లో తలదాచుకుందామని సెట్సుకో తో కలిసి బయల్దేరాను.

grave-3

కీలక సన్నివేశం

ఒక్కో రోజు మంచి నీటితోనే కడుపు నింపుకునే వాళ్లం. సెట్సుకో ఆకలి అని ఏడ్చినప్పుడల్లా తన దగ్గర జాగ్రత్తగా ఉన్న పిప్పర్‍మెంట్ డబ్బా నుంచి ఒక బిల్ల తీసి ఇచ్చే వాడిని. పాపం దాంతోనే అది సరిపెట్టుకునేది.

ఆకలి తో ఒక వైపు నరకయాతన అనుభవిస్తున్నా మేమున్న ఆ చోటు మాత్రం మాకు స్వర్గం. రాత్రయితే చాలు మిణుగురుల తళుకు బెళుకులతో ఆ చోటంతా మెరిసిపోయేది. సెట్సుకో కి మిణుగురులతో సావాసమయ్యింది. రాత్రి పూట మేమున్న చీకటి గదుల్లో వాటితో ఆడుకునే వాళ్లం.

ఒక రోజు ఉదయం నిద్రలేచే సరికి సెట్సుకో బయట ఒక గుంట తవ్వుతోంది. ఏంటో చూద్దామని అక్కడికి వెళ్లాను. సెట్సుకో చనిపోయిన మిణుగురులకు సమాధి కడ్తోందని చెప్పింది; “అమ్మ కూడా సమాధి లో నిద్రపోతోంది కదా” అనడంతో ఆశ్చర్యపోయాను. కుప్పలు కుప్పలు గా పడి ఉన్న మిణుగురులను భూమిలో పెట్టి పూడ్చేస్తుంటే అమ్మ చనిపోయిన దృశ్యం గుర్తొచ్చింది. వందల శవాలను ఒక గొయ్యిలో వేసి సామూహిక దహనం చేసిన ఆ ఘోరమైన దృశ్యాన్ని ఇన్నాళ్లూ నా గుండె లోనే దాచుకున్నాను.

రహస్యం బట్టబయలైన వేళ….ఎన్నో రోజులుగా నాలో దాచి ఉంచుకున్న కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. అంతగా నా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. కాసేపటికి తమాయించుకుని సెట్సుకో దగ్గర కూర్చున్నాను. “అన్నయ్యా, అందమైన ఈ మిణుగురులకు దేవుడు ఇంత అల్పాయుషు ఎందుకిచ్చాడు?” అనగానే మరో సారి కళ్లనీళ్ల పర్యంతమయ్యాను.

అమెరికన్ సైన్యం తో జపాన్ సేనల పోరాటం కొనసాగుతూ ఉంది; ఆకలి తో మా పోరాటం కూడా! చివరికి పిప్పర్‍మెంట్ బిల్లల డబ్బా కూడా ఖాళీ అయిపోయింది.

ఆకలి తీర్చుకోడానికి చిన్న చిన్న దొంగతనాలు చేశాను; పట్టుబడ్డాను. ఒక వైపు సెట్సుకో ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది. హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్ జబ్బు కనుక్కున్నాడు కానీ ఇవ్వడానికి అతని దగ్గరా మందులు లేవు.

నాన్న కి రాసిన ఉత్తరాలకు సమాధానం లేదు. చివరికి అమ్మ బ్యాంక్ లో దాచిన డబ్బు తీస్తే తప్ప బతకలేని పరిస్థితి. ఒక రోజు సెట్సుకో ని ఇంటి దగ్గరే వదిలి బ్యాంక్ కి బయల్దేరాను. డబ్బులు తీసుకుని తినడానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుని ఇంటికొచ్చాను.

grave-4

బుగ్గన ఏదో పెట్టుకుని చప్పరిస్తూ సెట్సుకో నీరసంగా పడుకుని ఉంది. నోరు తెరిచి చూస్తే అది మేమాడుకునే గోళీకాయ. పాపం పిప్పర్‍మెంట్ బిల్లనుకుంది. సెట్సుకో ని నిద్ర లేపడానికి ప్రయత్నించాను. తను మెల్లగా నిద్ర లేచి, “అన్నయ్యా నీ కోసం బిస్కెట్స్ చేశాను. చూడు” అని మట్టితో చేసిన బిస్కెట్ నా చేతిలో పెట్టింది. ఆ రోజు ఆకలితో ఎంత అలమటించిందో నా చిట్టి చెల్లి. వెంటనే నేను తెచ్చిన పుచ్చకాయను కోసి ఆమెకు తినిపించాను. ఒక ముక్క తింది. వంట చేసి తెస్తానని నేను బయటకు వెళ్ళాను.

నేను తిరిగి వచ్చేటప్పటికి సెట్సుకో అలాగే పడుకుని ఉంది. కానీ నాకు తెలుసు తను నన్ను వదిలి ఎంతో దూరం వెళ్లిపోయిందని. ఆ రాత్రంతా సెట్సుకో ని నా వళ్ళో పడుకోబెట్టుకున్నాను. ఉదయాన్నే ఆమెకు అంత్యక్రియలు చేసి ఈ లోకం నుంచి వీడ్కోలు పలికాను.

******

జపాన్ లొంగిపోయింది. యుద్ధం ఆగిపోయింది. నాలాంటి క్షతగాత్రులు ఎందరో రోడ్డున పడ్డారు. ఆకలి తో నిద్రలేని రాత్రులెన్నో గడిచాయి. మమ్మల్ని ఆదుకునే వారు కరువయ్యారు.

ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియదు. కానీ ఆ రోజు మాత్రం నాకు గుర్తుంది.

grave-5

సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచిన రోజు!

స్టేషన్ శుభ్రపరిచే వ్యక్తి ఒకడు, నా జేబులన్నీ వెతికి నేను అపురూపంగా దాచుకున్న పిప్పర్‍మెంట్ బిల్లల డబ్బాని కనుగొన్నాడు. అందులో ఏమీ లేకపోవడంతో చిరాగ్గా బయటకు విసిరేశాడు. దూరంగా పొదల్లో పడిన ఆ డబ్బా అలికిడికి మిణుగురులు నక్షత్రాల్లా పైకి ఎగిరాయి. దూరంగా ఎక్కడ్నుంచో డబ్బా కోసం పరిగెత్తుకొచ్చింది సెట్సుకో. దాన్ని తీసుకోబోతూ స్టేషన్ లో ఉన్న నా శవాన్ని చూసి అటుగా వెళ్లబోయింది. వెనక నుంచి చెయ్యి వేసి ఆమెను ఆపాను. నన్ను చూసిన వెంటనే సెట్సుకో మొహంలో మళ్ళీ చిరునవ్వు చిగురించింది. పిప్పర్‍మెంట్ బిల్లల డబ్బాని ఆమెకందించాను.

ఇద్దరం చేతిలో చెయ్యేసుకుని కొత్త లోకం లోకి ప్రయాణం సాగించాం.

2 Comments
  1. apkari surya prakash October 6, 2013 /
  2. భగవంతం November 28, 2013 /