Menu

డేవిడ్ లీన్ – ఒక పరిచయం

ఫ్రెంచ్ దర్శకుడు jean Renoir సినిమా దర్శకుల గురించి చెప్తూ, “ఒక గొప్ప దర్శకుడు తన జీవితకాలంలో నిర్మించిన అన్ని మంచి సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పేరిస్తే వచ్చేది వివిధ రకాల సినిమాల సముదాయం కాకపోగా అవన్నీ ఒకే సినిమాలోని వివిధ అధ్యాయాలుగా అనిపిస్తాయి” అంటారు. అంటే ఒక దర్శకుడు తన జీవితకాలంలో రూపొందించే గొప్ప సినిమాలన్నింటిలో చెరిపివేయలేని ఒక మార్కు వదిలిపెడ్తాడని ఆయన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు తమ జీవితకాలంలో రూపొందించిన సినిమాల్లో ఈ గుణాన్ని తప్పక గమనించవచ్చు. అలాంటి గొప్పవాళ్ళ లిస్టులో చేర్చదగిన వారిలో ఒక దర్శకుడు మాత్రం తప్పక ఉంటాడు. అతనే డేవిడ్ లీన్.

ఆయన పేరు మనం అంతగా విని ఉండకపోవచ్చు. ఆయన గురించి పెద్దగా తెలిసిఉండకపోవచ్చు. కానీ ఆయన సినిమాలు మాత్రం, అన్నీ కాకపోయినా, కనీసం ఒకటి రెండైనా మనకి తెలిసిఉండే అవకాశం ఉంది. ఒక పెళ్ళయిన యువతి ఒక అపరిచుతునితో ప్రేమలో పడే ’బ్రీఫ్ ఎన్‍కౌంటర్’ లాంటి ఫ్యామిలీ డ్రామా అయినా, డికెన్స్ రచనలను అత్యద్భుతంగా తెరకెక్కించిన ’ఓలివర్ ట్విస్ట్’ మరియు ’గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ లాంటి ఎపిక్ సినిమాలైనా, ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల మనోభావాలకు అద్దం పట్టే ’బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ అయినా వేటికవే ప్రత్యేకంగా ఉంటూనే ఇది ’డేవిడ్ లీన్’ సినిమా అని చెప్పకచెప్తూనే ఉంటాయి. తన సినిమాల ద్వారా ఎన్నో ప్రఖ్యాత రచనలను తెరకెక్కించి ప్రపంచ సినీ చరిత్రలో మర్చిపోలేని పాత్రలకు ప్రాణం పోసాడు డేవిడ్ లీన్. ఈయన సినిమాల్లోని కథలు/నేపథ్యాలు ఒక దేశానికే పరిమితం కాలేదు. రష్యాలో ’డాక్టర్ జివాగో’ అయినా, అరేబియా లో ’లారెన్స్ ఆఫ్ అరేబియా’, ఇండియాలో ’ఏ ప్యాసేజ్ టు ఇండియా’ సినిమాలు ఇందుకు ఉదాహరణలు.

డేవిడ్ లీన్ రూపొందించిన చాలా సినిమాలు నేటికీ క్లాసిక్స్ గా పరిగణించబడుతూ ఒక పర్‍ఫెక్ట్ సినిమాకి ఉదాహరణగా నిలబడుతుండడానికి కారణాల్లో ఒకటి ఆయన ఎన్నుకున్న కథలు. ఈయన సినిమాల్లోని కథలు చాలా వరకు ప్రాచుర్యం పొందిన నవలల ఆధారంగా రూపొందబడినమే. అయితే ఒక సినిమా మంచి సినిమా కావడానికి ఒక మంచి కథ ఎంత అవసరమో షాట్ కంపోజిషన్,నటీనటుల ప్రదర్శన, కెమరా కదలిక, కూర్పు లాంటి అంశాలు కూడా ఒక సినిమా నాణ్యతను నిర్ణయిస్తాయి. ఒక మంచి కథను ఎన్నుకోవడం లోనే కాకుండా పైన చెప్పిన వివిధ అంశాల్లో కూడా ఒక పరిపూర్ణమైన అనుభవమూ, జ్ఞానమూ కలిగివుండి తను రూపొందించిన ప్రతి సినిమానీ ఒక క్లాసిక్ కా రూపొందించన ఘనత డేవిడ్ లీన్ దే.

1908,మార్చి 25 న ఇంగ్లడు లోని క్రాయ్‍డన్ లో జన్మించి డేవిడ్ లీన్ మొదట లైమ్ గ్రూవ్ స్టూడియోస్ లో క్లాప్ బోర్డ్ అసిస్టెంట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇక్కడే ఆయన ఎడిటింగ్ లోని మెలుకవలు నేర్చుకుని ఎడిటర్ గా కొన్నాళ్ళు పని చేశారు. ఒక మంచి ఎడిటర్ తప్పక ఒక మంచి దర్శకుడిగా ఎదగగలడు అన్న అభిప్రాయం డేవిడ్ లీన్ విషయంలోఆక్షరాలా నిజమైంది.

బ్రిటిష్ నటుడు, నాటక రచయిత అయిన Noel Coward తో కలిసి డేవిడ్ లీన్ ’In Which We Serve’ అనే సినిమాతో మొదటి సారిగా దర్శకత్వాన్ని చేపట్టారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు(The Happy Breed, Blithe Spirit) Noel Coward తో కలిసి సహ దర్శకత్వం వహించిన డేవిడ్ లీన్ మొదటి సారిగా తన దర్శకత్వంలో ’బ్రీఫ్ ఎన్‍కౌంటర్’ సినిమాను రూపొందించారు. ఈ నాలుగు సినిమాలు కూడా డేవిడ్ లీన్ కంటే కూడా Noel Coward కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందుకు కారణం సినిమా టైటిల్స్ చూస్తే అన్ని సినిమాలూ Noel Coward’s ‘Brief Encounter’, Noel Coward’s ‘Blithe Spirit’ అని వుంటాయి. బ్రీఫ్ ఎన్‍కౌంటర్ సినిమాకి దర్శకత్వం వహించింది డేవిడ్ లీన్ అయినప్పటికీ ఆ సినిమా Noel Coward రచించిన ఒక నాటకం ఆధారంగా రూపొందించబడింది కాబట్టి ఆ సినిమా కూడా టైటిల్స్ లో Noel Coward’s ‘Brief Encounter’ అనే వుంటుంది. అయినప్పటికీ ఈ సినిమాతో డేవిడ్ లీన్ తన కంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరుకోవడం ద్వారా మంచి దర్శకుడిగా పేరుపొందాడు. ఈ సినిమా తర్వాత డికెన్స్ రచించిన ’గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ మరియు ’ఓలివర్ ట్విస్ట్’ను తెరకెక్కించడం ద్వారా చలనచిత్ర పరిశ్రమలో నైపుణ్యం గల దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమాల తర్వాత లీన్ రూపొందించిన ఎన్నో సినిమాలు నేటికీ ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాలుగా పరగణింబడుతున్నాయి.

ఆయన దర్శకత్వంలో వచ్చిన ’లారెన్స్ ఆఫ్ అరేబియా’ కానీ ’డాక్టర్ జివాగో’  కానీ ’ఏ ప్యాసేజ్ టు ఇండియా’ కానీ తీసుకుంటే ప్రతి సినిమా కూడా అన్ని అంశాల్లో అత్యుత్తమ విలువలు కలిగి వుంటాయి. ముఖ్యంగా లారెన్స్ ఆఫ్ అరేబియా లోని సినిమాటోగ్రఫీ, ‘ప్యాసేజ్ టు ఇండియా’ లో ఎడిటింగ్, ’డాక్టర్ జివాగో’ లోని భారీ ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ కూడా లీన్ దర్శత్వంలోని మెటిక్యులస్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి.

నలభై ఏళ్ల తన కెరీర్లో డేవిడ్ లీన్ కేవలం 16 సినిమాలు మాత్రమే రూపొందించినా అందులో చాలా సినిమాలు చలనచిత్ర చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.లైటింగ్, షాట్ కంపోజిషన్, ఎడిటింగ్, సౌండ్ లాంటి వివిధ అంశాల ద్వారా తను ఎన్నుకున్న కథాంశాలను అత్యంత నైపుణ్యంతో తెరకెక్కిస్తూ సినిమా కథ చెప్పే విధానంలోని వ్యాకరణం అభివృద్ధి చెందడంలో ఎంతో తోడ్పడ్డారని చెప్పొచ్చు.

స్టీవెన్ స్పీల్ బర్గ్, మార్టిన్ స్కోర్సెజీ లాంటి దర్శకులు ’డేవిడ్ లీన్ సినిమాల ద్వారానే సినిమాలు తీయాలని ఉత్తేజితులయ్యామ’ని ఆయన్ని పొగిడినా, Truffaut లాంటి దర్శకులు డేవిడ్ లీన్ సినిమాలు ’ఆస్కార్ ప్యాకేజెస్’ అని తీసి పారేసినా, Roger Ebert చెప్పినట్టు ’లీన్ సినిమాలు చూసి బయటకొచ్చాక పెద్దగా గుర్తుంచుకొనేదేమీ ఉండనప్పటికీ చూసినంత సేపూ మంత్రముగ్ధులు కావాల్సిందే’ అన్నది మాత్రం ముమ్మాటికీ నిజం.

6 Comments
  1. శంకర్ October 9, 2008 /
  2. Chetana October 10, 2008 /
  3. ravi October 11, 2008 /