Menu

Blow-Up

అంతా శూన్యమే, మనిషీ శూన్యమే !

ఉదయాన్నే వికసించి కళ్ళకు అందంగా కనిపించిన పువ్వు, సాయంకాలానికి వాడి నేల రాలుతుంది. బహుశా అశాశ్వతమైన ఆ పువ్వు అందాన్ని శాశ్వతం చెయ్యాలనుకోవడంలో కళ పుట్టి ఉండొచ్చు. ఆ పువ్వు యొక్క చిత్రాన్ని తనకి దొరికిన పనిముట్లతో కొండ గుహల్లో చిత్రీకరించి ఉంటాడు ఆదిమ మానవుడు.

మానవుడి ఎదుగుదలతో పాటే ఎదుగుతూ వచ్చింది కళ. కళ్ళ ముందు కనిపించిన పువ్వు ని ఉన్నదున్నట్టుగా, ఇది నిజంగా పువ్వేమో అని అనుమానపడేంతగా చిత్రీకరించగలిగే పనిముట్లను, నైపుణ్యాన్ని కాలక్రమంలో మనిషి సాధించాడు. కానీ ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రీకరించడం మాత్రమే కళ కాదని ఆధునిక మానవుడు భావించాడు.

ఉద్వేగాన్ని ఉద్వేగం కోసమే అభివ్యక్తం చేయడం కళాకారుడి పని కాదు; ఒక సత్యాన్ని వెలుగులోకి తేవడానికి ఉద్వేగాన్ని ఉపయోగించడమే సరైన పని అని ఆధునిక కళాకారునికి తోచింది. అందుకే ఆధునిక కళాకారుడు చాలావరకు సాంప్రదాయక ఆకృతులను త్యజించాడు; సుందర రూపాల్నీ, క్రమాల్నీ వదిలించుకున్నాడు. అలా అని అసలు ఆకృతినే వదిలి పెట్టినట్టు కాదు. ప్రతి దానికీ ఏదో ఒక ఆకృతి ఉండకతప్పదు. కాకపోతే మనకు అలవాటైన మూసలలో ఉండకపోవచ్చు. అలా పుట్టుకొచ్చిందే ఆధునిక కళ. అందులో భాగంగానే మూసలో ఏ మాత్రం ఒదగకుండా రోపొందించిన ఒక అద్భుత చలనచిత్రమే “Blow-Up”

సాధారణ, దైనందిన, అంగీకృత, సాంప్రదాయిక, సురక్షిత జీవితం కరిగిపోయిన స్థితిలో కథానాయకుడి జీవితంలో ఏర్పడిన శూన్యతా దర్శనాన్ని, అది దర్శనమయ్యాక అతని సంకట స్థితిని – దర్శకుడు Michelangelo Antonioni కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చిత్రీకరించారు.

లండన్, 1960 ల ప్రాంతం.

సరికొత్త సంగీతం, ఫ్యాషన్ లతో లండన్ నగరం హోరెత్తుతోంది. ప్రపంచం నలుమూలల నుంచీ ప్రజలు లండన్ తరలి వస్తుంటారు నగరంలోని ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లలో ఒకరు థామస్. అతని కెమెరా లో చిక్కితే చాలు పెద్ద మోడల్ అయిపోవచ్చని అతని ఇంటి చుట్టూ తిరుగుతుంటారు అందమైన అమ్మాయిలు. కానీ థామస్ కి ఇవేమీ పట్టనట్టే ఉంటాడు. తన మీదకు ఎగబడి వస్తున్న అమ్మాయిలను పురుగులకంటే హీనంగా చూస్తాడు; తన మూడ్ బావుంటే వాళ్ళ సౌందర్యోపాసన చేస్తాడు. అతని ప్రపంచమంతా అతని ఇష్టానుసారంగానే నడుస్తుంది.

డబ్బున్న వాడు; మంచి ఖరీదైన కారు; చేతిలో అందాలను ఒడిసిపట్టే విద్య – ఆనందంగా ఉండడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ థామస్ అలా కనిపిస్తాడు కానీ అతనికి తెలియకుండానే అతని బాహ్య, అంతరజీవితాల మధ్య దూరం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అతని బాహ్యజీవితం సుసంపన్నంగానే ఉన్నా అంతరజీవితం ఏదో తెలియని పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటుంది.

blow-3

ప్రజలకందరికీ తెలిసిన థామస్ కి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఒక వృత్తి. కానీ లోలోపల ఫోటోగ్రఫీ అంటే అతనికి ప్యాశన్. అందుకే పేద ప్రజల జీవితాల్ని తన కెమెరాలో బంధించడం కోసం తన ఖరీదైన జీవితాన్ని ఒక రోజుకి వదిలేసి, వారితోనే ఒక రాత్రంతా ఉండి ఫోటోలు తీస్తాడు. థామస్ తీసిన ఫోటోలను ఒక పాత్రికేయ మిత్రుడు తన పత్రికలో ముద్రించడానికి అంగీకరిస్తాడు. కానీ తను తీసిన ఫోటోలకు ఒక ముగింపు చిత్రం కావాలని, ఆ ఫోటో తియ్యగానే అన్నీ కలిపి ముద్రించాలని అంటాడు థామస్.

థామస్ కి ఆ అవకాశం రానే వస్తుంది

.ఒక రోజు ఏదో పని మీద ఒక పురాతన వస్తువులమ్మే షాప్ కి వెళ్ళిన థామస్ ని ఎదురుగా ఉన్న పార్క్ పిల్ల గాలులతో ఆహ్వానం పలుకుతుంది.

ఉదయం సమయం కావడంతో పార్క్ దాదాపు నిర్మాణుష్యంగా ఉంతుంది. కాసేపు పక్షులనీ, కాసేపు చెట్లనూ ఫోటోస్ తీస్తాడు థామస్. పార్క్ లో యథాలాపంగా నడుస్తుండగా దూరంగా ఒక చోట మనుషుల అలకిడి వినిపించి అటువైపు వెళ్తాడు థామస్. మధ్య వయస్సులో ఉన్న ఒక వ్యక్తి, అతనికంటే వయసులో చిన్నదైన ఒకామె తో కలిసి పార్క్ లో నడుస్తుంటారు.

అక్కడ వాళ్ళేం చేస్తున్నారు?

ఆడుకుంటున్నారా? పోట్లాడుకుంటున్నారా? సరసమాడుకుంటున్నారా?

థామస్ వాళ్లనే వెంబడిస్తూ రహస్యంగా వాళ్ల ఫోటోలు తీస్తుంటాడు. కాసేపటికి ఆమె థామస్ ని గమనిస్తుంది. థామస్ కూడా ఈ విషయం గ్రహించి అక్కడ్నుంచి బయల్దేరుతాడు. ఆమె థామస్ వెంటే పరిగెత్తుకుని వచ్చి అలా రహస్యంగా ఫోటోస్ తీయడం తప్పనీ, కెమెరాలో ఉన్న రీల్ తనకిచ్చేయాలని అంటుంది. థామస్ ససేమిరా అంటాడు. ఫోటోగ్రఫీ తన వృత్తి అనీ, తను కేవలం తన వృత్తి ధర్మాన్నే నిర్వర్తిస్తున్నానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు.

blow-2

థామస్ ఇంటికి చేరుకునే సరికి ఆమె అతన్ని వెతుక్కుంటూ ఇంటి దగ్గరకు వచ్చి ఉంటుంది. రీల్ ఇవ్వమని అతన్ని ప్రాథేయపడ్తుంది. కాసేపటికి థామస్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో స్టూడియో లోపలకి వెళ్ళి మరో రీల్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతాడు. ఆమె సంతోషంగా అక్కడ్నుంచి వెళ్లబోతూ థామస్ మాటల మాయాజాలంలో పడిపోతుంది. ఇద్దరి మధ్యా మాటలు కలుస్తాయి. థామస్ ఆమె ఫోటోలు తీస్తానంటాడు. ఆమె సరేనంటుంది. కాసేపటికి ఆమె బయల్దేరుతుండగా కనీసం మీ పేరైనా చెప్పలేదు అని అంటాడు థామస్. ఆమె తన ఫోన్ నెంబర్ ఒక కాగితం పై రాసిచ్చి అక్కడ్నుంచి హడావుడిగా బయల్దేరి వెళ్లిపోతుంది.
ఆమె వెళ్ళాక థామస్ తీరిగ్గా పార్క్ లో తీసిన ఫోటోలను తన స్టూడియోలో పెద్ద సైజులో ముద్రిస్తాడు. అలా ముద్రించిన ఒక ఫోటోలో మధ్య వయస్కుని కౌగిలిలో బంధింపబడ్డ ఆమె మొహంలోని ఆందోళన చూసి ఆశ్చర్యపోతాడు థామస్. అనుమానమొచ్చి తను తీసిన ఫోటోలను ఒక్కొక్కటిగా ముద్రించి చూసేసరికి అతనికి ఒక రహస్యం తెలుస్తుంది.

తను తీసిన ఫోటోల్లో ఒకదాంట్లో చెట్టు చాటునుంచి తుపాకీ గురిపెట్టిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత తీసిన ఫోటోల్లో దూరంగా చెట్టు చాటున పడి ఉన్న ఒక శవాన్ని చూస్తాడు. తనకే తెలియకుండా తను ఒక హత్యాదృశ్యాన్ని చిత్రీకరించాడని తెలుసుకుంటాడు థామస్.

వెంటనే ఆమె కి ఫోన్ చేస్తాడు. మరు నిమిషంలోనే ఆమె తనకు తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చిందని తెలుసుకుంటాడు. వెంటనే పార్క్ కి వెళ్లి చూస్తాడు. అక్కడ నిజంగానే శవం కనిపిస్తుంది.ఇంటికొచ్చే సరికి అతను ముద్రించిన ఫోటోలన్నీ ఎవరో దొంగలించారని తెలుసుకుంటాడు థామస్. జరిగిన విషయం చెప్దామని తన స్నేహితురాలి దగ్గర ప్రయత్నిస్తాడు. కానీ ఆమె థామస్ మాటలు పట్టించుకోడు. తన స్నేహితుడికి ఈ విషయం చెప్దామని బయల్దేరుతాడు థామస్.

blow-4

కీలక సన్నివేశం

థామస్ కార్లో వెళ్తుండగా రోడ్ మీద ఒక చోట ఆమె కనిపిస్తుంది. వెంటనే కారు వెనక్కి తిప్పి ఆమె దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు. కానీ అతను చూస్తుండగానే ఆమె మాయమవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ బయల్దేరుతాడు థామస్.

ఆమె మాయమైన చోటుకి అతి సమీపాన ఉన్న ఒక క్లబ్ లోకి వెళ్తాడు. అక్కడ ఒక రాక్ సంగీత ప్రదర్శన నడుస్తుంటుంది. అక్కడి జనాల్లో ఆమె కోసం వెతుకుతుంటాడు థామస్. సంగీతకారుడు ఉర్రూతలూగుతూ తన గిటార్ ని ముక్క చెక్కలు చేసి జనాల్లోకి విసుర్తాడు. జనాలు ఆ గిటార్ కోసం ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటుండగా అది థామస్ చేతికి దొరుకుతుంది. థామస్ ఆ గిటార్ ని చేతబట్టుకుని బయటకు పరిగెడ్తాడు. జనాలు కాసేపు అతని వెంటబడ్తారు. కానీ థామస్ వాళ్లకి దొరక్కుండా పారిపోతాడు.
థామస్ అలా పరిగెడ్తూ కొంచెం దూరం వచ్చాక ఆ గిటార్ ని ఫుట్ పాత్ మీద పడేసి వెళ్లిపోతాడు. అక్కడ నిల్చున్న ఒక వ్యక్తి ఆ గిటార్ ని తీసుకుని అదో పగిలిపోయిన వస్తువుగా భావించి చెత్తకుప్పలో పడేస్తాడు.

థామస్ తన పాత్రికేయ మిత్రుడి దగ్గరకు వస్తాడు. జరిగిందంతా చెప్పాలని ప్రయత్నిస్తాడు; కానీ అతను వినే పరిస్థితిలో ఉండడు. చివరికి విసిగిపోయిన థామస్ మరో సారి పార్క్ దగ్గరకు వస్తాడు. కానీ అక్కడ తను అంతకు ముందు చూసిన శవం లేకపోవడంతో ఆశ్చర్యపోతాడు.

అసలేం జరిగిందో, తను చూసింది నిజమో? కాదో? తెలియని పరిస్థితిలో పార్క్ లో నడుస్తుంటాడు థామస్.

ఈ లోగా కొంతమంది మైమ్ కళాకారులు అటుగా వస్తారు. వాళ్ళు ఒక టెన్నిస్ కోర్ట్ లోకి ప్రవేశించి టెన్నిస్ ఆడుతున్నట్టుగా నటిస్తారు. చేతిలో టెన్నిస్ ర్యాకెట్, బాల్ లేకుండానే ఊహాకల్పితంగా వాళ్లు ఆడుతున్న టెన్నిస్ ఆటను దూరం నుంచే విచిత్రంగా చూస్తుంటాడు థామస్.

ఈ లోగా మరో విచిత్రం జరుగుతుంది. వారి ఆటలోని ఊహాజనిత బంతి గాల్లోకి ఎగిరి థామస్ దగ్గర పడుతుంది. చుట్టూ మూగిన మైమ్ కళాకారులు థామస్ ని బంతిని ఇవ్వమని సైగలు చేస్తుంటారు. కానీ తన దగ్గర లేని బాల్ ని ఎలా ఇవ్వాల్లో థామస్ కి అర్థం కాదు. ఇంతలోనే తన పరిస్థితి అర్థమై వారితో జత కలిసి ఊహాజనిత బంతి ని వాళ్ల వైపు విసిరేస్తాడు. వాళ్లు సంతోషంగా ఆటను తిరిగి మొదలు పెడ్తారు.

ఈ ఆటను చూస్తూ చూస్తూ థామస్ తెర మీదనుంచి మాయమవడంతో సినిమా ముగుస్తుంది.

*****

అసలు థామస్ నిజంగానే హత్యా దృశ్యాన్ని చూశాడా? లేక ఇదంతా అతని భ్రమా? లేక కలా? ఈ ప్రశ్నలకేవీ సమాధానం చెప్పకుండానే సినిమా ముగుస్తుంది. సినిమా చివర్లో కూడా నిజమేంటో చెప్పకుండానే దాటవేస్తాడు దర్శకుడు. నిజానికి ఒక పసందైన మర్డర్ మిస్టరీకి కావాల్సినంత ముడి సరుకుని పోగు చేసి, సత్యాన్వేషణ మీరే చేసుకోమని ముగింపు మాత్రం ప్రేక్షకులకే వదిలేస్తాడు దర్శకుడు.

థామస్ పాత్ర ద్వారా ఐరోపా మానవుడు తను అనుభవిస్తున్న శూన్యాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఆంటోనియాని చూపెట్టడానికి ప్రయత్నించాడనో, లేదా గిటార్ సన్నివేశం ద్వారా తన చూసే ప్రేక్షకుల బట్టి సినిమాలోని అర్థం మారుతూ ఉంటుందని దర్శకుడు స్వయంగానే నిర్దేశించాడనో, లేదా ఆధునిక మానవుని గురించిన సత్యాన్ని పొరలు పొరలుగా ఈ చిత్రంలో అమర్చాడనో లేదా పొరలు పొరలుగా అమర్చిన అంశాలను విప్పి చూస్తే ఈ సినిమాలో కేవలం డొల్లతనం తప్ప మరేమీ లేదనో….పలు విధాలుగా ఈ సినిమా గురించి ప్రేక్షకులు వ్యాఖ్యానించవచ్చు. కానీ మోనాలిసా చిత్రం ఎలాగైతే ఎప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోతుందో, ఈ బ్లోఅప్ సినిమా కూడా చలనచిత్ర చరిత్రలో అంతే మిస్టరీగా మిగిలిపోతుంది.

2 Comments
  1. Uttara October 13, 2013 /
  2. satya October 18, 2013 /