Menu

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోసారు అకిరా కురొసావా.

1910,మార్చి 23 వ తేదీన, జపాన్ లోని టోక్యో లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అకిరా కురొసావా . ఏడుగురు సంతానం కలిగిన కుటుంబంలో ఆఖరి వాడు అకిరా కురోసావా. ఈయన పుట్టే నాటికి ఒక సోదరి పెళ్ళయ్యి, మరో సోదరుడు ఉద్యోగరీత్యా ఇళ్ళు వదిలి వెళ్ళిపోగా, మరో సోదరుడు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు.  దాంతో ముగ్గురు అక్కలు ఒక అన్నలతో తన చిన్నతనం గడిపిన అకిరా కురొసావా, తన నాలుగో తరగతిలో వుండగా మరో సోదరిని కోల్పోయాడు.  అందుకే కాబోలు death అనే concept ని తన సినిమాల్లో అధ్యయనం చేశారనిపిస్తుంది.

చిన్నతనంలో ఎక్కువగా తన  అన్న హీగో కురొసావా తో తిరుగుతూ గడిపిన జీవితం అకిరా కురోసావా జీవితంలోని కళాకారునికి పునాదులు ఏర్పరిచాయి. ఆ రోజుల్లో మూకీ సినిమాలకు వ్యాఖ్యాత (బెంషీ)గా వ్యవహరించే హీగో తోకలిసి చిన్ననాడే ఎన్నో సినిమాలను చూసే అవకాశం కలిగింది అకిరా కురొసావాకు. అంతేకాకుండా అకిరా కురొసావా తండ్రి పాశ్చ్యాత్య సినిమాలనూ చూడాలని తన కుటుంబ సభ్యులను ప్రోత్సాహించడంతో తన 19వ యేటికే దాదాపు వందకు పైగా సినిమాలను చూసి సినిమాలంటే ఒక ప్రత్యేక అభిమానం పెంచుకున్నాడు అకిరా కురొసావా.

1929 లో ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన అకిరా కురొసావా సాహిత్యం, చిత్రకళలను అభ్యసించాడు. సాహిత్యంలో ముఖ్యంగా Dostoevsky, గోర్కీ లంటే ఇష్టపడేవాడు అకిరా కురొసావా. ఇదే సమయంలో “Proletarian Artists’ League” చేరి కొన్నాళ్ళూ అక్కడా ఇక్కడా తిరుగుతూ లక్ష్యం లేని జీవితం గడిపిన తర్వాత కొన్నాళ్ళకు తన సోదరుడు హీగో ఆత్మహత్య చేసుకోవడంతో తన జీవితంకూడా అలా కాకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. తన సోదరునే అనుసరిస్తూ చిన్ననాటి నుండి జీవితం గడుపుకుంటూ వచ్చిన అకిరా కురొసావా, వారిద్దరి మధ్య సారూప్యం  గురించి చెప్తూ “I saw him as a negative strip of film that led to my own development as a positive image” అనే వారు.

హీగో మరణానంతరం ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టిన అకిరా కురొసావా ఒక దినపత్రికలో ప్రచురించబడ్డ ప్రకటనానుసారం  PCL (ఫోటో కెమికల్ లేబొరేటరీ- ఇదే కంపెనీ తర్వాత Toho మోషన్ పిక్చర్ కంపెనీగా ఆవిర్భవించి కురొసావా తో ఎన్నో సినిమాలు నిర్మించింది) అనే సినిమా నిర్మాణ కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారు.ఈ ఉద్యోగానికి దాదాపు 500 ల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో చివరిగా ఎన్నుకోబడ్డ ఐదుగురిలో ఒకరిగా అకిరా కురొసావా తన సినీ జీవితంలోకి మొదటిఅడుగు వేశారు.

PCL లో మొదట్లో కొన్నాళ్ళు కష్టాలనుభవించినా కజిరా యమమొటో అనే దర్శకుని పరిచయంతో అకిరా కురసొవా ఉత్సాహాన్ని పుంజుకున్నారు.  యమమొటో లో ఒక ఉత్తమ స్థాయి గురువును చూసిన అకిరా ఆయన వద్ద దర్శకత్వంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అప్పటికే స్క్రీన్‍ప్లే రచనలు సాగిస్తూ ఇతర సినిమాలకు పనిచేస్తున్న అకిరా కురొసావా వార్తాపత్రికలోచదివిన ఒక కొత్త నవల (Sanshiro Sugata) కథాంశం చదివి బాగా ప్రభావితం చెంది ఆ నవలను సినిమాగా మలచాలన్న నిర్ణయానికి వచ్చాడు.అనుకున్నట్టుగానే  1943 లో తన మొదటి సినిమా, Sanshiro Sugata ను రూపొందించారు అకిరా కురొసావా.

జూడో అనే యుద్ధకళ ఆధారంగా రూపొందించిన Sanshiro Sugata సినిమా అకిరా కురొసావా మున్ముందు రూపొందించిన సినిమాలతో పోల్చలేనప్పటికీ ఈ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత 1944 లో  Ichiban utsukushiku,Tora no o wo fumu otokotachi, Sanshiro Sugata-2 లాంటి సినిమాలు రూపొందించినప్పటికీ Yoidore tenshi (Drunken Angel,1948), Shizukanaru ketto (A Silent Duel, 1949), Nora inu(Stray Dog, 1949) సినిమాలు అకిరా కురొసావాను అప్పటి జపాన్ లోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

1950 వరకూ  అకిరా కురొసావా రూపొందించిన సినిమాలు ఒక ఎత్తైతే 1950 లో ఆయన రూపొందించిన ’రషొమన్’ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాతో అకిరా కురొసావా జపనీస్ సినిమాను ప్రపంచానికి దగ్గర చేశారు. అప్పటివరకూ జపాన్ వరకే పరిమితమైన జపనీస్ సినిమా ప్రపంచ సినీ ప్రేమికులకు దగ్గరయింది. అదే సమయానికి జపాన్ లో కెంజి మిజొగుచి, యసుజిరో ఓజు లు కూడా తమ సినిమాలను ప్రఖ్యాత ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా జపనీస్ సినిమా అంటే ఒక క్రేజ్ ఏర్పడింది.

’రషోమన్’ సినిమా తర్వాత అకిరా కురొసావా అంటే ప్రపంచ సినీ ప్రేమికులకు అత్యంత ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే అకిరా కురొసావా ఒక దాని తర్వాత ఒకటిగా అత్యధ్బుత సినిమాలను మలచసాగారు. ’రషోమన్’తర్వాత అకిరా కురొసావా రూపొందించిన చిత్రం ’హకుచి’. యువకుడిగా రష్యన్ రచయిత దోస్తోవిస్కీ రచనలను ఆసక్తిగా చదివిన అకిరా కురొసావా ’హకుచి’ చిత్రానికి గాను దోస్తోవిస్కీ రచన ’The Idiot’ ను కథాంశంగా ఎన్నుకున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధించనప్పటికీ తనకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి అని కురొసావా భావించేవారట.

’హకుచి’ తర్వాత అకిరా కురొసావా ’ఇకిరు’ మరియు ’సెవెన్ సమురాయ్’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలతో ఆయనకు ప్రపంచమంతా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ’The Hidden Fortress’, ‘Throne of Blood’ ,’యొజింబొ’ మరియు ‘సంజురో’ సినిమాలు అకిరా కురొసావాను ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చాయి.

దాదాపు పదిహేనేళ్ళ పాటు జపాన్ చలనచిత్ర సీమను ఏలిన అకిరా కురొసావా కెరీర్ కు 1965లో వచ్చిన ‘Red Beard’ సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమా వచ్చే సమయానికి కలర్ సినిమాలు రావడం, అప్పటి వరకూ తన సినిమాల్లో నటించిన Toshirō_Mifune తో గొడవలు రావడం, తను ఏర్పరచిన సినీ నిర్మాణ కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం లాంటి ఎన్నో అంశాలు కురొసావా కెరీర్ కు పెద్ద అడ్డుగోడగా నిలిచాయి. అప్పటివరకూ దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా రూపొందిస్తూ వచ్చిన అకిరా కురొసొవా 1965 నుంచి ఐదేళ్ళకొక సినిమా తీయడానికే ఎన్నో కష్టాలు పడాల్సివచ్చింది.

తన ఆఖరి శ్వాస విడిచే వరకూ సినిమాకే తన జీవితం అంకితం చేయాలనుకున్న అకిరా కురొసావా సినిమాలు రూపొందించే అవకాశాలు లేక ఒకానొక సమయంలోఆత్మహత్యకు కూడా పూనుకున్నారు.సినిమాలే జీవితంగా భావించిన అకిరా కురొసావా కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా తన సినిమాలన్నింటికీ స్క్రిప్టు సమకూర్చుకోవడంలోనూ, అలాగే కొన్ని సినిమాలకు ఎడిటర్ గానూ బాధ్యతలు నిర్వహించారు.

1985 లో అకిరా కురొసావా రూపొందించిన ‘Ran’ సినిమాతో తన పూర్వవైభవాన్నిసంపాదించుకున్నారు. షేక్స్పియర్ నాటకం ’కింగ్ లీయర్’ అధారంగా రూపొందించిన ఈ సినిమాను అకిరా కురొసావా తన సినిమాల్లోకెల్లా గొప్ప సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత అకిరా కురొసావా మరో మూడు సినిమాలు రూపొందించారు. ’డ్రీమ్స్’ సినిమా ద్వారా తన జీవితంలోని కలలను తెరకెక్కించారు అకిరా కురొసావా. ఎనిమిది లఘు చిత్రమాలిక అయిన ఈ సినిమా అకిరా కురొసావా చిత్రాల్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.

తన సినిమాలకు ప్రపంచంలోని వివిధ చలన చిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న అకిరా కురొసావాకు 1989 లో ’లైఫ్ టైమ్ అచివ్మెంట్’ కి గాను అస్కార్  అవార్డు అందుకున్నారు.

“I like unformed characters. This may be because, no matter how old I get, I am still unformed myself.” అని నమ్మిన అకిరా కురొసావా ప్రపంచ సినిమాకు విశిష్ట సంపదను మిగిల్చి 1998 లో తుది శ్వాస విడిచారు.

ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళినాఆయన సినిమాల ద్వారా చిరకాలం మన మధ్య బ్రతికే వుంటారు అకిరా కురొసావా!

11 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 12, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ March 12, 2008 /
  3. koresh March 13, 2008 /
  4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 13, 2008 /
  5. venkat November 27, 2008 /
  6. అభిమాని March 24, 2010 /
  7. G March 25, 2010 /
  8. మేడేపల్లి శేషు March 25, 2010 /