Menu

A Separation

ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.

 

పై ఫొటో లో ఉన్న వీరి పేర్లు సిమిన్, నాదెర్.ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే! ఉద్యోగస్థులు; చాలామందితో పోలిస్తే బాగా ఉన్నవాళ్లు. పన్నెండేళ్ల కి పైగానే దాంపత్య జీవితం; పదకొండేళ్ల కూతురు. వీళ్లు నిన్నమొన్నటి వరకూ అన్యోన్య దాంపత్యంలో భాగస్వాములు; నేడు విడాకులు కావాలని కోర్టుకెక్కిన అర్జీదారులు.

తమ దేశంలో కంటే విదేశాల్లోనే తమకీ, తమ కూతురుకీ సరైన భవిష్యత్తు ఉంటుందని భావించి, అక్కడకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా వెళ్ళడానికి అంతా సిద్ధమైన సమయంలో తనకి రావడానికి కుదరదన్నాడు నాదెర్. రాననడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి; అతని తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సోకింది. తన పాటికి తను విదేశాలకు తరలి వెళ్లిపోతే తన తండ్రిని సరిగా చూసుకునే వాళ్ళు ఉండరని అతని ఆందోళన.

వృద్ధ్యాప్యంలో ఉన్న మామగారిని చూసుకోడానికి సంరక్షకులు చాలామందే దొరుకుతారని, అయినా తన కొడుకని కనీసం గుర్తుపట్టలేని తండ్రిని చూసుకోవాల్సిన అవసరం నాదెర్ మీదే ఉందా? – అని సిమిన్ వాదన. తన తండ్రికి గుర్తులేకపోయినా, కొడుకుగా తన తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత అని నాదెర్ ఆమెకి గుర్తుచేశాడు. మరి ఇన్నాళ్ళూ కలలు కన్న తమ కూతురి భవిష్యత్ ఏంటని ఆమెడగిన ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు.

ఇద్దరి వాదనలూ విన్న న్యాయమూర్తి మాత్రం, ఈ కేస్ లో విడాకులు మంజూరు చెయ్యగలిగిన కారణాలేవీ కనిపించడం లేదని రాజీపడమని సలహా ఇచ్చాడు. ఇద్దరూ రాజీపడే స్థాయిని దాటబట్టే విషయం కోర్ట్ వరకూ వచ్చింది. సిమిన్ ఇళ్ళు ఖాళీ చేసి తన అమ్మగారింటికి వెళ్లిపోయింది. కూతురు మాత్రం తండ్రి దగ్గరే ఉంటానని మొరాయించింది.

ఇన్నాళ్ళూ జీవన సమరంలో కలిసి పోరాడిన ఇద్దరిని, విడగొట్టి ఎదురెదురుగా నిలిపింది జీవితం. ఈ ఆటలో గెలిచేదెవరో?

separation-2

పై ఫోటో లో ఉన్న వారు: రజియా, హొయత్

పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరిద్దరికీ పెళ్ళయి ఆరేడేళ్లయింది. ఐదేళ్ల కూతురు ఉంది. ఆమె కి దైవ భక్తి ఎక్కువ. దాంతోపాటే చాలా మృదువైన స్వభావం కలది. అతనికి మాత్రం కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆలోచన కంటే ముందు అతనికి ఆవేశం వస్తుంది.

గతంలో హోయత్ ఒక చెప్పుల షాపులో పనిచేసేవాడు. కానీ అకస్మాత్తుగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. భార్యా పిల్లల్ని పోషించడానికి దొరికిన చోటల్లా అప్పు చేశాడు. ఇప్పుడు అప్పుల వాళ్ల దాడి కి తట్టుకోలేక ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నాడు కానీ ఎక్కడా అవకాశం దొరకటం లేదు. భార్యంటే భర్త భారాన్నీ ఎంతో కొంత మోయాలన్న అవగాహన ఉన్నది రజియా. అందుకే భర్త నిరుద్యోగంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుంది.
రెండు కుటుంబాలు. రెండు వేర్వేరు సమస్యలు. వాటికి పరిష్కారం దొరకొచ్చు; దొరొక్కపోవచ్చు. కానీ ఎవరి జీవితాలు వారివే! కానీ జీవితం చిత్రమైంది. ఎవరితో ఎవర్ని ఎక్కడ ఎందుకు ముడివేస్తుందో తెలియదు.

భర్తను వదిలి అమ్మగారింటికి వెళ్ళింది సిమిన్; కానీ తన బాధ్యతలను మధ్యలో వదిలేసి మాత్రం వెళ్లలేదు. తనకు తెలిసిన వారి ద్వారా ఆమెకి రజియా పరిచయమైంది. ఆమె ను తన మామగారికి సంరక్షకురాలిగా నియమించింది. ప్రతి రోజూ సాయంత్రం నాదెర్ ఆఫీస్ నుంచి వచ్చేవరకూ అతని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడమే ఆమె పని.

చూడ్డానికి పెద్ద పని అనిపించలేదు. కానీ ఎనభై ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడికి సేవ చెయ్యడం అంత సుళువు కాదని వెంటనే అర్థమైంది. బట్టల్లోనే అతను మూత్ర విసర్జన చేసినప్పుడు, అతనిని శుభ్రం చేయడం, బట్టలు మార్చడం ఒక కష్టమైతే – భర్తకు తెలియకుండా చేస్తున్న ఈ పని ఆమెకు సరైనదిగా అనిపించలేదు. అందుకే మొదటి రోజే ఉద్యోగం మానేస్తానంది.
కానీ ఆ తర్వాత రోజే తిరిగి వచ్చింది. వీలైతే ఈ ఉద్యోగం తన భర్తకి ఇవ్వమని ప్రాథేయపడింది. కానీ అంతకుముందే తను ఇక్కడ ఈ పని చేశాననే విషయం మాత్రం చెప్పొద్దని నాదెర్ ని అభ్యర్థించింది రజియా. తీరా అంతా మాట్లాడుకుని హోయత్ కి ఉద్యోగం ఇచ్చేసరికి, అప్పుల వాళ్లతో జరిగిన గొడవల కారణంగా అతన్ని అరెస్ట్ చేయడంతో రజియా తిరిగి ఉద్యోగంలో చేరింది.

ఎలాగో కష్టపడి పెద్దాయన్ని జాగ్రత్తగా చూసుకుందామనుకుంది కానీ ఆ రోజు ఒక ఘోరం జరిగిపోయింది. తన కూతురితో ఏదో పనిలో ఉండగా ఆ పెద్దాయన ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు. ఆయన్ని వెతుక్కుంటూ భయంగా రోడ్ మీదకు వెళ్ళిన రజియా కు అతను రోడ్ కి అవతల ఉన్న న్యూస్ పేపర్ షాప్ లో కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ట్రాఫిక్ లో నుంచి అతన్ని తప్పించి అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చింది

separation-3
మరో కొత్త రోజు. ప్రతి రోజూ జీవితంతో సరికొత్త పోరాటమే.

ఇల్లు వదిలి వెళ్ళిన అమ్మ ఎప్పుడు తిరిగొస్తుందా? తన అమ్మా, నాన్నలు తిరిగి ఎప్పుడు కలుస్తారా? అని ఎదురు చూస్తున్న కూతురు. తనకు ఏం చెప్పాలో తెలియని నాదెర్. తను ఇంట్లోనుంచి వెళ్లిపోయినందుకైనా భర్త తన నిర్ణయానికి ఒప్పుకుంటాడని సిమిన్. తను ఒకరి ఇంట్లో పని చేస్తూ, ఒక పురుషుడికి తను సేవలు చేస్తున్నానని తెలిస్తే భర్త ఏమంటాడో అని భయపడుతూ రజియా. తన కుటుంబానికి ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధలో హోయెత్. ఎవరి బాధలు వాళ్లవి.

ఆ రోజు తన కూతురితో కలిసి సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్న నాదెర్, ఇంటికి తాళం వేసి ఉండడంతో కంగారుగా లోపలకి వెళ్ళిన అతనికి కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు.

తన తండ్రి ఒక తాడుతో మంచానికి కట్టి వేయబడి, మంచం మీద నుంచి కిందపడి దీనావస్థలో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు.

నాదెర్ కి రజియా మీద కోపం ముంచుకొచ్చింది. కాసేపటికి తిరిగివచ్చిన రజియా పై విపరీతంగా కోప్పడ్డాడు. ఎనభై ఏళ్ల వృద్ధుడిని చూసుకోవాల్సింది ఇలాగేనా? అని ప్రశ్నించాడు.

అర్జెంట్ పని రావడంతో అలా చెయ్యాల్సి వచ్చిందని సమాధానం చెప్పుకోచూసింది రజియా. నాదెర్ ఆమె మాటలు పట్టించుకోలేదు. అప్పటికప్పుడు అక్కడ్నుంచి వెళ్లిపోమన్నాడు. చివరికి తనకు రావాల్సిన జీతం ఇస్తే వెళ్లిపోతానంది రజియా. ఆమె చేసిన పనికి డబ్బులివ్వాల్సిన అవసరం లేదని కోపంగా రజియా ని నెట్టివేసి తలుపు వేసేశాడు నాదెర్.

తర్వాత రోజు ఉదయాన్నే సిమిన్ చెప్పడంతో ఒక కొత్త విషయం తెలుస్తుంది నాదెర్ కి. తను తోసిన తోపుకి రజియా మెట్ల మీద నుంచి జారి పడిందని, ఆ క్రమంలో నాలుగు నెళ్ల పసికందు ఆమె గర్భంలోనే చనిపోయాడని తెలుసుకుంటాడు నాదెర్.

ఇదంతా ఏమీ తెలియని హోయత్, అసలు విషయం తెలుసుకుని నాదెర్ తో గొడవకు దిగుతాడు. విషయం పోలీస్ ల వరకూ వెళ్తుంది. హత్యా నేరం కింద నాదెర్ ని అరెస్ట్ చేస్తారు. సిమిన్ అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకొస్తుంది.

తను రజియా మెట్లమీద పడిపోయేంత గట్టిగా తొయ్యలేదని కోర్ట్ లో వాదిస్తాడు నాదర్; అయినా తనకి రజియా గర్భవతి అని తెలియదనీ చెప్తాడు. కానీ తను గర్భవతి అన్న విషయం అతనికి తెలుసని రజియా వాదిస్తుంది.

ఎవరి వాదనలు వారు వినిపిస్తారు. మొత్తానికి తనకు రజియా గర్భవతి అని తెలియదనే విషయాన్ని కోర్ట్ కి స్పష్టం చేస్తాడు నాదెల్. అతను అబద్ధం ఆడుతున్నాడని రజియా ఎంత చెప్పినా ఎవరూ వినరు. మరో వైపు హోయెత్ తన ఆవేశంతో సరికొత్త అనర్థాలు కొనితెస్తాడు. నీ అంతుచూస్తానని నాదెల్ ని బెదిరిస్తాడు.

కీలక సన్నివేశం

కోర్ట్ నుంచి ఇంటికొచ్చిన తండ్రిని, నిజంగానే తనకి రజియా గర్భవతి అని తెలియదా? ప్రశ్నిస్తుంది కూతురు తెర్మా. తనకు రజియా గర్భవతి అన్న విషయం తెలుసనీ, కానీ ఆ పరిస్థుతుల్లో కోర్ట్ లో నిజం చెప్పేస్తే తను జైలు పాలవుతానని చెప్తాడు. తెర్మా కు తండ్రి చెప్పిన విషయం ఆమెకు మింగుడు పడదు.

ఎట్టి పరిస్థుతుల్లోనూ అబద్ధం చెప్పని తండ్రి అబద్ధాన్ని సహించలేకపోతుంది. రజియా సంగతి తన తండ్రికి తెలుసని అంతకుముందే తన తల్లి చెప్పినా నమ్మని తెర్మా ఇప్పుడే తండ్రే స్వయంగా ఒప్పుకోవడం భరించలేకపోతుంది.

ఇంతలో కోర్ట్ లో కేస్ మరో కొత్త మలుపు తీసుకుంటుంది. నాదెర్ కి అనుకూలంగా సాక్ష్యం చెప్పిన ఆవిడ తన సాక్ష్యం చెల్లదని దావా వేస్తుంది. దాంతో కేసు మళ్లీ మొదటికొస్తుంది. అనుకోని పరిస్థుతుల్లో ఈ కేసులో తెర్మా ను సాక్షిగా నిలబెట్టబడుతుంది.

తన దాకా వస్తే కానీ తెర్మా కి అర్థం కాదు. నిజం చెప్పాలనే అనుకుంటుంది. కానీ ఆమె నోటి వెంట అబద్ధం సులభంగా పాడేస్తుంది. తను చేసిన నేరాన్ని తనలోనే దాచుకుంటుంది తెర్మా. కోర్ట్ నుంచి బయటకు వచ్చాక తండ్రితో కలిసి కార్లో వెళ్తూ మౌనంగా రోదిస్తుంది. ఆ రోజే తన తండ్రి తో కాకుండా తల్లితో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది.

separation-4

అసలు తాము విడిపోవడమే ఈ కొత్త సమస్యలు వచ్చుండేవి కాదని సిమిన్ తో వాదించాడు నాదెల్. తనతో కలిసి విదేశానికి బయల్దేరి ఉంటే తాము కలిసే ఉండేవాళ్లమని అప్పుడు ఈ సమస్య వచ్చుండేది కాదని వాదించింది సిమిన్.

ఇదంతా ఏమీ అర్థంకాని ఒక మూగ సాక్షిగా నిలిచాడు నాదెల్ తండ్రి.

చివరికి అందరూ చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం వెతికారు.

డబ్బు తీర్చని సమస్య ఏదీ ఉండదు కదా!

రజియా కుటుంబానికి నాదెల్ డబ్బులిచ్చేలా ఒప్పించింది సిమిన్. రజియా కేస్ ఉపసంహరించుకుంటే పెద్దమనుషుల సమక్షంలో డబ్బులివ్వడానికి ఒప్పుకున్నాడు నాదెల్. కానీ ఒక షరతు మాత్రం విధించాడు అతను. రజియా గర్భంలోని శిశువు మరణించడానికి కారణం తనే అని, దివ్య ఖురాన్ మీద రజియా ఒట్టేయాలని అడిగాడు.

ఖురాన్ తేవడానికి లోపలికెళ్లిన రజియాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. భర్తకు అసలు నిజం చెప్పేసింది. తన అజాగ్రత్త వల్ల ఇంటినుంచి బయటకెళ్ళిన నాదెల్ తండ్రిని ట్రాఫిక్ లో నుంచి తప్పించే క్రమంలో తనను ఒక కారు గుద్దిందని, అప్పుడే తనలోని శిశువు మరణించి ఉంటాడని చెప్పింది. కాబట్టి ఖురాన్ మీద ప్రమాణం చెయ్యడం పాపమనీ చెప్పడంతో ఒప్పందం రద్దవుతుంది. చేతిదాకా వచ్చిన డబ్బులు కాస్తా పోవడంతో హోయెత్ కి ఏం చెయ్యాలో పాలుపోదు.

ఎవరి ఆట ఎవరు ఆడుతున్నారు? ఈ జీవన చదరంగపు ఆటలో పావుల్ని కదిపేదెవరు?

సిమిన్, నాదెల్ ల విడాకుల విషయంలో కోర్ట్ విధించిన సమయం ముగిసిపోయింది. వాళ్ళు విడిపోదామనే నిర్ణయించుకున్నారు. కానీ కలిసుండడమే కష్టమైనప్పుడు విడిపోవడం ఇంకా కష్టం. వారి మధ్యలో ఇరుక్కున తెర్మా సమస్య ఎలా తీరాలి?

న్యాయమూర్తి తెర్మా నిర్ణయం అడిగాడు. తల్లీ తండ్రుల మధ్యలో ఒక్కరినే ఎన్నుకోమన్నారు. తనైతే నిర్ణయం తీసుకుంది. కానీ వారిద్దరి ముందు చెప్పలేననడంతో, న్యాయమూర్తి వారిద్దరినీ బయటకు వెళ్ళమన్నారు.

నాదెల్, సిమిన్ బయటకు వచ్చి, ఒకరొకొకరికి దూరంగా కూర్చున్నారు. లోపల తెర్మా ఎవరినెన్నుకున్నా ఈ కథ సుఖాంతమవదు.

అయినా సుఖాంతమవడానికి ఇది కథ కాదు. ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.