Menu

The Lives of Others

సౌందర్యోపాసనే లోకకళ్యాణానికి మార్గం

1984, తూర్పు జర్మనీ దేశం. సోవియట్ రష్యా అధ్వర్యంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారుల హింస తట్టుకోలేక ప్రజలు రహస్యంగా పశ్చిమ జర్మనీకి తరలివెళ్ళిపోతున్న సమయం. ఏ సమయంలోనైనా ప్రజలు తమ మీద తిరగబడి ఉద్యమ బాటలో నడుస్తారనే అనుమానంతో, ప్రభుత్వం అటువంటి విపత్తు ఏదీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది; షుమారు లక్ష మందితో కూడిన రహస్య పోలీస్ వ్యవస్థతో పాటు, రెండు లక్షల మంది ఇన్ఫార్మర్స్ ని కూడా సమీకరించింది. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒక్కటే: ప్రజల జీవితాలని అడుగడుగునా తమ నిఘా కెమెరాల ద్వారా అనుసరిస్తూ, వారి ప్రతి కదలికను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉండడమే!

అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో అత్యంత నైపుణ్యంగా మైక్రోఫోన్లు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి వారి ప్రతి మాటనూ, ప్రతి అడుగునూ తెలుసుకునే రహస్య పోలీస్ నిపుణుల్లో ఒకరు వీస్లర్. వివాదాస్పదమైన ధోరణిలో పని చేస్తూ, తన తోటి వారితో సైతం కఠినంగా మెలుగుతూ, కేవలం తను చేస్తున్న పని మీద తప్ప మరే విధమైన వ్యాపకాలు లేని వీస్లర్ కి ప్రభుత్వం ఒక సరి కొత్త పని అప్పచెప్పింది.

Gerd Wiesler (Ulrich Mühe) bei seiner Arbeit.

ప్రముఖ నాటక రచయిత అయిన డ్రేమన్ మరియు అతని ప్రియురాలు క్రిస్టా-మారియా ల ఇంటి పై నిఘా ఏర్పాటు చేసి వారితో పాటు, వారింటికి వచ్చిపోయే వారి కదలికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మంత్రికి తెలియచేయడమే వీస్లర్ కి అప్పచెప్పిన సరికొత్త పని.

****

నిజానికి డ్రేమన్ తూర్పు జర్మనీ ప్రభుత్వానికి ఏ మాత్రం వ్యతిరేకి కాడు. అతని నాటకాల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు లేకుండానే రాస్తుంటాడు. ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో నాటకాలను రచించి, ప్రదర్శించిన తన తోటి కళాకారుల పరిస్థితి ఏమైందో డ్రేమన్ కి బాగా తెలుసు. అందుకే వీలైనంతలో తన రచనలు ఎటువంటి వివాదంలో ఇరుక్కోకుండానే ప్రయత్నిస్తుంటాడు.

కానీ మనం మాత్రం మంచి వాళ్లమైతే సరిపోదు. అవతలి వాళ్లూ మంచి వాళ్లయ్యుండాలి. మనిషికి మనిషి చేసే అన్యాయమే మానవ చరిత్ర. చరిత్రలోని కొందరి మనుషుల అన్యాయాలు, అకృత్యాలే ప్రపంచ యుద్ధాలకూ దారి తీశాయి; ఎందరో ప్రాణాలనూ బలి తీసుకున్నాయి.

డ్రేమన్ మీద ఎటువంటి కోపం లేకపోయినా, సెంట్రల్ కమిటి లోని మంత్రికొకరికి క్రిస్టా-మరియా పై కన్ను పడుతుంది. వీస్లర్ ఏర్పాటు చేసిన నిఘా ద్వారా డ్రేమన్ ప్రభుత్వ వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నాడని రుజువు చెయ్యగలిగితే, మంత్రి గారికి మరియా ని చేరుకోడానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయినట్టే!

lives-2

డ్రేమన్ ఇంటి పై నిఘా ఏర్పాటు చేసిన అతి కొద్ది సమయంలోనే మంత్రి గారి పన్నాగం తెలుసుకుంటాడు వీస్లర్. ఒక విధంగా మరియా పై అభిమానం కూడా పెంచుకున్న వీస్లర్, మంత్రి గారి వలలో పడకుండా ఆమెకు ప్రత్యక్షంగానే సాయపడతాడు.

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా బ్లాక్ లిస్ట్ చేసిన జెర్స్కా అనే దర్శకుడు తన బాధలు డ్రేమన్ తో చెప్పుకుంటాడు. కళాకారుల హక్కులను దోచ్చేస్తున్న ప్రభుత్వానిపై కోపం కంటే, నిస్సహాయులుగా మిగిలిపోయిన కళాకారుల బాధనే డ్రేమన్ తో జెర్స్కా పంచుకోవడం వీస్లర్ ఆసక్తిగా వింటాడు. డ్రేమన్ ఇంటిలో జరిగిన పార్టీకి హాజరైన ఇతర కళాకారుల సంభాషణలు వింటూ, వీస్లర్ కు మొదటి సారిగా సాహిత్యం గురించి పరిచయం ఏర్పడుతుంది.

డ్రేమన్ లేని సమయంలో, అతని ఇంట్లో నుంచి Bertolt Brecht రచించిన ఒక పుస్తకం దొంగలిస్తాడు. ఒక రోజు తీరుబడిగా కూర్చుని ఆ పుస్తకంలోని ఒక కవిత చదవడం మొదలు పెడ్తాడు.

On a certain day in the blue-moon month of September
Beneath a young plum tree, quietly
I held her there, my quiet, pale beloved
In my arms just like a graceful dream.
And over us in the beautiful summer sky
There was a cloud on which my gaze rested
It was very white and so immensely high
And when I looked up, it had disappeared.

 

కీలక సన్నివేశం

డ్రేమన్ ఇంటిపై నిఘా కొనసాగుతూనే ఉంటుంది.

అతని ఇంట్లోని టెలిఫోన్ రింగవడంతో, వీస్లర్ కూడా తను కూర్చున్న ప్రదేశం నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వైపున డ్రేమన్ మిత్రుడు వాల్నర్! “నిన్న రాత్రి జెర్స్కా ఉరిపోసుకుని అత్మహత్య చేసుకున్నాడు” అని చెప్తాడు వాల్నర్. డ్రేమన్ కి నోట మాట రాదు. ఫోన్ కింద పెట్టి కాసేపు అలాగే నిలబడిపోతాడు.

ఫోన్ శబ్దం విన్న మరియా హాల్లోకి వస్తుంది.

తన మిత్రుడి ఆత్మహత్య వార్త విని విభ్రాంతి చెందిన డ్రేమన్ తన పియానో వద్ద కూర్చుని, అంతకు కొన్ని రోజుల ముందే జెర్స్కా తనకి బహుమతిగా ఇచ్చిన “a Sonata for a Good Man” పాటను వాయిస్తాడు. వీస్లర్ కూడా ఈ పాట వింటూ ఉంటాడు.

పాటంతా అయ్యాక డ్రేమన్ అంటాడు, “ఈ పాట విన్న కామ్రేడ్ లెనిన్, జీవితాంతం ఇదే పాట వింటూ గడిపేయొచ్చన్నాడు. ఈ పాట నిజంగా విన్న ఎవరైనా ఒకరికి హాని తలపెట్టాలను ఎలా అనుకోగలరు?”

అత్యంత హృద్యంగా సాగిన ఆ పాట విని వీస్లర్ కన్నీళ్ళ పర్యంతం అవుతాడు.

వీస్లర్ జీవితంలో మార్పుకి ఇక్కడే బీజం పడుతుంది.

*****

గతంలో ఎన్నో సన్నివేశాల గురించి ఈ శీర్షిక లో రాసినప్పటికీ, సినిమాలోని సారాన్ని మొత్తం ఒకే సీన్ లో బంధించిన సన్నివేశం మాత్రం ఇదే!

సినిమా మొదట్లో డ్రేమర్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కి జరిగే సంభాషణలో, “మీ నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ప్రజలపై మీకున్న మమకారం మీ నాటకాల ద్వారా తెలుస్తుంది. కానీ మీరు ప్రజల్లో మార్పు తేవాలని ఎన్ని నాటకాలు రాసినా అది వృధా ప్రయాసే! మీరెంత అరిచి గీపెట్టినా ప్రజలు మారరు” అంటాడు మంత్రి.

కాని ఎలాంటి మనిషినైనా కదిలించగలిగే శక్తి కళకు ఉంది అని నమ్మే వ్యక్తి డ్రేమన్.

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః “ అని నానుడి. ఒక మంచి పాటకీ, మంచి సంగీతానికీ పరవశించని వారు ఎవరూ ఉండరు. కానీ ఒక్కోసారి మనిషి ఆ అవకాశం రాకుండానే జీవితం చాలించేస్తుంటాడు. బండరాళ్ల వంటి కఠిన హృదయాలను సైతం కరిగించగలిగే శక్తి సంగీతానికి ఉందని ఈ సన్నివేశంలో మనకి కనిపిస్తుంది.

*****

ఆ రోజు నుంచి వీస్లర్, తప్పుడు రిపోర్ట్ లతో డ్రేమన్ ని రక్షించే ప్రయత్నం చేస్తాడు. కానీ వీస్లర్ మీద అనుమానం వచ్చిన అతని పై అధికారులు ఇతర మార్గాల ద్వారా డ్రేమన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

చివరికి మరియా ద్వారానే డ్రేమన్ గురించి వివరాలు సేకరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ప్రచురించిన వ్యాసాన్ని చేజిక్కించుకోవడానికి పోలీసులు అతని ఇంటిని రైడ్ చేస్తారు. కానీ అప్పటికే విషయం తెలిసిన వీస్లర్ అక్కడకు ముందే చేరుకుని ఆ పత్రాలను దాచి వేస్తాడు.

కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. తన వల్లే డ్రేమన్ రహస్యం తెలిసిపోయిందన్న అపరాధ భావంతో రగిలిపోతున్న మరియా ఆత్మహత్య చేసుకుంటుంది.

డ్రేమన్ ఇంటిని రైడ్ చేసిన పోలీసులకు ఏ విధమైన సాక్ష్యాధారాలు దొరకవు. వాటి అదృశ్యం వెనుక వీస్లర్ హస్తం ఉందని గ్రహించిన పై అధికారి అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు.

కాలం గడిచిపోతుంది.

బెర్లిన్ గోడ కూలిపోతుంది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒకటవుతాయి.

కానీ తన ఇంట్లోని పత్రాలను దాచేసి పోలీసులకు దొరక్కుండా చేసిన వారెవరో అన్న ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతుంటాడు డ్రేమన్. చివరికి అదంతా వీస్లర్ అనే రహస్య పోలీస్ చేసిన సాయంగా గ్రహిస్తాడు.

చివరికి, అప్పటి తూర్పు జర్మనీలోని పరిస్థుతుల అధారంగా డ్రేమన్ “Sonata for a Good Man” అనే నవల రచించి దాన్ని వీస్లర్ కి అంకితం ఇస్తాడు.

అప్పటికి ఒక పోస్ట్ మ్యాన్ గా పని చేస్తున్న వీస్లర్ ఒక షాప్ లో ఆ పుస్తకాన్ని కొనుక్కుని, అందులో తన పేరుని చూసి గర్వపడడంతో సినిమా ముగుస్తుంది.