Menu

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.

కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు.

ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో చేర్చి యుద్ధభూమికి తరలిస్తున్నారు. పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే పండిన కొద్ది పాటి పంట మీద అధిక శాతం పన్నులు విధించి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు కోశాధికారులు.

కానీ సాటి మనిషి కష్టానికి స్పందించలేని కఠిన హృదయులు రాజ్యమేలుతున్న ఏ కాలంలోనైనా, స్పందించే మనసున్న మారాజులు ఉంటారు; అలాంటి మనసున్న ఒక రాజ్యాధికారి తన రాజ్యంలోని ప్రజలను అక్కున చేర్చుకున్నాడు. ఆ పేద ప్రజలకు చదువు సంధ్యలు నేర్పించి, వారినీ మనుషుల్లా ఆదరించి ఉన్నదాంట్లో అందరికీ సమానంగా పంచాడు. ఆకలిగొన్న ఆ ప్రజలకు ఆయనిచ్చిన వరం అతని పాలిట శాపమైంది. ప్రభువు ఆజ్ఞను మీరినందుకు ఆ రాజ్యాధికారిని అజ్ఞాత వాసానికి పంపించారు.

భార్య టమకి, కొడుకు జుషియో కూతురు అంజులను వదిలి ఒంటరిగానే వెళ్లడానికి సిద్ధమయ్యాడు ఆయన. బయల్దేరే ముందు తన గారాల బిడ్డ అయిన కొడుకు జుషియో ని దగ్గరకు పిలిచి, “నాయనా, సాటి జీవి పై దయలేని మనిషి మృగంతో సమానం. నీపై నీవు కఠినంగా ఉన్నప్పటికీ ,సాటి మనిషి పట్ల దయ, కరుణ చూపించు” అని హితబోధ చేశాడు.
ఆరేళ్ళు గడిచిపోయాయి. ఆ రాజ్యాధికారి కుటుంబానికి అతన్ని కలుసుకునే అవకాశం దొరికింది. అతన్ని కలుసుకోవడానికి దూరప్రాంతంలో ఉన్న ఒక రాజ్యానికి ప్రయాణమయ్యారు.

sansho-2

తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా గుర్తు లేని అంజు, తను విన్న కథల్లోని రాజకుమారులకంటే వీరత్వం కలిగిన తన తండ్రిని కలవాలనే జుషియో ఉత్సాహంగా ముందుకు సాగుతుంటే, భర్త జ్ఞాపకాలను మోసుకుంటూ బరువుగా టమకి వెనుక నడుస్తూ కొండలు, గుట్టలు, నదులు, సెలయేళ్ళు దాటి ఆ కుటుంబం చివరికి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు.

ఆ రాత్రికి అక్కడే సేద తీరుదామనుకున్నారు. పిల్లలిద్దరూ గుడిశె నిర్మాణానికి కావాల్సిన కట్టెలు విరవడానికి అడవిలోకి ప్రవేశించారు. వయసులో చిన్నదైన అంజు ఒక చెట్టు కొమ్మ పట్టుకుని విరవడానికి ప్రయత్నించింది; ఆమె బలం సరిపోలేదు. ఇంతలో జుషియో అక్కడకు చేరుకుని తనూ ఒక చెయ్యేశాడు. చెట్టు కొమ్మ విరిగింది; పిల్లలిద్దరూ కిందపడ్డారు. సరదాగా నవ్వుకున్నారు. ఇంతలో దూరం నుంచి తల్లి తమనే పిలుస్తుందనిపించింది అంజు కి. అదేమీ కాదు; అది కేవలం గాలి చప్పుడని వాదించాడు జుషియో.

****

రాత్రయింది.

ఎప్పుడు ఉదయమవుతుందా? ఎప్పుడు బయల్దేరి భర్త ను చూస్తానా అని టమకి ఎదురుచూస్తోంది. ఇంతలో ఒక ముసలావిడ దీపం పట్టుకుని అటుగా వచ్చింది. దగ్గరలోనే తన ఆశ్రమం సంగతి ఆ కుటుంబం మొత్తానికి రాత్రికి ఆశ్రయం ఇచ్చింది; ఆకలిగొన్న ఆ కుటుంబానికి అన్నం పెట్టింది; సకల మర్యాదలు చేసింది.

కానీ ఉదయం ఆ ముసలిది తన అసలు అవతారం బయట పెట్టింది. మోసం చేసి తల్లి ని కొంతమంది దుండగులకు, బిడ్డలను ఒక బానిస గృహానికి అమ్మేసి డబ్బు చేసుకుంది.

పిల్లలిద్దరినీ కొన్న శాంశో అనే అధికారి, చిన్నపిల్లలని జాలి కూడా లేకుండా వారిచే ఘోరమైన వెట్టి చాకిరీ చేపించమని అజ్ఞాపించాడు. అత్యంత దీనమైన పరిస్థితుల్లో బాధాకరమైన జీవితాన్ని సాగిస్తున్న ఆ పిల్లలికి టారో అనే వ్యక్తి పరిచయం కాస్తా ఊరటకలిగించింది. కష్టమో నష్టమో పెద్దయ్యే వరకూ ఈ కష్టాలని భరించాలని, ఆ తర్వాత అక్కడ్నుంచి బయటపడి తమ కుటుంబంతో ఏకమవ్వొచ్చని హితబోధ చేశాడు.

sansho-3

****

పదేళ్ళు గడిచిపోతాయి. బానిస గృహంలో జుషినో, అంజు పెరిగి పెద్దవాళ్లవుతారు. అక్కడ అనుభవించిన బాధల ఫలితంగా జుషినోలో ఎంతో క్రూరత్వం చోటుచేసుకుంటుంది. చిన్న నాట తండ్రి చేసిన హితబోధ మర్చిపోతాడు. ఎవరి ద్వారా తన జీవితం నాశనమైందో, ఆ శాంషో కే కొమ్ముకాసి అతని కుడి భుజంగా తయారవుతాడు. బానిస గృహం నుంచి తప్పించుకోజూసిన వారిని పట్టుకుని హింసిస్తుంటాడు. కానీ అంజు మాత్రం తండ్రి మాటను జవదాటక, అంత కష్టంలోనూ శాంతమూర్తిలా వుంటుంది.

క్రూరుడిగా మారిన అన్నయ్య ని చూసి బాధ పడ్తుంది అంజు. ఆ బానిస గృహం నుంచి తప్పించుకుందామని ప్రాథేయపడూతుంది. కానీ అంజు మాటలను జుషినో ఏ మాత్రం పట్టించుకోడు. తమ జీవితాలు ఇక ఇలా తెల్లారవలసిందేనని పరిస్థుతులకు తల ఒగ్గి ఓటమి ని అంగీకరిస్తాడు. కానీ అంజు మాత్రం తన ఆలోచన మానదు.

కీలక సన్నివేశం

బానిస గృహంలో పని చేసే నమిజో అనే ఒకావిడ చావు బతుకుల్లో ఉంటుంది. ఆమె ఎలాగూ బతకదని నిర్ణయానికి వచ్చిన శాంషో, నమిజో ని తీసుకెళ్లి అడావిలో పడెయ్యమని జుషినో కి చెప్తాడు. జుషినో ఏ మాత్రం దయ లేకుండా నమిజో ని మోసుకెళ్లి అడవిలో పడెయ్యడానికి సిద్ధం అవుతాడు. ఆమె బతికుండగానే అడవిలో పక్షులకు ఆహారం అవుతుందని, కనీసం నమిజో చివరి క్షణాల్లోనైనా ఆమె ని ప్రశాంతంగా ఉండానివ్వమని జుషినో ని ప్రాథేయపడుతుంది అంజు; అయినా వినకుండా జుషినో బయల్దేరుతాడు. అంజు కూడా అతని వెంటే వెళ్తుంది.

అడవిలో నమిజోని పొదల్లో పడేసి వెళ్దామనుకుంటాడు జుషినో. సాటి మనిషిని అలా ప్రాణం పోయే స్థితిలో వదిలి వెళ్లడం అన్యాయం అంటుంది అంజు. చాలా రోజుల తర్వాత జుషినో లో మానవత్వం మరో సారి ఉదయిస్తుంది. ఎండా వానల నుంచి నమిజోని పరిరక్షించడానికి ఒక చిన్న పాటి గుడిశె ఏర్పాటు చేద్దామని అంజు చెప్పిన ఆలోచనతో ఏకీభవిస్తాడు. గుడిశె కోసం అంజు చెట్ల కొమ్మలు విరుస్తుంటుంది; ఆమెకి సహాయపడతాడు జుషినో. ఒక కొమ్మను విరిచే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ కిందపడతారు.

ఆ సమయంలో జుషినో చుట్టూ తన చిన్ననాటి జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముడతాయి. వెంటనే అంజు తో కలిసి ఆ బానిస బతుకుకి దూరంగా పారిపోదామంటాడు. అంజు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వెంటనే జుషినో ఒక్కడినే పారిపొమ్మని ప్రోత్సాహిస్తుంది అంజు. జుషినో అక్కడ్నుంచి పారిపోయేవరకూ కాపలా కాసే సైనికుల కళ్లు గప్పుతుంది; తనను హింసించైనా తన ద్వారా జుషినో ఆచూకి తెలుసుకుంటారని, చివరికి నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుని తన వాళ్ల కోసం ప్రాణాలను సైతం. త్యాగం చేస్తుంది అంజు.

sansho-4

*****

బానిస గృహం నుంచి బయటపడ్డ జుషినో, బానిస గృహంలో శాంషో పెడ్తున్న హింసను, మరియు అతని ఆగడాలనూ అక్కడి రాజ్యపాలకునికి తెలియచేస్తాడు. ప్రభువుల ఆజ్ఞను శాంషో శిరసావహిస్తున్నాడని అతని ఆగడాలు ఆపడం తన చేతుల్లో లేదని చెప్తాడు ఆ రాజ్యపాలకుడు. ఈ క్రమంలో జుషినో గతం తెలుసుకుని అతన్ని మరో రాజ్యానికి రాజ్యపాలకునిగా నియమించబడతాడు. జుషినోలోని క్రూరత్వం పూర్తిగా నశిస్తుంది. చిన్నప్పుడు తన తండ్రి నేర్పిన సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. తనకున్న పరిమిత అధికారంతో శాంషో నడిపే బానిస గృహాన్ని ముట్టడిస్తాడు. అక్కడి బానిసలకు విముక్తి కలుగ చేస్తాడు. తన పని ముగియగానే తన పదవీ విరమణ చేసి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నాలు మెదలుపెట్టి చివరికి గుండెను కదిలించే ఒక అద్భుత సన్నివేశంలో తన తల్లిని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

******

ఎన్నో గొప్ప సన్నివేశాలతో పదకొండవ శతాబ్దపు రోజుల జపనీయుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా దృశ్యీకరించడంలో కెంజీ మిజోగుచి కనబర్చిన శ్రధ్ధ శ్లాఘనీయం. ఈ సినిమా జపాన్ కి చెందినప్పటికీ, ఈ సినిమాలోని కథ దేశ,బాష, జాతి, మతం లాంటి అడ్డుగోడలను అతిక్రమించి ప్రపంచంలోని ఏ మూలనున్న ప్రేక్షకున్నైనా కదిలించి వేయగలుగుతుంది.అలాంటి సత్తాకలిగిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి.

ఈ సినిమాలో కెమెరా కేవలం చూసే ప్రయత్నమే చేస్తుంది; చూపించే ప్రయత్నం కాదు. క్లోజప్, పాయింట్ ఆఫ్ వ్యూ లాంటి అంశాలతో ఏదో ఒక్క అంశాన్ని ఉధ్ఘాటించే ప్రయత్నం చేయకుండా, సినిమాలోని ప్రపంచానికి కెమెరా కేవలం ఒక కిటికీ గానే ఉపయోగించాడు మిజోగుచి.

నాగరికత వికసించిన క్రమంలో మానవుడు ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లలో బానిసత్వం ఒకటి. అలాంటి దురాచారాలను అణిచివేయడంలో ఎంతో మంది శ్రమ వుంది. అలాంటి ఒక కథగా ఈ సినిమా చూడొచ్చు. అంతే కాదు తల్లి కోసం ఒక అన్నాచెల్లెలు, స్వేచ్ఛ కోసం ఒక బానిస, తండ్రి బోధించిన విలువల వెతుకులాటలో ఒక కొడుకు, సముద్రం కోసం పిల్లకాలువ పడే తపనగా కూడా ఈ సినిమాని చూడొచ్చు.

సినిమా అంటే ఏమాత్రం ఇష్టం వున్న వారెవరైనా తమ జీవితంలో ఒక్క సారైనా తప్పక చూడవలసిన సినిమాల్లో ఇది ఒకటి. ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకుడు అయిన Gilbert Adair ఈ సినిమా గురించి చెప్తూ ఇలా అంటారు: “Sansho Dayu is one of those films for whose sake the cinema exists.” ఈ సినిమా చూసిన వారెవరైనా ఆయనతో ఏకీభవించక మానరు.
ప్రపంచంలోని అత్యుత్తమ పది సినిమాలలో ఒకటిగా ఈ సినిమాను చాలామంది పేర్కొంటారు. ఎవరో గొప్ప సినిమా అన్నారని కాదు కానీ ఈ సినిమా చూస్తే ఇది “the best” సినిమాగా అంగీకరించకపోయినా “the Perfect” సినిమాగా మాత్రం తప్పక ఏకీభవిస్తారు.