Menu

Fitzcarraldo

—అతడు అడవిని జయించాడు—

మనిషి ఎల్లప్పటికీ అపరిపూర్ణుడు! ఎప్పటికప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణత వైపు పయనం సాగిస్తుంటాడు. కానీ ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు; మనిషి ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు. కానీ, ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి పోవాలనే ప్రయత్నంలోనే మనిషి స్వేచ్ఛా జీవి అయ్యాడు. తరువాతి స్థితి అనేది మరొకటి లేకపోతే మనిషికి స్వేచ్ఛే లేదు. కానీ ఆ తరువాతి స్థితి కి చేరుకోడానికి ఒక్క స్వేచ్ఛ మాత్రం సరిపోదు; ఆ స్థితికి చేరుకోవాలనే తపన కావాలి; ప్రయాణం సాగించే ధైర్యం కావాలి; ఒక్కోసారి తన లక్ష్యాన్ని వెర్రిగా నమ్మాలి. ఇలాంటి వెర్రెక్కిన మనుషులే పిరమిడ్స్, స్టోన్ హెంజ్ ల సృష్టికి కారణమై ఉండొచ్చు. బహుశా ప్రపంచంలోని ఏడు వింతలూ ఇలాంటి మనుషుల సృష్టే అయివుటుంది. ఆధునిక మానవుని సృష్టి అయిన సినిమాకి కూడా ఈ వింతల్లో చేర్చే అవకాశం కల్పిస్తే అందులో చేర్చగలిగిన ఏకైక సినిమా గా Fitzcarraldo ని పేర్కొనవచ్చు.

*****

అది పందొమ్మిదో శతాబ్దపు చివరి దశలోని ఒక రోజు. రైళ్లు, విమానాలు ఇంకా ఎవరికీ తెలియని రోజులు అవి!

దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల పెరూ దేశం లోని ఒక పట్టణంలో, ప్రసిద్ధ ఒపెరా కళాకారుడు కరుసో ఆధ్వర్యలో ఒక సంగీత ప్రధాన నాటకం ప్రదర్శింపబడుతోంది.

కరుసో పాట కోసం 1200 మైళ్లు పడవలో ప్రయాణించి ఆ పట్టణానికి చేరుకున్నాడు ఒక సాహసి. ఒపెరా సంగీతమన్నా, అందులోనూ కరుసో అనే ఒపెరా సంగీతకారుడన్నా అతనికి ప్రాణం. ధనాన్వేషణలో తరలివచ్చిన ఎంతో మంది ఐరోపా వ్యాపారవేత్తల్లో అతను కూడా ఒకడు. ఆయన పేరే Fitzcarraldo!

పెరూ దేశంలో రైల్వే లైన్ నిర్మించే ఆలోచనతో అక్కడకు చేరుకున్నా, పరిస్థుతులు అనుకూలించక ఆ వ్యాపారాన్ని మధ్యలోనే ఆపేసి మరో వ్యాపారంలో చేతులు కాల్చుకున్నాడు అతను. అందరికీ వ్యాపారం ధనార్జనకు మార్గమైతే Fitzcarraldo లక్ష్యం వేరు! అంతులేని సంపాదన మీద అతనికి వ్యామోహం లేదు. సరిపడా సంపాదించాలి; ఆ వచ్చిన సొమ్ముతో తన స్థావరమైన ఇకిటో పట్టణపు దరిదాపుల్లోని అడవుల మధ్య ఒక భారీ ఒపెరా హౌస్ నిర్మించాలి; అందులో కరుసో ప్రదర్శన ఏర్పాటు చేయాలి – ఇంతే! అదే అతని చిరకాల వాంఛ! దానికోసం తన జీవితకాలపు శ్రమను, తను నమ్మిన వాళ్ల సొమ్మును తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. తన స్వప్నాన్వేషణకు శ్రీకారం చుట్టాడు.

fitz-2

ఒపెరా హౌస్ నిర్మాణానికి కావాల్సినంత ధనం సంపాదించడానికి అతనికి ఒకటే మార్గం కనిపించింది. పెరూ దేశపు అడవుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే రబ్బరు మొక్కలనుంచి సేకరించిన రబ్బరు వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే పెరూ అడవుల్లోని చాలా భాగం ఇతర వ్యాపారస్థుల్లో చేతుల్లో ఉంది. కాకపోతే అడవి మధ్యలో ఒక ప్రాంతం మాత్రం ఎవరి స్వాధీనంలో లేదు. కానీ ఆ ప్రదేశానికి చేరుకోవడం అత్యంత దుర్భేధ్యం.

అక్కడకు చేరుకోవాలంటే అమెజాన్ నదికి ఉపనది అయిన ఉక్యాలీ నదిని దాటుకుని వెళ్లాలి. కానీ ఉక్యాలీ నది మధ్యభాగంలో ఏర్పడే వేగవంతమైన ప్రవాహాన్ని దాటి వెళ్ళడం ఎంతటి పెద్ద ఓడకైనా అసాధ్యమైన పని. అందుకే అమెజాన్ నదికి మరో ఉపనదైన పచీటా నది ద్వారా తన ఓడపై ప్రయాణం సాగించాడు Fitzcarraldo.

కీలక సన్నివేశం

fitz-3

ఉక్యాలీ నది దాటడానికి ప్రవాహం అడ్డు; కానీ పచీటా నది దాటడం అంత సులభమేమీ కాదు. పచీటా నదీ ప్రాంతపు అడవుల్లో నివసించే జివారోస్ మరియు కంపాస్ అనే జాతి అడవి మనుషులు చాలా ప్రమాదకరమైన వారు.

Fitzcarraldo ప్రయాణిస్తున్న ఓడ కంపాస్ జాతి ప్రజలు నివసించే ప్రదేశపు సరిహద్దులకు చేరుకుంటుంది. వీరి రాకను గమనించిన అడవి మనుషులు డప్పులతో శబ్దాలు చేయడం మొదలు పెడ్తారు. ఓడలో పని చేసే సిబ్బంది భయభ్రాంతులవుతారు. వెంటనే ఓడను అక్కడ్నుంచి వెనక్కి మళ్ళించమని గొడవ చేస్తారు. వారి మాటలు లెక్క చేయకుండా కెప్టెన్ ఓడను ముందుకు సాగిస్తాడు. ఓడ సిబ్బంది తుపాకులు పట్టుకుని సిద్ధంగా ఉంటారు.

ఈ తెగలు తమని తాము శాపగ్రస్థులిగా భావిస్తుంటారనీ. తాము నివసించే అటవీ ప్రాంతం దేవుని సృష్టి అని, కాకపోతే తాము చేసిన తప్పుల కారణంగా దేవుడు ముఖం చాటేశాడనీ, మనుష్య జాతి అంతరించిపోయాకే దేవుడు తమ లోకానికి శ్వేత వాహనంలో తిరిగొచ్చి మిగిలిన భాగాన్ని సృష్టిస్తారనీ వారి నమ్మకం. అందుకే కొత్త వాళ్లెవరూ అటు రాకుండా జాగ్రతపడుతుంటారని Fitzcarraldo కి తెలిసి వస్తుంది. వెంటనే అతనికి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న గ్రామఫోన్ తీసి ఓడ పై భాగాన అమర్చి, కరుసో ఒపెరా ని అందులో ప్లే చేస్తాడు. ఆ సమయంలో నిజంగానే శ్వేత వాహనం పై తరలివచ్చే దేవుడిలానే అనిపిస్తాడు Fitzcarraldo!

దూరంగా ఎక్కన్నుంచో ఏదో వస్తువు తేలుతూ ఓడ వైపుగా వస్తుంటుంది. అది దగ్గరకొచ్చే సరికి ఒక నల్లటి గొడుగు గా గుర్తిస్తారు. బహుశా ఆ గొడుగు, ఈ తెగ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన క్రైస్తవ మతగురువులకి సంబధించినదైఉంటుందని అనుకుంటారందరూ.

అందరూ ఉత్కంఠ తో ఎదురుచూస్తుంటారు. కాసేపటికి వారి డప్పుల శబ్దం ఆగిపోతుంది,. ఇంజన్ శబ్దం తప్ప మరే శబ్దమూ లేకుండా ఓడ పచీట నది వెంట సాగిపోతుంటుంది. “ఈ నిశబ్దం ఎంత నిశబ్దంగా ఉందో కదా!” అనుకుంటాడు Fitzcarraldo.
ఆ నిశబ్దం చాలా భయంకరంగా ఉందని, ఏదైనా పెనుముప్పు వాటిల్లే లోపలే అక్కడ్నుంచి వెళ్లిపోవడం మంచిదని అంటాడు కెప్టెన్. అప్పటివరకూ నిర్భయంగానే ఉన్న Fitzcarraldo కూడా ఓడను వెనక్కి తిప్పుదామనుకునే లోపల, వందలమంది అడవిమనుషులు పడవల్లో ఓడవైపు తరలి వస్తారు.

సినిమా మొత్తంలో చాలా ఉత్కంఠ తో సాగే ఈ సన్నివేశం ఈ సినిమాకి ప్రాణంగా చెప్పుకోవచ్చు.

*****

ఏడు సముద్రాల అవతల మాంత్రికుడి చేతిలో బంధింపబడ్డ రాకుమారిని రక్షించే సాహసగాథలు, నిధినిక్షేపాల అన్వేషణ ప్రధానంగా సాగే అడ్వెంచెర్ సినిమాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహాంతరవాసులు తో చేసే పోరాటాలు – ఇలాంటి సాహస గాధలతో కూడిన సినిమాలు లెక్కలేనన్ని వచ్చి ఉండొచ్చు. కానీ ఆయా సినిమాలు ఆ సాహసాలను నిజమని భ్రమింపచేస్తూ తీస్తూ వచ్చినవే! కానీ సాహసయాత్ర ప్రధానంగా సాగే Fitzcarraldo ఈ సినిమాలన్నింటికంటే ఒక గొప్ప ప్రాధాన్యత కలిగిఉంది.

సాహస గాధలని సినిమాగా తీయడం ఒక ఎత్తైతే, ఈ సినిమా తీయడమే ఒక సాహసం. అప్పటికే Aguirre, the Wrath of God అనే సినిమాతో గొప్ప సాహసం చేసిన Werner Herzog వెర్రి తపనతో సృష్టింపబడిన దృశ్యకావ్యమే Fitzcarraldo!

fitz-5

మొదట అనుకున్నట్టుగా జాసన్ రాబర్డ్స్ ఈ సినిమాలో Fitzcarraldo పాత్ర పోషించాలి. కానీ షూటింగ్ సగంలో ఉండగా ఆరోగ్యకారణాలతో జాసన్ ఈ సినిమానుంచి వైదొలిగాడు. అదే సమయానికి Mick Jagger అనే నటుడు కూడా సినిమానుంచి వైదొలగడంతో, Klaus Kinski ని ప్రధాన పాత్రకి ఎన్నుకుని మరో సారి కొత్తగా సినిమా షూటింగ్ ఆరంభించాడు Herzog.

అప్పటికే ఒక విమానం కూలిన కారణంగా కొంతమంది గాయపడడం, పెరూ అడవుల్లోని తెగల మధ్య ఉన్న విద్వేషాల కారణంగా తరచూ షూటింగ్ ఆగిపోవడం లాంటి ఆటంకాల మధ్య Klaus Kinski రావడంతో పరిస్థితి మరింత జటిలమైంది. Herzog తో తరచుగా గొడవపడ్తూ షూటింగ్ కి అంతరాయం కలిగిస్తున్న Kinski ని చంపడానికి పథకం సిద్ధం చేసి, తన అనుమతి కోసం వచ్చిన ఆటవికులను, షూటింగ్ పూర్తయ్యే వరకూ ఆగమని చెప్పాడట Herzog.

ఇదంతా ఒకెత్తైతే, సినిమా కథ ప్రకారం 300 టన్నుల బరువున్న ఓడను పచీటా నది ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన పర్వతం మీదనుంచి పైకి లాగి, పర్వతానికి అవతలి వైపు పారుతున్న ఉక్యాలీ నది లో దింపాలి.

ఇదే వేరెవరైనా ఐతే అంత బరువున్న పడవను కొండమీంచి లాక్కెళ్లే సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారానో లేదా మరేదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారానో చిత్రిస్తారు. కానీ Herzog అందరి లాంటి వాడు కాదు.

300 టన్నుల బరువున్న నిజమైన ఓడని నిజంగానే ఒక పర్వతం మీదనుంచి వెయ్యిమంది మనుషులతో లాగించాడు. ఈ దృశ్యాల చిత్రీకరణలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా Herzog తొణకలేదు.

fitz-4

అంతే కాదు సినిమా చివరిలో వచ్చే ఒక సన్నివేశంలో ఉక్యాలీ నది భాగంలోని వేగవంతమైన ప్రవాహంలో ఓడ కొట్టుకుపోయే సన్నివేశాన్ని కూడా యదార్థంగా చిత్రీకరించారు. ఆ సమయంలో ఆ ఓడలో ఉన్న సాంకేతిక నిపుణులు తీవ్రంగా గాయపడ్డారు కూడా!

కేవలం సాహసోపేతంగానే కాకుండా దృశ్యకావ్యం అనబడే స్థాయిలో చిత్రీకరింపబడ్డాయి ఈ చిత్రంలోని సన్నివేశాలు. బహుశా Fitzcarraldo లాంటి సినిమా తీయడం ఇక ఎప్పటికీ, ఎవ్వరికీ సాధ్యం కాదేమో. అందుకే ఈ సినిమాని కేవలం చూసి ఆనందించడమే కాకుండా, ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్న కటోర దీక్ష, పట్టుదల, నిరంతర శ్రమ గురించి తెలుసుకునో లేదా ఈ విషయాలన్నింటి గురించి తీసిన డాక్యుమెంటరీ చిత్రం “Burden of dreams” చూస్తే, “చలనచిత్రాల్లో Werner Herzog చిత్రాలు వేరయా!” అని అనుకోక తప్పదు.

One Response
  1. tollywood September 10, 2013 /