Menu

Eternal Sunshine of the Spotless Mind

జ్ఞాపకాలనే వృత్తంలో కేంద్ర బిందువు ఆమె


ఆ రోజు సాయంత్రం బీచ్ లో…

అంతమంది జనాల మధ్యన, గుంపులో ఒంటరిగా నేను.
జనాలకు దూరంగా అలలకు చేరువులో, గలగలా మాట్లాడే నువ్వు.

అన్నింటికీ ఒక లెక్క ఉండాలనే నేను.
లెక్కలేకుండా జీవితాన్ని గడిపెయ్యాలనుకునే నువ్వు?

నేనేమో ముక్కు మొహం లేని అనామక నాయకున్ని.
నువ్వేమో అణువణువనా రంగుల కాంతులు విరజిమ్మే తారవి.

నువ్వలా, నేనిలా!
అయినా రెండు సగాలు కలుసుకున్నంత ఆనందం.

******

మనం కలుసుకున్న కొన్ని రోజుల తర్వాత!

ఒక రోజు రాత్రి….ఘనీభవించిన నిశబ్ద నదిపై తేలుతూ, ఆకాశం లో నక్షత్రాలకు చేరువన విహరిస్తూ, నాకు అండగా, తోడుగా నువ్వుండగా నేనేమన్నానో గుర్తుందా?

“మరణమంటే ఇక భయం లేదు. తట్టుకోలేనంత ఆనందాన్ని అనుభవించడం నా జీవితంలో ఇదే మొదటిసారి! అందమైన స్వప్నం నిజమైన క్షణమిది. ఇది చాలు నా జీవితానికి. కావాలంటే ఈ క్షణంలో చచ్చిపోగలను.” అని
అందమైన ఆ అనుభవం నీకింకా గుర్తుందా? గుర్తుంటే నన్నెలా వదిలేసి వెళ్ళగలిగావ్? ఏదో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమైతే తిరిగి వెనక్కి వచ్చుండే దానివే! కానీ నువ్వు రాలేదు.

******

ఇన్నాళ్ళ సావాసంలో మనం ఎన్ని సార్లు గొడవ పడలేదు?

అసలు మొదటి పరిచయంలోనే నాకూ నీకూ ఏ మాత్రం పొసగలేదు. గుర్తుందా?

ఆ రోజు రాత్రి, దారిలో కనిపించిన ఇంట్లోకి గోడదూకి వెళ్ళడమూ గుర్తుంది; ఎవరిదో తెలియని ఇల్లు నీ సొంతమైనట్టు ఇల్లంతా ధైర్యంగా తిరగడమూ గుర్తుంది; నీ ధైర్యాన్ని చూసి నేను విస్మయుడ్ని కావడమూ గుర్తుంది; కానీ ఇంతలోనే భయంతో నిన్ను ఒంటరిగా దిలేసి పిరికివాడిలా పారిపోవడమూ గుర్తుంది. మళ్ళీ తిరిగి నిన్ను కలవడమూ గుర్తుంది.

ఆ రోజు తర్వాత మనం ఆనందంగా కలలు గన్న కాలాలూ గుర్తున్నాయి; కలలు కరిగిపోయిన సందర్భాలూ గుర్తున్నాయి.కలిసి మనం నడిచిన త్రోవలో అడుగడుగునా ఎన్ని జ్ఞాపకల మైలురాళ్లో!

అందుకే తప్పు నీదా నాదా అని ఆలోచించకుండా నిన్ను వెతుక్కుంటూ తిరిగొచ్చాను. కానీ ఆ రోజు నేనెవరో తెలియనట్టు నువ్వు చూసిన చూపు నన్ను నిలువునా దహించి వేసింది.

eternal-2

నేనెవరో నీకు గుర్తు లేదా? నాతో గడిపిన అన్ని రోజుల్లో ఏ ఒక్క క్షణమూ నీకు జ్ఞాపకం లేదా?

నిజం బట్టబయలైంది!

నువ్వు నన్ను పూర్తిగా మరిచిపోయావు. కాదు, కాదు. వైద్యుల సాయంతో జ్ఞాపకమనే జబ్బుని నయం చేపించుకున్నావ్. నా గుర్తులను నీ లోనుంచి సమూలంగా చెరిపి వేయించుకున్నావ్.
నిజమే! ఈ జ్ఞాపకాలు ఎంతటి ప్రమాదకరమైన ఉచ్చులో, వాటిలో చిక్కుకుంటే ఏమవుతుందో నాకంటే నీకే ముందుగా అనుభవంలోకి వచ్చి ఉంటుంది.

నేను లేని నువ్వు వేరొకరితో సంతోషంగానే ఉన్నావు. కానీ నేనేం చెయ్యను?

ఒంటరిగా ఉన్నా తుంటరిలా నన్ను వదలని నీ జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయి. నీ జ్ఞాపకాలు గుదిబండలా నా బతుకును భారం చేస్తోంది. నా జీవితాన్నిచుట్టుముట్టిన జ్ఞాపకాల వృత్తంలో నువ్వే కేంద్ర బిందువు.

నీకు తెలుసు; నువ్వు లేని నేను లేను. నువ్వు లేకుండా అడుగు ముందుకు పడటం లేదు. జీవితం స్తంభించి పోయింది.

ఇప్పుడు నువ్వు లేవు. కనీసం నీలో జ్ఞాపకంగానైనా నేను లేను. అందుకే నేనూ నిశ్చయించుకున్నాను; నిన్ను మరిచిపోయే మందు అడిగాను.

చికిత్స మొదలైంది.

eternal-3
ఎన్నెన్ని జ్ఞాపకాలో!

పొరలు పొరలుగా ఆమె నాలో నుంచి దూరమవుతోంది.

కొన్ని జ్ఞాపకాలు రెక్కలు విప్పుకున్న పక్షుల్లా ఇట్టే స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాయి. కొన్నైతే ససేమిరా అంటున్నా, వాటికి సమాధులు తవ్వుతున్నారు. కానీ ఒక్కొక్క జ్ఞాపకం చెరిగిపోతుంటే నా లోలోపల శూన్యం ఆవహిస్తోంది.
ఒక్కో మైలు రాయిని పెకలిస్తూ, ఆ రోజు రాత్రి నది ఒడ్డున, ఆమె చేతిలో చెయ్యేసి నక్షత్రాలు లెక్కించుకుంటూన్న దగ్గరకు చేరుకున్నాము. నాకు తెలుసు ఒక్క రాత్రిలో నక్షత్రం పుట్టదు; ఒక్క రాత్రిలో ప్రేమ కూడా పుట్టదు. కానీ ఆ రాత్రి ఆమె సానిహిత్యంలో నేను చూసిన స్వర్గలోకపు జ్ఞాపకం మాత్రం చెరిపివేయడం నావల్ల కాలేదు.

నేను ఆకాశంలో ఎగురుతూ, సముద్రాలు దాటిన హీరోని కాదు. నాకు అదృష్టం లేదు; అధికారమూ లేదు. నన్ను ఏ అందమైన స్త్రీలు కన్నెత్తి చూడనే లేదు. కానీ ఆమెను కలిసిన తర్వాతే నేనెవరో కాస్తా తెలిసి వచ్చింది. కానీ ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆమె జ్ఞాపకాలు చెరిపెయ్యాలనుకోవడంలోని తప్పుని గ్రహించాను. ఆమె లేకపోయినా, ఆమె జ్ఞాపకాలతో బతికెయ్యవచ్చనే విషయం విస్మరించాను.

“ఈ చికిత్స ఆపడం సాధ్యం కాదా? నా మాటలు మీకు వినిపించడం లేదా? హలో మిమ్మల్నే! దయచేసి ఈ చికిత్స ఆపేయండి. ప్లీజ్. కనీసం ఈ ఒక్క జ్ఞాపకాన్ననయినా నాకు మిగల్చండి. ఆమె నా జీవన గానం. ఆమె లేక రంగు లేదు; కాంతి లేదు. అంతా శూన్యం. నా స్వర్గం నాకిచ్చెయ్యండి. ఈ చికిత్స ఆపెయ్యండి. ప్లీజ్“

*****

ఉదయమైంది.

ఈ రోజు ప్రేమికుల రోజు. ఆఫీసుకని బయల్దేరాను కానీ ఏదో తెలియని వెలితి. సరాసరి నాకిష్టమైన బీచ్ కి బయల్దేరాను. బీచ్ ఖాళీగా ఉంది. ఇసుకలో కాసేపు నడిచాను. మనసులో తెలియని ఆందోళన.

eternal-4

కాసేపటికి బీచ్ నుంచి బయల్దేరుదామనుకుంటుండగా ఒక యువతి అటుగా వచ్చింది. నేను మొదట పట్టించుకోలేదు. తనే నాతో పరిచయం చేసుకుంది. ట్రైన్ లో ఇంటికి తిరిగొస్తుంటే వచ్చి నా పక్క సీట్లో కూర్చుంది. కాసేపట్లోనే ఇద్దరికీ పరిచయం పెరిగింది. ఈ కొద్ది సేపు పరిచయంలోనే ఆమె నాతో రెండు సార్లు గొడవ కూడా పెట్టుకుంది. ఎప్పట్నుంచీ పరిచయం ఉన్న వాళ్లలా స్నేహం కుదిరింది. నాతో పాటు ఇంటికి వస్తానంది.

ఆమెతో కలిసి కార్లో ఇంటికి వెళ్తుంటే రహస్యం బట్టబయలైంది. వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు మా బ్రతుక్కి ఒక్క లక్ష్యమే అనుకుంటా! అందుకే మేము కొత్తవాళ్లలా మళ్ళీ కలిసాం. కలిసినందుకు ఆనందపడేలోగా గొడవ మొదలయింది. నా జ్ఞాపకాలను ఎందుకు చెరిపేసావని నేను, నేనెందుకు చెరిపేశానని తను – విషయం మళ్లీ మొదటికొచ్చింది.
కానీ ఈ సారి ఆమెను నేను వదులుకోదల్చుకోలేదు. ఈ సారి సలహా తనే ఇచ్చింది.

eternal-5

నేను
నీకు అర్థం కాని
అధర్వణ వేదాన్ని
అద్భుత యోగాన్ని
నను చేరాలంటే
సాధన కావాలి
నువు యోగివి కావాలి
అన్యమనస్కం కాకూడదు
అంతా నామయం అయితే
మనం అనంతమవుతాం —(మరో శాకుంతలం-పద్మలత నుంచి)