Menu

Stalker

మనిషి నిత్యాన్వేషి. నిరంతరాన్వేషణలో మనిషి సత్యాన్నీ అన్వేషించాడు.ఈ భూమ్మీద మనిషి ఆవిర్భావం జరిగినప్పటినుంచీ ఈ అన్వేషణ సాగుతూనే ఉంది.

ఒకానొక కాలంలో అసలీ సత్యం అంటే ఏంటి? అని ఎలా అయినా తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడు; దారిలో కలిసిన మనుషులనూ, మహర్షులనూ అడిగాడు; రాజులూ, రారాజులనూ దారి చూపమని ప్రాథేయపడ్డాడు. కొండలూ గుట్టలూ ఎక్కాడు. ఏడు సముద్రాలు దాటాడు; మహారణ్యాల్లోనూ తిరిగాడు. పగలనకా రేయనకా అతని అన్వేషణ కొనసాగింది. మనుషులెవ్వరూ చేరుకోలేని ఒక ప్రదేశంలో సత్యం నివసిస్తోందని నమ్మదగిన వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాడు. చివరికి ఒకానొక రోజు అతను ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అడవిలోపల ఎక్కడో నివసిస్తోన్న సత్యం ఇంటి తలుపు తట్టాడు.

సత్యం తలుపు తీసింది.

ఎదురుగా ఎండిపోయిన బక్క ముసలి ప్రాణి. ముఖం ముడతలు పడి ఉంది. నడుం ఒంగిపోయుంది.

“సత్యం అంటే మీరేనా” అని అడిగాడు. అవునని ఆ ప్రాణి తలూపింది.

అతని సంతోషానికి అవధుల్లేవు. సత్యాన్ని కళ్లారా చూసిన ఆనందంలో అతను తిరిగి బయల్దేరాడు. అతనలా వెళ్లబోతుండగా సత్యం అతన్ని వెనక్కి పిలిచింది. “బాబూ నాకో సహాయం చెయ్యాలి” అని దీనంగా అడిగింది. అతను తప్పక చేస్తానన్నాడు. “నువ్వుఇక్కడ్నుంచి తిరిగి వెళ్లాక, అందరూ సత్యం ఎలా ఉంటుంది అని అడుగుతారు. అందంగానే ఉన్నానని చెప్పగలవా?” అని సత్యం ప్రాథేయపడింది.

సత్యాన్వేషికి ఎదురైన సత్యం ఇది.

కానీ అసలు ఉన్నది ఒకే సత్యమా? లేక అతన్ని తప్పు దారి పట్టించి సత్యం కవల సోదరి అసత్యం ఇంటికి పంపించారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనమూ సత్యాన్వేషణ చెయ్యాలి. కానీ సత్యం మనకి తారసపడుతుందా? మనిషి కి అందకుండా తప్పించుకుని తిరుగుతోన్న సత్యాన్వేషణే ఇంత క్లిష్టమైతే, absolute truth అనబడే దేవుడి కోసం ఇంకెంత అన్వేషించాలి?

*****

క్షేత్రం (The Zone)

….కొంతమంది దాన్ని ఉల్కాపాతం అన్నారు; మరి కొంతమంది అది గ్రహాంతర వాసుల పనేమో అన్నారు. కారణం ఏదైనప్పటికీ అక్కడ ఏర్పడిన క్షేత్రం ఒక అద్భుత సృష్టి అని కొందరి నమ్మకం. క్షేత్రం యొక్క రహస్యాన్ని చేధించడానికి ప్రభుత్వం కొంతమంది దళాలను అక్కడకు పంపించింది; కానీ వారిలో ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. ప్రస్తుతం క్షేత్రం యొక్క పరిధిలోకి ఎవరూ వెళ్ళకుండా, ప్రభుత్వం ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముళ్లకంచెతో మూశేసింది. అది దాటి ఎవరినీ వెళ్లనివ్వకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది.” – ప్రొఫెసర్ వాలెస్, నోబెల్ బహుమతి గ్రహీత.

stalker-2

సూర్యుడు ఇంకా ఉదయించలేదు. గైడ్ (Stalker) నిద్ర లేచాడు. నిద్రపోతున్న తన భార్య, కూతుళ్ళను నిద్రకు భంగం కలగకుండా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇంట్లోనుంచి బయల్దేరబోతుండగా భార్య అతన్ని ఎదుర్కొంది. దయచేసి వెళ్లొద్దని ప్రాథేయపడింది; ఏడ్చి గోల చేసింది. గైడ్ ఆమె మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

దారిలో రైటర్ కనిపించాడు. తనతోపాటు ఒకమ్మాయి ఉంది. ఏ మాత్రం మ్యాజిక్ లేని ఈ నిస్సారమైన జగత్తుపై అనివార్యమైన బతుకు గురించి ఆమెతో చర్చిస్తున్నాడు. మరి బెర్ముడా ట్రయాంగిల్ సంగతేంటని ఆమె అడిగింది. అలాంటి కాల్పనిక సత్యాలే మనిషిలో ఇంకా కొద్దిపాటి ఆసక్తిని మిగిలించాయని రైటర్ చెప్పుకొచ్చాడు. ఈలోగా అక్కడొకొచ్చిన గైడ్ ని చూసి, తనతో ఉన్న ఆవిడను చూపిస్తూ ఆమె కూడా తమతో పాటు రావాలనుకుంటుందనీ చెప్పాడు రైటర్. ససేమిరా కుదరదన్నాడు గైడ్. ఇక చేసేదేమి లేక ఆమె లేకుండానే గైడ్ తో కలిసి బయల్దేరాడు రైటర్. ఇద్దరూ కలిసి ఊరికవతల ఉన్న ఒక బార్ కి చేరుకున్నారు. అక్కడ అప్పటికే ప్రొఫెసర్ వచ్చి ఉన్నాడు. తమ ప్రయాణానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు గైడ్.

వారి గమ్యం ఒకటే! పోలీసుల కళ్ళు గప్పి ఎలాగైనా క్షేత్రం చేరుకోవాలి. అక్కడి మాయమంత్రాలకు లోబడకుండా, గైడ్ చెప్పిన నియమాలను అతిక్రమించకుండా, అతను చూపిన దారిలో వెళ్తూ, క్షేత్రం నడుమన ఉన్న గది లోకి వెళ్లడమే వారి లక్ష్యం. ఆ గదిలో వారి హృదయాంతరాల్లో నిగూఢంగా దాగిఉన్న తీవ్రమైన కోరిక నిజమవుతుంది.

దారి పొడవునా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాళ్లకి. పహరా కాస్తున్న పోలీసులనుంచి ఎలాగో తప్పించుకుని గైడ్ కి మాత్రమే తెలిసిన త్రోవ గుండా క్షేత్రపు సరిహద్దులకు చేరుకుంటారు వారందరూ.

stalker-3

కళ యొక్క గొప్పతనాన్ని, నిస్వార్థ స్వభావాన్ని చెప్తూ మరో వైపు సైన్స్ యొక్క నిరుపయోగాన్ని వివరిస్తూ ప్రొఫెసర్ కి కోపం తెప్పిస్తాడు రైటర్. మరో వైపు తన స్వంత ఎజెండాతో అక్కడకు వచ్చిన ప్రొఫెసర్ గైడ్ మాట వినకుండా కోపం తెప్పిస్తుంటాడు.

చివరికి ఎంతో కష్టపడి క్షేత్రం మధ్యలో ఉన్న గది దగ్గరకు చేరుకుంటారు అందరూ. అక్కడకు చేరుకోగానే ప్రొఫెసర్ తనతో తెచ్చుకున్న బాంబ్ తో ఆ గది ని పేల్చెయ్యాలని ప్రయత్నిస్తాడు.

“తమలాగే ఇక్కడకు చేరుకున్న ఏ నియంతో, ఏ రాక్షసుడో – మానవాళి మొత్తానికి ముప్పు తెచ్చే కోరిక కలిగిఉంటే? అప్పుడు మానవుని పరిస్థితి ఏంటి?” అనేది ప్రొఫెసర్ వాదన. అందుకే దేవుణ్ణే చంపెయ్యాలన్నది అతని ఆలోచన.

ఆశ్చర్యకరంగా రైటర్ కూడా ప్రొఫెసర్ పనిని ప్రోత్సాహిస్తాడు. అసలు ఆ గదికి అర్థం లేదని, నిజంగానే తన కోరిక తీరి తనో పెద్ద జీనియస్ గా బయటకి వచ్చి లాభం ఏంటని ప్రశ్నించుకుంటాడు. అసలు ఏ రచయితైనా తన అనుమానాలు నివృత్తి చేసుకో డానికో, ప్రజలకు తనేదో చెప్పడం ద్వారా తనకో గుర్తింపు సాధించుకోడానికో రాస్తాడు. అలాంటిది తనో జీనియస్ అని ఖచ్చితంగా తెలిసిపోయాక ఇక రాయాల్సిన అవసరం ఏముంటుంది? రాయాల్సిన అవసరం లేని తన అవసరం ప్రపంచానికి ఏముంటుంది? -అలాంటప్పుడు తను జీనియస్ కాకపోవడమే మేలని, కాబట్టి ఆ గది తో అసలు ఎవరికీ అవసరం లేదనీ ప్రొఫెసర్ తో గొంతు కలుపుతాడు రైటర్.

గదిలోకి వెళ్లమని వారిద్దరినీ ఏ మాత్రం ఒప్పించలేని గైడ్ (Stalker) వారితో కలిసి తిరుగు ప్రయాణం చేస్తాడు.

*****

stalker-5

కీలక సన్నివేశం

క్షేత్రం నుంచి తిరిగివచ్చిన గైడ్ ని అతని భార్య ఓదారుస్తుంది. వికలాంగురాలైన తమ కూతురు మంకీ తో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో మంకీ ఒక టేబుల్ వద్ద కూర్చుని ఉంటుంది. గదినిండా పొగ అలుముకుని ఆహ్లాదంగా ఉంటుంది. మంకీ కాసేపు పుస్తకం చదువుతుంది. తన “స్నేహితుడి” గురించి ఒక కవిత వాయిస్ ఓవర్ లో ప్లే అవుతుంటుంది.

టేబుల్ మీద కొన్ని గాజు వస్తువులు ఉంటాయి. మంకీ వాటి వైపు తీక్షణంగా చూడగానే ఒక్కొకటి వాటికవే కదుల్తాయి. మంకీ ఒక పొడవాటి గాజు గ్లాసు ని చూస్తూ టేబుల్ పై తన తలను ఉంచుతుంది. అలా కదులుతూన్న గ్లాస్ టేబుల్ చివరికి చేరుకుని నేలమీద పడి పగిలిపోవడంతో సినిమా ముగుస్తుంది.

ఈ సీన్ ఎందుకంత కీలకమంటే, దాదాపు రెండున్నర గంటల పాటు ఫ్రొఫెసర్ మరియు రైటర్ ల జీవితపు చేదు అనుభవాలతో తమ మనసుల్ని రాయిగా చేసుకున్న విధానం తెలియచేయడం మరియు దేవుణ్ణి చేరుకోవాలంటే చిన్నపిల్లాడిలాంటి అమాయకత్వం, బలహీనత, నిస్సహాయతలు కావాలని వారికి చెప్పాలన్న గైడ్ ప్రయత్నం తో, ఈ సినిమా సాగుతుంది.

మానవ ప్రగతికి రెండు కళ్లైన సైన్స్ మరియు ఆర్ట్ ని ప్రొఫెసర్ మరియు రైటర్ పాత్రల ద్వారా సూచిస్తాడు టార్కోవ్స్కీ. కానీ సైన్స్ మరియు కళ ద్వారా వారిద్దరూ పొందిన జ్ఞానం చివరికి క్షేత్రం లో కోరికలు తీర్చే గదిలోకి వెళ్లి, ఆ దేవున్నే స్వయంగా చూడగలిగే ధైర్యాన్ని వాళ్ళకివ్వదు. కానీ, చిన్నపిల్లే కాకుండా వికలాంగురాలు కూడా అయిన మంకీ ఆ దైవత్వాన్ని సునాయసంగా పొందగలుగుతుంది.దాంతో, భగవంతుడు నిస్సహాయులను బలపరుస్తాడని చెప్పకనే చెప్తాడు టార్స్కోవ్స్కీ!

“దేవుడు మరణించాడు”, అంటాడు నీచీ. కానీ మానవజాతి తాము గీసుకున్న చట్రాల్లో ఇరుక్కుని, శతాబ్దాలుగా ఇహలోకానికీ పరలోకానికీ ఉన్న పేగు బంధాన్ని తెంచేసుకున్నాడు. కానీ తిరిగి ఆ బంధాన్ని ముడివేయగలమనే ఉద్దేశమే ఈ కీలక సన్నివేశంలో మనకు కనిపిస్తుంది.

టార్కోవ్స్కీ అందరిలాంటి దర్శకుడు కాదని చెప్పడానికి ఈ సినిమాలోని చివరిది మరియు అత్యంత కీలకమూ అయిన ఈ సన్నివేశం చాలు.

ఆసక్తికరంగా మొదలై, మధ్యలో పతాక స్థాయికి చేరుకుని, చివరికి దాని లక్షాన్ని చేరుకునే కథాంశాలు ఈయన సినిమాల్లో ఉండవు. ”బహుశా ఇందులో ఏదైనా సింబాలిజం ఉందేమో! ఏదో చెప్పాలని ప్రయత్నించాడేమో”, అని ఆయన సినిమాలని ఇప్పటికీ ఫ్రేము ఫ్రేమునా అన్వేషిస్తూనే ఉన్నారు సినీ ప్రేమికులు.

ఇదే విషయం టార్కోవ్క్సీ ని అడిగినప్పుడు, “ఎక్కడికెళ్ళినా, ఎవరు చూసినా ప్రతి వాళ్లు నా సినిమాల గురించి ప్రశ్నలు గుప్పించేస్తున్నారు – ఈ షాట్ అర్థం ఏంటి? ఆ సీన్ అవసరం ఏంటి? అని. నేను భరించలేకపోతున్నాను. ఒక కళాకారుడు తన ఉద్దేశాలకు భాధ్యత వహించాల్సిన అవసరం లేదని నేననుకుంటాను. నా సినిమాల్లో ఎటువంటి సింబాలిజం లేదు. నేను ప్రేక్షకుల్లో కేవలం భావాలను – ఎటువంటి భావలైనా కానివ్వండి – ప్రేరేపించడమే ధ్యేయంగా సినిమాలు తీస్తాను. కానీ ఎందుకో అందరూ నా సినిమాల్లో లేని అర్థాలను వెతకడానికి ప్రయత్నిస్తుంటారు” అని చెప్పుకొచ్చారు.

కానీ సృష్టి చేయడం వరకే కళాకారుడి పని; ఆ తర్వాత అతను వేరు, అతని కళ వేరు. కళాకారునిగా అతని ఉద్దేశాలు అతనికి ఉండొచ్చు. కానీ ఆ కళను చూసి స్పందించే ప్రతి ప్రేక్షకుడికి ఒక్కోరకమైన వ్యాఖ్యానం చేసే హక్కు ఉంది.

ఎన్ని సార్లు చూసినా ఇంకొంచెం కొత్తగా అనిపించే టార్కోవ్స్కీ సినిమా “Stalker” గురించి నా వ్యాఖ్యానం ఇదే!

2 Comments
  1. Radical IT Solutions January 2, 2014 /
  2. Telugu Cinema News January 2, 2014 /