Menu

Ship of Theseus

తానే మారెనా? గుణమే మారెనా?

నేను ఎవర్ని?


ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు. చివరికి మరో సారి ఇదీ నేను అని స్థిరంగా నిర్ణయించుకుని జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటాడు మనిషి. కానీ కీర్క్‌గార్డ్ చెప్పినట్టు “మనిషి నిత్య పరిణామి”.

మనిషి ఒక స్థితి నుంచి మరో స్థితికి మారుతూ పరిణమిస్తూ ఉంటాడు. నిజమే, చెట్లు పుట్టలు కూడా పరిణమిస్తాయి. కానీ వీటి విషయంలో, ఏ స్థితిలో అయినా, ఏ దశలోనైనా, ఆ స్థితిని, ఆ దశను పూర్తిగా వర్ణించగలం. కానీ మనిషి అలా కాదు. అతడు ఏమి కానున్నాడు, ఏమిగా మారనున్నాడు? ఏ దిశగా పరిణమిస్తున్నాడు? అతడి ప్రణాళిక, ఉద్దేశాలేమిటో చెప్పడం సాధ్యం కాదు. ఈ పరిణామ క్రమంలో మనిషి అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి?

ఏది నా అస్తిత్వం? మారిన నేనా? మారకముందు నేనా? లేక మరో సారి మారబోతున్న నేనా? విశ్వమంతా వ్యాపించిన అనంతమైన తాడుని పట్టుకుని ఎక్కడని వెతకను నా కోసం?

****

Ship of Theseus అనబడు ఒక విరోధాభాసం మరియు ఒక సినిమా

పూర్వం గ్రీకు దేశంలో థీసియుస్ అనే ఒక రాజు ఉండేవాడు. అతను కృతి అనే పట్టణం నుండి ఓడలో బయల్దేరి అథెన్స్ అనే చోటుకి చేరుకుని అక్కడ ఒక మహానగరాన్ని స్థాపించాడు. థీసియుస్ మహారాజు అథెన్స్ కి చేరుకున్న ఓడని అక్కడి ప్రజలు తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. దశాబ్దాలు గడిచిపోయాయి. ఓడలోని కొన్ని భాగాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. నగర చరిత్రలో భాగమైన ఈ ఓడ ప్రాముఖ్యాన్ని గమనించిన ఊరి పెద్దలు ఓడలోని భాగాలను సరి కొత్త భాగాలతో భర్తీ చేసి మరమ్మత్తు చేశారు. ఆ విధంగా ఓడలో పాడవుతున్న భాగాలకు మరమ్మత్తు కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. చివరికి ఒకరోజు ఆ ఓడలోని ప్రతి అంగుళం కొత్త భాగాలతో భర్తీ చేయబడింది.

ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. ఎప్పుడో కొన్ని తరాల క్రితం తమ ఊరికి చేరుకున్న ఓడ, ఇప్పుడు సరికొత్త భాగాలతో భర్తీ చేయబడిన ఈ ఓడ ఒక్కటేనా కాదా? అనేది ప్రశ్న. ఆ ఓడలోని భాగాలన్నీ మారినప్పటికీ ఆ ఓడ యొక్క గుణం (ఆత్మ) మాత్రం మారలేదనీ, కాబట్టి ఈ ఓడ ఆ ఓడేనని ఒక వాదన. అలా కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. ఒక వేళ ఈ ఓడ మరమ్మత్తు చేసే క్రమంలో తీసి పారేసిన భాగాలన్నింటినీ మరో చోట ఒక ఓడలా సమీకరించగలిగితే- ఇప్పుడు ఇది నిజమైన Ship of Theseus ఎందుకు కాకూడదని వారి వాదన.

ఇన్ని వేళ సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక పారడాక్స్ (విరోధాభాసం) గానే మిగిలిపోయింది. ఈ అంశం ఆధారంగా రూపొందింపబడిన సినిమానే “Ship of Theseus”.

*****

తర తరాలుగా మనిషి తనలో తానే ఘర్షణ పడుతూ, మధనపడుతున్న అధ్యాత్మిక, నైతిక, సైధ్ధాంతిక సంకటస్థితిని చర్చించే నేపధ్యంలో హృద్యంగా రూపొందించబడిన సినిమా ఇది. అవయవ మార్పిడి పొందిన ముగ్గురి జీవితాల ఆధారంగా అల్లబడిన కథ ఇది.

అలియా అనే దృష్టి సంబంధ వైకల్యం కలిగిన ఫోటోగ్రాఫర్ కార్నియా మార్పిడి ద్వారా తన దృష్టి ని పునరుద్ధరించుకోగలుగుతుంది. కానీ కొత్తగా ప్రపంచాన్ని చూడగలిగే అవకాశం కలిగినా తనకు చూపులేనప్పుడే ఇప్పటికంటే మంచి ఫోటోలు తీయగలిగాననే అసంతృప్తి ఆమెలో అసహనం కలుగచేస్తుంది.

అభ్యుదయ వాద కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్న పాటి స్టాక్ బ్రోకర్ గా పెద్దగా ప్రాముఖ్యం లేని జీవితం గడిపేస్తూన్న నవీన్ ది మరో కథ. హాస్పిటల్ లో చేరిన శంకర్ అనే పేద వ్యక్తి కిడ్నీ దొంగలించి ఎవరో విదేశీయుడికి అమ్మారని తెలుసుకుని, శంకర్ కి నవీన్ సహాయం చేసే క్రమంలో జరిగే కథ మరొకటి.

ఇక మూడో కథ కొస్తే, జైన మత గురువు అయిన మైత్రేయ చీమకైనా హాని తలపెట్టడు. తన మత ప్రచారం కంటే జైన మత సిద్ధాంతాల్లో ఒకటైన అహింసను అన్ని విధాలా ప్రచారం చేస్తుంటాడు మైత్రేయ. ముఖ్యంగా మందులు, సౌందర్య సామాగ్రి తయారు చేసే ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను నోరులేని జంతువులమీద ప్రయోగించి హింసకు గురిచేస్తున్నారని కోర్ట్ లో కేస్ వేస్తాడు. చాలా తీవ్ర స్థాయిలో జంతుహింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు మైత్రేయ. ఇలా ఉండగా ఒక రోజు అతనికి లివర్ సిరోసిస్ అనే వ్యాధి సోకిందని తెలుస్తుంది. ఆ వ్యాధి నయం కావాలంటే మందులు వేసుకోవాల్సి వస్తుందని, జంతువులపై ప్రయోగం చేసిన మందులను ఎట్టి పరిస్థుతుల్లో ఉపయోగించనని మొండికేస్తాడు మైత్రేయ.

రోజులు గడుస్తాయి, వారాలు గడుస్తాయి. ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేసినా మైత్రేయ ఒప్పుకోడు. మొదట్నుంచీ కూడా మైత్రేయ తో దేవుడు, ఆత్మ లాంటి విషయాల గురించి వాదనకు దిగుతుంటాడు చార్వాక అనే కుర్రాడు. మైత్రేయ ఆరోగ్యం బాగా క్షీణించిన దశలో ఒక రోజు మైత్రేయ ని చూడ్డానికి వస్తాడు చార్వాక.

*****
కీలక సన్నివేశం

 ship-2

 

 

 

 

 

 

 

 

 

కోర్డిసెప్స్! ఒక భయంకరమైన ఫంగస్ ఇది. చీమలు మరియు ఇతర క్రిమికీటకాదుల శరీరాల్లో ఉండే పరాన్నజీవి. కోర్డిసెప్స్ ఫంగస్ సోకిన చీమ యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఫంగస్ చీమల కేంద్ర నాడీ వ్యవస్థలో మొదట స్థావరం ఏర్పరుచుకుంటుంది. అక్కడ్నుంచి తన పని మొదలుపెడ్తుంది ఈ ఫంగస్. చీమ చేసే పనుల్నీ, అది తీసుకునే నిర్ణయాలను ఈ ఫంగస్ నియంత్రిస్తుంది. ఈ విషయాలేమీ తెలియని చీమ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటున్నాననే భ్రమలో ఉంటుంది. కానీ ఫంగస్ తను పెరగడానికి అనుకూలంగా ఉండే ప్రదేశానికి దారి మళ్లిస్తుంది. అలా చేరగానే చీమ తానంతట తాను ఒక కొమ్మను తన కోరలతో గట్టిగా పట్టుకుని ఆగిపోతుంది. ఇలా జరిగిన మరు క్షణం ఆ ఫంగస్ చీమను చంపేసి, ఆ చీమ శరీరాన్ని తన అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది.

అంత చిన్న చీమ శరీరంలో చేరిన ఒక ఫంగస్, తను స్వచ్చంధంగా చేస్తున్నానని చీమని భ్రమింప చేసి మైండ్ కంట్రోల్ చేస్తుంది. అలాంటప్పుడు లక్షల కొద్దీ బ్యాక్టీరియాకు ఆలవాలమైన మానవ శరీరాన్ని నడిపించేది ఎవరు? మనమేనా? లేక ఎవరో మన జీవితాన్ని నిర్ణయించేసి తెలివిగా నడిపించేస్తున్నారా?” అని చార్వాకుడు మైత్రేయ ను ప్రశ్నిస్తాడు.

“ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయి లో జైన మతం అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. అంత నిష్టగా పాటించే ఈ సిద్ధాంతమే నిజమైతే, తన శరీరంలో నివసిస్తున్న వేలకోటి సూక్ష్మ క్రిముల సంగతేంటి?” అని చార్వాక అడిగిన ప్రశ్నకు మైత్రేయలో మొదటి సారిగా మార్పు అనే బీజం పడుతుంది. తన జీవితకాలం పాటు మైత్రేయ నమ్మిన సిద్ధాంతాల పునాదులు చార్వాక అడిగిన ప్రశ్నతో కదిలిపోతుంది.

ఆద్యంతం అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో పాటు ఆసక్తి గొలిపే ఇలాంటి ఎన్నో సన్నివేశాలతో విశేషంగా ఆకట్టుగోగలిగే సినిమా ఇది.

*****
ముగింపు

ship-3

 

 

 

 

 

 

 

ఒక శరీరానికి కట్టివేయబడి, ఆ పదార్థంలో కూరుకుపోయిన ఆత్మే “మనిషి” అని కొంతమంది అంటారు. మరణానంతరం ఈ “ఆత్మ” మరో శరీరంలో సాక్షాత్కరిస్తుందనీ నమ్ముతారు. ఒక వేళ అదే నిజమనుకుందాం. ఆ వ్యక్తి మరణానంతరం తన అవయవాలను దానం చేసాడు; ఈ అవయవాలను అమర్చుకున్న కొంతమంది నూతన జీవితాన్ని పొందారు. ఇక్కడే మరో సారి “Ship of Theseus” ప్యారడాక్స్ చర్చకు వస్తుంది.

ఇప్పుడు నేనెవరు? ఈ ఉద్యానవనంలో కొన్నాళ్ళు వికసించి రాలిపోయిన మరో పువ్వునా? లేక ఏ తోటమాలి పుణ్యమో, తిరిగి మరో చెట్టున చేరి కొత్తగా వికసించిన పువ్వునా?

ఈ సినిమాలోనే ఒక సన్నివేశంలో చెప్పినట్టు: ఒక్కోసారి ఇదంతా మనిషి సృష్టించుకున్న భాష కారణంగా వచ్చిన కాంప్లికేషన్ గా కూడా అనిపిస్తుంది. అక్షరాలు – అచ్చులు, హల్లులు. వాటిని అటు ఇటు పేర్చి, దేవుడు,స్వర్గం, మానవత్వం, జీవితం, అస్థిత్వం, పరమార్థం అంటూ పదాలు కూర్చి వాటికి అర్థాలు వెతుక్కుందామని జీవితాంతం తాపత్రయపడుతుంటాడు. అసలు భాషే లేకపోతే మనం సృష్టించుకున్న ఈ పదాలను దాటి నిజంగానే జీవితానికి ఒక అర్థమనేది ఉంటుందా?

సమాధానం తెలియదు కానీ “Ship of Theseus” లాంటి సినిమా చూసినప్పుడు జీవితాన్ని అర్థం చేసుకోవాలనే తపన కలిగి తీరుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక గొప్ప అనుభూతి మిగుల్తుంది. జీవితకాలంలో చాలా తక్కువ సార్లు మాత్రమే కలిగే అరుదైన అనుభవం “Ship of Theseus” .

3 Comments
  1. నామరూపం August 4, 2013 /
  2. Indian Minerva August 6, 2013 /
  3. నామరూపం August 7, 2013 /