Menu

Shadows of Forgotten Ancestors

అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది – ప్రేమ.

ఈ విశాల ప్రపంచమంతా ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ కోసమే సృష్టించబడిందా? అసలు అనంతమే రెండుగా విడిపోయి వారిద్దరి రూపాలు దాల్చిందా? చంద్రుడిని ఆకాశం కోసం చేయబడినట్లు, దేవుడు ఆమెను తన కోసం చేశాడా?

ఇవాన్-మరీచ్కా ల జంటను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటే – కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి, ఈ చరాచర సృష్టి ఏమిటి – అన్నీ వారి ప్రేమ గీతానికి వంతు పాడాయి; ఒక అజరామరమైన ప్రేమ కథకు శ్రీకారం చుట్టాయి.

వారి తల్లిదండ్రులు బద్ధ శత్రువులని తెలియని వయసు లో మరీచ్కా; తన తండ్రిని హతమార్చిన వాడి కూతురితో స్నేహం చేయకూడదని తెలియని వయసులో ఇవాన్.
మనిషితనం ఇంకా వంటబట్టని వయసది. తిట్టుకోవడంలోనూ, కొట్టుకోవడంలోనూ ఆనందమే తప్ప మరేమీ కోరుకోని అమాయకత్వం వారిది.

చిన్న వయసునుంచీ పెంచుకున్న స్నేహం, యుక్తవయసులో ప్రేమగా మారింది. ఇవాన్-మరీచ్కా ల ప్రేమ కథ ను అత్యంత సుందరంగా తెరకెక్కించిన చలన చిత్రమే “Shadows of Forgotten Ancestors”.

****

ప్రఖ్యాత సోవియట్ ఫిల్మ్ మేకర్ ఆండ్రీ టార్కోవ్స్కీ తో తరచుగా పోల్చబడే సెర్జీ పరజనోవ్ ఈ చిత్రానికి దర్శకుడు. “చలనచిత్రమనే కళాలయంలో ఆశీర్వాదం పొందిన ఎందరో భక్తులు (దర్శకులు) ఉండొచ్చు. కానీ ఆ దేవాలయానికి మాత్రం పూజారి ఒక్కడే – సెర్జీ పరజనోవ్” అంటాడు ఫ్రెంచ్ దర్శకుడు Godard.

చలనచిత్రం అనే సాంకేతిక పరిజ్ఞనానికి ఒక సరికొత్త భాష (ఫిల్మ్ లాంగ్వేజ్) తోడై కళ గా రూపాంతరం చెందడంలో ఎంతో మంది కృషి చేశారు. ఫ్రేం, షాట్, సీన్, సీక్వెన్స్ అనేవి సినిమా భాషకు ముఖ్య మూలకాలైతే, ఎడిటింగ్ ఆధారంగా ఒక వ్యాకరణాన్ని సృష్టించిన వారిలో గ్రిఫిత్ ఒకరు! అదే సమయానికి రష్యాలో ఐజెన్స్టీన్ లాంటి వారు ఎడిటింగ్ లో మోంటాజ్ అనే ప్రక్రియ ద్వారా సినిమా భాషకు మరో మాండలికాన్ని సృష్టించారు. దాదాపు అరవై, డెబ్భై ఏళ్లపాటు సినిమా అనే కళకు ఈ వ్యాకరణమే పునాదిగా నిలచింది. ఆ తర్వాత 1958 లో ఫ్రెంచ్ న్యూ వేవ్ ఉద్యమం వరకూ సినిమా వ్యాకరణంలో పెద్దగా మార్పు రాలేదనే చెప్పుకోవాలి.

కానీ ప్రపంచ సినీ చరిత్రలో అతి కొద్దిమంది మాత్రమే తన సినిమాల ద్వారా సరికొత్త ఫిల్మ్ గ్రామర్ ని ప్రవేశ పెట్టారు.వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెర్జీ పరజనోవ్. ఈయన తన చలన చిత్రాల్లో వాడిన ఫిల్మ్ లాంగ్వేజ్ ఎంత ప్రత్యేకమైనదంటే, ఆయనలా సినిమాలు తీయడం మరెవరికీ వీలుకానంత! ఈయన తీసిన సినిమాల్లో కెమెరా అసాధ్యమైన కోణాల్లో ప్రయాణిస్తూ విభ్రాంతి కలిగిస్తూంటుంది. పాత్రలకు అతి దగ్గరగానే ఉంటూ, ఎత్తైన కొండలూ గుట్టల్లో సైతం సెలయేటిలా ప్రవహిస్తుంది. పరజనోవ్ సినిమా ని అనుభవించడమే సాధ్యం కానీ వర్ణించడం అసాధ్యం.

shadows-2

ప్రపంచాన్నే మరిచిపోయి, ప్రేమలో మునిగిపోయిన ఇవాన్-మరీచ్కాలు తమ భవిష్యత్ గురించి ఎన్నో కలలు కంటారు. విడిపోయిన తమ కుటుంబాలను తమ ప్రేమతో ఏకం చెయ్యాలనుకుంటారు.

కానీ ఇవాన్ కుటుంబానికి బ్రతుకు భారమవుతుంది. కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుని డబ్బు సంపాదించడానికి దూర ప్రాంతానికి తరలి వెళ్తాడు.

ఇవాన్ బయల్దేరుతుండగా మరీచ్కా అతని వెంటే ఊరి పొలిమేరలు వరకూ వస్తుంది. ఇవాన్ తిరిగి వచ్చేవరకూ ఎదురుచూస్తుంటానని ఒట్టేస్తుంది. ప్రతి రాత్రి ఆకాశంలో నక్షత్రాల్లో ఇవాన్ ని చూసుకుంటానని చెప్తుంది.

కాలం గడుస్తుంది. ప్రతి రాత్రి ఇవాన్, మరీచ్కాలు వారి వారి ప్రదేశాల్లోని పచ్చిక బయళ్లలో పడుకుని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ వారి కలయిక కోసం ఎదురుచూపులు చూస్తుంటారు.

ఇంతలో, ఒకానొక సంఘటనలో మారీచ్కా దురదృష్టవశాత్తూ ఒక కొండ చరియమీద నుంచి లోయలోకి పడిపోతుంది. ఊరు ఊరంతా ఆమె కోసం గాలించడం మొదలు పెడ్తారు. విషయం తెలిసిన ఇవాన్ ఆమె ను వెతకడానికి బయల్దేరుతాడు. కథా పరంగా చూసినా, టెక్నిక్ పరంగా గా చూసినా ఈ సినిమాలో కీలక సన్నివేశం ఇదే!

shadows-3

కథగా చూస్తే ఈ సినిమా విషాదాంతపు ప్రేమ కథలైన “రోమియో-జూలియట్”, “లైలా-మజ్ను” ల కోవలోకే వస్తుంది. కానీ మరీచ్కా ని వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశంలో పరజనోవ్ చూపించిన పనితనం ఎటువంటి వారినైనా ఆశ్చర్యపరుస్తుంది.

అలాగని కేవలం అధ్బుతమైన చిత్రీకరణ మాత్రమే కలిగిఉండి, ప్రేక్షకుల్లో ఏ మాత్రం చలనం కలిగించలేని విధంగా పరజనోవ్ దర్శకత్వం ఉండదు. దర్శకుడు తన కెమెరాతో ముత్యాల్లాంటి షాట్స్ ని చిత్రీకరించగలిగినా, వాటిని గుదిగుచ్చగలిగే ఎమోషన్ అనే తాడు తప్పక ఉండాలి. పరజనోవ్ ఇక్కడే మిగతా దర్శకులకంటే ముందుంటాడు.

పరజనోవ్ చిత్రీకరణ గురించి Alexi Korotyukov మాటల్లో చెప్పాలంటే: “Paradjanov made films not about how things are, but how they would have been had he been God.”

ముఖ్యంగా పైన పేర్కొన్న సన్నివేశంలో కెమెరా దేవుడి కన్నులా పని చేస్తుంది. తను సృష్టించిన మనిషి బాధను కళ్లారా చూసి తనూ ఆ బాధననుభవిస్తున్నట్టుగా కెమెరా కదుల్తుంది.

బహుశా, తనే స్వయంగా డిజైన్ చేసిన క్రేన్ లాంటి ఎక్విప్మెంట్ ద్వారా ఎంతో ఎత్తు నుంచి, లోతైన నీటిలో ప్రవహించే నావను చిత్రీకరిస్తూనే, వెంటనే భూమి మీదకు చేరి ఇవాన్ ని హ్యాండ్ హెల్డ్ కెమెరాతో ఫాలో అవుతూ వచ్చే కొన్ని షాట్స్ ఈ చిత్రానికి తలమానికంగా నిలుస్తాయి.

*****

మరీచ్కా ని వెతుక్కుంటూ బయల్దేరిన ఇవాన్, నీటిలో కొట్టుకుని ఒడ్డుకు చేరిన మరీచ్కా శవాన్ని చూస్తాడు. కూలిపోయిన తమ ఆశల సౌధాన్ని గుర్తుకు తెచ్చుకుని తనూ కుప్ప కూలిపోతాడు.

ఇప్పుడతనో తాగుబోతు.
తన కన్నీళ్లను తానే తాగుతాడు.
కష్ట సుఖాలను దిగమ్రింగుతాడు.
ఏ సుఖాలూ అతని దరిచేరలేవు
ఏ ప్రేమలూ అతని హద్దు మీరలేవు;
లోనికి చొరలేవు.
ఇది అతని రాజ్యం, ఇష్టారాజ్యం;
అతని దుఖ సామ్రాజ్యం

*****

కాలాన్ని మంచిన మందు లేదంటారు. మరీచ్కా మరణించిన పదేళ్లకు పలాగ్నా అనే యువతిని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడవుతాడు. కానీ పలాగ్నా వద్ద అతనికి శారీరక సుఖం తప్ప అతనికి కావాల్సిన ప్రేమ లభించదు. ఈ లోగా పలాగ్నా మరొకరితో సంబధం ఏర్పరుచుకుంటుంది. ఇవాన్ ఇప్పటికీ ఎప్పటికీ మరీచ్కా కలిసి కన్న స్వప్నం లోనే జీవిస్తున్నాడని అర్థం చేసుకుంటాడు.

ఆ కల మళ్లీ రాదని అతనికి తెలుసు
అయినా ఆ కళ్లు దాని కోసం వెతుకుతూనే ఉంటాయి.
అదే కలను తెచ్చే రాత్రి కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి.

shadows-4

 

 

 

 

 

 

 

 

 

పలాగ్నా తో తెగ తెంపులు చేసుకుని, చిన్నప్పుడు మరీచ్కాతో ఆడిన అడవిలోకి వెళ్తాడు ఇవాన్. మరీచ్కా అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఇన్నాళ్లూ ఏ అమరపురిలోనో దాక్కుని ఇప్పుడు తన కనులెదుటే సాక్షాత్కరించి, ఊరించి తనను రమ్మంటోన్న మరీచ్కాని చేరే ప్రయత్నం చేస్తాడు ఇవాన్.

చెయ్యి చాచిన కొద్దీ దూరం. ఆమెని చేరాలనే ఇన్నాళ్లీ జీవన సమరం. చివరికి మరీచ్కా కూడా చేజాచి అతన్ని చేరుతుంది. ఇవాన్ వెతలకు ఉపశమనం కలుగుతుంది. ప్రకృతి వారి రక్తం తో తడిసి ముద్దవుతుంది. వారి ప్రేమ అమరమవుతుంది.

అందుకే తరాలు మారినా ఇవాన్-మరీచ్కా ప్రేమగీతపు రాగాలు ఇంకా ధ్వనిస్తూనే ఉన్నాయి. అజరామరమైన ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ఆ పూర్వీకులను మర్చిపోయినా వారి నీడన మరెన్ని ప్రేమ కావ్యాలు పూస్తాయో?

సినిమాలో చివరి సీన్ ఇది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లోలాగే ఈ కీలక సన్నివేశంలో వాడిన టెక్నిక్ అత్యద్భుతం అని చెప్పాలి. ఎంత అద్భుతం అంటే, ప్రపంచంలో అతి సుందరంగా చిత్రీకరింపబ్బడ్డ పది గొప్ప సన్నివేశాల్లో ఈ సన్నివేశాన్ని చేర్చవచ్చు.

shadows-5

చిత్రీకరించే కెమెరా, నటించే నటీనటులు,తెర వెనుక ఉండి అంతా నడిపించే దర్శకుడు, తెర మీద దృశ్యాలను చూసి ఆనందించే ప్రేక్షకుడు – అంతా మమేకమయ్యే విశిష్ట సన్నివేశం ఇది.

పరజనోవ్ సినిమా కూడా ప్రేమ లాంటిదే. అది అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది.

*****

పరజనోవ్ ఒక మెజీషియన్. ఆయన దగ్గర లెక్కలేనన్ని రహస్యాలున్నాయి. ఉరకలేస్తూ వచ్చి మెల్లగా ఒడ్డుకు చేరిన అలలు – ఇసుకలో గవ్వలను రహస్యంగా దాచేసినట్టు – పరజనోవ్ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక చిన్న అలలా ఎగిసి తన చలనచిత్రాలను రహస్యంగా ఇక్కడ వదిలి వెళ్ళాడు.

వెతుక్కోవడం అన్వేషకులకు కొత్తేమీ కాదు కదా? శోధించండి!

మీరు ఆయన్ని చేరాలే గానీ ఏదో ఒక రహస్య సృష్టిని మీ కళ్లముందుంచకపోడు. ఏదో ఒక దృశ్యం ద్వారా పరజనోవ్ మిమ్మల్ని తప్పక పలకరిస్తాడు. మీ హృదయంలో చెరగని ముద్ర వేస్తాడు.

One Response
  1. కమల్ August 18, 2013 /