Menu

Kramer vs. Kramer

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు.

ఎక్కడో పుట్టారు.ఎక్కడో పెరిగారు.

జొయన్నా, టెడ్ అనబడే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆత్మీయత పెరిగి ఒకే ప్రాణంగా మెలగుతూ ఒక వంశవృక్షానికి కొత్త కొమ్మలు, రెమ్మలు తొడిగారు. బిల్లీ అని నామకరణం చేశారు.

జంట కట్టి, సంతానం వృద్ధి చేయడమొక్కటే లక్ష్యమయ్యుంటే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం లేదు. సంతాన వృద్ధికంటే కూడా ఇద్దరు ఒకటై కలిసి జీవించడంలోని ఆనందానికే వివాహ బంధంలో ప్రాముఖ్యత ఉంటుంది.

టెడ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు జొయన్నా కూడా ఇలానే అనుకుంది. కానీ టెడ్ ఆఫీస్ పనిలో విపరీతంగా బిజీ అయిపోయాడు. ఇల్లు, ఆఫీస్…ఆఫీస్, ఇల్లు. టెడ్ కి ఇదే లోకం.

భార్యాభర్తలు రెండు చక్రాలుగా సంసార రథం నడవాలంటారు. కానీ తమ కొడుకు బిల్లీని, తన కుటుంబాన్నీ తనే రథమై, చక్రాలై నడిపించింది జొయాన్నా. పెళ్లయిన ఎనిమిదేళ్లకు కానీ ఇల్లు అనే నాలుగ్గోడలమధ్య తను భార్యగా బందీ అయిన విషయం గ్రహించలేకపోయింది.

పెళ్లి అనే బంధం లో మడిచి దాచేసిన రెక్కలను తిరిగి విప్పింది. రొటీన్ జీవితపు చట్రంలో ఇరుక్కున్న తనను తాను ప్రశ్నించుకుంది.

భర్తకు భార్యను; కొడుకుకి తల్లిని. కానీ నేనెవర్ని?

జొయన్నా కు సమాధానం తోచలేదు. తనను తాను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. జొయన్నా వెళ్లిపోతూ కొడుకు బిల్లీ ని మాత్రం టెడ్ దగ్గరే వదిలేసింది.

టెడ్ ఆఫీస్ జీవితంలో ఎంతో సాధించాడు. కుటుంబ జీవితంలో అంతా పోగొట్టుకున్నాడు. జొయన్నా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాక అతను మాత్రం రెక్కలు తెగిన పక్షిలా కూలబడ్డాడు.

రథముంది; సారధి లేడు. అయితే బతుకు బండి ఆగిపోతుందా? ఆగకూడదు, అనుకున్నాడు. లేచి నిలదొక్కుకున్నాడు. తన కొడుకు బిల్లీ తో కొత్త జీవితానికి నాంది పలికాడు.
జొయన్నా తిరిగొచ్చి బిల్లీ తనకు కావాలంటే న్యాయబద్ధమైన పోరాటం చేశాడు. భర్తగా ఫెయిలయినా తండ్రిగా నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు.

కలిసి పెంచిన కొడుకు బిల్లీ కోసం తల్లి జొయన్నా క్రేమర్, తండ్రి టెడ్ క్రేమర్ విడి విడిగా చేసిన న్యాయపోరాటమే “Kramer vs. Kramer”.

*****

ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆఫీస్ కి బయల్దేరడం. ఆఫీస్ లో సాయంత్రం దాకా పని చేసి ఇంటికి బయల్దేరడం. రాత్రి పడుకోవడం మళ్ళీ తిరిగి ఉదయాన్నే లేవడం – అదే రొటీన్ జీవితం; ప్రతి రోజూ పునరావృత్తమయ్యే ఒకే బోరింగ్ సన్నివేశం. అయినా మనిషి జీవించడం ఆగడు. జీవితంలో ఎదురయ్యే సరికొత్త పరిస్థుతుల ద్వారా దైనందిన జీవితమనే బోరింగ్ సన్నివేశాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటాడు.

కానీ మార్పుని అంత సులభంగా అంగీకరించలేడు మనిషి. కానీ అదే మనిషికి మార్పు సహజం అనీ తెలుసు; ఆ మార్పుకి అలవాటు పడడమూ తెలుసు – తరతరాలుగా ఇదే మనిషి జీవనసూత్రం.

Kramer vs. Kramer లో ఎన్నో అద్భుత సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా బిల్లీ ఎవరికి దక్కాలి అనే పోరాటంలో న్యాయవాదులు ఆ భార్యా భర్తలను ప్రశ్నించే కోర్ట్ రూం సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అయితే ఇదే సినిమాలో మరో సన్నివేశం చలనచిత్ర కళను చాలా కొత్తకోణాల్లో ఆవిష్కరించింది. టెడ్ మరియు బిల్లీల మధ్య నడిచే ఆ సన్నివేశమే ఈ వారం కీలక సన్నివేశం.

*****

జొయన్నా ఇంటినుంచి వెళ్లిపోయిన తర్వాత రోజు.

ఎప్పటిలానే బిల్లీ నిద్ర లేస్తాడు. బాత్ రూం కి వెళ్ళి పని చూసుకుని తల్లిదండ్రుల బెడ్ రూంలోకి వెళ్తాడు.

గుర్రుగా నిద్రపోతున్న టెడ్ ని నిద్ర లేపి “నాన్నా అమ్మెక్కడ?” అని అడుగుతాడు. టెడ్ బెడ్ మీద జొయన్నా లేకపోవడం చూసి ముందు రోజు రాత్రి ఆమె వెళ్లిపోవడం గుర్తుకువస్తుంది.

బిల్లీ ని సిద్ధం చేసి స్కూల్ కి పంపించాలి. ఈ లోగా తనూ సిద్ధమై ఆఫీస్ కి బయల్దేరాలి. వీటన్నింటికంటే ముందు ఇద్దరికీ బ్రేక్ ఫాస్ట్ తయారు చెయ్యాలని గుర్తుకొస్తుంది. హడావుడిగా లేచి, బిల్లీతో కలిసి వంటగదిలోకి వస్తాడు.

బ్రేక్ ఫాస్ట్ కి టెడ్ తనకు ఫ్రెంచ్ టోస్ట్ కావాలని అడుగుతాడు బిల్లీ.

“ఓహ్! అందులో ఏముంది” అంటూ నాలుగు కోడి గుడ్లు ఫ్రిజ్ లోనుంచి తీసి ఒక కప్పులో వాటిని పగలగొడ్తాడు. ఆ పగలగొట్టడంలో అంతా రభస రభస చేస్తాడు. ఆ తర్వాత బ్రెడ్ ని కప్పులో ముంచలేక రెండు ముక్కలు చేసి కప్పులో ముంచి ఫ్రెంచ్ టోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. తండ్రి చేష్టలను విచిత్రంగా చూస్తుంటాడు బిల్లీ.

మరో వైపు కాఫీ చేసుకునే ప్రయత్నంలో కావాల్సిన దానికంటే ఎక్కువ కాఫీ పొడి వేసి దాన్నీ చెడగొడతాడు టెడ్. ఈ లోగా స్టవ్ మీదున్న ఫ్రెంచ్ టోస్ట్ మాడిపోతుంది. దాన్ని ఆపే ప్రయత్నంలో చెయ్యి కాల్చుకుంటాడు.

టెడ్ అప్పటివరకూ “జొయన్నా లేకపోతే ఏంటి?” అనే అహాన్ని ప్రదర్శిస్తూ, తనకు కనీసం ఆమ్లెట్ వెయ్యడం కూడా రాదనే విషయం బిల్లీకి తెలియకూడదన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కానీ వంటింట్లో తన ఆటలు చెల్లవని తెలిసి నిస్సహాయంతో కోపోద్రేకుడవుతాడు.

http://www.youtube.com/watch?v=pmyfOquda-M
తల్లి జొయన్నా సంరక్షణలోనే బిల్లీ ఉండడం సరైనదని కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత రోజు.

బిల్లీకి పరిస్థితిని వివరిస్తాడు టెడ్. తండ్రిని వదిలి వెళ్లడం బిల్లీకి ఇష్టం ఉండదు. కానీ బిల్లీని సముదాయించి ఇంటికి తీసుకొస్తాడు టెడ్.
తండ్రీ కొడుకులు చివరిసారిగా వంటింట్లో బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తుంటారు.

టెడ్ గుడ్లను పగలగొట్టి ఒక పెద్ద గిన్నెలో వేస్తాడు. బిల్లీ ప్యాకెట్ లోనుంచి ఒక్కొక్క బ్రెడ్ తీసి గిన్నెలో వేస్తుండగా టెడ్ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తుంటాడు.

తండ్రీ కొడుకులు ఒకరికొకరూ సహకరించుకుంటూ ప్రశాంతంగా పని చేస్తారు.

ఇద్దరి మధ్యా నిశబ్దం. ఆ నిశబ్దం మాటున ఎన్ని అర్థాలో?

సన్నివేశం ఒకటే.

మొదటి సన్నివేశంలో, టెడ్ కేవలం పేరుకే మాత్రమే తండ్రి. భార్య ఇంటిని నడుపుతుంటే, తన ఆఫీస్ పనిలో నిమగ్నమై కుటుంబాన్ని పెద్ద పట్టించుకోని చాలామందు మధ్యతరగతి భర్త ఎలా అయితే ప్రవర్తిస్తాడో టెడ్ కూడా అలానే ప్రవర్తిస్తాడు.

రెండవ సారి వచ్చిన సన్నివేశంలో, తన కొడుకు బిల్లీ పెంపకంలో సంవత్సరం రోజులపాటు అలవాటు పడిన తండ్రి గా రూపాంతరం చెందుతాడు.

దీన్నే చలనచిత్ర రచనా విధానంలో సెటప్ & పేఆఫ్ అని అంటారు. మొదటి సన్నివేశంలో పెంపకం చేతకాని తండ్రిగా టెడ్ పాత్రని సెటప్ చేసి రెండు సన్నివేశంలో అతనిలో కలిగిన మార్పుని పేఆఫ్ చేస్తారు.

కేవలం కథాపరంగా మాత్రమే కాకుండా, టెక్నికల్ అంశాలైన ఎడిటింగ్, సినిమాటోగ్రఫీల కారణంగా కూడా ఈ సన్నివేశం సినిమాకి కీలకమవుతుంది.

ఈ సన్నివేశాలలో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొదటి సన్నివేశంలో షాట్స్ అమర్చిన తీరు చాలా వేగంగా ఉంటుంది. దాదాపు ప్రతి ఐదు సెకండ్లకూ షాట్ మారుతుండగా, ఫ్రెండ్ టోస్ట్ చేసే ప్రక్రియలో తండ్రీ కొడుకులు చేసే హడావుడితో పాటు, జొయన్నా వెళ్లిపోవడంతో అల్లకల్లోలమైన అతని మనస్సు ని ఈ విధంగా ఎడిటింగ్ ప్రక్రియలో తెలియచేస్తాడు దర్శకుడు.

అదే విధంగా రెండో సన్నివేశంలో, ఎడిటర్ పనితనం వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ తండ్రీ కొడుకులు మౌనంగా వంటగదిలో ఫ్రెంఛ్ టోస్ట్ తయారు చేస్తుంటారు. ఇక్కడ కట్స్ అసలే ఉండవు. ఒకే లాంగ్ టేక్ లో ఈ సీన్ ని తీయడం ద్వారా, టెడ్ మానసిక పరిస్థితి ఏ విధమైన గందరగోళం లేకుండా ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టుగా మనకి తెలియచేస్తాడు దర్శకుడు.

అదే విధంగా మొదటి సన్నివేశంలో కెమెరా బిల్లీ, టెడ్ ల మధ్య డైనమిక్ గా కదుల్తుంటుంది. కానీ రెండో సారి వచ్చే సన్నివేశంలో కెమెరా స్థిరంగా ఉంటుంది.

ముగింపు:
చివరకు బిల్లీ ని తల్లికి అప్పగించే సమయం వచ్చేస్తుంది. జొయన్నా ఇంటి దగ్గరకు వస్తుంది. తను కిందున్నానని, టెడ్ ని ఒంటరిగా రమ్మంటుంది.

బిల్లీ ని “ఇంటికి” తీసుకెళ్లానని వచ్చానని, కాకపోతే టెడ్ తో బిల్లీని చూసినప్పుడు బిల్లీ సరైన ఇంటిలోనే ఉన్నాడని చెప్తుంది. తను పెంచి పెద్ద చేసినప్పటికీ బిల్లీని చాలా బాగా చూసుకున్నాడని కాబట్టి టెడ్ దగ్గరే ఉండడం మంచిదని చెప్పడంతో కథ ముగుస్తుంది.

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు.

kramer-4

కలిపేదీ
విడదీసేదీ
ఆ పై వాడు.
కలిసి విడిపోవాల్సిందీ
విడిపోయి కలిసుండాల్సిందీ
మనం.