Menu

బెలా టర్ – ఒక పరిచయం

హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 25 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ Cannes 2007 లో తన సినిమా Man from London ప్రదర్శనతోనూ,బెర్లిన్ ఫెస్టివల్ 2011 లో టూరిన్ హార్స్ సినిమాతో ఉత్తమ చిత్రం అవార్డ్ పొందాక ఈయన గురించి చాలా మందికి తెలిసివచ్చింది.

1955లో హంగరీ దేశంలో జన్మించిన Bela Tarr 22 ఏళ్ళ వయసులోనే తన తొలి సినిమా , Family Nest ద్వారా 1977లో సినీ జగత్తులో మొదటి అడుగు వేశారు. ఆ తర్వాత 1981లో The Outsider మరియు 1982లో The Prefab people సినిమాల ద్వార తన సినీ పయనంలో మొదటి మజిలీ పూర్తి చేశారు. అటు పిమ్మట 1988లో Damnation, 1994లో Satantango, 2000లో Werckmeister Harmonies సినిమాల ద్వారా తన రెండో మజిలీని పూర్తిచేసి 2007లో The Man from London అన్న సినిమా ద్వారా Cannes ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సినిమా విభాగంలో ప్రపంచం లోని అత్యుత్తమ దర్శకులతో పోటీపడి, ఆ తర్వాత Turin Horse సినిమాతో బెర్లిన్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డు పొందారు.

బెలా టర్ సినిమాలు, దర్శకత్వ శైలిని విశ్లేషించడమే ఈ వ్యాసంయొక్క ఉద్దేశం.

కమ్యూనిస్టు పరిపాలనలో హంగరీ ప్రజలనుభవించిన కష్టాలను కళ్ళకు కట్టేలా Family Nest చిత్రాన్ని రూపొందించారు. ఇళ్ళు కొరత కారణంగా పెళ్ళై పిల్లలు కలిగిన ఒక భార్యాభర్తల జంట, భర్త తల్లిదండ్రుల ఇంట్లో ఆవాసం పొందాల్సి వస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కడికో వెళ్తుందని, ఎవరితోనో తిరుగుతుందని తన కొడుకు తలకెక్కిస్తాడు తండ్రి. దీని ఫలితంగా ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలోని ముఖ్య కథ.

Family Nestలో లాగా The Outsider సినిమాలో కూడా కమ్యూనిస్టు పాలనలో వ్యర్ధమైన జీవితాన్ని తెరపైకెక్కించారు Bela Tarr. వయొలిన్ వాయించుకు తిరిగే ఒక వ్యక్తి కథ ఇది. జీవితం మీద వైరాగ్యం, విరక్తి తో సొంత భార్యా బిడ్డలనే గాలికొదిలేస్తాడు. కమ్యూనిస్టుల జులుం నుంచి తప్పించుకునే మార్గం లేక తాగుడుతో తన బాధలు మరవాలనుకుంటాడు. ఇతన్ని భరించలేని భార్య అతని సోదరునితో వెళ్ళిపోతుంది. చివరకు బ్రతుకే భారం చేసుకుంటాడు.

అంతకముందు తీసిన రెండు సినిమాల్లాగానే The Prefab People సినిమాలో కూడా హంగరీలోని జీవన పరిస్థితులను మరోసారి హృద్యంగా తెరకెక్కించారు Bela Tarr. ఓవర్ టైం పని చేస్తూ ఇంటికి ఏ రాత్రో చేరుకునే భర్త గురించి ఎదురు చూసే భార్య , పని చేయగా వచ్చిన అలసటను తీర్చుకోడానికి స్నేహితులతో పార్టీలు, షికార్లు చేసే భర్త ల కథ ఈ సినిమా. పని ఒత్తిడీ, ఇంట్లో విసుగు లాంటి అంశాలు ఆ భర్తను మరో దేశంలో ఉద్యోగం వెతుక్కుని అక్కడికి పారిపోవాలనుకునేలా చేస్తాయి. కాని సినిమా చివర్లో అతనా ఆలోచన మానుకుని తన భార్యతో పాటుగా కొత్త వాషింగ్ మెషీన్ కొనుక్కుని ఇంటికి రావడంతో సినిమా ముగుస్తుంది.

పైన పేర్కొన్న మూడూ సినిమాలు కూడా Documentary Fiction శైళిలో రూపొందించారు Bela Tarr.కల్పిత కథను నిజ జీవితంలో జరిగినట్టుగా చిత్రీకరించడమే ఈ చిత్రాల యొక్క ప్రత్యేకత.

Documentary Fiction శైళిలో ని ముఖ్య అంశాలు:

-Non Professional నటీనటులను ఉపయోగించడం.
-ముందుగానే ప్లాను చేసుకున్న Storyboard ప్రకారం సీన్లను చిత్రీకరించడం.
-నటీ నటుల మానసిక స్థితి, సీను యొక్క అవసరాన్ని బట్టి సంభాషనలను మనోధర్మం (improvise)చేయడం.
-Hand held కెమెరా ఉపయోగించడం లాంటి ప్రక్రియలు ఈ రకమైన సినిమాలో ముఖ్యమైన అంశాలు. దీనినే cinema varite(యధార్ధ సినిమా) అని కూడా అంటారు.

http://www.youtube.com/watch?v=gy4IbTjhffE

సమకాలీన పరిస్థితులను, దేశప్రజల స్థితి గతులను ఉన్నదున్నట్టుగా కథారూపంలో తెలియచెప్పడమే లక్ష్యంగా ఎక్కడా రాజీపడకుండా సెల్ల్యులాయిడ్ పైకెక్కించారు Bela Tarr. ఈ మూడు సినిమాల తర్వాత Bela Tarr తన దర్శకత్వ శైళిని పూర్తిగా మార్చుకున్నారు. Cinema Varite నుంచి Experimental సినిమావైపు Bela Tarr దృష్టి పెట్టడం హఠాత్ పరిణామం కాదు. ఈ పరివర్తనం అతని మూడో సినిమా అయిన Prefab People లోని చివరి సీన్లోనే మొదలయిందని చెప్పాలి. కొన్ని నిమిషాల నిడివికలిగిన దీర్ఘమైన షాట్ తో ఈ సినిమాను ముగిస్తూ తన కొత్త శైళిని ఆవిష్కరించారు. అంతక ముందు వరకు పక్కింటి వాళ్ళ కిటికీలోకి తొంగిచూసి వాళ్ళ రహస్య జీవితాలను మనముందుకు తెచ్చే లాగా క్లోజప్ షాట్స్ తో నిండి పోయిన Bela Tarr సినిమాలు రాను రాను పరిపక్వత చెంది జీవితాన్ని నిర్వివేచనతో చూసినట్టుగా ఉంటాయి. షేక్స్పియర్ డ్రామా Macbeth ను 67నిమిషాల నిడివితో కేవలం రెండే షాట్లతో చిత్రీకరించి కొత్త శైళికి మార్గం ఏర్పరుచుకున్నారు.

Macbeth తర్వాత Bela Tarr రూపొందించిన Damnation, Satantango, Werckmeister Harmonies చిత్రాలు Bela Tarr కెరీర్ లో ముఖ్యమైనవి.

Damnation సినిమాలో Karrer అనే వ్యక్తి తన రోజులను వ్యర్ధంగా గడుపుతూ సాయంత్రమ్య్యే సరికి టైటానిక్ అనే బార్ కి చేరుకుని మందు కొడుతూ కాలం గడుపుతూ అక్కడ పాటలుపాడే యువతితో ప్రేమలో పడతాడు. ఆమె భర్త సెబాస్టియన్ ను పని మీద వేరే చోటుకి పంపేలా చేసి ఆమెతో శృంగారం వెలగబెడతాడు. తిరిగొచ్చిన సెబాస్టియన్‌తో గొడవపడి జీవితం మీద విరక్తితో వీధిన పడతాడు.

Damnation తర్వాత Bela Tarr, Krasznahorkai రచించిన నవల ఆధారంగా Satantango అనే చిత్రాన్ని రూపొందించారు. షుమారు ఏడు గంటలకు పైగా నిడివికలిగిన ఈ సినిమా నిర్మాణం ఐదారేళ్ళపాటు వీరు జరిపిన నిర్విరామం కృషి ఫలితం. ఇంతటి ధీర్ఘకాలమైన కాల పరిమితి కలిగిన సినిమాని ప్రదర్శించడానికి ఎవరూ ముందుకు రారని, కనీసం TVలో కూడా ప్రదర్శనకు అణువు కాదని తెలిసి కూడా ఈ సినిమాను నిర్మించారంటే కళపై ఆయనకున్న శ్రధ్ధను మనమర్థం చేసుకోవచ్చు.

Satantango తర్వాత Bela Tarr తీసిన మరో సినిమా, Werckmeister Harmonies, Krasznahorakai నవల The melancholy of Resistance అధారంగా రూపొందించబడింది. కథా పరంగా ఉద్వేగభరితమైన అంశాలేమీ లేనప్పటికీ Bela Tarr తన సినిమాల ద్వారా ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఈ మూడు చిత్రాల ద్వారా తన సినిమాలకొక కొత్త శైళిని కనిపెట్టారు Bela Tarr. అందులోని కొన్ని ముఖ్యాంశాలు:

-Black and White లో సినిమాలను రూపొందించడం.
-సినిమాలోని షాట్లు దీర్ఘమైన కాలపరిమితి కలిగివుండడం.
-దృశ్య చిత్రీకరణ నిజజీవితానికి దగ్గరగా వుండడం.

Damnation చిత్రం తర్వాత Bela Tarr రూపొందించిన చిత్రాలన్నీ పైన పేర్కొన్న అంశాలన్నీ కలిగివుంటాయి. షుమారు ఏడు గంటలపాటు సాగే Satantango సినిమాలో 40కి మించి షాట్లు లేవంటేనే అతని శఈళిని అర్థం చేసుకోవచ్చు. అలాగే Bela Tarr దర్శకత్వం వహించిన లఘు చిత్రం Visions of Europe (The Prologue) లో కథంతా 5 నిమిషాలపాటు సాగే ఒకే షాట్ లో జరుగుతుంది. నిజానికి సినిమా రీలు 11 నిమిషాల కాల పరిమితి ఉండబట్టి సరిపోయింది గానీ లేదంటే సినిమా మొత్తాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించే వాడేమో! దీర్ఘమైన కాల పరిమితి కలిగినంత మాత్రాన కెమెరా స్విచ్ ఆన్ చేసి పది నిమిషాల పాటు ఒకే దగ్గర నిలకడగా ఉంటుందనుకుంటే పొరపాటే. షాట్ పరిమితి పొడవైనప్పటికీ స్టెడీ కాం విధానం తో కెమెరా పాత్రల చుట్టూ తిరుగుతూనే వుంటుంది.

Bela Tarr తీసిన The Man from London అనే సినిమా ఈ మధ్య జరిగిన చాలా Film Festivalస్ లో ప్రదర్శింపబడింది. గతంలో మాదిరిగానే ఈ సినిమా నిర్మాణంలో కూడా Bela Tarr ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఈ సినిమా నిర్మాణం మొదలయిన కొన్ని రోజులకు నిర్మాత మరణించడంతో ఆగిపోయిన సినిమా ఆ తర్వాత అందిన ఆర్థిక సహాయంతో రెండేళ్ళ తర్వాత పూర్తి చేయబడింది. Georges Simenon రచించిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఆకస్మాత్తుగా ఒక సూట్‌కేసులో డబ్బులు దొరికిన ఒక మధ్య వయస్కుని కథ. ఇంకా విడుదలకాని ఈ సినిమా ఎప్పుడెపుడా అని Bela Tarr అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన సమీక్షలను బట్టి చూస్తే ఈ సినిమా ఈయన గత సినిమాలంత తీవ్రంగా లేకపోయినా బాగానే వుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Bela Tarr సినిమాలు చూసిన చాలామంది బోరుకొట్టినట్టుగా అనుభూతి పొందుతారు. అందుకు కారణం గతంలో ఇలాంటి సినిమాలు ఎవ్వరూ తీయకపోవడం, యధార్ధానికి కల్పనకు మధ్య ఉన్న యెల్లలు చెరిపేసినట్టుండే ఈయన సినిమాలు అసమనామైనవి. Bela Tarr సినిమాల గురించి Gus Van Sant అనే మరో దర్శకుడూ ఇలా అంటారు, “He learnt cinema from its origin as if Modernist Cinema never existed.” Bela Tarr సినిమా Satantango చూసిన Susan Sontag ఇలా అన్నారు, “Devastating, enthralling for every minute of its seven hours. I’d be glad to see it every year for the rest of my life.”

అయితే Turin Horse తర్వాత బెలా టర్ సినిమాలు తీయడం ఆపేస్తున్నానని, ఒక ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని పేర్కొనడం కాస్తా ఆనందం, కాస్తా విచారం కలిగించే విషయం.

“I’m not a filmmaker anymore, I had a feeling the work is done. Ready. No reason to repeat anything, no reason to make copies of this language or these feelings, because I want to protect it. From myself too. And I really want to give it to you. We created it take it or leave it. And that’s all. And I think it’s enough for me.” —Bela Tarr

4 Comments
  1. Sowmya July 3, 2008 /
  2. bhanu prakash July 3, 2008 /