Menu

వుడి ఎలెన్ తో కాసేపు

పరిచయం: Woody Allen గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటాను. గత నలభై ఏళ్లుగా నలభై కి పైగా సినిమాలు తీసి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉడీ ఆలెన్ మాటల్లో సినిమా దర్శకత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. ఉడీ అలెన్ తరహా సినిమాలు (Woody Allenesque Films) అనే ఒక ప్రత్యేక జాన్రా సినిమాలు ఆయన స్వంతం. ఉడీ అలెన్ సినిమాలు చూసిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో వేగంగా సినిమా నిర్మాణం చేయడం ఈయన ప్రత్యేకత.

సీన్ మధ్యలో కట్ చేయకపోవడం, లాంగ్ టేక్ షూటింగ్, ఒకే సీన్ ని వివిధ యాంగిల్ లో షూట్ చెయ్యకపోవడం, ట్రాక్ ఇన్ కంటే జూమ్ కి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి ఆల్టర్నేట్ సినిమా టెక్నిక్ ద్వారా కంట్రోల్డ్ బడ్జెట్ లో సినిమా తీయగలుగుతున్నాడు కాబట్టే ఉడీ ఆలెన్ దాదాపు డెభ్భ్హై ఐదేళ్ల వయసులో కూడా ఈ రోజుకీ సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఉడీ అలెన్ సినిమాల ద్వారా ఔత్సాహిక దర్శకులు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డైలాగ్, కామెడీ ప్రధానంగా నడిచే తెలుగు సినిమా దర్శకులకు ఉడీ అలెన్ సినిమాటిక్ టెక్నిక్ ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా Ctrl+Alt Film కోసం ఉడీ అలెన్ మాస్టర్ క్లాస్ ఆధారంగా రాసిన ఈ వ్యాసం మీ అందరి కోసం.

ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం గురించి: నేనెప్పుడూ ఫిల్మ్ మేకింగ్ ఎక్కడా నేర్చుకోలేదు, నేర్పించాలనీ అనుకోలేదు.మిత్రుడు స్పైక్ లీ ఒక సారి-హార్వర్డ్ యూనివర్శిటి లో అతను టీచ్ చేసే క్లాస్ లో టీచ్ చెయ్యమని అడిగారు. మొదట నా వల్ల కాదన్నాను కానీ ఎలాగో కష్టపడి ఒక క్లాస్ చెప్పాను కానీ చివరికి నా వల్ల కాదని తెలిసిపోయింది. నా వల్లే కాదు అసలు ఎవరైనా ఫిల్మ్ మేకింగ్ ఎలా టీచ్ చెయ్యగలరో నాకర్థం కాదు. There’s so little you can teach about making a film!

ఎవ్వరినీ డిసప్పాయింట్ చెయ్యడానికి చెప్పడం లేదు కానీ, నా దృష్టిలో “You either have it or you don’t”. ఒక వేళ మీలో దర్శకుడు కావడానికి కావాల్సిన ’అది’ (అదేంటో నాకూ తెలియదు) లేకపోతే జీవితాంతం ఫిల్మ్ స్కూల్ లో గడిపినప్పటికీ మీకు సినిమా సరిగ్గా ఎలా తీయాలో నేర్చుకోలేక పోవచ్చు. ఒక వేళ మీలో ’అది’ ఉంటే మాత్రం చాలా త్వరగా నేర్చుకునే అవకాశం ఉండొచ్చు.

ఫిల్మ్ మేకర్ కి కావాల్సినవి/నేర్చుకోవాల్సినవి: ఒక ఫిల్మ్ మేకర్ ముందుగా తనని తాను సైకలాజికల్ గా చాలా స్టేబుల్ గా, బ్యాలెన్సెడ్ గా ఉంచుకుంటూ, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది గొప్ప ప్రతిభ ఉన్న వాళ్లు కూడా ఒక్కో సారి మానసిక ఆందోళన, తమ టాలెంట్ మీద తమకే అనుమానం, ఛాన్స్ ల కోసం ఆత్రుత,అవి వస్తాయో రావో అనే బెంగ, ఇవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ల గొడవలు లాంటి కారణాల వల్ల వారి జీవితాల్ని నాశనం చేసుకున్నారు. అందుకే క్రమశిక్షణ కలిగిన జీవితం సినిమా వాళ్లకి చాలా అవసరం.

ఐడియాస్ ఎక్కడ్నుంచి వస్తాయి: అలాగే నేను నా సినిమాలో ఉపయోగించిన కొన్ని టెక్నిక్స్ గురించి నన్ను చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు Annie Hall సినిమాలో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి ప్రేక్షకులతో డైరెక్ట్ గా మాట్లాడాలనే ఐడియా నాకెలా వచ్చిందని చాలామంది అడిగారు.

నా దృష్టిలో సహజంగా (instinct) వచ్చే ఐడియాలే చాలా మంచివి. మన instinct ని మనం ఫాలో అవ్వాలి. అంతే కానీ ఐడియాస్ రావడానికి ఏదో గొప్ప పద్ధతి ఉందని దాని కోసం ఎదురుచూస్తూ కోర్చోకూడదు. మీలో క్రియేటివ్ టాలెంట్ ఉంటే అవి చాలా సులభంగా ఐడియాస్ మీలోనుంచి బయటపడతాయి లేదంటే కొంచెం కష్టమే!

నా సినిమాలకు నేనే రచయితను: ప్రపంచంలో రెండు రకాల దర్శకులు ఉంటారు. ఒకరు వేరెవరో రాసిన స్క్రీన్ ప్లే ని సినిమాగ తీస్తారు. మరొకరు తమ సినిమాలకు తామే స్క్రిప్ట్ రాసుకుంటారు. ఇద్దరిలో ఏ రకం దర్శకులు గొప్ప అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. నేను మాత్రం రెండో రకం దర్శకుల కోవకు చెందినవాడిని.

తను తీసే సినిమాకి తనే స్క్రీన్ ప్లే రచించినప్పుడు ఆయా సినిమాల్లో ఒక రకమైన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తమై అలాంటి సినిమాల ద్వారా ఆ దర్శకుడి సినిమాలకు ఒక రకమైన శైలి ఏర్పడుతుంది. అంతే కాకుండా దాదాపు అన్ని సినిమాల్లోనూ కొన్ని అంశాలు మరియు ప్రత్యేకమైన విషయాల ప్రస్తావన తరచుగా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి దర్శకులకు ప్రేక్షకులతో ఒక ప్రత్యేక బంధం ఏర్పడే అవకాశం ఉంది. అదే మొదటి రకం దర్శకులకు ఇలాంటి అనుబంధం ఏర్పరుచుకోవడం కొంచెం కష్టమైన పనే అని నాకు అనిపిస్తుంది. కానీ తన స్క్రిప్ట్ తానే సొంతంగా రాసుకున్నంత మాత్రాన ఈ బంధం ఏర్పడుతుందనే నమ్మకం కూడా లేదు. ఆసక్తికరంగా లేని స్క్రిప్ట్ మనమే సొంతంగా రాసుకోవడం కంటే వేరెవరో రాసిన మంచి స్క్రిప్ట్ ని తెరకెక్కించడమే ఒక్కోసారి మంచిది.

ఇవి కాకుండా దర్శకుడిగా నాకంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి దర్శకుడు కూడా సినిమాని ముందుగా తనకి నచ్చేవిధంగానే తీసుకోవాలి. సినిమా నిర్మాణం జరిగే అద్యంతం దర్శకుడే మాస్టర్/కెప్టెన్ గా నిలబడాలి. అదీ కాక మనకు నచ్చేలా తీస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులకైనా నచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రేక్షకులు ఇది నచ్చుతారేమో, ఇది నచ్చరేమో అని ఊహించుకుంటూ సినిమా తీయడమంతా ఘోరతప్పిదం ఏదీ ఉండదు.

షూటింగ్ ముందు సన్నాహాలు: నా వరకూ నేను సెట్ లోకి అడుగుపెట్టే వరకూ నాకు అసలు ఏమీ తెలియదు; తెలుసుకోవాలని ప్రయత్నించను. అంటే ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కొంతమంది సెట్ లో ఏమేం చెయ్యాలో, ఏ లెన్స్ ఉపయోగించాలి, ఏ షాట్ లో కెమెరా ఏ యాంగిల్ లో పెట్టాలి అని ముందే బాగా ప్లాన్ చేసుకుని సెట్ లోకి వస్తారు. నా పద్ధతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, నాదే సరైన పద్ధతి అని కాదు.

షూటింగ్ కి వచ్చే వరకూ నాకసలు ఏ విధమైన ఐడియా ఉండదు. రిహార్సల్స్ చేపించడం కూడా నాకు నచ్చదు. ఉదయాన్నే లేచి, ఆ రోజు నేనున్న మూడ్ ని బట్టి ఎలా షూట్ చెయ్యాలో డిసైడ్ చేసుకుంటాను. కానీ మీ అందరికీ నేనిచ్చే సలహా ఏంటంటే మీరు నా పద్ధతి ఫాలో అవ్వకపోతే మీకే మంచిది. ఇలా పని చెయ్యడం నాకు అలవాటు కాబట్టి నేనిలానే చేస్తాను. మీరూ ఇలానే చెయ్యాలంటే బహుశా మీకు వర్కవుట్ కాకపోవచ్చు.

షూటింగ్ చేసే పద్ధతి: ఇక్కడ కూడా నా స్టైల్ చాలా మంది దర్శకులకంటే వేరుగా ఉంటుంది. చాలామంది దర్శకులు యాక్టర్స్ ని రిహార్సల్ చేపించి వారి నటనకు తగ్గట్టుగా కెమెరా సెటప్ చేస్తారు. కానీ నేను ముందు కెమెరా సెటప్ చేసి యాక్టర్స్ ని ఆ ఫ్రేములో ఇమిడిపోయేలా చెయ్యడాని ప్రయత్నిస్తాను. ఒక విధంగా నా విధానం నాటకానికి దగ్గరగా ఉంటుంది.

నేను సీన్ కవరేజ్ కోసం ఆ యాంగిల్, ఈ యాంగిల్ అంటూ ఎక్కువ షాట్స్ తియ్యను. వీలైనంతవరకూ కట్ లేకుండా లాంగ్ టేక్ లో సీన్ ఫినిష్ చెయ్యడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. కట్ చెయ్యాల్సిన అవసరం రానంతవరకూ నేను సీన్ ని కట్ చెయ్యను. ఒకే సీన్ ని వివిధ యాంగిల్స్ లో షూట్ చెయ్యడం కూడా నాకంత ఇష్టం ఉండదు. ఒక వేళ నేను కట్ చేసినా అంతకుముందు షాట్ ఎక్కడైతే కట్ చేసానో అక్కడ్నుంచే మరో యాంగిల్ లో మొదలుపెడ్తాను. ఆ విధంగా యాక్టర్స్ అంతకుముందు షాట్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని ఎక్కువ అలోచన లేకుండా ప్రతి సారీ ఫ్రెష్ గా నటించే అవకాశం ఉంది.

కామెడీ గురించి: కామెడీ సినిమా చేయడం చాలా కష్టం. కెమెరా అనవసరంగా మూవ్ చేసినా, అనవసరంగా షాట్ కట్ చేసినా you will kill the laugh. కామెడీ రియల్ గా, సింపుల్ గా మరియు క్లియర్ గా ఉండాలి. నా వరకూ నేను సీన్ మధ్యలో కట్ చేయడానికి ఇష్టపడను. అందుకే నేను ఎక్కువగా జూమ్ లెన్స్ వాడుతుంటాను. ఈ విధంగా ఒక వ్యక్తి క్లోజప్ కావాలంటే జూమ్ చేస్తాను. తిరిగి మిడ్ షాట్ కావాలంటే జూమ్ బ్యాక్ చేస్తాను. ఈ టెక్నిక్ ద్వారా నేను సెట్ లో సీన్ షూటింగ్ సమయంలోనే ఎడిటింగ్ చేసేస్తాను. ఈ పద్ధతినే ఇన్ కెమెరా ఎడిటింగ్ అంటారు. ఇదే ఎఫెక్ట్ డాలీ (ట్రాక్) ఇన్, డాలీ ఔట్ ద్వారా కూడా సాధించవచ్చు కానీ ఇక్కడే జూమ్ కి డాలీ కి ఒక తేడా ఉంది. ముఖ్యంగా డాలీ చెయ్యగలిగినంత స్థలం సెట్ లో ఉండకపోవచ్చు. అలాగే జూమ్ కాకుండా డాలీ చెయ్యగానే కెమెరా ని మూవ్ చేస్తాం. ఆ విధంగా మనం అనవసరంగా లేని ఇంపాక్ట్ ని ఆ షాట్ లేదా సీన్ కి ఆపదిస్తున్నాం అని నేననుకుంటాను. ఒక వేళ మీరు అది కావాలనే చేస్తే ఫర్వాలేదు. కానీ కేవలం ఒక వస్తువు లేదా వ్యక్తి/పాత్రను మరింత దగ్గరగా చూపించడమే లక్ష్యమైతే జూమ్ చెయ్యడమే మంచిదని నా అభిప్రాయం. లేదంటే కెమెరా మూవ్ చేసి ట్రాక్ ఇన్ చెయ్యడం ద్వారా ప్రేక్షకులకు “ఇది చూడండి. చూడండి” అని అరిచి మరీ చెప్తున్నట్టుగా ఉంటుంది.

నియమాలు ఉన్నది అతిక్రమించడానికే: చాలా రోజుల వరకూ నేను ఒక పాత్రను పరిచయం చేయాలంటే చాలా స్క్రీన్ టైం అవసరమనుకునే వాడ్ని. కానీ ఒక పాత్ర కారు ఎక్కడం, ఒక బిల్డింగ్ లోనుంచి బయటకు రావడం వంటి సాధారణ దృశ్యాల ద్వారా కూడా ఒక పాత్రను క్రియేట్ చెయ్యొచ్చు అని నేను Zelig సినిమా చేసినప్పుడే తెలుసుకున్నాను.

అలాగే Husbands and wives సినిమా తియ్యకముందు వరకూ నేనిదివరకూ చెప్పిన రూల్స్ ఫాలో అయ్యేవాడిని. కానీ ఈ సినిమాలో నేను మొదటి సారిగా నేను కెమెరా ని బాగా మూవ్ చేశాను. అంతకుముందు ఎందుకు చెయ్యలేదంటే అప్పుటకి నేను కెమెరా మూవ్ మెంట్ కి సంబధించినంతవరకూ పెద్దగా అనుభవం లేదు. అదీ కాక అంతకు ముందు నేను ఎక్కువగా పని చేసిన సినిమాటోగ్రాఫర్ గార్డన్ విల్స్ సీన్ ఎలా లైట్ చేస్తాడంటే, కొంచెం అటూ ఇటూ కెమెరా జరిపామంటే లైట్స్ ఫ్రేమ్ లోకి వచ్చేస్తాయి. కానీ ఆ తర్వాత నేను కార్లో డి పామా అనే సినిమాటోగ్రాఫర్ తో పని చెయ్యడం మొదలుపెట్టాను. అతనితో పని చెయ్యడం మొదలుపెట్టాక కెమెరా మూవ్ మెంట్ చెయ్యడం ద్వారా కొత్త అనుభూతులు కల్పించవచ్చని అర్థమైంది. కేవలం సీన్ సినిమాటిక్ గా ఉండటానికోసమే కాకుండా పాత్ర యొక్క అంతర్గత స్థితి ని తెలియచేయడానికి కూడా కెమెరా మూవ్ మెంట్ అవసరం అనిపించింది. అయినప్పటికీ ఇక్కడ కూడా నేను సీన్ అనవసరంగా కట్ చేయడం, మ్యాచ్ కట్ లు, వివిధ యాంగిల్స్ లో ఒకే సీన్ ని తియ్యడం లాంటి నియమాలను మాత్రం పెద్దగా అతిక్రమించలేదనే చెప్పాలి.

యాక్టర్స్ ని డైరెక్ట్ చెయ్యడం ఎలా?: నాకు యాక్టర్స్ ని అతిగా డైరెక్ట్ చెయ్యడం ఇష్టం ఉండదు. వాళ్ల పని వాళ్లు చేసుకోమని చెప్తాను. కాకపోతే అలా చెయ్యడానికి మంచి టాలెంట్ ఉన్న నటీనటులకు ఎన్నుకోగలగాలి. అప్పుడే వాళ్ల పని వాళ్లు సరిగ్గా చేస్తారు. చాలా మంది యాక్టర్స్ ని ఓవర్ డైరెక్ట్ చేస్తారు. అలాగే పాత్ర గురించి, పాత్ర స్వభావం గురించి అతిగా చర్చిస్తూ, ఇంటలెక్చువలైజ్ చేసుకుంటే పోతే పాత్ర లోని spontaneity పోతుందనిపిస్తుంది. అలాగే నటీనటూలు లాంగ్ షాట్స్ లో బాగా నటిస్తారని నేను నమ్ముతాను.

ఈ తప్పులు చెయ్యకపోతే మేలు: మీ విజన్ కి సరిపడనిది ఏదైనా కూడా మీ సినిమాలో ఉపయోగించకండి. అంటే ఉదాహరణకు సినిమా మధ్యలో ఒక మంచి ఐడియా, లేకపోతే వెరైటీ కోసం ఏదో ట్రై చెయ్యాలనిపిస్తే ఆ కోరికను ఆపుకోండి. అలా అని మార్పులు చేయకూడదని కాదు. సినిమా అనేది చెట్టు లాంటిది. మొదట విత్తనం నాటాక అది కొంచెం కొంచెంగా ఎదగాలి. దానితోపాటే దర్శకుడు కూడా ఎదగినప్పుడే ఫలితాలు బావుంటాయి.

ఇతరుల అభిప్రాయలకు విలువనివ్వకపోవడం అంత మంచిది కాదు. ఇతరులు చెప్పిన వాటిని ఒప్పుకోండి అలాగే వారి ఐడియాస్ ని అభినందించండి.

అలాగే పూర్తిగాని స్క్రిప్ట్, మరియు వీక్ స్క్రిప్ట్ తో సినిమా మొదలు పెట్టడమంతా ఘోరమైన తప్పు మరొకటి ఉంటుంది.

చివరి మాట: కాబోయే దర్శకులకు నేను చెప్పే ముఖమైన సలహా ఒకటుంది. సినిమా గురించి మనకు అంతా తెలుసనే భ్రమలో ఉండకండి. ఇవాళ కూడా నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీస్తున్నాను. ఇప్పటికి ఎన్నో సినిమాలు తీశాను. అయినా కూడా ఇవాళ కూడా నేను తీసిన సినిమాలకు ప్రేక్షకులనుంచి వచ్చే స్పందన చూసి ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఒక్కోసారి వారి స్పందన చూసి షాకి కూడా గురవుతాను. ఒక్కోసారి నేను క్రియేట్ చేసిన పాత్ర ని ప్రేక్షకులు తమతో identify చేసుకుంటారనుకుంటాను. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆడియన్స్ పడి పడీ నవ్వుతారనుకున్నచోట నిశబ్దంగా ఉంటారు. అలాగే ఇక్కడేమంత పెద్ద రెస్పాన్స్ ఉండదు లే అనుకున్న చోట పడి పడి నవ్వుతారు. ఒక విధంగా ఇదంతా చాలా చిరాకు కలిగిస్తుంది. కానీ వీటన్నింటి వల్లే సినిమా దర్శకత్వం అనేది చాలా మ్యాజికల్ గానూ, ఆశ్చర్యకరంగానూ, మరియి ఆనందభరింతంగానూ ఉంటుంది. ప్రేక్షకులకు ఏం కావాలి, సినిమా ఎలా తీయాలి అనే నాకు అన్నీ తెలిసుంటే నేను సినిమాలు తీయడం ఎప్పుడో మానేసే వాడిని. అది తెలియకే ఇప్పటికే ఈ తంటాలు.

 

2 Comments
  1. VENKAT June 19, 2012 /
  2. Swathi June 21, 2012 /