Menu

Wild Strawberries

జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు; వాటిలో చిక్కుకుంటే అంతే !

సమయానికి అర్థం లేని చోట,
బీటలు వారిన శిధిలాల నడుమ,
అతను నడుస్తున్నాడు.

వీధి నిండా ఏకాంతం.
గడియారంలో ముళ్లు లేవు.
తోడు కోసం అతని అన్వేషణ

జ్వరాల గుర్రాల బండికి సందు చేసింది దారి.
బండిలోనుంచి జారిపడిందో శవపేటిక
శవం అతని చెయ్యిపట్టుకు లాగుతోంది….

ఉలిక్కిపడి నిద్రలేచాడు ప్రొఫెసర్ బోర్గ్. ఇంకొద్ది గంటల్లో అతను స్టాక్‍హోమ్ నుంచి విమానంలో బయలుదేరి లుంద్ పట్టణానికి చేరుకోవాలి. కానీ వేకువజామునే వచ్చిన వింత స్వప్నమేదో అతనికి లోలోపల భయాన్ని సృష్టించింది. మరణానికి చేరువలో ఉన్న 78 ఏళ్ల బోర్గ్ కి విమానంలో వెళ్లడం సరికాదని అనిపించింది. యాభై ఏళ్ల పాటు వైద్య విద్యకు బోర్గ్ చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం ఆ సాయంత్రం లుంద్ పట్టణంలో అతనికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఆ వేకువ జామునే తన కోడలితో కలిసి కారులో లుంద్ పట్టణానికి ప్రయాణం మొదలుపెట్టాడు ప్రొఫెసర్ బోర్గ్. ఆ క్షణంలో అతనికి తెలియదు – ఈ ప్రయాణం తన జీవితంలోనే ఒక ముఖ్య ఘట్టమని!

*****

పరిచయం

సినిమా అనేది ఒక సాంకేతిక పరిజ్ఞానం గా మొదలై, ప్రజలకు వినోదం అందించే ఒక సాధనంగా స్థిరపడిపోయే క్రమంలో కొంతమంది ప్రతిభావంతులైన దర్శకుల చేతిలో సినిమా సకల కళలకు ఆవాలమైన అరవై ఐదో కళగా ఆవిర్భవించింది. అటువంటి ప్రతిభ కలిగిన దర్శకుల్లో ఎప్పటికీ చెప్పుకోబడే పేరు – ఇంగ్మర్ బెర్గ్‌మన్. ఈయన గొప్పదనం చెప్పుకోవాలంటే 2007 లో బెర్గ్‌మన్ చనిపోయిన క్షణాన్ని ఎంతో మంది సినీ క్రిటిక్స్ “end of cinema” గా ప్రకటించారు.

స్వీడన్ దేశానికి చెందిన ఈ దర్శకుడు ఎన్నో కళాఖండాలను రూపొందించారు. సినిమా కళ ఆవిర్భవించిన ఈ వందేళ్లలో ప్రపంచం యావత్తూ వచ్చిన కొన్ని లక్షల సినిమాల్లో నేటికీ అత్యుత్తమమైన సినిమాల జాబితాలో చోటు దక్కించుకునే సినిమా “వైల్డ్ స్ట్రాబెర్రీస్”. ఇంగ్మర్ బెర్గ్‌మన్ రూపొందించిన సినిమాల్లోకెల్లా అత్యుత్తమైన సినిమాల్లో ఇది ఒకటి.

కథగా చెప్పాలంటే “వైల్డ్ స్ట్రాబెర్రీస్” లో పెద్ద ఏమీ ఉండదు. ముందే చెప్పుకున్నట్టు ప్రొఫెసర్ బోర్గ్ తనకి ఇవ్వబోయే గౌరవ పురస్కారాన్ని అందుకోడానికి కారులో స్వీడెస్ లోని ఒక పట్టణం నుంచి మరో పట్టణాన్ని చేసే ప్రయాణమే “Wild Strawberries” అనబడే ఈ “రోడ్ మూవీ” యొక్క కథాంశం. దారి మధ్యలో బోర్గ్ తో ప్రయాణించే కొంతమంది ప్రయాణికులు- వారితో బోర్గ్ అనుభవాలతో పాటు, మార్గమధ్యంలో తన చిన్నప్పటి ఇంటిని సందర్శించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపిన క్షణాలే ఈ సినిమాని నడిపిస్తాయి.

స్వీడిష్ భాషలో ఈ సినిమా పేరు “Smultronstället”. నిజానికి ఆంగ్ల భాషలోకి ఈ సినిమా పేరుని, “Wild Strawberries” గా కాకుండా “The wild strawberry place” గా అనువదించాలని అప్పట్లో చాలామంది స్వీడిష్ జాతీయులు పేర్కొన్నారట. వారలా అనడానికి గొప్ప కారణమే ఉంది.

స్వీడెన్ దేశం లో స్ట్రా బెర్రీ పండ్లకు ప్రసిద్ధి చెందింది. మన పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దొరికే రేగి పండ్లలా స్వీడెన్ లో స్ట్రాబెర్రీస్ పండుతాయి. స్ట్రాబెర్రీలు కాచే సీజన్ లో చిన్న పిల్లలు పొలాల్లో విచ్చలవిడిగా పెరిగే స్ట్రా బెర్రీ పొదలను గీతలు గీసి, సరిహద్దులు ప్రకటించుకుని ఆయా ప్రదేశాల్లో కాచే పండ్లను తాము మాత్రమే కోసుకోవాలనే ఆంక్షలు విధించుకోవడం అక్కడి ఆనవాయితీ. ఆ విధంగా స్వీడిష్ ప్రజల్లో చాలా మంది చిన్ననాటి జ్ఞాపకాలు, స్ట్రాబెర్రీలు పండే ప్రదేశాలతో ముడివేయబడి ఉంటాయట. ఇదే విషయం గురించి, ప్రొఫెసర్ బోర్గ్ పాత్రలో అద్భుత నటన ప్రదర్శించిన Victor Sjostrom ని ప్రస్తావిస్తూ, “మీ సినిమా ద్వారా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. మన చిన్ననాటి స్ట్రాబెర్రీ పొదలు ప్రతి చోటా ఎల్లప్పుడూ ఉంటాయి – కానీ వాటి కోసం మనం నేలకు వంగి క్షుణ్ణంగా పరిశీలించాలి” అంటూ ఒక అభిమాని ఉత్తరం రాసారట!

కీలక సన్నివేశం

లుంద్ పట్టణానికి బయల్దేరిన ప్రొఫెసర్ బోర్గ్ మార్గమాధ్యంలో తను పుట్టి పెరిగిన ఊరిలో కాసేపు ఆగుతాడు. అప్పట్లో తను ఆడుకున్న ప్రదేశాలు చుట్టి తిరుగుతూ ఒక ప్రదేశానికి చేరుకుంటాడు – అది తన యుక్త వయసులో తన మరదలు సారా తో కలిసి స్ట్రా బెర్రీస్ ఏరుకునే చోటు. ఆ ప్రదేశం చూడగానే బోర్గ్ యాభై ఐదేళ్ల క్రిందటి తన గతంలోకి ప్రయాణిస్తాడు.

బోర్గ్ నిల్చున్న కొద్ది దూరంలోనే తన మరదలు సారా స్ట్రా బెర్రీస్ ఏరుతూ ఉంటుంది. ఇంతలో బోర్గ్ తమ్ముడు సిగ్‍ఫ్రిడ్ అటు వచ్చి సారా తో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ సారా అతన్ని వారించి తనకి బోర్గ్ అంటే ఇష్టమని చెప్తుంది. అయినా సిగ్‍ఫ్రిడ్ ఆమెను వదలడు. మాయమాటలు చెప్తూ వెంబడిస్తాడు. సిగ్‍ఫ్రిడ్ మొత్తానికి సారా మనసు గెలిచి ఆమెను ముద్దాడుతాడు. ఈ క్రమంలో ఆమె అప్పటి వరకూ ఏరిన బెర్రీ పళ్ళు మట్టి పాలవుతాయి. సారా కి తను చేసిన తప్పు అర్థమవుతుంది. సిగ్‍ఫ్రిడ్ కౌగిలి నుంచి తప్పించుకుని పారిపోతుంది.

wild-2

తన చిన్న వయసులో జరిగిన ఈ సన్నివేశపు తాలుకు జ్ఞాపకాలే బోర్గ్ తర్వాత జీవితాన్ని మొత్తం ప్రభావితం చేశాయని ఈ మనకి తెలియచేస్తాడు దర్శకుడు. తన తమ్ముడి మాయమాటలకు లొంగిపోయిన సారా కారణంగా, బోర్గ్ తన తర్వాతి జీవితం నిరాశావాద ధృక్పధంతో గడిపాడని చెప్పకనే చెప్తాడు దర్శకుడు.

ఈ సన్నివేశం గొప్పదనానికి కేవలం కథలో దాని యొక్క ప్రాముఖ్యత మాత్రమే కారణం కాదు. ఈ సన్నివేశ చిత్రీకరణ కారణంగా కూడా ఈ సినిమాలో కెల్లా కీలక సన్నివేశంగా పేర్కొనవచ్చు.

బోర్గ్ గత కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకునే ఈ ఫ్లాష్‍బ్యాక్ సన్నివేశంలో మనం అప్పటి టీనేజ్ బోర్గ్ కి బదులుగా ఇప్పటి 78 ఏళ్ల బోర్గ్ నే చూస్తాం. జీవితమనే నాటకంలో, ఆ రోజు ఎలాగైతే ప్రేక్షకుడిగా మిగిలిపోయి తన జీవితాంతం ఆ జ్ఞాపకాల మధ్య నలిగిపోతూ వచ్చాడో – ఈ రోజు కూడా అతను కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోవడం తప్ప మరేమీ చెయ్యలేడు. 1957 లోనే ఇలాంటి ఒక సరికొత్త కథా నిర్మాణ ప్రక్రియ ను పరిచయం చేసిన ఘనత బెర్గ్‌మన్ కే చెందుతుంది. అయితే ఈ సన్నివేశానికి కొనసాగింపు సినిమాలో మరో చోట వస్తుంది.

కారు ప్రయాణంలో అలసట చెందిన బోర్గ్, తన కోడలు కారు నడుపుతుండగా నిద్రలోకి ఉపక్రమించి ఒక స్వప్నంలోకి జారుకుంటాడు.

కలలో బోర్గ్ మరో సారి తన చిన్ననాటి “Wild strawberry place” కి చేరుకుంటాడు. అంతకుముందు సన్నివేశంలోలా కాకుండా ఈ సారి సారా బోర్గ్ తో మాట్లాడుతుంది. తను చేసిన మోసం కారణంగా జీవితాన్ని అక్కడే అప్పుడే ఆపేసిన వైనం అద్దం ద్వారా అతని కళ్ల ముందుంచుతుంది. తను సంతోషంగానే ఉన్నాడని ఇనాళ్లూ ఆత్మవంచన చేసుకున్న బోర్గ్ కి నిజాన్ని తెలియచేస్తుంది. తన కారణంగా బోర్గ్ జీవితంలో మాయమైన చిరునవ్వుని అతనికి మరోసారి పరిచయం చేస్తుంది. ఇక్కడనుంచే బోర్గ్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.

wild-3

అంతే లేని కాలంలో నేనెంత
ఇక బ్రతికేస్తాను హాయిగా వీలైనంత

******
ముగింపు

ఒక విధంగా, వృధ్యాపంలో ప్రొఫెసర్ బోర్గ్ నెమరువేసుకున్న చిన్ననాటి జ్ఞాపకాలుగా “వైల్డ్ స్ట్రాబెర్రీస్” ని పరిగణించాల్సి వచ్చినా, దర్శకుడు ఇంగ్మర్ బెర్గ్‌మన్ ఈ సినిమాని రూపొందించిన తీరు మాత్రం గొప్ప కళాఖండాల నడుమ నిలబెడ్తుంది. ముఖ్యంగా, జ్ఞాపకాలు ఎంతటి ప్రమాదకరమైన ఉచ్చులో, వాటిలో చిక్కుకున్న జీవితాలు ఎలా ఉంటాయో బోర్గ్ జీవితం ద్వారా కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు దర్శకుడు. చిన్ననాటి జ్ఞాపకపు ఉచ్చులో చిక్కుకుపోయి నిరాశావాద ధృక్పధంతో జీవిస్తూ తన చుట్టు పక్కల వారి జీవితాలను ప్రభావితం చేసిన బోర్గ్, ఆ జ్ఞాపకాల చెరనుంచి ఎలా విముక్తుడయ్యాడో చూపించే సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమాని ప్రపంచ సినిమా చరిత్రలో ఒక “మాస్టర్ పీస్” గా నిలబెట్టింది.; బెర్గ్‌మన్ ని ప్రపంచపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా నిలబెట్టింది.