Menu

Salaam Cinema

సినిమానేజీవితం. జీవితమే సినిమా : మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల.

సినిమా!

అరవై నాలుగు కళలనీ తనలో ఇముడ్చుకుని ఉధ్బవించిన ఒక సరికొత్త మహత్తర కళ! శతబ్దాలుగా కళారాధనలో జీవిస్తూ వస్తున్న మానవునికి గత శతాబ్దంలో మాత్రమే సాధ్యమైన ఒక వినూత్న కళ.

ఈ ప్రపంచంలోని అరు వందల కోట్ల మంది జనాభాలో కనీసం సగం మందైనా ఎప్పుడోకపుడు ఈ కళ ను అనుభవించిన వాళ్లే అయ్యుంటారు. సినిమా అనే చలనచిత్రానుభవాన్ని రుచి చూశాక అందులో తామూ ఒక భాగం కావాలనుకోవడం కోట్లాదిమంది కల.

అసలీ సినిమా అంటే ఏమిటి?

కళలు, కలలు విరివిగా అమ్మబడే చోటా?

వందల మంది ప్రేక్షకులు ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా?

ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?

సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా కూడా జీవితం లాంటిదే! సినిమా కూడా జీవితం లాగే మన మదిలో నిలిచిపోయే కొన్ని సంఘటనలు మరియు సన్నివేశాల సమాహారం. జీవితంలాగే సినిమా కూడా! ఒక దృశ్యం, ధ్వని, ఒక భావోద్వేగం ద్వారా కొన్ని సన్నివేశాల సమాహారాలు జీవితాంతం జ్ఞాపకాల రూపంలో గుర్తు చేస్తూ వెంటాడుతాయి.

****

salaam-2

మోసిన్ మక్మల్‌బఫ్!

ఈ పేరు వినని సినీ ప్రేమికుడు ఉండడేమో! ఇరాన్ దేశం నుంచి వచ్చిన అత్యుత్తమ చలనచిత్ర దర్శకుల్లో ఒకరు. అతనికి సినిమా అంటే హడావుడిగా అరగించే ఫాస్ట్ ఫుడ్ కాదు. మన హృదయంలో జీవితకాలం నివసించే ఒక అనుభవం సినిమా. చీకటి గదిలో తెర మీద ప్రక్షేపించబడిన చిత్రాలు నిరంతరం మన లో చైతన్యాన్ని కలిగించగలవనే నమ్మకం కలవాడు ఆయన.

1979 లో ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవం లో పోరాడి జైలు పాలయ్యాక, కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర వహించినప్పటికీ -దేశ సమస్యలు పరిష్కరించుకోవటానికి రాజకీయ సంస్కరణ మాత్రమే సరిపోదు, ప్రజల మనసుల్లో మార్పు రావాలని మక్మల్‌బఫ్ అర్థం చేసుకున్నాడు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి సినిమా కి మించిన ఆయుధం లేదని గ్రహించాక తన జీవితం మొత్తం సినిమాకే అంకితం చేసిన గొప్ప దార్శనికుడు మక్మల్‌బఫ్.

ఒక్క మోసిన్ మక్మల్‌బఫ్ మాత్రమే కాదు, అతని కుటుంబ సభ్యులందరూ చలనచిత్ర దర్శకులే. అతని భార్య మార్జే మెష్కినీ, పెద్ద కూతురు సమీరా, చిన్న కూతురు హానా మరియు కొడుకు మేశాం కూడా తమ చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలందుకున్నవారే . ఈయన కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. నిర్మాత, నటుడు, కూర్పరి…ఇంకా ఎన్నెన్నో! సినిమా కళని వారసత్వ సంపదగా తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలనుకోలేదు మక్మల్‌బఫ్. తన దేశంలో చలనచిత్ర కళను బోధించే మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేశాడు.

అయనకి సినిమా, జీవితం వేరు వేరు కాదు. సినిమానే జీవితం. జీవితమే సినిమా : తన చుట్టూ, తన చెంతన, తన లోలోపల.

*****

28 డిసెంబర్ 1895

కళలకు కాణాచీ అయిన ప్యారిస్ నగరంలోని గ్రాండ్ కెఫ్ లో ఇంకాసేపట్లో మానవాళి కనీ వినీ ఎరుగని అద్భుతమైన కళా రూపం అక్కడ ఆవిష్కరింపబడుతోంది. ఈ సరికొత్త కళ గురించి ఆ నోటా ఈ నోటా విన్న సామాన్యులు, కళాకారులు అక్కడ గుమిగూడారు. ప్రతి కళాకారుడు జీవితాన్ని తన కళారూపాల్లో బంధించాలనుకుంటాడు. మిగిలిన కళల్లో ఈ విధంగా చేయడం కాస్తా కష్టంతో కూడుకున్న పనే!కానీ ఇలాంటి సానుకూలత స్వాభావికంగానే సాధ్యమైన చలనచిత్ర కళను కళ్లారా చూడ్డానికి జనం వేచిచూస్తున్నారు. ప్రదర్శన మొదలైంది.

ఒక చిన్నపాటి రైల్వే స్టేషన్. జనాలు ప్లాట్‍ఫామ్ మీద రైలు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాణం పోసుకున్న బొమ్మలను ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ప్రేక్షకులు. దూరం నుంచి రైలు వస్తోంది. దగ్గరకొస్తున్నఆ రైలు బండి తమ మీదకి వచ్చేస్తుందేమోనని కొంతమంది భయాందోళనతో బయటకు పరిగెట్టారు; మరికొంతమంది సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

సరిగ్గా నిమిషం పాటైనా లేని ఆ ప్రదర్శన ఆ రోజుల్లో ఒక సంచలనం. అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతం చేసిన గొప్ప సందర్భం. సృష్టి కి ప్రతిసృష్టి జరిగిన ఒక అద్భుత సంఘటన.

*****

1995 వ సంవత్సరం.

చలనచిత్ర కళ మొదలై వందేళ్లు గడిచిపోయాయి. మూకీ గా మొదలైన సినిమా, టాకీ-సినిమాస్కోప్-70 ఎం. ఎం-త్రీడీ-ఐమ్యాక్స్-ఫోర్‍ డి-డిటీయస్-డోల్బీ నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. ప్యారిస్ లోని ఒక కెఫె లో ప్రాంభమైన చలనచిత్ర ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద పరిశ్రమగా నిలదొక్కుకుంది.

ఒక శతాబ్దం పాటు ప్రజలను ఆలరించిన సినిమా పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తమదైన శైలిలో వందేళ్ల సినిమా పండగని జరుపుకుంటున్నాయి.

మోసిన్ మక్మల్‍బఫ్ కూడా ఈ వందేళ్ల పండగ ని జరుపుకోవాలనుకున్నాడు. కానీ ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలో అంతుపట్టలేదు ఆయనకి. ఈ పండగ కేవలం సినీ పరిశ్రమదే కాదు ప్రేక్షకులది కూడా కావాలని మాత్రం అనుకున్నాడు.

నిజమే మరి. ప్రేక్షకులు లేని చలనచిత్రాన్ని ఊహించగలమా? ఎవరి కోసమైతే ఇన్నాళ్లూ తను చలనచిత్రాలు తీశాడో వారినే తన కథా వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పటివరకూ తెర ముందు కూర్చుని సినిమా చూసే ప్రేక్షకులను తెరమీదకు తీసుకువద్దామనుకున్నాడు. వందేళ్లుగా ఈ కళను ఆదరిస్తూ వస్తున్న వారికి సలాం చెయ్యాలనుకున్నాడు. తను తీయబోయే సినిమాలో భాగం కావాలనుకునే వారిని సంప్రదించమంటూ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. “సలాం సినిమా” మొదలైంది.

salaam-3

*****

కీలక సన్నివేశం

“సలాం సినిమా” లో ఇదీ కీలక సన్నివేశం అని చెప్పదలుచుకునే ధైర్యం నాకు లేదు. నిజానికి ఈ సినిమా మొత్తం ఒకే సన్నివేశంగా పరిగణించవచ్చు.

పేపర్లో ప్రకటన కు స్పందించి వచ్చిన ఇరాన్ దేశస్థులు తండోపతండాలుగా మక్మల్‍బఫ్ స్టూడియో ఎదుట బారులు తీరిన దృశ్యం నుంచి కెమెరా కి గుడ్ బై చెప్పి ఆడిషన్స్ గదిలోనుంచి అందరూ తరలి వెళ్లిపోగా ఖాళీగా మిగిలిపోయిన ఆడిటోరియం దృశ్యం వరకూ ఈ సినిమాలో అంతా కీలకమే!

సినిమా అంటే ఎలా ఉంటుందో కూడా తెలియకపోయినా సినిమాల్లో నటించాలనే తీవ్రమైన కోరికతో ఆడిషన్స్ కి వచ్చిన ఒక అంధుడు; గతంలో మక్మల్‍బఫ్ తో ఉన్న పరిచయంతో తన పిల్లలిద్దరినీ సినిమాలో తీసుకొమ్మని రికమెండేషన్ తో వచ్చిన ఒక తండ్రి, విదేశానికి తరలి వెళ్లిపోయిన తన ప్రేమికుడి అన్వేషణలో విదేశీ వీసా సంపాదించడానికి ఈ సినిమా ఒక మార్గం కావొచ్చేమోననే ప్రయత్నంలో వచ్చిన ఒక యువతి – ఇలా ఎన్నో సామాన్యుల కథలు సినిమాతో ఎలా ముడిపడిఉన్నాయో “సలాం సినిమా” లో మనం చూస్తాం.

మరో వైపు అమెరికన్ చలనచిత్రాల ద్వారా ప్రభావితమై, తననందరూ పాల్ న్యూమన్ అంటారని అందుకే నటుడవుదామని వచ్చిన యువకుడు, తనకి మార్లిన్ మన్రో పోలికలున్నాయని అందుకే ప్రయత్నం చేద్దామని వచ్చిన యువతి – ఇలా మన జీవితంలో రోజూ తారసపడే సినిమా పిచ్చోళ్లు “సలాం సినిమా” లో మనకి కనిపిస్తారు.

సినిమాలో అవకాశం కోసం సరదాగా ప్రయత్నిద్దామనుకునే వారు, మక్మల్‍బఫ్ పెట్టిన పరీక్షల్లో ఓడిపోయి కళ్లనీళ్లతో వెనుదిరిగిన వారు, తనకొచ్చిన అవకాశాన్ని పక్క వారి కోసం త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ మంచి వాళ్లు, స్వతహాగా మంచి వారైనా సినిమాలో చెడ్డవారిగా నటించడంలోనే థ్రిల్ ఉందని భావించే వాళ్లు – ఇలా ఎందరికో ఈ సినిమా సలాం చేస్తుంది.

******

salaam-4

సినిమా అనే ఓడకు కెప్టెన్ లాంటి వాడు దర్శకుడు. అతను సర్వాధికారాలు కలిగి ఉంటాడు. చిటికెలో ఏడవమంటాడు, ఇంతలోనే పగలబడి నవ్వమంటాడు. ఒక విధంగా చూస్తే అలాంటి అధికారాలు గల ఒక నియంత అవినీతి పై చేసిన ధ్యానం (meditation on the corruption of power) గా కూడా ఈ సినిమాని వ్యాఖ్యానించవచ్చు.

ఏదేమైనప్పటికీ ఎప్పుడో ఎవరో అతి తక్కువమంది మాత్రమే చేసే ఇలాంటి ప్రయత్నం చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందనడంలో అనుమానం లేదు.

*****

2013 వ సంవత్సరం. ఇది మరో వందేళ్ల సినిమా పండగ. మన పండగ.

సినిమా అనే ప్రక్రియ మొదలైన ఇన్నేళ్లకి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిఉండడానికి కారణం ప్రేక్షకుడికి ఆ ప్రక్రియ వెనుక ఉండే ఎనిగ్మా నే కారణం.కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయిన ప్రశ్న ఒకటుంది. సినిమా అంటే ఏంటి?

కలా? నిజమా? జ్ఞాపకమా? సంఘటనా? ఆర్టా? క్రాఫ్టా?చిత్రమా? విచిత్రమా?అనుభవమా? అనుభూతా? వినోదమా? వ్యాపారమా?

కాదు, అవునని చెప్పడానికి ఎవ్వరికీ అర్హత లేదు. To each his own అంతే! ఎందుకంటే సినిమాలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. Impossible is nothing in Cinema.

One Response
  1. అరిపిరాల July 9, 2013 /