Menu

సాహసం

ఐతే సినిమాతో మొదలుపెట్టి కేవలం నాలుగు సినిమాలతో అశేష అభిమానులని సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నాలుగేళ్ల క్రితం వచ్చిన ప్రయాణం సినిమా కాస్త నిరాశ కలిగించినప్పటినుంచీ చందు గారి తర్వాత సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇవాళ విడుదలయిన సాహసం సినిమాతో యేలేటి మరో సారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఒక విశ్లేషణాత్మక వ్యాసం.

కథ గా చెప్పాలంటే, హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే గౌతమ్ (గోపీచంద్) పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఐతే ఎప్పటికప్పుడు తనని అదృష్టదేవత వరిస్తుందేమోనని కలలు కూడా కంటుంటాడు. అనుకోకుండా ఒక రోజు అతనికి తన ఇంట్లో దొరికిన చెదలుపట్టిన పత్రాల ద్వారా తన పూర్వీకులకు సంబంధించిన వజ్రాలు ప్రస్తుతం పాకిస్తాన్ లోని పెషావర్ ప్రాంతంలోని ఒక గుహ లో ఉన్నాయని తెలుసుకుంటాడు. అయితే ఆ గుహలో ఈ వజ్రాలతో పాటు వేల కోట్ల విలువపలికే నిధి ఉందని తెలుసుకున్న ఒక్కడున్నాడు -అతనే సుల్తాన్ (శక్తి కపూర్). ఇదే సమయానికి పాకిస్తాన్ లోని ఒక హిందూ దేవాలయాన్ని సందర్శించే ప్రయత్నంలో ఉన్న శ్రీనిధి (తాప్సీ) గౌతమ్ కి పరిచయం అవుతుంది. శ్రీనిధితో కలిసి పాకిస్తాన్ కి ప్రయాణం అవుతాడు గౌతమ్. పాకిస్తాన్ చేరుకున్న గౌతమ్ తన పూర్వీకుల ఆస్థి తిరిగిదక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ సినిమా కథ!

టక్కరి దొంగ తర్వాత తెలుగులో వచ్చిన మొట్టమొదటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. బహుశా తెలుగులో వచ్చినన్ని యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు మిగతా భాషల్లో వచ్చి ఉండకపోవచ్చు. గతంలో తెలుగులో వచ్చిన ఇలాంటి యాక్షన్ అడ్వెంచెర్ సినిమాలన్నీ కూడా కౌబాయ్ సినిమాలుగానే వచ్చాయి (మోసగాళ్లకు మోసగాడు, కౌబోయ్ నెం.1. కొదమ సింహం, టక్కరిదొంగ మొదలుగునవి). అయితే సాహసం సినిమా కౌబాయ్స్ లాంటి ఊహాజనిత  ప్రపంచంలోకాక సమకాలీన ప్రపంచంలో తన కథను మౌంట్ చేయడం ద్వారా, ఈ genre సినిమాలను సరికొత్తగా ఆవిష్కరించారు. సాహసం సినిమా తీయడంలో యేలేటి గారు ఒక పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.

బహుశా గత కొన్ని సంవత్సరాలలో జరిగిన యదార్థసంఘటనలు ఈ కథకు పునాది అయ్యుండాలి. కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ లోని ఒక పవిత్రమైన హిందూ గుడి ని పట్టించుకునే వారులేక శిధిలమైపోతున్నాయన్న వార్తలు, అలాగే అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలో దొరికిన నిధుల గురించి వచ్చిన కథనాలనుంచిచి సాహసం కథ పుట్టి ఉండవచ్చు.

కథా వస్తువు ఎన్నికలో కానీ, కథా నేపథ్యంలో కానీ ఎప్పుడో కొన్ని తెలుగు సినిమాలలో తప్ప కనిపించని authenticity కూడా ఈ సినిమాకి ప్రత్యేకం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, రామ చేసిన ప్రొడక్షన్ డిజైన్, ఏ మాత్రం ఎబ్బెట్టుగా లేని గ్రాఫిక్స్ సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక నటీ నటుల విషయాలకొస్తే గోపిచంద్ హీరో పాత్రకి సరిపోయాడు. తెలుగులో ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. విలన్ పాత్రలో శక్తి కపూర్ చాలా బాగా రాణించాడు. చాలా సీరియస్ గా నడిచే సెకండాఫ్ లో శక్తికపూర్ పండించిన సున్నితమైన బ్లాక్ హ్యూమర్ అందరినీ అలరిస్తుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. పాకిస్తాన్ లో జరిగే కథ కాబట్టి దేశభక్తి పూరిత సంభాషణలు, పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ చేసే hate speeches, పాకిస్తానీ విలన్స్ భారతీయులను అవమానిస్తూ మాట్లాడే మాటలు కానీ ఎక్కడా వాడకపోవడంలో దర్శకుడి నిబద్ధత తెలుస్తుంది.

ఇది అన్ని విధాలా ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ATM దోపిడీ తర్వాత వచ్చే యాక్షన్ సీన్ కానీ, ఆ తర్వాత చెత్త డంపింగ్ యార్డ్ లో గోపీచంద్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కానీ… అన్నీ గొప్పగా చిత్రీకరించబడ్డవే! కాకపోతే సాహసం అనే సినిమాకి వచ్చిన ప్రేక్షకులు అంచనాలకు తగ్గ సాహసోపేత ఘట్టాలు సెకండాఫ్ వరకూ రాకపోవడంతో ఒకింత నిరాశకి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సినిమా అంతా అయ్యాక మాత్రం థ్రిల్ కి గురవుతారు ప్రేక్షకులు.

నా దృష్టిలో “సాహసం”  కేవలం కథను నమ్మి తీసిన సినిమా. స్క్రీన్ ప్లే పరంగా  కూడా ఎక్కడా లోటు పాట్లు లేవు. మధ్యలో వచ్చే ఒక డ్యూయెట్, ఆలీ పాత్ర ద్వారా పండించాలనుకున్న కొంత కామెడీ తప్పితే మిగిలి అంశాలన్నీ కథకు లోబడే ఉంటాయి; అంతే కానీ “entertainment” పేరుతో అనవసరమైన సాగతీత ఉండదు.

అయితే, సాహసం సినిమా చూసిన కొద్ది మంది సినిమాలో చివరి నలభై నిమిషాలు చాలా బావుంది. కానీ మిగిలిన సినిమా ఫర్వాలేదు అని అనడం విన్నాను. రెగ్యులర్ ఫార్మట్ తెలుగు సినిమాలు చూసి అలవాటైపోయి మనకి అలా అనిపించవచ్చు. ఈ విషయం గురించే ఫేస్ బుక్ మిత్రుడు ధరణి కుమార్ తన సమీక్షలో రాస్తూ, మొదట్లో తనకూ అలానే అనిపించినా తర్వాత ఆలోచించి ఇది రెగ్యులర్ సినిమా కంటే ఎందుకు భిన్నమైనదో అంటూ చెప్పిన కొన్ని విషయాలు నచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

ఈ సినిమాలో –

 • హీరోకి ఇంట్రడక్షన్ ఫైట్ లేదు.
 • ఇద్దరు హీరోయిన్లు లేరు
 • హీరో పక్కన నలుగురైదుగురు ఎర్రి పుల్కా ఫ్రెండ్స్ లేరు
 • హీరోయిన్ ని ఇంప్రెస్ చెయ్యడానికి హీరో ఎక్కడా ట్రై చెయ్యడు
 • ఫస్ట్ హాఫ్ లో హీరో లేదా హీరోయిన్ కోసం విలన్ గ్యాంగ్ ఫోటో పట్టుకుని వెతకడం ఉండదు
 • పంచ్ డైలాగ్స్ లేవు
 • ఐటం సాంగ్ లేదు
 • ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు
 • సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లేదు
 • రివెంజ్ ఎపిసోడ్ లేదు
 • క్లైమాక్స్ లో సుమోలు గాల్లో ఎగరవు
 • అన్నింటికంటే ముఖ్యంగా “బ్రహ్మానందం” లేడు.

ధరణి కుమార్ చెప్పినట్టే, ఈ సినిమాలో రెగ్యులర్ తెలుగు సినిమాలో ఉండాల్సిన పై అంశాలేవీ లేవు. ఇప్పటివరకూ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వచ్చిన చంద్రశేఖర్ యేలేటి గారు అన్ని హంగులతో కూడిన భారీ కమర్షియల్ సినిమా తీస్తున్నారంటే, అన్ని కమర్షియల్ సినిమాల్లోగే ఉంటుందని వెళ్లేవారికి కొంచెం ఆశ్చర్యంగానే ఉండవొచ్చు. Genre మర్చిపోయి కలగూరగంపగా తయారయిన తెలుగు సినిమాకి ఎప్పటికప్పుడు “ఐతే”, “అనుకోకుండా ఒక రోజు”, “ఒక్కడున్నాడు”, “ప్రయాణం” లాంటి వైవిధ్యభరితమైన కథాంశాలతో  సినిమాలు రూపొందిస్తూ  వచ్చిన చందు గారు చేసిన మరో వైవిధ్యమైన సినిమా సాహసం.

అలాగే, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనబడే “కామెడీ”, “గ్లామర్” లాంటి అంశాలు లేకపోవడం కారణంగా సినిమా B, C సెంటర్లలో ఈ సినిమా ఆడదేమో అని  కొంతమంది అభిప్రాయం. కానీ అలా జరగకపోవచ్చనే అనిపిస్తుంది.

నాకింకా బాగా గుర్తుంది – అప్పుడెప్పుడో వచ్చిన కౌబాయ్ సినిమాలనుంచి, ఆ తర్వాత వచ్చిన ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా “సాహస ఘట్టం”, ఈ మధ్య వచ్చిన “యుగానికొక్కడు” వరకూ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలను B, C సెంటర్లలోనూ తెలుగు వారు బాగా అదరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేనైతే ఇప్పటికే రెండు సార్లు (ఒక సారి మల్టి ప్లెక్స్, మరో సారి సింగిల్ స్క్రీన్) చూశాను. రెండు థియేటర్లలోనూ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కాబట్టి ఈ సినిమా విజయవంతమవుతుందనే గట్టి నమ్మకం ఉంది.

సాహసం లాంటి genre based films హిట్ అయితే మరి కొన్ని కొత్త genre సినిమాలు రావడానికి మార్గం సుగమం అవుతుంది.

5 Comments
 1. ramu July 13, 2013 /
 2. jay July 17, 2013 /
 3. sripathi July 18, 2013 /
 4. Venkata kumar July 19, 2013 /
 5. telugu cinema September 10, 2013 /