Menu

Poetry

జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం!

ఒక జ్ఞాపకం.

అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి మా అక్క మొహం మీద పడి వింతగా ప్రకాశించింది. హాల్ మధ్యలో కూర్చుని ఆడుకుంటున్న నన్ను దగ్గరకు చప్పట్లు కొడుతూ రమ్మని ఆప్యాయంగా పిలిచింది. బుల్లి బుల్లి అడుగులు వేస్తూ నేను మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లాను. నన్ను దగ్గరకు లాక్కొని ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించింది అక్క. నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. అక్క నన్ను “మిజా ఇలా రా! ఇలా రా? అని మళ్లీ మళ్లీ పిలుస్తోంటే నేనెంత ముద్దుగా ఉంటానో అనిపించింది. నా జీవితంలో ఆనందకరమైన రోజు అదే! నా గురించి నా మొట్టమొదటి జ్ఞాపకం కూడా అదే!

నా పేరు మిజా!

చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఒక పోటీలో నేను రాసిన ఒక కవిత చదివి మా టీచర్ నేను ఓ పెద్ద కవయిత్రిని అవుతానని చెప్పాడు. నా వయసు అరవైకి పైనే. ఇప్పుడు నేను ధనవంతుల ఇళ్లల్లో పని చేసే ఒక పేద పనిమనిషిని!

*****

కొరియాలోని ఒక చిన్న పట్టణంలో నివసంచే అరవై ఐదేళ్ల మిజా కథ – పోయెట్రీ.

జీవితపు చివరి దశలో కవత్వం రాయాలనే తన చిన్ననాటి కోరికను తీర్చుకోడానికి “కవిత్వం రాయడం ఎలా?” అనే అంశం పై ఏర్పాటు చేయబడిన నెలరోజుల వర్క్ షాప్ లో చేరుతుంది మిజా.

అధ్యాపకుడు క్లాస్ లోని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కవిత్వం రాయాలంటే ముందు మన కళ్లు తెరిచి చూడాలంటాడు. మామూలుగా చూడడం కాకుండా జీవితాన్ని తరచి చూడాలంటాడు. ఒక యాపిల్ పండు ఎర్రగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే కానీ దాన్ని పరిశీలించి చూస్తే తప్ప అందులో దాగున్న రంగులన్నీ మనకి కనిపించవనీ, కవులు,కళాకారులు మాత్రమే మన దైనందిన జీవితంలో దాగున్న రహస్యాలను చూడగలరని చెప్తాడు. ఆ వర్క్ షాప్ లో చేరిన మొదటి రోజు అధ్యాపకుడు చెప్పిన ఈ అంశం ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపు.
poetry-2

మిజా ఒక రోజు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తుండగా హాస్పిటల్ ఎదుట హృదయవిదారకంగా రోదిస్తున్న ఒక మహిళను చూస్తుంది. ఆ దృశ్యం ఆమెను కలిచివేస్తుంది.

ఆగ్నెస్ అనబడే ఒక పదహారేళ్ల యువతి నీళ్లల్లో దూకి ఆత్మహత్య చేసుకుందనీ, హాస్పిటల్ బయట ఏడుస్తున్న ఆ మహిళ కూతురే ఆగ్నెస్ అనీ తర్వాత తెలుసుకుంటుంది మిజా.
కానీ జీవితం చాలా క్రూరమైనది. అనుకోకుండా చూసిన ఒక సంఘటన తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని ఆమె అనుకోలేదు.

*****
ధనవంతుల ఇళ్లల్లో పని చేస్తూ, బతకడానికి సరిపడా సంపాదించుకుంటూ, తన వద్దే పెరుగుతూ స్కూల్లో చదువుకుంటున్న మనవడికి వండి పెడ్తూ జీవితం గడిపేస్తున్న మిజా కి ఒక కఠోర సత్యం తెలుస్తుంది. ఆగ్నెస్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఆరుగురు టీనేజ్ బాలురిలో తన మనవడు కూడా ఒకడని ఆమెకు తెలుస్తుంది. ఆ వయసులో అలాంటి విషయం తెలిసిన ఎవరైనా కుప్పకూలిపోవాల్సిందే!కానీ అప్పుడే జీవితం మీద కొత్త ఆశలు చిగురింపచేసుకున్న మిజా ఆ సత్యాన్ని ఎదుర్కొంటుంది.

తన మనవడి స్నేహితుల తల్లిదండ్రులు సమావేశమై తనని కూడా అహ్వానిస్తే అక్కడకు వెళ్తుంది మిజా.

ఈ కేస్ పోలీసుల దాకా వెళ్లకుండా, ఆగ్నెస్ కుటుంబానికి తలో ఐదు లక్షల చొప్పున మొత్తం ముప్ఫై లక్షలు ఇవ్వాలని నిర్ణయిస్తారు. మిజా కూడా తన మనవడి తరుపున ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనని చెప్తారు. మిజా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. నైతికంగా నీటమునిగిన మధ్యతరగతి జీవితాలను అసహ్యించుకుంటుంది. ఆగ్నెస్ అనుభవించిన బాధను తనూ అనుభవించాలనుకుంటుంది.

ఆగ్నెస్ ఆత్మహత్య చేసుకున్న నది దగ్గరకు వస్తుంది మిజా. ఆ నది ఒడ్డు మీద కూర్చుని బ్యాగ్ లోనుంచి నోట్ బుక్ తీసి ఏదో రాయాలనుకుంటుంది. మదిలో మెదిలిన ఆమె భావాలు మాటలై ప్రవహిస్తాయనుకుంటుంది. కానీ ఆ ప్రవాహం ఒక కన్నీటి చుక్కగా మారి కాగితం పై పడ్తుంది. సాటి మనుషుల క్రూరత్వాన్ని సహించలేక నిస్సహాయంగా విలపిస్తున్న ఒక మహిళని చూసి ప్రకృతి రోదిస్తుంది.వెంటనే జోరున వర్షం కురుస్తుంది.

దేవతలు ఏడుస్తున్న వర్షం.దగాపడిన మనుష్యులు కాలుతున్న వాసన.

poetry-3

కీలక సన్నివేశం

పిల్లలందరి తండ్రులు మరో సారి సమావేశమవుతారు. మిజా ని కూడా అక్కడకు పిలుస్తారు. ఆగ్నెస్ తల్లితో మాట్లాడి తామనుకున్నట్టు ఆమెను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదనీ, మిజా నే అందుకు సరైనదని అందరూ నిర్ణయిస్తారు. మిజా వేరే దారి లేక ఒప్పుకుంటుంది.

ఆగ్నెస్ ఇల్లు చేరుకుంటుంది మిజా. ఇంట్లో ఎవరూ ఉండరు. తలుపు తెరిచే ఉండడంతో లోపలకి తొంగి చూస్తుంది. లోపల కూడా ఎవరూ ఉండరు. ఇంట్లో ఒక టేబుల్ మీద ఆగ్నెస్ ఫోటోలని చూస్తుండగా పక్కింటామె “ఎవరూ” అని పిలవడంతో బయటకి వస్తుంది మిజా. ఆగ్నెస్ తల్లి అక్కడికి దగ్గర్లోనే ఉన్న పొలాల్లో పని చేస్తుందని పక్కింటావిడ చెప్పడంతో అక్కడకు బయల్దేరుతుంది మిజా.

ఆగ్నెస్ తల్లిని కలవడానికి పొలాల్లో నడుస్తూ దారిలో కిందపడిన అప్రికోట్ పళ్లను చూసి ఆ చెట్టు దగ్గర ఆగి ఒక పండుని కొరికి రుచి చూస్తూ, చుట్టూ ఉన్న మరి కొన్ని కుళ్లిపోయిన అప్రికోట్ పళ్లను చూస్తుంది. వాటిని చూడగానే “చెట్టు తన ఫలాలను కిందకు రాల్చి, మట్టి కరిపించి కొత్త జీవితానికి ప్రాణం పోస్తుంది” అని రాసుకుంటుంది. ఆమెలో ఒక నూతన సత్యం ఉదయించిన క్షణం అది.

కాస్త దూరం నడిచి ఆగ్నెస్ తల్లిని కలుస్తుంది మిజా. ప్రాణానికి విలువ కట్టిన వ్యాపారానికి బ్రోకర్ గా అక్కడకు వచ్చిన మిజా, ఎంతైనా తల్లి మనసు తెలిసినది కాబట్టి ఆ పని చెయ్యలేకపోతుంది. ఆగ్నెస్ తల్లిని అపరిచుతిరాలిలా మాత్రమే పలకరించి వచ్చేస్తుంది.

*****
స్వగతం

జీవితంలో మనకి నచ్చిన కొన్ని సందర్భాలు ఉంటాయి. అవి అవతలి వారితో పంచుకోవడంలో ఒక ఆనందం ఉంది. కానీ అది అవతలి వారి అంగీకారంతోనే చేయగలం.

సినిమా అంటే నాకు ప్రాణం. అలా అని నా ఇష్టాన్ని వేరొకరి మీద రుద్దడం కూడా నాకు ఇష్టం ఉండదు. పోయెట్రీ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. యాపిల్ పండుని సరిగ్గా చూడగలిగితే అందులో ఎన్నో రంగులూ రహస్యాలు ఉన్నాయని చెప్తాడు అధ్యాపకుడు. అది విన్న మిజా ఇంటికి వచ్చి యాపిల్ ని చేతిలో పట్టుకుని తీక్షణంగా చూస్తుంది. కాసేపటికి యాపిల్ తొక్క తీసి తింటూ, యాపిల్ తినడంలో ఉన్న సుఖం చూస్తూ కూర్చోవడంలో లేదని చెప్తుంది. ఆ సన్నివేశం లాగే కవిత్వం అంటే ఇదీ అని ఇదిమిత్తంగా చెప్పగలగడం ఎవరికీ సాధ్యం కాదు. సినిమా కూడా జీవితం లాగే మన మదిలో నిలిచిపోయే కొన్ని సంఘటనలు మరియు సన్నివేశాల సమాహారం. ఇది మంచి కవిత్వం, ఇది మంచి సినిమా అని చెప్పడానికి ఎవరికీ అర్హత లేదు. To each his own అంతే! కానీ ప్రపంచంలోని వివిధ చలనచిత్రోత్సవాలు మరియు వివిధ మార్గాల ద్వారా నేను మెచ్చిన సినిమాలు పరిచయం చేయడమే “సన్నివేశం” అనే శీర్షిక యొక్క ముఖ్య ఉద్దేశం.

ఆ పరంపరలో నేను పరిచయం చేస్తున్న మరో సినిమా “పోయెట్రీ”. ఇది ఒక అధ్భుత దృశ్ర్య కావ్యం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమా దర్శకులుండడం చాలా అరుదు. అలాంటి అరుదైన సినిమాలను పరిచయం చేయడమే నా లక్ష్యం. ఈ వ్యాసాల ద్వారా ఆయా సినిమాలను అందంగా పరిచయం చేయాలనుకుంటున్నాను; ఆ సినిమాలున్నంత అందంగా నేను పరిచయం చేయలేకపోతే అది నా లోపమే తప్ప అది ఆయా సినిమాలది కాదు అని సవినయంగా తెలియచేసుకుంటూ, మన వ్యాసంలోకి వస్తే….

*****
ఎంత చేసినా ఆగ్నెస్ కి జరిగిన అన్యాయాన్ని మాత్రం మర్చిపోలేకపోతుంది మిజా. తన జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ లోగా మిజా పోయెట్రీ క్లాస్ కూడా ముగింపుకి వస్తుంది. చివరి రోజు క్లాస్ లో విద్యార్థులంతా పోగవుతారు. కానీ మిజా మాత్రం రాదు. క్లాస్ లో టీచర్ ఎవరెవరు పోయెట్రీ రాశారని అడుగుతాడు; కానీ ఒక్కరు కూడా చెయ్యెత్తరు. కానీ అతని టేబుల్ మీదున్న పుష్పగుచ్చం, దానితో పాటే ఉన్న కొన్ని కాగితాలు చూసి ఆశ్చర్యపోతాడు. అది మిజా రాసిన కవిత. ఆగ్నెస్ కోసం మిజా రాసిన కవిత తో సినిమా ముగుస్తుంది.

******
అగ్నెస్ నీ అందమైన జీవితం చిందరవందర అయింది. ఈ దగాకోరు సమాజం నీ మరణానికి రేటు కట్టింది. ఇన్నాళ్లూ వీళ్లతోనా నేను జీవించింది? నేనూ వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోతున్నాను.

ఆగ్నెస్, నువ్వు పువ్వులా నేలరాలావు. నీటిలో తేలావు. మట్టిలో కలిసిపోయావు. అగ్నెస్, నీ గురించి తలుచుకుంటే నా మనసు రగిలిపోతోంది. కానీ నిన్ను మృతి చెందని స్మృతిగా మిగిలిస్తాను. నా బాధను పాటగా మలిచి ఈ గాలికి అంకితం చేస్తాను. ఆ పాట నీకు చేరుతుందనే ఆశిస్తున్నాను.

ఆగ్నెస్ ఈ పాట నీ కోసం!

poetry-4

*****
Agnes’ Song
How is it over there?
How lonely is it?
Is it still glowing red at sunset?
Are the birds still singing on the way to the forest?
Can you receive the letter I dared not send?
Can I convey…
the confession I dared not make?
Will time pass and roses fade?
Now it’s time to say goodbye
Like the wind that lingers and then goes,
just like shadows
To promises that never came,
to the love sealed till the end.

To the grass kissing my weary ankles
And to the tiny footsteps following me
It’s time to say goodbye
Now as darkness falls
Will a candle be lit again?
Here I pray…
nobody shall cry…
and for you to know…
how deeply I loved you
The long wait in the middle of a hot summer day
An old path resembling my father’s face
Even the lonesome wild flower shyly turning away
How deeply I loved
How my heart fluttered at hearing faint song
I bless you
Before crossing the black river
With my soul’s last breath
I am beginning to dream…
a bright sunny morning…
again I awake blinded by the light…
and meet you…
standing by me.

4 Comments
  1. SJ July 15, 2013 /
  2. kiran July 15, 2013 /
  3. sripathi July 18, 2013 /
  4. రావు సాంబశివ August 25, 2017 /