Menu

Code Unknown

ఎన్ని రంగుల్లో వికసించినా దాని పేరు మాత్రం గులాబి! రంగు నలుపైతే మాత్రం అతను మనిషి కాడా?

శ్రీశ్రీ అంటారు, “ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ఎంతగా పైపై భేదాలున్నా/ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/అంతరంగం అట్టడుగున మాత్రం/అంతమందిమీ మానవులమే!”

కానీ ఈ విషయాన్ని మనం ఎంత వరకూ ఆచరణలో పెడ్తున్నామనేదే పెద్ద ప్రశ్న. జాతి, కులం, ప్రాంతం, వర్ణం ఆధారంగానే ఇంకా మనుషులను అంచనా వేస్తున్న కాలం ఇది. ఈ అంచనాల ఆధారంగానే ఒకరికోరకంగా, ఇంకొకరికింకో రకంగా నియమాలను వర్తింప చేస్తూ తను అల్లిన చిక్కుముడిలోనే ఇరుక్కుపోయిన పరిస్థితి నేటి మనిషిది!

మానవ సంబంధాల రహస్యాల్ని చేధించడంలో సినిమా అనే ఆయుధాన్ని ఉపయోగించిన వారిలో ఆస్ట్రియా దేశానికి చెందిన Michael Haneke ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో సినిమా తీయాలంటే అందుకు తగిన టెక్నిక్ చాలా ముఖ్యం.కేవలం చర్చిస్తున్న అంశం యొక్క ప్రాధాన్యత కారణంగా కొన్ని సినిమాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అయితే ఆ అంశాన్ని దర్శకుడు ఎటువంటి సినిమాటిక్ టెక్నిక్ ద్వారా తెరకెక్కించాడనే విషయమే ఆయా సినిమాలు/దర్శకులను మరో మెట్టు పైన నెలబెడ్తుంది. ఒక మానవీయ అంశంతో పాటు ఉత్తమ సినిమాటిక్ టెక్నిక్ ని కలగలిపిన “Code Unknown” అనబడే ఫ్రెంచ్ సినిమా గురించి ఈ వారం సన్నివేశంలో…

కీలక సన్నివేశం

ప్యారిస్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనం ముందు నిల్చుని గంట నుంచీ ఎదురుచూస్తుంటాడు జాన్. ఇంతలో యాన్ అనే యువతి అపార్ట్‌మెంట్ లో నుంచి బయటకు వస్తుంది. జాన్ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. జాని ని చూసి ఆశ్చర్యపోతుంది యాన్. “నువ్వేంటిక్కడ?” అని అడుగుతుంది. “అన్నయ్య ఎక్కడ?” అని అడుగుతాడు జాన్. అన్నయ్య ఊరు వెళ్ళాడని చెప్తుంది యాన్.

జాన్ అన్న భార్య యాన్. ఆమె పనికి వెళ్లే హడావుడిలో ఉంటుంది. దారిలో నడుస్తూ వాళ్లిద్దరూ సంభాషించుకుంటారు. పల్లెటూర్లో జీవితం కష్టమైపోయిందనీ అందుకే తండ్రికి కూడా చెప్పకుండా ప్యారిస్ పారిపోయి వచ్చానని, కానీ అపార్ట్‌మెంట్ లో ఫ్లాట్ నెంబర్ తెలియక గంటనుంచీ బయటే ఎదురుచూస్తున్నానని జాన్ చెప్తాడు. అతను చెప్పిన విషయం విని యాన్ కొంచెం ఇబ్బందికరంగా మొహం పెడ్తుంది. ఈ వయసులో ప్యారిస్ వచ్చేయడం అంతమంచిది కాదనీ, ఇంకా కొన్నాళ్లు తన స్వంత ఊరిలోనే ఉండి తండ్రికి సహాయపడమని సలహా ఇస్తుంది. జాన్ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోడు. సరే ఈ రోజుకి తమ ఇంట్లో ఉండమని అతనికి తమ ఇంటి తాళం చెవులు ఇస్తూ, “జాన్, నీకు తెలియంది కాదు. మా ఇల్లు నువ్వే ఇదివరకే చూశావు. ఆ ఇరుకింట్లో నేనూ మీ అన్నయ్య ఉండడానికే సరిపోదు. కావాలంటే సాయంత్రం మీ అన్నయ్య వచ్చే వరకు ఉండు” అని చెప్పి వెళ్లిపోతుంది యాన్.

code-2

తాళం చెవులు తీసుకుని, యాన్ కొనిచ్చిన బన్ రొట్టె తింటూ, తన పల్లెటూరి జీవితాన్ని గుర్తు తెచ్చుకుని వీధుల్లో దిగాలుగా నడుస్తుంటాడు జాన్. వీధుల్లో ప్రజలు ఎవరి పనుల్లో వారు బిజీగా తిరుగుతుంటారు. ఒక వీధిలో కొంతమంది యువకులు గుమిగూడి పాటలు పాడుతుంటారు. జాన్ కాసేపు అక్కడే నిల్చుని వారి పాటలు వింటూ ఇంత అందమైన ప్యారిస్ నగరం వదిలి తిరిగి తన ఊరికి వెళ్లిపోవాల్సి వస్తుందనే ఆలోచనతో కోపంగా అక్కడ్నుంచి బయల్దేరుతాడు. అలా వస్తుంటే వీధి చివరన ఒక ముసలామె కూర్చుని దారినపోయే వాళ్లను యాచిస్తూ కనిపిస్తుంది. బహుశా ఏ అధారం లేక బ్రతుకు గడవక తను కూడా ఇలాగే యాచించాల్సిన పరిస్థితి వస్తుందనే భయంతోనో ఏమో, జాన్ తన చేతిలో ఉన్న కాగితపు కవర్ ని ఉండగా చేసి ఆమె మీద విసిరి కోపంగా వెళ్లిపోతాడు జాన్.

అతనలా నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో “ఏయ్ ఆగు” అని వినిపించినా జాన్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటాడు. ఇంతలో ఎవరో తన భుజం మీద చెయ్యేసి ఆపడంతో జాన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఎదురుగా ఒక నల్ల జాతీయుడు నిల్చుని ఉంటాడు. “నువ్వు చేసింది తప్పు కదా! ఆమె నీకేం చేసింది? అలా పిచ్చి కాగితం ఆమె మీద విసరడం తప్పు. వెళ్లి ఆమెని క్షమాపణ కోరు” అని జాన్ ని నిలదీస్తాడు ఆ నల్ల జాతీయుడు.

జాన్ అతని మాట వినకుండా ముందుకు సాగిపోతుంటాడు. నల్ల జాతీయుడు జాన్ ని అంత సులభంగా పోనియ్యడు. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ జరుగుతుంది. జనాలు గుమిగూడుతారు. తమ షాపుల ముందు ఇలా గొడవ పెట్టుకోవద్దని, లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుందని అంటారు. నల్ల జాతీయుడు జరిగిన విషయం అక్కడి వాళ్లకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.

code-3

ఈ లోగా ఈ గొడవంతా దూరం నుంచి చూసిన పోలీసులు అక్కడకు చేరుకుంటారు. యాన్ కూడా అక్కడకు తిరిగి వస్తుంది. పోలీసులు నల్లజాతీయుడిని పట్టుకుని “ఎందుకు గొడవ చేస్తున్నావ్?” అని నిలదీస్తారు. అతను ఆశ్చర్యపోతాడు. జరిగిన విషయం చెప్దామని ప్రయత్నిస్తాడు. జాన్ కాగితం పడేసిన ముసలామె ను విచారించమని, అప్పుడే జరిగిన విషయం తెలుస్తుందని వివరించడానికి ప్రయత్నిస్తాడు. యాన్ పోలీసులతో మాట్లాడి జాన్ తప్పేం లేదని విడిపించుకుని వెళ్లిపోతుంది. అప్పటివరకూ తమాషా చూసిన జనాలు కూడా ఒక్కొక్కరూ వెళ్ళిపోతారు. చివరికి పోలీసుకు మరియు నల్ల జాతీయుడు మాత్రమే మిగులుతారు. తన తప్పేమీ లేదని పోలీసులతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అతని మాటలు అరణ్యరోదనే అవుతాయి. ఏమైనా చెప్పాల్సింది ఉంటే పోలీస్ స్టేషన్ లో చెప్పుకోమని ఆ నల్ల జాతీయుడి చేతులు విరిచి బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్ళడంతో ఈ సన్నివేశం ముగుస్తుంది.

*****

పల్లెటూర్లలో బ్రతుకు భారమై పట్టణాలకి వలస వస్తున్న ప్రజలు, పట్టణాల్లోని ఇరుకు గదుల్లో జీవితాలు, ఎన్నో ఆశలతో పట్టణాలకు తరలి వచ్చి బ్రతకలేక యాచక వృత్తి స్వీకరించిన జనాలు లాంటి ఎన్నో సమస్యలను స్పృశిస్తూనే మరో పక్క ఈ నాడు ప్రపంచం యావత్తూ జరుగుతున్న జాతి/వర్ణ వివక్ష ను కూడా ఈ సన్నివేశంలో మనముందు ఏకరువు పెడ్తాడు దర్శకుడు.

సాధారణంగా ఒక సన్నివేశం యొక్క గొప్పదనం రెండు రకాలుగా వర్ణించవచ్చు. ఒకటి ఆయా సన్నివేశాల్లో ఉండే అంశం ఆధారంగా చర్చించవచ్చు. ఇంతవరకూ ఈ శీర్షికలో మనం చర్చించుకున్న సన్నివేశాలన్నీ ఈ కోవకి చెందిందే! అయితే ఆ సన్నివేశం ఎటువంటి సినిమాటిక్ టెక్నిక్ ఆధారంగా చిత్రీకరించబడిందో అనే అంశం ఆధారంగా కూడా ఆయా సన్నివేశాల గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. బహుశా చాలా కొద్ది సందర్భాల్లోనే ఈ రెండు అంశాలు కలగలిపిన సన్నివేశాలు చిత్రీకరించబడతాయి.

ఎనిమిది నిమిషాల పాటు జరిగే ఈ సన్నివేశాన్ని దర్శకుడు Michael Haneke చిత్రీకరించిన తీరు అపూర్వం. అందుకే ప్రపంచంలోని అత్యుత్తమ సన్నివేశాల లిస్టు లో ఈ సన్నివేశం ఎప్పుడూ చోటుచేసుకుంటుంది. “లాంగ్ టేక్” అనబడే టెక్నిక్ ద్వారా చిత్రీకరింపబడ్డ ఈ సన్నివేశం గొప్పదనమేంటో చెప్పాలంటే మనం కొంచెం చరిత్ర తెలుసుకోవాలి.

****

ఒక స్టేజి మీద జరుగుతున్న నాటకాన్ని పిల్మ్ కెమెరా తో రికార్డ్ చేసినంత మాత్రాన అది సినిమా అవదు అని అందరూ ఒప్పుకునే విషయమే. నాటకాన్ని కెమెరా తో రికార్డ్ చేసి తెర మీద ప్రదర్శిస్తే అది recorded stage play అవుతుంది కానీ, (సినీ నటులు ఉన్నప్పటికీ) దాన్ని సినిమా అని ఎవరూ ఆమోదించరు. ఫిల్మ్ కెమెరా ని కనుగొన్న మొదటి రోజుల్లో, రోజువారీ జీవితంలోని సంఘటనలను రికార్డ్ చేసి తెర మీద ప్రదర్శించే వాళ్ళు. అప్పటి రోజులకు అదే సినిమా అయినప్పటికీ, రాను రాను సినిమా అనేది ఒక కళగా ఎదగడానికి కారణమయ్యింది మాత్రం ఎడిటింగ్. హాలీవుడ్ కి చెందిన ప్రఖ్యాత ఎడిటర్ Walter Murch మాటల్లో చెప్పాలంటే ఎడిటింగ్ ద్వారా సినిమా కి రెక్కలొచ్చాయట. ఆధునిక ప్రపంచంలో ప్రయాణ రంగంలో విమానం ఎంతటి విప్లవాత్మక మార్పుతెచ్చిందో, సినిమా రంగంలో కూడా ఎడిటింగ్ అంతే విప్లవాత్మకమని ఆయన అభిప్రాయం.

అయితే కొంతమంది దర్శకులు తమ సీన్స్ లేదా సీక్వెన్స్ ని ఏ మాత్రం ఎడిటింగ్ అవసరం లేకుండా చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలనే “లాంగ్ టేక్” అని అంటారు. ఇలాంటి సన్నివేశాలలో ఎక్కడా కట్ ఉండదు. అయినా కూడా మనకి బోర్ కొట్టకుండా సినిమా చూస్తున్న అనుభూతి కలగచేయడానికి ఎడిటింగ్ కి బదులుగా బహుముఖంగా కదులుతున్న కెమెరాని ఉపయోగిస్తారు. ఈ లాంగ్ టేక్ అనే టెక్నిక్ ని చాలా నైపుణ్యంగా వాడిన దర్శకుల్లో Michael Haneke ఒకరు.

ఈ వారం మనం చర్చించిన సన్నివేశం కూడా ఈ లాంగ్ టేక్ పద్ధతిలో చిత్రీకరించబడ్డదే! కీలకమైన ఈ సన్నివేశాన్ని మీరు ఈ లింక్ (http://www.youtube.com/watch?v=8xv5FqxsA1g) ద్వారా అంతర్జాలంలో చూడవచ్చు.

****

code-4
ముగింపు:
ఏదేమైనప్పటికీ జాతి, మతం, కులం పేరుతో విడివిడిగా కాక కలివిడిగా జీవించినప్పుడే ఈ లోకంలో సమైక్య జీవన సౌందర్యం వెల్లివిరుస్తుంది. కానీ మానవత్వం వికసించిన ఇన్నేళ్లకు కూడా రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టుక ఆధారంగా మనుషులను అంచనా వేసి అణచివేతకు గురిచేయడం జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించే అఫ్సర్ గారు రాసిన “A Black Love Poem” నుంచి కొన్ని లైన్లతో ఈ వారం “సన్నివేశం” సమాప్తం.
……
ఇన్ని చరిత్ర పేజీల తరవాత కూడా
ఇన్ని ఉద్వేగాల సహయానాల తరవాత కూడా
చివరికి నువ్వో రంగు
నేనో రంగు
అంతే!