Menu

Wong kar-wai – ఒక పరిచయం

అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మనం సినిమాలు కాస్తా ఎక్కువగానే చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యున్నత సినిమాలను స్టడీ చేయడం ద్వారా ఫిల్మ్ లాంగ్వేజ్ ను బాగా తెలుసుకోవచ్చు. ఒక్క సారి ఫిల్మ్ లాంగ్వేజ్ పై బాగా పట్టు సాధించాక అందులో ఎన్ని ప్రయోగాలయినా చేయొచ్చు. మనకంటూ ఒక భాషను సృష్టించుకోవచ్చు. అలా తమ కంటు ఒక శైళిని సృష్టించుకున్న దర్శకులు చాలా తక్కువ మందే వున్నారు. అదీ మన దేశంలో మరీ తక్కువ.ఇలా తమకంటూ ఒక భాషను రూపొందించుకున్న దర్శకుల్లో నాకు గుర్తొచ్చేది ఒక హాంగ్ కాంగ్ దర్శకుడు. హాంగ్‌కాంగ్ సినిమా అనగానే హీ…హూ అంటూ సాగే కుంగ్‌ఫూ సినిమాలే గుర్తుకొస్తాయి ఎవరికైనా. కానీ నాకు తెలిసినంత వరకూ హాంగ్‌కాంగ్ సినిమాకు వన్నె తెచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు వాంగ్ కార్-వై.

యాక్షన్ సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన జాకీ చాన్, బ్రూస్-లీ, జెట్ లీ లాంటి నటుల లాగే, హాంగ్ కాంగ్ కు చెందిన దర్శకుడైన జాన్ వూ హాలీవుడ్ వెళ్ళి ఫేస్ ఆఫ్ లాంటి యాక్షన్ సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందినా, రాను రాను యాక్షన్ చిత్రాలంటే బోరుకొట్టిన ప్రేక్షకులు మంచి సినిమాలు ఆశించడం మొదలుపెట్టిన రోజుల్లో వాంగ్ కర్-వై సినిమాలు అంతర్జాతీయంగా ప్రేక్షకుల కళ్ళల్లో పడ్డాయి.

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా, డ్యాన్సులు, పాటలు, హాంగ్ కాంగ్ సినిమా అంటే కరాటే కుంగ్ ఫూ విన్యాసాలు అని నిర్ధారించేసే రోజుల్లో వాంగ్ కర్-వై తన సినిమాల ద్వారా వ్యక్తిగతమైన శైళి ని నిర్దేశించుకుని, సినిమా ద్వారా కూడా కవిత్వం పలికించవచ్చని నిరూపించాడు.

ఈయన తీసిన మొదటి సినిమా అయిన As tears go by కథాపరంగా Mean streets సినిమాను తలపించినప్పటికీ, సినిమాను విజువల్ పోయట్రీగా చూపించడంలో మాత్రం ఈయన Martin Scorcesse ని మించిపోయారు.

ఆ తర్వాత ఈయన తీసిన Days of Being Wild, Ashes of Times, Chungking Express, Happy Together, Fallen Angels, In the mood for love, 2046 సినిమాలు ఒక దానిని మించినవి ఒకటిగా వుంటాయి.

షాంగై లో పుట్టి ఐదేళ్ళ వయసులో హాంగ్‌కాంగ్ తరలి వెళ్ళిన వాంగ్ కర్ వై కుటుంబం అక్కడి భాష అర్థం కాని పరిస్థితుల్లో ఇతరులతో స్నేహం చేయడం కష్టం కావడంతో ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి ఎక్కువగా సినిమాలు చూడడం ద్వారా వాంగ్ కర్ వై కి సినిమాలతో మొదటి అనుభూతులు ఏర్పడ్డాయి.

భాష ఏదైనా చిత్రాల ద్వారా ఎంతో సమాచారాన్ని అందివ్వగల సినిమా అంటే చిన్న నాడే ఆసక్తి కనబర్చిన వాంగ్ కర్-వై కాలేజీ నుండీ బయట పడగానే సినిమా అవకాశాల కోసం ఎదురు చూడకుండా కొన్నాళ్ళూ TV పరిశ్రమలో పని చేశాక, దాదాపు పదేళ్ళ పాటు సినిమాలకు రచయితగా పనిచేసాకే మొదటి సినిమా చేసే అవకాశం దొరికింది.

ఇప్పటివరకూ 12 సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి గడించి దాదాపు అన్ని చిత్రోత్సవాల్లోనూ అవార్డులు పొందిన తర్వాత కుడా తనను ఒక దర్శకునిగా కాకుండా ఇంకా ఒక ప్రేక్షకుడిగానే భావిచే వాంగ్ కర్-వై, సినిమాలు ఎందుకు తీయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం ఆయన మాటల్లోనే చెప్పాలంటే “…I think I wouldnt really consider myself a director. I still see myself as an audience member – an audience member who stepped behind camera. When I make a film, I always try to reproduce the first impressions that I had as a film lover. And I believe I make films for the audience, first and foremost. But there has to be more than that, of course. Its not the only reason. It must only be one of the reasons. The rest is more personal and, well, more secret.”

పెట్టిన కూలింగ్ గ్లాసెస్ ఎప్పుడూ తీయని వాంగ్ కర్-వై కళ్ళల్లో ఎప్పుడూ ఎటువంటి చిత్రాలు కదలాడుతాయో ఎమో కానీ, ఆయన సినిమాలు చూసిన ఎవరైనా ఒప్పుకోవలిసిన విషయం ఒకటుంది. ఈయన సినిమాల్లో వున్నటువంటి భావ చిత్రణ వేరే ఏ దర్శకులతో పోల్చలేనంతగా అద్వితీయంగా వుంటుంది. అంతటి ప్రత్యేకత ఏమిటి ఈయన సినిమాల్లో అని అడిగితే మాత్రం ఈయన తీసిన సినిమాలు చూసి తెలుసుకోవలిసిందే! కానీ వాంగ్ కర్-వై మాటల్లోనే ఆయన దర్శకత్వ ప్రతిభలోని రహస్యలేంటో తెలుసుకోవడం చాలా అరుదైన విషయం.

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు తెలుసుకుంటే ఆయన ప్రతిభ వెనుక వున్న కొన్ని రహస్యాలు మనకు తెలియవచ్చు. వాంగ్ కర్-వై రూపొందించిన సినిమాలన్నింటికీ దాదాపుగా ఆయనే స్క్రిప్ట్ సమకూర్చుకున్నారు. తన సినిమాలకు తానే స్క్రిప్ట్ రచించుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఒక విధంగా వాంగ్ కర్-వై కి ఇది ఒక పెద్ద ప్రయోజనం. తన సినిమాలకు తనే స్క్రిప్ట్ రాసుకోవడం వల్ల ఏ దర్శకునికైనా పూర్తి స్వాతంత్ర్యం దొరుకుతుంది.అంత మాత్రాన ప్రతి దర్శకుడు మంచి స్క్రిప్ట్ రాయగలరని నమ్మకం ఏమీ లేదు.

వాంగ్ కర్-వై విషయానికి వస్తే ఈయన స్క్రిప్ట్ రాసే సమయంలో ముందుగా ఆలోచించే విషయం, కథ జరిగే ప్రదేశం గురించి. ఎక్కడ జరుగుతుందో తెలిస్తే ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం చాలా సులభం అని ఈయన అభిప్రాయం. అందరు దర్శకులు స్క్రిప్ట్ రాసుకుని లోకేషన్లు వెతుక్కోవడానికి వెళ్తే వాంగ్ కర్-వై మాత్రం ముందు లొకేషన్లు వెతుక్కుని తర్వాత కథ రాసుకుంటారట.

ఈయన స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు తప్పకుండా పరిగణించే మరో విషయం genre. చాలా మంది కథా రచయితలు తప్పు చేసేది ఇక్కడే! ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూసిన వాళ్ళెవరైనా ఈ విషయం ఒప్పుకుంటారనుకుంటాను. ఈ మధ్య వచ్చే సినిమాలు ముందు ఒక కామెడీ గా మొదలయ్యి, లవ్‍స్టోరీ గా రూపాంతరం చెంది అక్కడనుంచి ఒక యాక్షన్ సినిమాగా ముగుస్తుంది. ప్రేక్షకులకు నవరసాలు అందించాలని, లేదా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక genre నుంచి మరో genre కు మారుతూ ప్రేక్షకుల్లో ఒక మూడ్ కల్పించలేకపోవడం చాలా సినిమాల యొక్క పెద్ద తప్పు. అందుకే వాంగ్ కర్-వై మాటల్లో genre యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే,”The only thing that I try to make very clear when I start a film is the genre that I want to place it in……I try to make each of my films in a different genre. And I think that’s part of what has made them so original.

అదే ఇంటర్వ్యూ లో వాంగ్ కర్-వై చెప్పిన మరో విషయం కాబోయే దర్శకులకు ఎంతో మార్గ దర్శకమవుతుందని నా అభిప్రాయం. ఒక కవి పదాలను ఒక సారి ప్రాస కోసం,ఒక్కో సారి భావుకత కోసం, మరో సారి అర్థం కోసం,ఒక్కో రకంగా వుపయోగించుకున్నట్టు దర్శకుడు సినిమాటోగ్రాఫర్తో కలిసి తమకు అర్థవంతమైందైగా తోచేలా ఒక భాషను సిధ్ధాంతీకరించాలి అని చెప్తాడు. ఒక్క మాటలో చెప్పలంటే “Invent Your Own Language” అంటాడు వాంగ్ కర్-వై.

నా దృష్టిలో వాంగ్ కర్-వై కు వున్న మరో అనుకూలత ఈయన సినిమాలన్నింటికీ దాదాపుగా ఒకే సినిమాటోగ్రాఫర్(Christopher Doyle) పని చేయడం. ఈ విధంగా చేయడం మూలాన దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ మధ్యన ఒక విధమైనటువంటి అవగాహన ఏర్పడి మంచి ఫలితాలు లభించే అవకాశం వుంది. ఇదే విషయం Ingmar Bergman మరియు Sven Nyskvist ల జంట కూడా నిజమని నిరూపిస్తుంది.

అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు అవ్వాలనుకునే వారికి ఈయన ఇచ్చే సూచన. “One last thing: to be a director, you have to be honest. Not with other people, but with your self. You have to know why your’re making a film; you have to know when you’re making a mistake and not put the blame on others.”

ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసే మన దర్శకులు, వాంగ్ కర్-వై చెప్పినట్టు ప్రేక్షకుల కోసం మాత్రమే కాకుండా తమ సినిమాలకో పర్సనల్ టచ్ ఇచ్చినట్టయితే తప్పకుండా మంచి సినిమాలు రూపొందించే అవకాశం వుంటుంది.

అసలీ ఎవరీ వాంగ్ కర్-వై ఏమిటాయన గొప్పతనం అని ఇప్పటికీ మీకనిపిస్తే ఇప్పుడే వెళ్ళి ఆయన శినిమాల DVD లు తెచ్చుకుని చూసి తెలుసుకోండి. నేర్చుకోండి. ఇప్పుడే అంత అర్జంటుగా వెళ్ళి తెచ్చుకోవడం కుదరనట్టయితే ఈ కింది వీడియో చూసి ఆనందించండి. ఈయన తీసిన In the mood for love మరియు 2046 సినిమాలు చూడడం మాత్రం మర్చిపోకండి.

వాంగ్ తీసిన లేటెస్ట్ సినిమా My Blueberry Nights ఆయన అభిమానులను చాలా నిరాశకు గురిచేసిందని విన్నాను. త్వరలో ఆ సినిమా చూసి నా అభిప్రాయం రాసే ప్రయత్నం చేస్తాను. అయినా క్వాలిటీ సినిమాలు తియ్యాలంటే హాలీవుడ్ కి కొంచెం దూరంగా వుండడమే మేలేమో కదా 🙂

16 Comments
 1. ప్రసాద్ సామంతపూడి February 20, 2008 /
 2. sathish February 20, 2008 /
 3. viswanath Goud March 27, 2009 /
 4. మేడేపల్లి శేషు September 2, 2009 /
 5. rayraj September 2, 2009 /
  • G September 2, 2009 /
  • kash August 13, 2013 /
 6. rayraj September 2, 2009 /
   • rayraj September 8, 2009 /
 7. rayraj September 2, 2009 /
 8. kash August 13, 2013 /