Menu

Taste of Cherry

ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు!

ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని అంటారు. నా గొయ్యి నేనే తీసుకున్నాను. కానీ నేను పడలేదు; పడుకున్నాను.

నేను మెలుకవగానే ఉన్నాను. ఇది మెలుకవేనా?

పైన ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల పల్లకి ఎక్కి విహరిస్తున్నాడు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి.

****
నేను మీకు తెలుసు! ఇవాళ ఉదయం ఎవరి కోసమో వెతుకుతూ కార్లో నగరమంతా తిరుగుతుండగా మీలో కొంతమంది నన్ను చూసే ఉంటారు.

హే మిస్టర్ పచ్చ చొక్కా? నిన్నే!

ఉదయం, పార్క్ దగ్గర పచ్చని చెట్లకు నీరు పడుతుంటే, నీ దగ్గర్లో ఒక కారు ఆగినట్టే ఆగి వెళ్లిపోయింది గుర్తుందా? అది నేనే!

ఊరి బయట మెకానిక్ షెడ్ దగ్గర, పాడుబడిన కార్లో “రయ్ రయ్” అంటూ కారాట ఆడుకునేది మీ పిల్లలేనా? బహుశా వాళ్లకి నేను గుర్తుండి ఉంటానేమో!

కూలీలుగా మారిన రైతులెందరో బారులు తీరిన రద్దీ రోడ్డులో మీరు నన్ను చూసి ఉంటారు. మెడకో సంచీ తగిలించుకుని ఈ రోజు ఎలా గడుస్తుందో తెలియక, పని దొరుకుతుందేమోనని ఆశగా నా కారు దగ్గరకొచ్చి అడిగిన ఒక మధ్య వయస్కుడికి నేను గుర్తుండొకపోవచ్చు. పాపం! ఉదయం నుంచి ఎన్ని కారు అద్దాలగుండా తన ఆర్తనాదాన్ని వినిపించాడో?

TOC-2

Sale. Sale. Sale. Buy one get one free. లోకం సగం ధరకే అమ్ముడుపోయింది.. మా ఇద్దర్నీ పనిలోకి తీసుకోండని ప్రాధేయపడిన యువ కార్మికుడికీ నేను గుర్తుండకపోవచ్చు.

ఈ నగరంలో నాకు సహాయం చెయ్యగలిగిన వారి కోసం వెతుకులాట వృధా ప్రయాస అనిపించింది. ఇక్కడందరూ ఉరుకులూ పరుగులే! ఊరి శివార్లయితే బావుంటుందని అటు వైపే బయల్దేరాను.

****

అతను టెలిఫోన్ బూత్ లో బూతులు తిడుతున్నాడు. డబ్బులేమన్నా చెట్లకు కాస్తాయా అని గోల చేస్తున్నాడు. నాకైతే అతనే సరైన వాడనిపించాడు. కారు దగ్గర్లో ఆపాను. అతను అనుమానంగా చూశాడు. బూత్ దాటి అతను రాగానే కార్లో లిఫ్ట్ ఇస్తానన్నాను; అవసరం లేదన్నాడు. దగ్గర్లో ఉన్న ఇంటిలోకి వెళ్లి నా వైపే అనుమానంగా చూస్తుంటే రమ్మని పిలిచాను. కావలసిందే డబ్బులే కదా, చెప్పిన పని చేస్తే చెట్లమీద కాకపోయిన కారుసీట్ కింద దొరుకుతాయని చెప్పాను. నమ్మలేదు. సరికదా! నన్ను అదోలా చూశాడు. నాకర్థమయింది. బహుశా హోమోఫోబిక్ అయ్యుంటాడు పాపం. నా ఉద్దేశం వివరించదలుచుకోలేదు. అక్కడ్నుంచి బయల్దేరాను.

****
అతను అంత ఎత్తు కొండమీదనుంచి సునాయాసంగా జారుకుంటూ దిగేశాడు. కానీ జీవితంలో మాత్రం కష్టాల కడలిని ఎదురీదుతున్న వాడిలా కనిపించాడు. చెట్టు, చేమ, గుట్ట, పుట్టల వెంట ప్లాస్టిక్ సంచులు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. దొరికింది అమ్మితే రోజుకి రెండొందలుమూడొందలుఆరొందలు; ఒక్కోసారి ఏముండదు. క్లుప్తంగా ఇదీ అతని జీవితం. చెప్పిన పని చేస్తే రెండు లక్షలిస్తానన్నాను. భయంతో పారిపోయాడు. పిచ్చాడు.

యూనిఫాం ధరించిన ఒక సైనికుడు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉన్నాడు. కూటి కోసం కోటి విద్యలనుకున్నాను. సైన్యంలో ఉండబట్టి కాస్తా ధైర్యవంతుడిలానే ఉన్నాడు. అతనే లిఫ్ట్ అడిగి మరీ కారెక్కాడు. పేద కుటుంబంలో జన్మించిన తొమ్మిది మంది సంతానంలో ఒకడు. డబ్బుల విలువ తెలిసిన వాడు. సహాయం చేస్తానన్నాడు; తీరా చెయ్యాల్సిన పని చెప్పేసరికి ధైర్యం కాస్తా మాయమై క్షణాల్లో అక్కడ్నుంచి పరారయ్యాడు పాపం పసి సైనికుడు.

****
TOC-3

ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాను. కారు అదుపు తప్పింది. జనాలు పోగయ్యారు. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. తలో చెయ్యి వేసి కారుని రోడ్ మీదకు తీసుకొచ్చారు.

అడక్కుండానే ఇంతమంది సాయం చేస్తున్నారు. అడిగినప్పుడు మాత్రం ఏ ఒక్కరూ సాయం చెయ్యరేం?

అసలైనా నేనేమడిగానని? సాటి మనిషి మాత్రమే చేయగలిగిన చిన్న సాయం. దిక్కు లేని చావు ఎవ్వరికీ రాకూడదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నాక అంత్యక్రియలు జరిపించి నన్ను ఆ మట్టిలో కలిపే వారికోసం వెతుకుతూ ఉన్నాను.

కారు బయల్దేరింది. నాకు సహాయం చేసే వారికోసం అన్వేషణ తిరిగి మొదలయింది.

****
అతను మతబోధకుడు. “మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా దేవుడు మీపై అమిత దయగలవాడు. ఈ శరీరము నీకు దేవుడు ప్రసాదించిన వరం; దానిని హింసించే హక్కు మీకు లేదు” అని హితబోధ చేశాడు.

అతనికి నా బాధలు చెప్పాలనుకున్నాను. నా బాధ అర్థం చేసుకోగలరేమో కానీ, అనుభవించడం మీ వల్ల కాదు. ఈ లోకంలో నాకు సాయం చేసే వాళ్లే దొరకరా?

దొరికాడు!

కీలక సన్నివేశం

అతను వయసులో నాకంటే పెద్దవాడు. నేనడగ్గానే సాయం చెయ్యడానికి ఒప్పుకున్నాడు. అతని అవసరం అలాంటిది. కానీ నాతో ఉన్నంత సేపు నా అత్మహత్యా ప్రయత్నాన్ని అపడానికే ప్రయత్నించాడు. తన జీవితంలోని ఒక సంఘటన గురించి చెప్పాడు.

TOC-4

అప్పడు నా వయసు 30 లోపే! జీవితంలో ఎదురైన కష్టాలు భరించలేక ఒక రోజు ఈ జీవితం చాలిద్దామనుకున్నాను. ఒక వేకువ జామున ఊరికి దూరంగా ఉన్న నేరేడు తోటకి వెళ్లాను. నాతో తెచ్చుకున్న తాడుతో ఉరిపోసుకోవలనుకున్నాను. కింద నుంచి తాడు విసిరే ప్రయత్నం చేశాను కానీ బాగా ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మ ని కింద నుంచి చేరుకోలేకపోయాను. ఇక చేసేదేం లేక చెట్టు పైకెక్కాను. బలంగా ఉన్న ఒక కొమ్మకు తాడు ని కట్టి దిగబోతుండగా నా చేతికి ఏతో మెత్తగా తగిలింది; చూస్తే బాగా మగ్గిన నేరేడు పళ్లు. చిన్నప్పుడు అదే నేరేడు చెట్టు కింద నేను ఏరుకున్న పళ్ల రుచి నాకు గుర్తొచ్చింది. వెంటనే ఒక పండు నా నోట్లో వేసుకున్నాను. అదే రుచి. ఇంకొకటి తిన్నాను. ఆ పైనే ఇంకొకటి. అలా తింటూనే ఉన్నాను. ఈ లోగా దూరంగా కొండ దిగువ నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు.

అధ్బుతం. నేను కళ్లారా చూసిన మహాద్భుతం. అంత అందమైన దృశ్యాన్ని నేను జీవితంలో చూడలేదు.

అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది చిన్న పిల్లలు చెట్టుపైన ఉన్న నన్ను చూశారు. నేరేడు పళ్ల కోసం కొమ్మని ఊపమన్నారు. రాలిన నేరేడు పళ్లను ఏరుకుని సంతోషంగా వెళ్లిపోయారు. నేను కొన్ని పళ్ళను మూటకట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాను. నా భార్య ఇంకా నిద్రపోతూనే ఉంది. లేవగానే నేను తెచ్చిన నేరేడు పళ్లు చూసి సంతోషించింది. ఆ రోజుతో నేను ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విరమించుకున్నాను.

ప్రాణం మీద కోల్పోయిన తీపి నాకు తిరిగి నేరేడు పళ్లలో దొరికింది.

జీవితం చాలా చిత్రమైనది. ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు!

ఈ జీవితంలో చూడాలనుకుంటే మనకు మరుక్షణంలో ఎదురయ్యే ఆశ్చర్యాలు ఎన్నెన్నో! వాటిలో కనీసం ఒక్కటైనా నీకు జీవితం మీద ఆశ కలిగించవచ్చు.

****

ఎవరెన్ని చెప్పినా ఈ జీవితానికి వీడ్కోలు పలకాలని గట్టి నిర్ణయానికే వచ్చాను. నా ఆలోచనను మార్చుకునే ప్రసక్తే లేదు. నిద్ర మాత్రలు సిద్ధం చేసుకున్నాను. ఉదయానికి నేను చనిపోయుంటే అంత్యక్రియలు జరపడానికి పెద్దాయన ఒప్పుకున్నాడు. నా కోరిక నెరవేరబోతోంది
.
పోతూ పోతూ ఇవన్నీ చెప్పి ఎందుకు మిమ్మలి విసిగించడం. ఇప్పటికే ఆలస్యమయింది. ఇంతటితో విశ్రాంతి తీసుకోనా? నా గోతిలో నేను పడుకోనా?

****

ఎవరా వస్తున్నది? ఏమిటా శబ్దం? అది చిరు గాలి సవ్వడి కాదే?సెలయేటి గలగలలూ కాదే?

ఏమిటా వెలుగు? ఏమిటా శబ్దం? వర్షమా? ఇది కలా? నిజమా?

ఆకాశంలో చంద్రుడు మబ్బుల పల్లకీలో నిద్రపోయాడు. నా కళ్లు మూతలు పడుతున్నాయ్. ప్రపంచాన్ని చీకటి శాసిస్తోంది.

TOC-5

మామూలుగా అయితే ఇక్కడితో సినిమా అయిపోతుంది. చివరిగా స్క్రీన్ మీద పేర్లు పడుతుండగా జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్న ప్రేక్షకులు బరువైన హృదయంతో ఇంటికి బయల్దేరుతారు. కానీ ఇది “అబ్బాస్ కియరస్తోమి” సినిమా. తన సినిమా ప్రేక్షకులు, కేవలం సినిమా చూసి జీవితపాఠాలు నేర్చుకునేంత దద్దమ్మలేమీ కాదని అతనికి తెలుసు. అప్పటివరకూ మనం చూసిన సినిమా షూటింగ్ లోని కొంత భాగాన్ని మనకి చూపిస్తాడు. అంతవరకూ నేను చచ్చిపోతానంటూ తిరిగిన వ్యక్తి సిగెరెట్ కాల్చుకుంటూ అక్కడే నింపాదిగా తిరుగుతుంటాడు. అంతవరకూ మనం చూస్తున్నది సినిమా అని గుర్తు చేస్తూ స్క్రీన్ మీదకి వచ్చేస్తాడు దర్శకుడు.

ఈ సినిమా 1997 కాన్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందినప్పుడు కియారస్తోమి ఉపయోగించిన ఈ self-referential టెక్నిక్ గురించి పెద్ద చర్చే జరిగింది. ’ఇది కేవలం సినిమానే’ అని కియరస్తోమి, ’ఇదీ ఒక సినిమాయేనా’ అని కొంతమంది, ’ఇదీ అసలు సినిమా అంటే’ అని మరికొంతమంది అన్నారు.

ఏదేమైనప్పటికీ, ఇన్నాళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నాం అంటే చరిత్ర లో నిలిచిపోయే సినిమాగా టేస్ట్ ఆఫ్ చెర్రీ ని గుర్తించక తప్పదు.