Menu

Revolutionary Road

అది ప్రేమాకాలం.

అతడి కంటి వెలుగులో ఆమె. ఆమె చిరునవ్వులో అతడు. వారు వయసులో ఉన్నారు. ఎండ-వాన, పగలు-రాత్రి, తేడా తెలియని వయసు. గుంపును మరిచి జంట పిచ్చుకల్లా ప్రేమలో మునిగితేలారు.

ప్రేమికులు భార్య భర్తలయ్యారు. జంట పక్షులు గుంపు ని వెతుక్కున్నాయి. వారిద్దరూ జన ప్రవాహంలో కలిసిపోయారు.

జనం పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అది పండాలంటే శ్రమించాలన్నారు. ఉండడానికి గూడు కావాలన్నారు. తినడానికి తిండి కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలన్నారు. డబ్బు కావాలంటే ఉద్యోగం ఉండాలన్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ’జీవితం’ మొదలైంది.

9 to 5 రొటీన్ లో అతను జీవితాన్ని పోగొట్టుకున్నాడు. పోయిన చోటే వెతుక్కోవాలన్నారు. కానీ అతను రోజు వారీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని మరెక్కడో వెతుక్కున్నాడు. వంటింటికి, పిల్లల పెంపకానికి అంకితమైన ఉత్తమ గృహిణిగా ఆమె జీవితాన్ని త్యాగం చేసింది; కలలను సమాధి చేసింది. ఒకరికొకరు గా ఉన్న వాళ్లు ఎవరికి వారయ్యారు. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు కాల ప్రవాహంలో కలిసిపోయాయి. కలలు కరిగిపోయాయి. ఇద్దరి మధ్యా అనంతమైన అగాధం. అనూహ్యమైన శూన్యం.

ఆమె పేరు ఏప్రిల్. అతని పేరు ఫ్రాంక్.

ఏప్రిల్ కు జీవితం శూన్యం గా తోచింది. కానీ శూన్యం నుంచే సమస్తం ఉద్భవించాయన్న సత్యం ఆమెకు తెలియంది కాదు. సగం రాసి ఆపేసిన ప్రేమ కవితకు సరికొత్త ఆరంభం కావాలనుకుంది.

ఫ్రాంక్ ఆ రోజు ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. చిరాగ్గా బెడ్ రూం లోకి నడిచాడు. ఎదురుగా కొత్త వెలుతురు. ఆ వెలుతురులో తన భార్య, పిల్లలు; ఆశ్చర్యపోయాడు. తనకే గుర్తు లేని తన పుట్టిన రోజున ఏప్రిల్ ఏర్పాటు చేసిన surprise party.

సరికొత్త జీవితానికి ప్రారంభోత్సవం!

RR-2

ఆ రాత్రి ఏప్రిల్ తన మనసులోని ఆలోచనలను అతని ముందు పరిచింది. ఇష్టం లేని ఉద్యోగం తో కష్టంగా జీవిస్తున్న ఫ్రాంక్ ని ఉద్యోగం మానెయ్యమంది. అందరిలా మనమూ బతకాల్సిన అవసరంలేదని అతనితో వాదించింది. అత్మవంచన చేసుకుని హాయిగానే ఉన్నామనే భ్రమలోనుంచి అతన్ని తట్టి లేపింది. ఒకప్పటి తమ కలలకు రెక్కలు తొడిగింది. అమెరికా వదిలి ప్యారిస్ వెళ్దామంది. అక్కడ ఏప్రిల్ ఉద్యోగం చేస్తుండగా ఫ్రాంక్ తను కలలు కన్న జీవితాన్ని గడపొచ్చని ఆశలు చిగురింప చేసింది. ఏప్రిల్ చెప్పిన మాటలతో ఫ్రాంక్ మదిలో కొత్త జీవితపు వెలుగు ఉదయించింది.

తెల్లవారింది. ఫ్రాంక్ ఎప్పట్లానే ఆఫీస్ కి బయల్దేరాడు. కానీ అతనిలో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహం. ఆఫీస్ లో తన తోటి మిత్రులతో ప్యారిస్ వెళ్తున్న సంగతి చెప్పేశాడు.

జీవన సమరంలో రూపు మాసిన తమ అస్తిత్వాలను వెతుక్కుంటూ తాము వెళ్లిపోతున్నామని తమ చిన్ని ప్రపంచంలో ప్రకటించేశారు. ఉన్న ఉద్యోగం వదిలేసి జీవితాన్ని వెతుక్కుంటూ ప్యారిస్ వెళ్లడం అందరికీ వింతగా తోచింది. అద్బుతమైన ఐడియాగా ముందు పొగిడారు; వెనక్కి వెళ్లి నవ్వులాడుకున్నారు. ఏవరమనుకున్నా ఇప్పుడు వారికీ లోకంతో పనిలేదు. వారికి మళ్లీ ప్రేమాకాలం మొదలయింది. ప్యారిస్ కి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అలాంటి సమయంలో వారికి పరిచయం అయ్యాడు జాన్.

జాన్ చదువుకున్నవాడు. గణితంలో PhD చేశాడు. ప్రపంచాన్ని చూసిన వాడు. దేశ విదేశాలు చుట్టివచ్చాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే వాడు. భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆరాటం లేని వాడు. లోకం కోసం తనని మంచి వాడిలా ప్రదర్శించుకుంటూ తన పరువు మర్యాదలని పరిరక్షించుకోవడంలో ఏ మాత్రం ఆసక్తి లేని వాడు.

కానీ తమలా ఉండని వాళ్లని, తమలో ఇమడని వాళ్లని లోకం క్షమించదు. పిచ్చాళ్లని ముద్ర వేస్తుంది. జాన్ హాస్పిటల్ పాలయ్యాడు. చాలా రోజుల తర్వాత జాన్ మనస్పూర్తిగా ’మనుషులతో’ మాట్లాడే అవకాశం దొరికింది.

RR-3

కీలక సన్నివేశం

మొదటి సారి ఫ్రాంక్-ఏప్రిల్ జంటని చూసినప్పుడు అందరిలాంటి వాళ్లే అనుకున్నాడు జాన్. అదే భావంతో

ఫ్రాంక్ ని “ఏం చేస్తుంటావ్?”అని అడుగుతాడు.

పెద్ద పెద్ద మేషీన్స్ తయారు చేసే కంపెనీలో పని చేస్తున్నానని ఫ్రాంక్ చెప్పుకొచ్చాడు. “ఎవరో డిజైన్ చేసిన మెషీన్స్ ని, ఇంకెవరో తయారు చేస్తే, కేవలం వాటిని అమ్మే సేల్స్ మేనేజర్ గా ఒక బోరింగ్ జాబ్ చేస్తున్నా”నని ఫ్రాంక్ నిర్భయంగా చెప్పాడు.

“మనిషికి ఉండడానికి గూడు సమకూర్చుకోవాలి. అందుకు ఒక జాబ్ కావాలి. కానీ మనిషి అంతటితో సరిపెట్టుకోడు. తన హోదా చాటుకునే భవంతి కావాలనుకుంటాడు. అందుకు ఇష్టం లేని జాబ్ చేస్తుంటాడు. బహుశా మీరు కూడా ఈ చట్రంలో ఇరుక్కుపోయారా?” అని ఫ్రాంక్ ని ప్రశ్నిస్తాడు జాన్.

అ ప్రశ్నకు ఫ్రాంక్ అనూహ్యమైన జవాబు చెబుతాడు, అది విని ఆశ్చర్య చకితుడే అవుతాడు జాన్.

“అవును మరి. యంత్రాల నడుమ యాంత్రికంగా జీవిస్తూ కోల్పోయిన జీవితాన్వేషణలో ప్యారిస్ వెళ్తున్నాం ” అని చెబుతాడు ఫ్రాంక్. అ మాట ఇద్దరూ ముక్త కంఠంతో చెప్పినట్టే వినిపించి  సంభ్రమాశ్చర్యాలకి లోనవుతాడు జాన్.

సమాజిక హోదా అనే గుదిబండ మెడలో వేసుకుని జీవితాన్ని ఉన్నచోటే చాలించే కోట్ల జనాలకు మళ్లే కాకుండా తమ ఇష్టానుసారం జీవితాన్ని గడపాలనుకునే వారిని మొదటి సారి చూస్తాడు. రెక్కలొచ్చిన పక్షులు మొదటిసారి ఎగరడంలోని ఆనందాన్ని వాళ్లలో చూశాడు అతను.

అరో ప్రశ్న వేస్తాడు. “అమెరికా నుంచి దూరంగా ప్యారిస్ కి ఎందుకు ఎగిరిపోతున్నారు” అని అడుగుతాడు.

“జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో శాశ్వత శరణాలయాలు నిర్మించుకుని, నిస్సహాయంగా బతుకులు శూన్యం చేసుకునేకంటే, అసౌకర్యమైనా, అనిశ్చిత జీవితంలో ఎదురుకాబోయే ఆశ్చర్యాల అన్వేషణలో మేము ఎగిరిపోతున్నాం” అని సమాధానం చెబుతాడు ఫ్రాంక్.

మళ్లీ ఆశ్చర్యం. అమెరికన్ డ్రీం చెల్లా చెదురై జీవితాల్లో అలముకున్న శూన్యం గురించి జాన్ విన్నాడు. ఎంతోమందితో చర్చించాడు కూడా! కానీ ఆ శూన్యాన్ని చేధించలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నామని స్థిరంగా చెప్పిన మనుషులను ఇంతదాకా చూడలేదు. అంతే కాదు, ఈ స్థితి నుంచి ఎలాగోలా బయట పడాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం కూడా తను వినలేదు. అ సంక్లిష్టతను సునాయాసంగా ఛేదిస్తారా అన్నట్లున్న జంటను మొదటిసారిగా ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాడు జాన్.

“జీవితంలోని ఈ శూన్యాన్ని గ్రహించడానికి ధైర్యం కావాలి. కానీ మన నిస్సహాయ స్థితిని ఒప్పుకోవడానికి మాత్రం ధైర్యాన్ని మించినదేదో కావాలి. అది గ్రహించాక ఎగిరిపోవడం తప్ప వేరే దారి లేదు. మీ ప్యారిస్ ప్రయాణానికి నా శుభాకాంక్షలు” అని చెప్పి జాన్ వెళ్లిపోతాడు.

జాన్ మాటలకు వీళ్లూ ఆశ్చర్యపోతారు. అయితే, ఆ ఆశ్చర్యం భిన్నమైనది. పిచ్చాడని జాన్ ని ముద్ర వేసిన పిచ్చి లోకాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఫ్రాంక్-ఏప్రిల్ ల వంతయింది.

RR-5

కానీ కాలం కలల్ని కాటు వేస్తుంది.

ఉద్యోగం వదిలి వెళ్లిపోతున్న ఫ్రాంక్ కి ప్రమోషన్ ఎర చూపారు. అనిశ్చయ స్వర్గం కంటే నిశ్చయ నరకమే అతనికి మేలనిపిస్తుంది.

చేప వలలో పడిపోయింది. అతను స్వప్న సౌధాలను కూల్చివేశాడు. ఆమె రెక్కలు తెగి పోయాయి. అయినా సరే ఆమె ఎగరదల్చుకుంది. అతను చేసిన తప్పు తెలుసుకునే లోపలే ఏప్రిల్ ఈ లోకానికే దూరంగా విశాల విశ్వంలోకి ఎగిరిపోయింది. రెక్కలున్నా ఎగరడం రాని ఒంటరి పక్షిలా ఫ్రాంక్ ఈ భూమ్మీదే మిగిలిపోయాడు.