Menu

రహస్య స్నేహితుడు

ఆనందం వెతుక్కోవడంలోనా? లేక కనుక్కోవడంలోనా?

నాకైతే వెతికి కనుక్కోవడంలో ఉందని ఒక రహస్య స్నేహితుడిని కలిసాక తెలిసింది.  ఆయన సృష్టి అపూర్వం. న భూతో న భవిష్యతి అని తరచుగా వింటుంటాం. అందులో వందకి తొంభై తొమ్మిద సార్లు అది కేవలం అతిశయోక్తి మాత్రమే. అయితే ఈ నా స్నేహితుని గురించి ఆయన చేసిన సృష్టి గురించి చెప్పాలంటే మాత్రమే న భూతో న భవిష్యతి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని మాత్రం ధృఢంగా చెప్పగలను. అయితే ఈయన గురించి లోకమెందుకో చప్పుడు చెయ్యకుండా ఉంది. ఎవరో ఒకరు ఈయన్ని మరికొంతమందికి పరిచయం చెయ్యకపోతే ఈయన సృష్టి న భవిష్యత్ అవుతుందో ఏమోనని ,కష్టమైనా ఆయన్ని మీకు పరిచయం చేద్దామన్నది నా ఈ  ప్రయత్నం.

ఈ మధ్య ప్రతి రాత్రీ కలల్లో నన్ను అప్యాయంగా పలకరించే నా ఈ రహస్య స్నేహితుని పేరు సెర్జీ పరజనోవ్.

అయితే ఒక్కోసారి నా స్నేహితుని రహస్య సృష్టి నా కంటపడకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. లేదా నేనైనా నా కళ్ళు మూసుకుని ఉండాల్సింది. చిక్కటి చీకటినైనా భరిస్తూ స్థిరంగా ఉండొచ్చేమో కానీ ఆ రహస్య రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాక మళ్ళీ మామూలు మనిషవడానికి సమయం పడ్తుందనుకుంటాను.

నన్నా విచిత్ర రంగుల లోకానికి తీసుకెళ్ళినందుకు నా రహస్య స్నేహితుని నిందించాలో లేక శిరస్సు వంచి నమస్కరించాలో నాకిప్పటికీ తెలియకుంది. అంతా కాకపోయినా కొంతైనా లోకాన్ని తవ్వి చూసానని విర్రవీగిన నాకు కాస్త వ్యవధిలో అందమైన లోకాలనెన్నో తిప్పి చూపించి “ఇప్పడు అంతా చూసేశానోచ్!” అని గర్వపడేలా చేసినందుకు ఇంతలోనే “అసలు ఇంతవరకూ నేనేమీ చూడలేదా?” అని అనుమానం రేకెత్తించినందుకే ఇంతటి అయోమయం.

“నీ అయోమయ స్థితి కి నాకు కారణం తెలుసు. నన్ను చూడు. మొదట్లో కొంత సృష్టి చేశాను. కానీ ఆ తర్వాతే తెలిసింది అందులో నేను చేసిన సృష్టి ఏమీ లేదని. తెలుసుకున్న తర్వాత మళ్ళీ పూనుకున్నాను. అవకాశం ఉండుంటే మరో సారి ఫ్రెష్ గా మొదలుపెట్టుండేవాడినేమో?” అంటాడు నా స్నేహితుడు.

“వీలైనప్పుడల్లా నూతన అధ్యాయం మొదలెపెట్టాలి. ఒకే అధ్యాయంలో జీవితం బోర్ కొట్టేస్తుంది” అంటూ నాకు దగ్గరైన పరజనోవ్ అతి కొద్ది సమయంలోనే నాకు ఆప్త మిత్రుడైపోయాడు.

“టార్కోవ్స్కీ గుర్తులేడూ? ఆయనే లేకపోతే నేను లేను. నా కంటే చిన్నవాడైతేనేం, ఆయన దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. ఇవాన్స్ చైల్డ్ హుడ్ నన్ను పూర్తిగా దహించివేసింది. ఆ అగ్ని జ్వాలల్లో నేను మళ్ళీ పునర్జన్మ పొందాను. అదే జరగకుంటే మర్చిపోయిన మా పూర్వీకుల నీడలు నేను తెరకెక్కించేవాడిని కాదేమో. అదే లేకుంటే మన పరిచయం జరిగిఉండేది కాదేమో” అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు. నేర్చుకోగలిగితే నీకంటే చిన్నవారినుంచి కూడా నేర్చుకోవచ్చని బోధిస్తాడు.

పరజనోవ్ తో పరిచయం పెరిగే కొద్దీ చాలా విషయాలు చెప్తాడు. ప్రశ్నలు వేస్తాడు. రహస్యాలెన్నో చెవిలో చెప్తాడు. “మార్క్ డోన్స్కోయ్ తెలుసటోయ్? ఇటాలియన్ నియోరియోలిజం వినుంటావు కానీ రష్యన్ నియోరియలిజం గురించి విన్నావా?” అని అడుగుతాడు. “లోకకళ్యాణానికి సౌందర్యోపాసనే మార్గం.” అని సింపుల్ గా తేల్చి పారేస్తాడు. ఇంతలోనే “సౌందర్యోపాసన అంత సులభం అనుకోకు. కొన్ని సార్లు అది పెద్ద నేరంగా కూడా పరిగణించబడవచ్చు. అందుకే కాస్తా జాగ్రత్త సుమా!” అని దిగులుగా చెప్తాడు. ఇంతలోనే తేరుకుని “సత్యాన్వేషణలో ఈ మాత్రం కష్టాలు పడాల్సిందే మరి. దర్శకత్వమంటే నిజ్జంగా నిజం కోసం వెతకడమే. ముందు నువ్వు అది తెలుసుకోవాలి. ఆ పై ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.” అని హితబోధ చేస్తాడు.

“ఇంతకీ ఆయన చెప్పిన రహస్యాలేమిటో?” అని అడిగితే, చిరుగాలి చెట్టుతో చెప్పిన రహస్యాలే పరజనోవ్ తన చలనచిత్రాల ద్వారా నాతో గుస గుసలాడాడు. ఆ రహస్యాలేవో నాకే సొంతం. కానీ పరజనోవ్ ఒక మెజీషియన్. ఆయన దగ్గర లెక్కలేనన్ని రహస్యాలున్నాయు. మీరు ఆయన్ని చేరాలే గానీ ఏదో ఒక రహస్య సృష్టిని మీ కళ్లముందుంచకపోడు. కాకపోతే ఉరకలేస్తూ వచ్చి మెల్లగా ఒడ్డుకు చేరిన అలలు ఇసుకలో గవ్వలను రహస్యంగా దాచేసినట్టు పరజనోవ్ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక చిన్న అలలా ఎగిసి తన చలనచిత్రాలను రహస్యంగా ఇక్కడ వదిలి వెళ్ళాడు. వెతుక్కోవడం మీలాంటి అన్వేషకులకు కొత్తేమీ కాదు కదా. శోధించండి. ఏదో ఒక దృశ్యం ద్వారా పరజనోవ్ మిమ్మల్ని తప్పక పలకరిస్తాడు. మీ హృదయంలో చెరగని ముద్ర వేస్తాడు.

3 Comments
  1. గీతాచార్య January 9, 2011 /
  2. jay June 26, 2013 /