Menu

In the mood for love

ఎక్కడ మొదలు పెట్టను?

పచ్చని పొలాలను, విశాలమైన ఇళ్లను వదిలి, పచ్చ నోట్ల అన్వేషణలో ఇరుకు గదుల పట్టణాలకు తరలివచ్చిన వారితో నిండిపోయిన జనసముద్రపు తాకిడికి తట్టుకోలేక, అలల్లో కొట్టుకొచ్చి ఒడ్డున మిగిలిపోయిన నా దగ్గరే మొదలుపెట్టాలని ఉంది. కానీ ఓడిపోయి ఒడ్డున చేరిన నా కథ ఎవరికి కావాలి?

పోనీ మరోలా మొదలు పెడ్తే?

వలస పక్షుల్లా పట్టణానికి తరలి వచ్చి ఏటికొక గూడు మారుతూ వలస జీవితంలోనూ వలస వెళ్తోన్న వింత జీవితం లో ఒక రోజు.

దిన పత్రికలోని క్లాసిఫైడ్స్ లో కనుగొన్న అద్దె ఇంటి చిరునామా అన్వేషణలో ఆమె నాకు మొదటి సారి ఎదురుపడింది; ఒకే రోజు ఒకే భవనంలోని పక్క పక్కన ఉన్న రెండు ఇరుకు గదుల్లోకి ఆవాసానికొచ్చిన వలస పక్షులం మేము; ఇద్దరం పెళ్లయిన వాళ్లం. మా జీవిత భాగస్వాములతో సక్రమ సంబంధాలు కలవాళ్లం. అవసరం లేకపోయినా ఇరుగు పొరుగు వారితో సఖ్యత ప్రదర్శించగలిగే నైపుణ్యం కలిగిన వాళ్లం. దారిలో ఎదురు పడితే కళ్లతోనే పలకరించుకునేవాళ్లం.

imfl-2

మా పరిచయం చూపులనుంచి పొడి పొడి మాటల వరకూ వచ్చింది. న్యూస్ పేపర్ కావాలంటూ ఒక రోజు ఆమె మా ఇంటికి వచ్చింది. తటపటాయిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. మాటలు పెరిగాయి. మాటల్లో అభిరుచులు కలిసాయి. మా పరిచయం పెరిగింది.

ఒక రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగొచ్చి తలుపు తియ్యబోతుండగా ఆమె కూడా అప్పుడే తిరిగి వచ్చింది. తన ఇంటి తలుపుతీస్తుండగా అడిగాను, “ఈ మధ్య మీ ఆయన కనిపించటం లేదే?” అని. ఆఫీస్ పని మీద ఊరెళ్లారని చెప్పింది.వునా అన్నట్టు తలూపాను. ఇంతలో ఆమె అడిగింది, “మీ ఆవిడ ఊరెళ్లారా?” అని. అవునని చెప్పాను.

It is a restless moment.
She has kept her head lowered,
to give him a chance to come closer.
But he could not, for lack of courage.
She turns and walks away.

****

imfl-3

ఒక హోటల్.
అతడు, ఆమె. ఇద్దరికీ ఈ లోకంతో సంబంధం లేదు. ఇద్దరి మనసుల్నీ తొలుస్తోన్న ఆలోచన ఒకటే! ఇద్దరి మధ్యా నిశబ్దం. ముందుగా అతనే మాట్లాడాడు.
అతడు: మిమ్మల్ని ఇలా హోటల్ లో కలుద్దామన్నందుకు క్షమించాలి. కానీ మీతో మాట్లాడాలి అందుకే…
ఆమె: ఫర్వాలేదు. చెప్పండి
అతడు: మీ హ్యాండ్ బ్యాగ్ చాలా బావుంది. ఎక్కడ కొన్నారు?
ఆమె: ఎందుకడుగుతున్నారు?
అతడు: ఏం లేదు. మా భార్య కి కూడా ఇలాంటిదే ఒకటి కొందామని.
ఆమె: ఇది మా ఆయన ఆఫీస్ పని మీద వెళ్లినప్పుడు వేరే ఊరినుంచి తీసుకొచ్చారు. ఇలాంటివి అక్కడే దొరుకుతాయి. ఆయన్ని అడుగుతాను.
అతడు: అయితే అవసరం లేదు లెండి. మన ఊర్లో దొరుకుతాయేమోమని…
ఇద్దరి మధ్యా కాసేపు నిశబ్దం.
ఆమె: నిజానికి నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను.
అతడు: అడగండి
ఆమె: మీరు కట్టుకున్న టై చాలా బావుంది. ఎక్కడ కొన్నారు?
అతడు: ఇవి ఇక్కడ దొరకవు. మా ఆవిడ బిజినెస్ ట్రిప్ మీద వెళ్లినప్పుడు తీసుకొచ్చింది. ఎందుకు అడిగారు?
ఆమె: మా ఆయన పుట్టినరోజుకి ఇలాంటి టై గిఫ్ట్ గా ఇద్దామని…
అతడు: అయితే మా ఆవిడను అడిగి తెప్పిస్తాను.
ఆమె: అవసరం లేదు లెండి. మన ఊర్లో దొరుకుతాయేమోమని…
మరో సారి ఇద్దరి మధ్యా నిశబ్దం.
ఈ సారి నిశబ్దాన్ని చేధించడం ఆమె వంతయింది.
ఆమె: నిజానికి మా ఆయనకు మీ టై లాంటిదే ఉంది.
అతడు: మా ఆవిడకు కూడా మీ హ్యాండ్ బ్యాంగ్ లాంటిదే ఉంది.
ఇద్దరూ ఒకరి వైపు ఒకరు సూటిగా చూసుకున్నారు.
ఆమె: మీరేం చెప్పాలనుకుంటున్నారు?
ఆతడు: మీరేదైతే చెప్పలేకపోతున్నారో అదే!

******

నిజం బట్టబయలయిన ఆ సాయంత్రం నువ్వు నేనూ వర్షంలో తడిచిన నగరపు వీధుల్లో కొత్త జంటలా నడవడం గుర్తుందా? ఎంత దూరం నడిచినా, “పక్క పక్కన ఇళ్లల్లో ఉంటూ, పరిచయం ఉన్నా మనం సంబధం సక్రమంగానే ఉందే! వాళ్లకెలా ఈ అక్రమ సంబంధం సాధ్యమైంది?” అని నువ్వడిగిన ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.
సినిమా హాల్లు, హోటల్ గదులూ, కారు వెనుక సీట్లూ, ఖాళీ రోడ్లూ వెతికాం సమాధానం కోసం. సక్రమం అక్రమమైన ఆ క్షణం కోసం.ఒక రాత్రి కారు వెనుక సీట్లో నా చేతిలోకి నీ చేతిని తీసుకోబోతుండగా నాకు సమాధానం దొరికినట్టే దొరికి నువ్వు వారించడంతో మాయమయ్యింది.

నీ, నా, మన, వారి ఆలోచనలతో ఎన్ని నిద్రలేని రాత్రులో?

******

రాత్రి నిద్ర చెదిరింది. ఉదయపు వెలుగు చీకట్లను తొలిగించే పోరాటంలో ఉంది. కిటికి లో నుంచి నగరం లోని భవనాలు కలల్ని కుదించుకుని కట్టుకున్న పేకమేడల్లా కనిపిస్తున్నాయి. రోడ్ మీద ఉన్న కరెంట్ స్థంభాలకు వేలాడుతున్న తీగెలపై ఎక్కడ్నుంచో వచ్చి వాలిందొక పిచుక. కాసేపటికి ఇంకెక్కడ్నుంచో వచ్చి ఆ తీగ మీదే వాలింది మరో పిచుక; రెండు పిచుకలూ ఒక దాని వైపు ఒకటి అర్తిగా చూసుకున్నాయి. వెంటనే రెండు పిచుకలు గాల్లోకి ఎగిరిపోయాయి – ఒకటి ఉత్తరం దిశగా, మరొకటి దక్షిణం దిశగా!

******

కాలం గిర్రున తిరిగింది. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నువ్వు మాత్రం నా ఆలోచనలను వీడలేదు. ఆ సాయంత్రం వర్షపు నీటిలో తడుస్తూ తెలియని దేనికోసమో ఎదురుచూస్తూ నువ్వు; నీ పై రాలిన నీటి చుక్క నిన్ను తాకుతూ వరద నీటి పాలవడం చూస్తూ నేను. నీ కంటి నుంచి జాలువారిన నీటి చుక్క కన్నీరేమోనని నేను; అది నేను గమనించినా వాన నీరు అనుకుంటానని నువ్వు. కానీ వర్షం కురిసిన ప్రతి సారీ నువ్వే గుర్తొస్తావు. ఒక నీటి చుక్కలో ప్రపంచాన్నే చూడగలిగాను ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి నీటి చుక్కలోనూ నిన్ను మాత్రమే చూడగలను.

అయినా నువ్వు గుర్తుకు రావడానికి వానే అక్కర్లేదు. ఒక్కోసారి దారిలో నడుస్తూ తొక్కిన సిగెరెట్ పీక కూడా నీ గురించే గుర్తు చేస్తుంది. నీకు గుర్తుందా? మొదటి సారి హోటల్ లో గది నెంబర్ 2046 లో…సిగెరెట్ తాగుతూ పరుపు పైన నువ్వు; కాస్త దూరంగా కింద కూర్చుని సిగెరెట్ తాగుతూ నేను. ఆ రోజు ఎవరి సిగెరెట్ వాళ్లు కాలుస్తూ, ఎవరి పొగ వాళ్లు వదుల్తూ నువ్వు నేను ఎవరి ఆలోచనల్లో వాళ్లం ఉన్నాం కానీ గాల్లోకి లేచిన పొగ ఏకమై ఎక్కడో మన ఆలోచనలనీ ఏకం చేసుంటాయి తెలుసా?

imfl-4

******

అందుకే మళ్లీ మళ్లీ నువ్వు గుర్తొస్తుంటే నిన్ను చూద్దామని దేశాలు దాటి ఎగురుకుంటూ వచ్చాను. నీ ఇంటి తలుపు ముందు నిలబడ్డాను.

నాకు తెలుసు. తలుపు తెరిస్తే నువ్వు నిజంగా కనిపిస్తావు. నిన్ను చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. పెదవుల అవసరం లేకుండానే చూపులతోనే కోటి మాటలు మాట్లాడుకోవాలనిపిస్తుంది. అయినా సరే నేను తలుపు తట్టదలుచుకోలేదు. ప్రేమ పుట్టడమే అసాధ్యమైన పరిస్థుతుల్లో నాకు అది అనివార్యమైంది . కానీ అది నాకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం. ఇన్నాళ్లూ నన్ను దహించిన ఒక సత్యం. అందుకే ఉత్తరాన ఉన్న నీ నుంచి దూరంగా దక్షిణం వైపు తిరిగి ఎగిరిపోతున్నాను.
కానీ నాపై నీకు ఏ మూలనైనా ప్రేముందో లేదో అని మాత్రం జీవితాంతం నాకు ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. బహుశా ఆ ప్రశ్నకు నాకు ఎప్పటికీ సమాధానం దొరొక్కపోవొచ్చు. బహుశా ఆ సమాధానం నీలో దాచుకున్న ఒక రహస్యం కావొచ్చు.

గుండె లోతుల్లో దాచుకోలేక, ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలను పాతకాలపు ప్రజలు ఏం చేసే వారో తెలుసా? ఎత్తైన కొండమీదకెళ్లి, అక్కడున్న ఏదైన చెట్టు మొదల్లో ఒక రంధ్రం చేసి, ఆ రంధ్రంలోకి తన రహస్యాన్ని గుసగుసలాడి, ఆ రంధ్రాన్ని బంకమట్టితో మూసేసే వారు. ఆ విధంగా ఆ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా ఉండిపోయేది. నేనూ అంతే చేశాను. నా రహస్య ప్రేమ కు అంత్యక్రియలు జరిపించేశాను.

ఎందుకంటే మన సంబంధం సక్రమం. నీపై నా ఆశలు సజీవం.

imfl-5

*******