Menu

సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు తెరవెనక పడ్డ పాట్లు మరో మహాకావ్యాన్ని తలపిస్తాయి. ఆ వివరాలు, ఈ వ్యాసంలో.

* * * *

మీడియా మొగల్ ఛార్లెస్ ఫోస్టర్ కేన్ మరణంతో సినిమా ప్రారంభమవుతుంది. మరణశయ్యపై అతని చివరి మాట ‘రోజ్ బడ్’ అనేదానికి అర్ధం కనుగొనటానికి జెర్రీ థాంప్సన్ అనే పాత్రికేయుడి ప్రయత్నాలే మిగతా సినిమా అంతా. తన పరిశోధనలో భాగంగా అతను కేన్ స్నేహితులను, బంధువులను, ఉద్యోగులను అనేకమందిని ఇంటర్వ్యూ చేస్తాడు. సినిమా మొత్తం కేన్ జీవితం గురించి వారు చెప్పే వివరాలతో ఒకదాని వెంట ఒకటిగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల సమాహారంగా నడుస్తుంది.

చిన్నతనంలోనే కేన్ తల్లి పేదరికం తట్టుకోలేక కుమారుడిని ఓ ధనిక కుటుంబానికి దత్తత ఇవ్వటం, పెద్దవాడైన కేన్ ప్రచురణ రంగంలోకి ప్రవేశించి ఒక్కో మెట్టే ఎక్కుతూ అమెరికాలో మీడియా మొత్తాన్నీ శాసించే స్థాయికి ఎదగటం, ఆ క్రమంలో ప్రత్యర్ధులని నిర్దాక్షిణ్యంగా చిత్తుచేయటం, మొదట్లో మంచివాడుగా ఉన్న కేన్ అగ్రస్థానానికెదిగే సమయానికి నిరంకుశుడిగా, ఎవరినీ నమ్మలేనివాడిగా తయారవటం, తనవారిని ఒక్కొక్కరినీ దూరం చేసుకుని ఎంతో సాధించినా ఒంటరివాడిగా మిగిలిపోవటం, హాలీవుడ్ సినీరంగంతో అతని అనుబంధం, ఝనడూ (Xanadu) పేరుతో బ్రహ్మాండమైన సౌధాన్ని నిర్మించుకోవటం, రకరకాల వస్తు సేకరణపై ఆసక్తి .. ఇలా ఒక్కో సన్నివేశమూ కేన్ జీవితంలో ఒక్కో దశనీ విడమర్చి చెబుతాయి.  అప్పటివరకూ కొందరు అంతరంగికులకే తెలిసిన కేన్ జీవిత విశేషాలెన్నిటినో జెర్రీ థాంప్సన్ సేకరించగలుగుతాడు కానీ అతని చివరి మాటలు ఎవరినుద్దేశించినవో కనిపెట్టలేకపోతాడు. క్లైమాక్స్‌లో ఝనడూ పనివాళ్లు కేన్‌కి సంబంధించిన పనికిరాని వస్తువులని ఒక్కొక్కటే మంటల్లో వేసి తగులబెట్టేస్తుండగా, జెర్రీ థాంప్సన్ ‘రోజ్ బడ్’ అంటే ఏమిటో ఇక ఎప్పటికీ అంతుపట్టని రహస్యంగా తేల్చేసి వెళ్లిపోతాడు. కెమెరా మెల్లిగా అగ్నికీలలకాహుతవుతున్న వస్తువులమీదికి కదులుతుంది.  అప్పుడు – ప్రేక్షకులకి కేన్ చివరి మాటల వెనుక రహస్యం అర్ధమవుతుంది. తెరపై కొద్ది క్షణాలపాటే కదలాడే ఆ దృశ్యం కేన్ వ్యక్తిత్వంలో అతని సన్నిహితులెవరూ ఎరుగని మరో కోణాన్ని మౌనంగా ఆవిష్కరిస్తుండగా – సినిమా ముగుస్తుంది.

ఈ చిత్రం దర్శకుడిగా ఆర్సన్ వెల్స్‌కి మొదటిది. దర్శకత్వం వహించటంతో పాటు చిత్రంలో ప్రధానమైన ఛార్లెస్ కేన్ పాత్రని అత్యంత ప్రతిభావంతంగా పోషించాడు వెల్స్. హీరో అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి అని పాత్రల లక్షణాలు గిరిగీసినట్లు ఉండే ఆ రోజుల్లో ప్రధాన పాత్రని రాగద్వేషాలుండే మామూలు మనిషిగా రూపుదిద్దటం, కేన్ మంచివాడో, చెడ్డవాడో అర్ధం కాకుండా చూపించి మెప్పించదలచటం కత్తిమీద సామే. ప్రధాన పాత్రని గురించి ఇతర పాత్రలు ఎవరికి తెలిసిన కోణంలో వారు ముక్కలు చెక్కలుగా చెబితే, ఆ పాత్ర అసలు వ్యక్తిత్వం ఏమిటో మీరే గుదిగుచ్చుకోండి అన్నట్లు ప్రేక్షకులకే వదిలేయటం అప్పట్లో పెద్ద ప్రయోగమే.

వెండితెరపై సిటిజెన్ కేన్ కధ చెప్పే పద్ధతిలో ఆర్సన్ వెల్స్ ఇంకా అనేక ప్రయోగాలు చేశాడు. నేడు సర్వసాధారణమైపోయిన లో-యాంగిల్ షాట్స్, డీప్ ఫోకస్, ఎల్-కట్స్, ఆడియో మాంటేజ్ .. ఇవన్నీ వెల్స్ ఈ సినిమాతో పరిచయం చేసినవే. శబ్ద ప్రధానమైన రేడియో రంగం నుండి రావటంతో సిటిజెన్ కేన్‌లో అతను శబ్దంతో చేసిన ప్రయోగాలు అబ్బురపరచాయి. అప్పటిదాకా సినిమాపైనున్న దృశ్య ప్రధానమైన మాధ్యమం అన్న ముద్రని పక్కనబెట్టి సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఓ సన్నివేశానికి మరింత బలం తీసుకురావచ్చని నిరూపించిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో పాత్రధారులకి చేసిన మేకప్ కూడా అద్వితీయమనిపించే రీతిలో ఉంటుంది. యవ్వనం నుండీ వృద్ధాప్యం వరకూ వివిధ దశల్లో కేన్ గా కనిపించిన ఆర్సన్ వెల్స్ ఆహార్యం, ఆయా వయసులకి తగ్గట్లు నడకలోనూ, మాట తీరులోనూ వెల్స్ చూపించిన తేడా అద్భుతమనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే – రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సాంకేతిక నిపుణుడిగా తొలి ప్రయత్నంలోనే విశ్వరూపం చూపించాడు ఆర్సన్ వెల్స్.

* * * *

విడుదలై డెబ్భయ్యేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వార్తల్లో ఉండే సిటిజెన్ కేన్ నిజానికి నిర్మాణ ప్రకటన వెలువడిన క్షణం నుండే ఎన్నో వివాదాలకు, ఎంతో సంచలనానికీ కేంద్రబిందువయింది. కారణం – ఛార్లెస్ ఫోస్టర్ కేన్ పాత్ర విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్ స్ఫూర్తితో రూపొందటం. ఎవరీ విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్?

1863లో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఓ ధనికుల కుటుంబంలో జన్మించిన విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్ ఇరవై మూడేళ్ల వయసులో ముద్రణా రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అమెరికావ్యాప్తంగా ముప్పైదాకా దినపత్రికలకి, అనేక ఇతర ప్రచురణలకి యజమానయ్యాడు. ఈయన స్థాపించిన హెర్స్ట్ కార్పోరేషన్ అధీనంలోనివే నేటి ప్రసిద్ధ ‘శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్’, ‘కాస్మోపాలిటన్’ వంటి ప్రచురణలు, ‘ఇఎస్‌పిఎన్’, ‘హిస్టరీ ఛానెల్’, ‘ఎ & ఇ’ వంటి టెలివిజన్ ఛానెళ్లు.  ఓ రకంగా, ప్రపంచంలో మొట్టమొదటి మీడియా మొగల్ ఈయనే. రెండు సార్లు అమెరికన్ ఎగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యుడుగా కూడా పనిచేశాడు. పత్రికారంగంపై ఆధిపత్యం కోసం హెర్స్ట్‌కి నాటి మరో మీడియా ప్రముఖుడు జోసెఫ్ పులిట్జర్ అధీనంలోని పత్రికలతో జరిగిన హోరాహోరీ చాలా ప్రసిద్ధం (ఈ రెండు సంస్థల ఆధిపత్య పోరాటాల ఫలితంగా పత్రికారంగంలో పుట్టిన కలుపు మొక్కే – ఎల్లో జర్నలిజం). తన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచగల చతురుడు హెర్స్ట్. నాటి అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా హెర్స్ట్ అధీనంలోని న్యూయార్క్ జర్నల్ ప్రచురించిన రెచ్చగొట్టే కధనాల ఫలితంగానే 1901లో అధ్యక్షుడు విలియమ్ మెకిన్లీ హత్య చేయబడ్డాడనేది పలువురు చరిత్రకారుల అభిప్రాయం. తన దినపత్రికల సర్క్యులేషన్ పెంపొందించుకోవటం కోసం ఈయన ప్రచురించిన కధనాలు ప్రజల్ని రెచ్చగొట్టి (1898 వేసవిలో) అమెరికా స్పైయిన్ మీద యుద్ధానికి దిగేలా పురిగొల్పాయంటే హెర్స్ట్ ఎంతటి అసాధ్యుడో తెలుస్తుంది. అటువంటి హెర్స్ట్ జీవితాన్ని సినిమాగా మలచటం సాహసమే. హెర్స్ట్‌ని గుర్తుకు తెచ్చే విషయాలు సిటిజెన్ కేన్ లో ఎన్నో ఉన్నాయి. పత్రికా రంగంపై ఆధిపత్యం, హాలీవుడ్ తో సంబంధ బాంధవ్యాలు, వస్తు సేకరణపై ఆసక్తి, నిరంకుశత్వం, ప్రత్యర్ధులని అణచివేయటంలో దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించటం మచ్చుకి కొన్ని. విలియం హెర్స్ట్ తనకోసం క్యాలిఫోర్నియా తీరప్రాంతంలో నలభై వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించుకున్న సువిశాల సౌధం ‘హెర్స్ట్ కాజిల్’ (Hearst Castle) కి ప్రతిరూపమే సినిమాలో కేన్ నివాస సౌధం ఝనడూ.

తన జీవితం ఆధారంగా సినిమా రానుండటం హెర్స్ట్‌కి నచ్చలేదు. ఇంకేముంది, సినిమాని ఆపేయటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హాలీవుడ్‌లో తన పలుకుబడి ఉపయోగించి సినిమా తీయటానికి ప్రముఖ స్టుడియోలేవీ ముందుకు రాకుండా చేయటానికి ప్రయత్నించాడు. ఒక వంక వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ, జీవితంలోనూ తలపండిన హెర్స్ట్ – మరోవంక ఇరవై నాలుగేళ్ల ఆర్సన్ వెల్స్. తెలియనివారికి ఇది కొండను ఢీకొన్న పొట్టేలు కధలా ఉంటుంది. అయితే ఆర్సన్ వెల్స్ కూడా ఆషామాషీ వ్యక్తి కాడు. పట్టుమని పాతికేళ్లు లేకపోయినా అప్పటికే రేడియో ప్రయోక్తగా, స్టేజ్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా పేరుగడించినవాడు. ముఖ్యంగా, 1938లో ఆర్సన్ వెల్స్ రూపొందించి రేడియోలో ప్రసారం చేసిన ‘వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్’ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే, ఆ కార్యక్రం వింటున్న శ్రోతలు అమెరికాపై నిజంగానే గ్రహాంతరజీవుల దాడి జరుగుతుందని భీతిల్లిపోయారట! ఓ రేడియో కదంబ కార్యక్రమంలా కాకుండా, అసలు సిసలు వార్తా ప్రసారంలా రూపొందించి ప్రసారం చేసి ప్రజల్ని హడలగొట్టిన ఆ కార్యక్రమంతో ఆర్సన్ వెల్స్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది.

సిటిజెన్ కేన్ సినిమా తీయటానికి ఎవరూ ముందుకురాకుండా చేయటానికి హెర్స్ట్ ఎన్ని పావులు కదిపినా, ఆర్సన్ వెల్స్ అప్పటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌కెఓ స్టుడియోస్ తన సినిమాకి పెట్టుబడి పెట్టేలా ఒప్పించటమే కాకుండా నిర్మాణం మొత్తం తన పూర్తి నియంత్రణలో జరిగేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. చిత్ర నిర్మాణం 1940 జూన్ లో మొదలై అక్టోబర్లో పూర్తయింది. ఈ సినిమా విడుదల చేయకుండా దాని నెగటివ్స్ మరియు అన్ని ప్రతులనూ తగులబెట్టేయటానికి ఆర్‌కెఓ స్టుడియోకి ఎనిమిది లక్షల డాలర్ల మొత్తం ఇవ్వజూపినా స్టుడియో నిరాకరించిందట. ఇక చివరి ప్రయత్నంగా హెర్స్ట్ ఈ చిత్రానికి సంబంధించిన వార్తలేవీ తన అధీనంలోని పత్రికల్లో రాకుండా నిషేధించాడు.

ఇన్ని గొడవలు, వివాదాల మధ్య 1941 మే నెలలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు (అలాగని నిర్మాతలకు నష్టాలూ తెచ్చిపెట్టలేదు. ఆ ఏడాది విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఆరో స్థానంలో నిలిచిందీ చిత్రం). రెండవ ప్రపంచ యుద్ధం ప్రచండంగా జరుగుతున్న రోజుల్లో విడుదలవటం దానికో కారణం కాగా, హెర్స్ట్ మీడియా సంస్థల సహాయ నిరాకరణ ప్రధాన కారణం. ఆ ఏడాది ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో అకాడెమీ (ఆస్కార్) అవార్డులకు నామినేట్ అయినా చివరికి స్క్రీన్-ప్లేకి మాత్రమే అవార్డు దక్కించుకుందీ చిత్రం. అవార్డు ప్రకటనా కార్యక్రమంలో ఈ చిత్రం పేరు వినిపించినప్పుడల్లా ప్రేక్షకులనుండి అవహేళనగా కేకలు, అరుపులు వినిపించేవి. హెర్స్ట్ దెబ్బకి  హాలీవుడ్ మొత్తం ఆర్సన్ వెల్స్‌కి, సిటిజెన్ కేన్‌కి వ్యతిరేకంగా మారిపోవటం దానికి కారణం. అందువల్లే ఆ ఏడాది అకాడెమీ అవార్డుల్లో ఈ చిత్రానికి తగిన గౌరవం దక్కలేదనటంలో సందేహం లేదు. అయితే పదేళ్ల తర్వాత టెలివిజన్లో ప్రసారమయ్యాక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల దృష్టినాకర్షించింది, అనతికాలంలోనే హాలీవుడ్ క్లాసిక్‌గా వినుతికెక్కింది.

సిటిజెన్ కేన్‌లో ప్రతి షాట్‌లోనూ ఏదో ఒక సింబాలిజం. చిత్రం ఎత్తుగడ, క్లైమాక్స్ – ఈ రెండూ చాలు దర్శకుడిగా ఆర్సన్ వెల్స్ సత్తా ఏమిటో చాటటానికి. సినిమా ఝనడూ సౌధం ప్రధాన ద్వారం మీదున్న ‘No Trespassing’ అనే బోర్డు మీద క్లోజ్-అప్ షాట్ తో ప్రారంభమై తిరిగి అదే బోర్డు మీద అదే రకమైన షాట్ తో పూర్తి కావటం – ఛార్లెస్ ఫోస్టర్ కేన్ వ్యక్తిత్వంలోనికి తొంగిచూసేందుకు ఎవరికీ అనుమతి లేదు అన్నదానికి అతి పెద్ద సింబాలిజం. సినిమా నిండా ఇటువంటివి మరెన్నో. సినిమా కళని సీరియస్‌గా తీసుకునేవారందరూ తప్పక చూడవలసిన చిత్రం ఇది. సినిమా నిర్మాణంలోని సాంకేతికాంశాలే కాక, తెరవెనుక ఎన్నెన్ని వత్తిడులు తట్టుకోవాలో, అవాంతరాలు అధిగమించాలో తెలుసుకోటానికి సిటిజెన్ కేన్‌ని మించిన కేస్ స్టడీ మరొకటి ఉండదు. అందుకే, నేడు సిటిజెన్ కేన్ ఓ పాఠ్యాంశంగా లేని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచంలో లేదు.

 

–అబ్రకదబ్ర

12 Comments
 1. మురళి November 2, 2008 /
 2. hari devana November 2, 2008 /
 3. shree November 4, 2008 /
 4. మురళి November 4, 2008 /
 5. cbrao November 26, 2008 /
 6. అబ్రకదబ్ర December 3, 2008 /
 7. venkat December 3, 2008 /
 8. srinivas goud December 19, 2008 /
 9. Sirish Kumar(Kummy) March 31, 2009 /
 10. sreenadh March 2, 2011 /
 11. Dingu March 10, 2013 /