Menu

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం.

ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ లేదా కొనసాగింపు లాంటిది. ఈ వ్యాసం చదివాక మీరూ సిటిజెన్ కేన్ గురించి ఇంకా ఏమైనా విశేషాలు తెలియచేయాలంటే మీరు ఈ గొలుసు ని కొనసాగించవచ్చు.

పరిచయం

1939 లో నిండా పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడితో RKO రేడియో పిక్చర్స్ అనే సంస్థ వరుసగా మూడు సినిమాలు (సంవత్సరానికొకటి) నిర్మించే కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆరోజుల్లో అదొక పెద్ద సంచలనం. ఆ సెన్సేషన్ అంతటితో ఆగలేదు. ఆ సినిమాలకు నిర్మాత, దర్శకుడు, రచయిత గా మాత్రమే కాకుండా ఆ సినిమాల్లో ముఖ్య భూమిక పోషించేది కూడా ఆ పాతికేళ్లు నిండని యువకుడే అని ప్రకటిస్తూ, అడ్వాన్స్ గా 150,000 డాలర్లు ఆయన చేతిలో పెట్టడమే కాకుండా ఈ సినిమాల్లో వచ్చిన లాభాల్లో పాతిక శాతం అతనికిస్తారని ప్రకటించి సంచలనం సృష్టించింది RKO సంస్థ. ఇన్నిఆద్భుత అవకాశాల్ని ఒకే సారి అందిపుచ్చుకున్న ఈ కుర్రాడు అంతకుముందు సినిమాల్లో ఏమైనా పని చేసిన అనుభవం ఉండా అంటే అదీ లేదు. కాకపోతే ఆయన అప్పటికే కొన్ని నాటకాలను దర్శకత్వం వహించి ఉన్నాడు. అలాగే కొన్ని సంచలనాత్మకమైన (హెచ్.జి.వెల్స్ రచించిన ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ నవలను రేడియోలో నాటికలా ప్రసారం చేస్తే జనాలు అదంతా నిజమనుకుని నానా హడావుడి చేసారట) రేడియో ప్రోగ్రామ్ లు కూడా రూపొందించి మంచి పేరు ప్రఖ్యాతలే సంపాదించి ఉన్నాడు. అయినప్పటికీ అంత పెద్ద బాధ్యత ఆయనకివ్వడమూ ఆయన ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించడమూ అద్భుతమైన విషయమే. ఇదంతా చూసి హాలీవుడ్ లో చాలామంది ముక్కున వేలేసుకున్నారు, పక్కకు వెళ్ళి బచ్చా గాడు వీడేం చేస్తాడనీ కూడా అనుకున్నారు. ఈ కుర్రాడేమైనా సామాన్యుడా! అంతా చేసి తనకు దొరికిన అవకాశం ఒక చిన్న పిల్లాడికిచ్చిన రైలు బొమ్మతో (This is the biggest electric train a boy ever had!)పోల్చాడు. ఆ యువ సంచలనం పేరు Orson Welles.

కాంట్రాక్ట్ ఐతే రాసుకున్నారు కానీ ఐడియాల మీద ఐడియాలొచ్చేసాయి ఆర్సన్ వెల్స్ కి. ఇదా అదా అని ఆలోచిస్తూనే కాలం గడిచిపోయింది. ఒకానొక సమయంలో జోసెఫ్ కాన్రాడ్ రచించిన హార్ట్ ఆఫ్ డార్క్నెస్ ని సినిమాగా తీసేద్దామని కూడా నిశ్చయానికి వచ్చేసాడు. అయితే కాంట్రాక్ట్ మరో మూడు నెలల్లో రద్దయిపోతుందన్న సమయంలో Herman Mankiewicz ఇచ్చిన ఒక ఐడియా వెల్స్ కి చాలా నచ్చడంతో ఆ ఐడియా అధారంగా సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు.

ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే అమెరికాలో ఆ రోజుల్లో మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న విలియమ్ రాండాల్ఫ్ హర్స్ట్ అనే వ్యాపారవేత్త జీవితం ఆధారంగా సినిమా కథ రూపొందించడం. అనుకున్నట్టే ఆయన జీవితం ఆధారంగానే (హర్స్ట్ అనుమతి లేకుండానే) కథ సిద్ధం చేసి సినిమాగా రూపొందించారు. ఆ సినిమానే సిటిజన్ కేన్.

సినిమా విడుదలయింది. విమర్శకులు సినిమా చూసి అద్భుతం అన్నారు. న భూతో న భవిష్యతి అని ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా గురించి రాస్తూ Cecelia Ager ఈ విధంగా అన్నారు.

“Before Citizen Kane, it’s as if the motion picture was a slumbering monster, a mighty force stupidly sleeping, lying there, sleek, torpid, complacent—awaiting a fierce young man to come kick it to life, to rouse it, shake it, awaken it to its potentialities, to show it what it’s got. Seeing it, it’s as if you never really saw a movie before.”

అలాగే Bosley Crowther మాటల్లో చెప్పాలంటే…

“Citizen Kane is far and away the most surprising and cinematically exciting motion picture to be seen here in many a moon … it comes close to being the most sensational film ever made in Hollywood.”

ఇలా తన తొలి సినిమానే అత్యధ్భుతంగా తెరకెక్కించారని ఆర్సన్ వెల్స్ కి పేరయితే వచ్చింది కానీ ఈ సినిమాని చూడ్డానికి మాత్రం జనాలు రాలేదు. అంటే జనాలకి సినిమా నచ్చక కాదు. దీని వెనుక పెద్ద కుట్రే వుంది. తన జీవితాన్ని అనుమతి లేకుండా తెరకెక్కించాడన్న అక్కసుతో విలియమ్ రాండాల్ఫ్ హర్స్ట్ ఆర్సన్ వెల్స్ పై కక్ష గట్టాడు. సిటిజెన్ కేన్ సినిమా ప్రింట్లన్నీ కొని కాల్చి బూడిద చెయ్యాలనుకున్నాడు కానీ కుదర్లేదు. దాంతో సిటిజెన్ కేన్ సినిమాకి తన పత్రికల ద్వారా ప్రచారం చెయ్యనివ్వలేదు. అలాగే ఆ సినిమా ప్రదర్శించిన థియేటర్ యాజమాన్యం పై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని బెదిరింపులకి దిగాడు. మొత్తానికి ఆయననుకున్నదంతా చేశాడు. సిటిజెన్ కేన్ బాక్సులు బాక్సాఫీస్ దగ్గర  పెద్దగా కాసులు రాల్చలేదు.

సిటిజన్ కేన్ సినిమాతో RKO కి భారీగా నష్టపోలేదు కానీ పెద్దగా లాభాలు కూడా రాలేదు.వెల్స్ తో వరుసగా మూడు సినిమాలు నిర్మించాలనుకున్న RKO మాట తప్పలేదు కానీ సిటిజన్ కేన్ లో వెల్స్ కి దొరికిన స్వాతంత్ర్యం మిగిలిన సినిమాల్లో లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిటిజన్ కేన్ వెల్స్ జీవితంలోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ సినిమాగా నిలిచిపోయింది కానీ అంతటి గొప్ప సినిమా తీయగలిగే అవకాశం ఆయనకు మరోసారి లేకుండా పోయింది.

ఇంతకీ ఏంటీ సినిమాలోని గొప్పతనం?

సిటిజన్ కేన్ అనే ఈ సినిమా 60 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఒప్పుకుంటారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో కథ సంగతి పక్కనపెడితే ఈ కథ చెప్పిన తీరు ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో కూడా వైవిధ్యమైనదే. సినిమా కథను సంఘటనలు జరిగిన సమయానుక్రమంలో సరళ రీతిళో కాకుండా, విరళ రీతి (non-linear) లో చెప్పడం సిటిజన్ కేన్ తోనే మొదలయింది. అలాగే ఈ సినిమా మరెన్నో ప్రక్రియల్లో కూడా ఈ సినిమా ప్రత్యేకతలను కలిగిఉంటుంది. ఉదాహరణకు, సినిమాటోగ్రఫీ విభాగంలో డీప్ ఫోకస్ అనే ప్రక్రియను మొదటి సారిగా ఈ సినిమాలోనే ఉపయోగించారు. అలాగే సౌండ్ డిజైన్లో కూడా కొత్త ప్రక్రియలు ఈ సినిమాలో చోటుచేసుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఉపయోగించిన భావవ్యక్తీకరణ పద్ధతుల గురించి కూడా ఎంతో చెప్పుకోవచ్చు.

కథనం

హాలీవుడ్లో సిటిజెన్ కేన్ కి పూర్వం వచ్చిన చాలా సినిమాల్లో కథ ఎవరి దృష్టి కోణం నుంచీ నడవక ఒక న్యూట్రల్ లేదా unrestricted దృష్టికోణంలో నడిచేవి. ఇలాంటి కథల్లో ప్రేక్షకులకు సినిమాలో పాత్రలకంటే ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే సిటిజన్ కేన్ లో అలా కాదు. సినిమా మొదలవ్వడం ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొదలవుతుంది. చార్లెస్ ఫాస్టర్ కేన్ యొక్క పెద్ద కోట బయట “NO TRESPASSING” అనే బోర్డు చూపుతూ సినిమా మొదలవుతుంది. అక్కడే మనకు దర్శకుడు ఇది మామూలు సినిమాల్లాగా కాదు, మీరు ఇంతకు ముందు సినిమాల్లోలాగా పాత్రల జీవితాల్లోకి వెళ్ళిపోలేరు అని సింబాలిక్ గా చెప్తాడు. కోట బయట నుంచి చిన్నగా కెమెరా కదుల్తూ కేన్ బెడ్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ కేన్ జీవితపు ఆఖరు క్షణాల్లో ఉంటాడు. చనిపోయే ముందు అతని నోటినుంచి వెలువడే చివరి పదం “రోజ్ బడ్”.

ఓపెనింగ్ సీన్ వీడియో

ఇలా రోజ్ బడ్ అంటూ కేన్ చనిపోవడంతో మొదటి సీన్ ముగుస్తుంది. ప్రేక్షకుడిగా మనకున్న దృష్టికోణాన్ని అక్కడితో లాగేసుకుంటాడు వెల్స్. అక్కడ్నుంచీ ప్రేక్షకులకు ఒక గైడెడ్ టూర్ లాంటిది మొదలవుతుంది. దాదాపు రెండు గంటలపాటు ఆరుగురు నెరేటర్స్ ద్వారా మనం కేన్ జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం.

మొదటగా మనం కేన్స్ జీవితం గురించి ఒక న్యూస్ రీల్ ద్వారా తెలుసుకుంటాం. ఈ న్యూస్ రీల్ లో కేన్ ఎంత గొప్ప వ్యాపారవేత్తో తెలుస్తుంది. ఈ న్యూస్ రీల్ తర్వాత ఒక పత్రికా విలేఖరి కేన్ చనిపోయే ముందు రోజ్ బడ్ అని ఎందుకు అన్నాడో తెలుసుకునే ప్రయత్నంలో కేన్ తో బాగా పరిచయమున్న ఐదుగురిని కలిసి వారి ద్వారా కేన్ జీవిత విశేషాలు తెలుసుకుంటాడు. అయితే ఈ ఐదుగురు చెప్పే విషయాలు ఒక వరుసక్రమంలో ఉండవు. అదీకాకా ఈ ఐదుగురు కేన్ జీవితంలోని వివిధ దశల్లో పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి మనకి కేన్ జీవితంలోని ఆయా దశల గురించి మాత్రమే తెలుసుకుంటాం.

ఇలా వివిధ వ్యక్తుల దృష్టికోణాల్లో కేన్ గురించి మనం వివిధ విషయాలు తెలుసుకుంటాం. అంతే తప్ప అంతకుముందు వచ్చిన హాలీవుడ్ సినిమాల్లోలాగా మనకి సినిమాలో పాత్రలకంటే ఎక్కువ తెలిసుకునే అవకాశం ఇవ్వడు వెల్స్. నా దృష్టిలో ఇలాంటి కథ-కథనాలు ప్రేక్షకులను సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తాయని నమ్మకం.

సిటిజన్ కేన్ సినిమా మొత్తంలో మనకి ముక్కకు ముక్కలుగా కేన్ గురించి కొన్ని వివరాలు తెలుస్తాయి. అయితే ఈ విషయాలన్నీ దర్శకుడు సమ్మరైజ్ చేసి మనకి చెప్పడు. జిగ్ సా పజిల్లోని కొన్ని ముక్కలు మాత్రమే మనకిస్తాడు దర్శకుడు. వాటిని మనల్నే పేర్చుకోమంటాడు. అదీకాక అన్ని ముక్కలూ ఇవ్వడు. మిస్సయినవాటిని మనల్నే పూర్తిచేసుకోమంటాడు. ఈ విధంగా సిటిజన్ కేన్ చూడ్డంలో కేవలం వినోదమే కాక కాస్త మెదడుకి మేత కూడా లభిస్తుంది.

అయితే సినిమా మొదట్లో మనల్ని కెమెరాతో పాటు తీసుకెళ్ళి ఇక చాలు వెళ్ళి నేను చూపించేది చూడండి అని ప్రేక్షకులని సినిమా ప్రపంచంలోంచి బయటకి తోసేసిన దర్శకుడు సినిమా చివరలో మనల్ని మళ్ళీ అప్యాయంగా సినిమా ప్రపంచంలోకి ఆహ్వానిస్తాడు. కేన్ ’రోజ్ బడ్’ అంటూ ఎందుకు చనిపోయాడో తెలుసుకోడానికి బయలుదేరిన రిపోర్టర్ చివరకు ఆ విషయం తెలుసుకోలేకపోతాడు. అయితే దర్శకుడూ ప్రేక్షకుడికి మాత్రం ఈ విషయం గురించి పూర్తిగా చెప్పకపోయినా ఒ హింట్ ఇస్తాడు.

సినిమాటోగ్రఫీ

సిటిజన్ కేన్ మొదటి సారిగా నేను 2000 సంవత్సరంలో చూశాను. అప్పటికే పల్ప్ ఫిక్షన్ సినిమా చూసి ఉండడంతో ఈ సినిమాలోని నాన్ లీనియర్ నెరేటివి గురించి కొంచెం అవగాహన ఉండడంతో పెద్దగా ఎక్సైట్ కాలేదు కానీ ఆ రోజుల్లోనే నాన్ లీనియర్ నెరేటివా అని ఆశ్చర్యం కలిగింది. అయితే ఈ సినిమాలో బాగా నచ్చిన విషయాలు (అప్పటికి పెద్దగా సినిమా పరిజ్ఞానం లేనప్పటికీ) కొన్నున్నాయి. నాకు బాగా నచ్చిన విషయం సినిమాటోగ్రఫీ. గతంలో చూసిన చాలా సినిమాలకంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కేన్ చిన్నప్పుడు మంచులో ఆడుకునే సీన్. (వీడియో చూడండి). ఈ సీన్ చూడగానే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని నాకనిపించింది కానీ ఆ ప్రత్యేకత ఏంటో అప్పుడు నాకర్థం కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ళకు సిటిజన్ గురించి చదువుతుంటే తెలిసింది ఈ టెక్నిక్ ని డీప్ ఫోకస అంటారని. డీప్ ఫోకస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రేములో ఉన్న ప్రతి వస్తువూ ఫోకస్ లో ఉంటుంది. అది దగ్గర వున్న వస్తువులైనా, దూరంగా ఉన్న వస్తువులైనా. అయితే ఈ రోజుల్లో ఉన్న లెన్స్ లతో డీప్ ఫోకస్ ఫోటోగ్రఫీ కష్టం కాదు గానీ ఆ రోజుల్లో ఇది ఒక ప్రయోగం అని చెప్పొచ్చు. అయితే కేవలం డీప్ ఫోకస్ మాత్రమే కాకుండా ఫ్రేమింగ్ మరియు స్టేజింగ్ లను కలిపి ఈ టెక్నిక్ వాడడం వల్ల ఈ సీన్ చాలా బావుంటుంది.

అలాగే ఈ సినిమాలో నాకు నచ్చిన మరో సీన్ కూడా సినిమాటోగ్రఫీ కి సంబంధించినదే.

కేన్ గురించి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో థాంప్సన్ అనే రిపోర్టర్ కేన్స్ రెండో భార్యను సుసాన్ ని కలుస్తాడు. ఈ సీన్లో కెమెరా సుసాన్ నడిపే ఒక నైట్ క్లబ్ బయట మొదలవుతుంది. ఆ నైట్ క్లబ్ బయట ఉన్న బోర్డ్ దగ్గర కెమెరా మొదలయ్యి పైకి కదుల్తూ ఆ క్లబ్ రూఫ్ టాప్ పై నున్న ఒక అద్దం లోనుంచి కెమెరా క్లబ్ లోపలికి ప్రవేశిస్తుంది. మొదటి సారి ఈ సీన్ చూసినప్పుడు అలా ఎలా చేసారబ్బా అనే ఆశ్చర్యంతో రెండు మూడు సార్లు రివర్స్ చేసుకుని చూసాను. ఎందుకంటే ఎంత పెద్ద క్రేన్లున్నా కూడా ఈ రోజుల్లో కూడా ఆ షాట్ తియ్యడం చాలా కష్టం. కానీ నాలుగైదు సార్లు చూసాక ఆ షాట్ ఒక ట్రిక్ షాట్ అని అర్థమయింది కానీ ఎలా చేసుంటారో అర్థం కాలేదు. తర్వాతెప్పుడో మేకింగ్ ఆఫ్ సిటిజన్ కేన్ చూస్తుంటే ఆ ట్రిక్ ఏంటో తెలిసింది.

ఈ సీన్లో మనం బయటనుంచి చూసిన నైట్ క్లబ్ బిల్డింగ్ అసలు బిల్డింగే కాదు. అది ఒక మినియేచర్ సెట్. అందుకే అక్కడ కెమరా ఇష్టమొచ్చినట్టు జరపగలిగారు. అలా జరుగుతూ కెమరా ఆ మినియేచర్ బిల్డింగ్ పై కప్పు చేరుకున్నప్పుడు ఒక మెరుపు మెరుస్తుంది (ఈ సీను మొదలయ్యేటప్పటికే బయట వర్షం పడుతుంటుంది). అలా తలుక్కున మెరిసినప్పుడు కట్ చేసి క్లబ్ లోపల సీన్ మొదలవుతుంది. మొదటి సారి చూసినప్పుడు ఇది కట్ లేకుండా ఉందనుకుంటారు చాలామంది. అయితే తన తెలివితేటల్తో మనల్ని అలా నమ్మింపచేస్తాడు కానీ నిజానికి అక్కడ కట్ ఉందన్న విషయం తెలియనవ్వకుండా చేస్తాడు వెల్స్.

ఈ సీన్ ఇక్కడ చూడొచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో అడుగడుగునా ఎన్నో కెమెరా విన్యాసాలు మనకి కనిపిస్తాయి. ఇలాంటి ఎన్నో కొత్త టెక్నిక్ లు ఈ సినిమాతోనే మొదలయ్యాయని చెప్పొచ్చు.అందుకే ఈ సినిమా నేటికీ నెంబర్ వన్ గా నిలిచిందనిపిస్తుంది.

ఈ సినిమా గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికే వ్యాసం నాలుగైదు పేజీలు దాటిపోవడంతో ఆ విశేషాలు మరో వ్యాసంలో కొనసాగిస్తాను.నేనే కాదు మీరు కూడా ఈ వ్యాసాన్ని కొనసాగించవచ్చు.

9 Comments
  1. అబ్రకదబ్ర January 1, 2009 /
  2. చందు January 2, 2009 /
  3. విష్ణువర్థన్ రెడ్డి January 2, 2009 /
  4. ceenu January 2, 2009 /
  5. Rohiniprasad January 4, 2009 /
  6. చందు January 6, 2009 /
  7. అబ్రకదబ్ర January 6, 2009 /