Menu

అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం

అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు.

జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో కియారోస్తమి జన్మించారు. బాల్యంలోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న కియారోస్తమి తర్వాత ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. ఒంటరిగా కాలం గడుపుతూ చదువు పై పెద్దగా శ్రద్ధ చూపెట్టని కియారోస్తమి బాల్యం నుంచే కళాకారుడు కావాలని కలలుగనే వాడు. పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వవిద్యాలయంలో చేరి లలిత కళలు నేర్చుకోవాలనిఆసక్తి చూపినా అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేకపోవడంతో అక్కడ్నుంచి బయటపడి కొన్నాళ్ళు ట్రాఫిక్ పోలీస్ గా పని చేశాడు. ఇదే సమయంలో మరో కళాశాలలో చేరి ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు ట్రాఫిక్ పోలీస్ గా ఉద్యోగం చేసేవాడు. కళాశాలలో చిత్రకళ ను అభ్యసించి బయటకు వచ్చాక చాలా రోజులు కమర్షియల్ ఆర్టిస్ట్ గా పుస్తకాలకు కవర్ పేజీలు డిజైన్ చేయడం, పోస్టర్స్ డిజైన్ చేయడం వంటివి చేసేవాడు. అక్కడ్నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ టివి లో కమర్షయల్స్ కు దర్శకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు. 1960-1969 ల మధ్య కాలంలో కియారోస్తమి దాదాపు 150 కి పైగా కమర్షియల్స్ డైరెక్ట్ చేశాడు.

ఈ సమయంలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని (Firuz Shiravanlu) తన ఆధ్వర్యంలో నెలకొల్పనున్న ఒక సంస్థకు చిత్ర నిర్మాణంలో సహాయం చేయాలని కియారోస్తమి ని కోరడంతో తన ఉద్యోగం వదిలి పూర్తి స్థాయి సినిమా నిర్మాణం వైపు మళ్ళారాయన. 1970 లో ఈ సంస్థ (Kanun-Intellectual Development of Children and Young Adults) నిర్మించిన”The Bread and Alley’ అనే పది నిమిషాల లఘు చిత్రం ద్వారా కియారోస్తమి చలనచిత్ర రంగంలో తన తొలి అడుగు వేశాడు.

Kanun లో బాలలకు మంచి విలువలు ప్రబోధించే చిత్రాల నిర్మాణం చేపట్టిన కియారోస్తమి ఆ తర్వాత కాలంలో పూర్తి నిడివి చిత్రాల నిర్మాణం చేపట్టారు. కానీ Kanun లో కియారోస్తమి నిర్మించిన చిత్రాలు చాలా వరకూ ఆయన భవిష్యత్తులో నిర్మించే చిత్రాలను ప్రభావితం చేసాయనడంలో సందేహం లేదు. Kanun లో ఉండగా నిర్మించిన బాలల చిత్రాల వలే కియారోస్తమి నిర్మించిన చాలా చిత్రాలు ఎంతో minimalistic గా ఉండడమే కాకుండా ఈయన రూపొందించిన చాలా సినిమాల్లో చిన్న పిల్లలు ప్రధాన పాత్ర పోషిస్తారు.

Kanun అనే ప్రభుత్వ సంస్థ నిర్మాణంలో సినిమాలు రూపొందించడం మొదలుపెట్టిన కియారోస్తమి కమర్షియల్ సినిమా ఫార్మట్ లోని రొటీన్ పోకడలకు దూరంగా తనకంటూ ఒక శైలి ని ఏర్పరుచుకునే స్వాతంత్ర్యం లభించడంతో రొటీన్ సినిమాల జోలికి పోకుండా వైవిధ్యమైన కథలను తెరకెక్కించారు.

కియరోస్తమి దర్శకత్వంలో వచ్చిన  సినిమాల్లో తప్పక చూడాల్సినవి:

 • A taste of Cherry
 • The Wind will Carry Us
 • Close Up
 • Where is my friends’ Home?
 • And Life Goes On
 • Ten

అత్యంత చిన్నవైన కథలు ఈయన సినిమాలకు ప్రత్యేకం. ఉదాహరణకు: ‘Where is my friends’ home?’ సినిమాలో కథ చాలా చిన్నది. ఒక పాఠశాలలో మొహమద్ రెదా అనే విద్యార్థి ఉంటాడు. అతను ఎప్పుడూ హోమ్ వర్క్ సరిగ్గా చేయడు. ఆరోజు క్లాసులో హోమ్ వర్క్ చెయ్యకుండా వచ్చినందుకు మొహమద్ రెదా పై మండిపడతాడు టీచర్. అంతే కాకుండా తర్వాత రోజు హోమ్ వర్క్ చెయ్యకుండా వస్తే ఇక స్కూల్ కి రానివ్వనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక సంఘటనలో మొహమద్ హోమ్ వర్క్ చెయ్యాల్సిన నోట్ బుక్ అహ్మద్ అనే యువకుడి చేతిలోకి వస్తుంది-కానీ ఇంటికి చేరుకున్నాక కానీ ఆ విషయం గ్రహించడు అహ్మద్. ఇక సినిమా అంతా ఆ రోజు సాయంత్రం మొహమద్ రెదా ఇల్లు వెతికి ఆ పుస్తకాన్నితిరిగివ్వడంలో అహ్మద్ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో సాగుతుంది.

అలాగే ‘Taste of Cherry’ అనే సినిమాలో కూడా కథ చాలా చిన్నదే. జీవితం మీద విరక్తి చెందిన ఒక వ్యక్తి ఇరాన్ లోని ఒక పట్టణంలో కార్లో తిరుగుతూ దారిన పోయే వాళ్ళకి అడిగి మరీ లిఫ్ట్ ఇస్తాడు. కార్లో ఎక్కిన వాళ్ళకు ఆయన ఒక కోరిక కోరుతాడు. తను ఆ రాత్రి నిద్ర మాత్రలు మింగి ఒక గోతిలో పడుకుంటానని, ఉదయాన్నే వచ్చి తను మరణించి ఉంటే ఆ గోతిని మట్టితో కప్పి వెళ్ళాలని అడుగుతాడు. అందుకు ప్రతిగా చాలా డబ్బులు ఇస్తానని చెప్పినా చాలా మంది ఒప్పుకోరు. ఇలా రోజంతా తను కలుసుకొన్న వివిధ వ్యక్తుల మధ్య కార్లో జరిగే సంభాషణలతో సినిమా సాగుతుంది.

ఈ రెండు సినిమాలే కాదు దాదాపు కియారోస్తమి నిర్మించిన సినిమాలన్నింటిలోనూ కథలు చాలా చిన్నవే. అయితే ఈ కథలు చెప్తూ ఆయన తన సినిమాల ద్వారా చర్చించే విషయాలు మాత్రం అత్యంత క్లిష్టమైనవి.

అబ్బాస్  కియరోస్తమీ తన చలనచిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం మాత్రమే కాదు, తోటి దర్శకుల చేత కూడా వేనోళ్ళ ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా మాటల్లో చెప్పాలంటే “…నేను అమితంగా ఇష్టపడే సినిమా దర్శకుడు సత్యజిత్ రే ఈ లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు నేను బాగా కలత చెందాను. కాని కియరస్తోమి సినిమాలు చూసాక రే వదలిన వెలితిని పూడ్చగలిగే మరో దర్శకున్ని మనకిచ్చినందుకు దేవునికి కృతఙ్ఞతలు తెలిపాను.”

ప్రపంచంలోని వివిధ చలనచిత్రోత్సవాల్లోనే కాకుండా వివిధ సంస్థల ద్వారా కియరోస్తమీ దాదాపు రెండు వందలకి పైగానే అవార్డులు అందుకున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రఖ్యాతి గాంచినా ఆయన ఏనాడు తన దేశం వదిలి సినిమాలు తీయలేదు. అవకాశం ఉండి కూడా ఇతర దేశాల్లో ఎందుకు సినిమాలు తీయలేదన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు ఆయన-“బాగా ఏపుగా ఎదిగిన ఒక చెట్టును వేర్లతో పెకలించి మరో చోటుకు తరలించి నాటితే ఆ చెట్టు తిరిగి పూలు పూయకపోవచ్చు. ఒక వేళ పూసినా ఆ పూలు అంతకు ముందంత సువాసనలు కలిగి ఉండకపోవచ్చు. అది సహజం. అలాగే నేను కుడా నా దేశం వదిలి ఇతర దేశాల్లో సినిమాలు తీసుంటే నేను ఆ చెట్టులా అయ్యుండే వాడిని”

9 Comments
 1. j.suryaprakash December 10, 2008 /
 2. saif ali gorey December 10, 2008 /
 3. rao December 11, 2008 /
 4. మేడేపల్లి శేషు December 11, 2008 /
 5. ravi December 11, 2008 /