Menu

షత్రంజ్ కే ఖిలాడి (1977)

ఒక సినిమాను చూస్తూ ఉండగానే – “వావ్…” అనుకుంటూ…పూర్తవగానే…”వావ్వ్వ్వ్వ్” అని అనుకోవడం ఇటీవలి కాలంలో జరగలేదు నాకు. సత్యజిత్ రాయ్ హిందీ చిత్రం ’శత్రంజ్ కే ఖిలాడీ’ చూసాక, అలాంటి అనుభవం కలిగింది. చిన్నప్పుడు దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షల్లో – ఒక పాఠ్యాంశంగా ప్రేంచంద్ ’శత్రంజ్ కే ఖిలాడీ’ ఉన్నట్లు గుర్తు. అదే ఈచిత్రానికి మూలం. చారిత్రక సంఘటన ఆధారంగా రాసిన ఈకథ, ఒరిజినల్ ఎలా చదివానో, అప్పటికి స్కూలు రోజుల్లో నాకేం అర్థమైందో నాకు గుర్తులేదు కానీ, ఒక సినిమాగా దీన్ని తీసిన పద్ధతి, కథను నడిపిన పద్ధతి మాత్రం అమోఘం.

కథ: కథాకాలం 1856. ఔద్ నవాబు వజీద్ అలీ షా (అమ్జాద్ ఖాన్) కళల పట్ల అనురక్తిలో మునిగితేలి రాజ్యపాలనను నిర్లక్ష్యం చేస్తాడు. దాన్ని సాకుగా చెప్పి, అప్పటికి కొన్నాళ్ళుగా మిత్రరాజ్యంగా చెలామణి ఔతున్న ఔద్ ని, కొత్త ఒప్పందం సృష్టించి, దాని ద్వారా హస్తగతం చేసుకోవాలన్నది ఈస్ట్ ఇండియా కంపెనీ, లార్డ్ డల్హౌసీ ల ప్లాను. ఈ బాధ్యత వారి అధికారి జేమ్స్ ఓట్రం (రిచర్డ్ ఆటెన్బరో) అప్పగిస్తారు. ఇది ఇలా ఉంటే, దీనికి సమాంతరంగా, ఇద్దరు రాజ కుటుంబీకుల చదరంగం పిచ్చి కథ. మీర్జా సజ్జద్ అలీ (సంజీవ్ కుమార్), మీర్ రోషన్ అలీ(సయీద్ జాఫ్రీ) -ఇద్దరూ చదరంగం ప్రేమికులు. రోజు పొడుగుతా ఆడుతూ ఉండటమే వీళ్ళపని. భార్య ఏంచేస్తోంది, తనకెలా ఉంది…. ఏదీ పట్టించుకోరు. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే, బ్రిటీషు వారు ఔద్ ఆక్రమించుకోబోతున్నారని తెలియగానే, ఇల్లువదిలి ఊరవతలకి ఎక్కడికో పోయి చదరంగం ఆడుకుంటూ గడిపేంత. స్థూలంగా ఇదీ కథ. ఔద్ ఆక్రమణానికి ఇలా ఆకాలం నాటి రాజకుటుంబాల్లోని నిర్లక్ష్య వైఖరే కారణం – అన్న వ్యాఖ్య ఈ సినిమా కథకి ఆయువు పట్టు అని నా అభిప్రాయం.

సత్యజిత్ రాయ్ సినిమాలు నేను చూసిందే తక్కువ కానీ, ఇంత గ్రాండ్ గా తీస్తారనుకోలేదు. రెండు బెర్గ్మాన్ సినిమాలు (వైల్డ్ స్ట్రాబెరీస్, పర్సోనా) చూసి, ఆతరువాత మూడో చిత్రం – “ఫానీ అండ్ అలెగ్జాండర్” చూశేసరికి, చాలా గ్రాండ్ గా తీసాడేంటి ఈయన – అని ఆశ్చర్యపోయా దాదాపు రెండేళ్ళక్రితం (లంకె ఇక్కడ). సత్యజిత్ రాయ్ తో కూడా అదే అనుభవమైంది ఇప్పుడు. 🙂

ఇక కథనం విషయానికొస్తే, అద్భుతంగా అనిపించింది నాకు. మరీ నెమ్మదిగా కాక, మరీ వేగంగా కాక, మాటలు తక్కువున్న చోట్ల చేతలూ, చేతలు తక్కువున్న చోట మాటలూ – అన్నీ కలిపి – దీన్ని చూడ్డం ఒక మంచి అనుభవం అనిపించింది. సంగీతం కూడా సత్యజిత్ రాయ్ చేతులమీదుగానే జరిగింది – నాకు శాస్త్రీయ సంగీతాల పరిచయం లేదుకానీ, వినసొంపుగా ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది – నటీనటుల ప్రదర్శన. నాకు మొత్తం అందరూ నచ్చారు. చాలా శ్రద్ధగా ఎంపిక చేసినట్లున్నారు. అతికినట్లు సరిపోయారు వారి వారి పాత్రలకి. సంభాషణల రచయితలుగా ముగ్గురి పేర్లున్నాయి (సత్యజిత్ రాయ్ సహా) – మరీ క్లిష్టమైన ఉర్దూ పక్కన పెడితే (నాకు అర్థం కాదు కనుక), చాలా బాగున్నాయి సంభాషణలు. మరీ పొడుగు సంభాషణలు ఎక్కడా లేవు. (రాజుల సినిమా అని, అలాంటివి ఎక్కువుంటాయేమో అని భయపడ్డాను).

అసలు వీటినన్నింటికీ మించి, ఈసినిమాలో నటించకపోయినా వాయిస్ ఓవర్ చెప్పి – అమితాబ్ బచ్చన్ ఈసినిమాలో నటులంత ప్రభావితం చేశాడు. వాయిస్ ఓవర్ చాలా బాగుంది.

నాకు బాగా నచ్చిన దృశ్యాలు:
– సినిమా మొదటి పది-పదిహేను నిముషాల్లో : రాజు ప్రవర్తనను చూపిస్తూనే, ఔద్ చరిత్ర చెప్పిన పద్ధతి, అక్కడ వాడిన చిత్రాలు : చరిత్రను చక్కగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పాయి.

-ఓట్రం, అతని సహాయాధికారి కెప్టెన్ వెస్టన్ (టామ్ ఆల్టర్) మధ్య జరిగిన తొలి సంభాషణ.

– మీర్ -మీర్జాలు మీర్జా ఇంట్లో చదరంగంలో మునిగి ఉన్నప్పుడు, ఒంటరిగా, నెగ్లెక్ట్ కాబడ్డ భావనలో ఉంటున్న మీర్జా భార్య (షబానా అజ్మీ) పరిస్థితిని చూపిన విధానం. ఆ ఒక్క భాగం మాత్రం, కాలాతీతమైనది అనిపిస్తుంది నాకు. ఏకాలంలో నైనా, ఆ దృశ్యం చూసి ఆమె పాత్రలో తమను తాము చూసుకునే ఆడవారు ఉంటారని నా అభిప్రాయం. ఆమెలోని సంఘర్షణను, ఆ భార్యా-భర్తల మధ్య నడిచే కథా చూపే ఆ పది-పదిహేను నిముషాలూ అద్భుతం. మళ్ళీ మళ్ళీ చూడమన్నా చూస్తాను నేను.

-రాజ్యం హస్తగతం చేయమని రాజుకి బ్రిటీష్ వారు వర్తమానం పంపినప్పుడు రాజు స్పందన చూపే దృశ్యాలు. ఆయనగారు అక్కడకూడా కవిత్వం ఎలా చెప్పగలిగాడో (రోము తగలడుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు), కానీ, అమ్జాద్ ఖాన్ మాత్రం – డైలాగులు లేనప్పుడు కూడా ముఖ కవళికల్లోనే చాలా మాట్లాడాడు అనిపించింది. బాధని వంద డైలాగుల్లో చెప్పడం ఒక పద్ధతి, బాధని అభినయించడం ఒక పద్ధతి. అమ్జాద్ ఖాన్ ది రెండో పద్ధతి.

-క్లైమాక్స్ దృశ్యంలో మీర్జా-మీర్ లు గొడవపడి, కాసేపటికి మళ్ళీ కలుసుకునే దృశ్యం

(ఈ ఐదూ కలుపుకుంటే సినిమా కథ పూర్తయినట్లే!)

– ఈసినిమాని ఒక సోషల్ సెటైర్ గా కూడా అనుకోవచ్చేమో అనిపించింది అక్కడక్కడా. ప్రధానంగా, ఇలా, ఇంటిని పట్టించుకోకుండా ’చెస్’ ఆడుకోడం లాంటివేదో చేసి, ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం; మీర్ సాహెబ్ లాగా భార్య ఇంకొకరితో రిలేషన్ లో ఉందని గమనించినా, దాన్ని ఎదుర్కునే ధైర్యంలేక (ఎదుర్కుంటే తన తప్పులు ఎత్తిచూపుతారు కదా!) ఆమెని ఆపకపోవడం, బాధ్యతలని విస్మరించి స్వంత సుఖాల్లో మునగడం – ఇలాంటివన్నీ, ఇప్పటికీ చాలా కుటుంబాల్లో చూస్తున్నవే. అలాగే, ఈచిత్రం ఎమర్జెన్సీ టైంలో తీసారట. ఇందులో ’నోబెల్ మెన్’ ప్రదర్శించిన నిరాసక్తత వంటిదే చాలా మంది ప్రదర్శించినందువల్లే ఇందిరాగాంధీ అలా చేయగలిగింది – అనేసి దీనికీ, అప్పటి రాజకీయాలకీ ముడిపెట్టే వాదం కూడా ఒకటి చదివాను నెట్లో.

మొత్తానికి, తప్పక చూడవలసిన సినిమా. కథ చదివి సినిమా చూసినా, నిరాశ చెందే అవకాశాలు తక్కువంటాన్నేను. కొన్ని పర్సనల్ జ్ఞాపకాల పరంగా ఇందులో నాకు నచ్చినవి: ఎన్నోరోజులకి ఫరూక్ షేక్ నటించిన చిత్రం చూడ్డం, ’ఆరాధన’ చిత్రంలో తప్ప ఫరీదా జలాల్ యువతిగా ఎలా ఉంటుందో చూడని నేను, ఇందులో చూడ్డం, ఇందులో పోషించిన తరహా పాత్రలో తొలిసారి షబానా అజ్మీ ని చూడ్డం – ఇటువంటివి.

సినిమా వివరాలు:
శత్రంజ్ కే ఖిలాడీ
నిర్మాణం: 1977
దర్శకత్వం, సంగీతం: సత్యజిత్ రాయ్
(అన్నట్లు, ఇది రాయ్ తొలి హిందీ చిత్రం).

9 Comments
  1. kolord97@gmail.com April 5, 2010 /
  2. Keshavcharan April 6, 2010 /
  3. Sowmya V.B. April 7, 2010 /
  4. Faustin Donnegal April 7, 2010 /
  5. Sowmya January 25, 2012 /
    • Sowmya January 26, 2012 /