Menu

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – III

(ఈ వ్యాసాల్లో ఇది మూడవది, ఆఖరిది. మొదటి భాగంలో కథా నిర్ణయం, తూర్పు పశ్చిమ దేశాల సినిమా ప్రభావం, ఎడిటింగ్ – రెండవ భాగంలో సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ పరిచయం చేసాను. ఈ మూడవ భాగంలో రూపకల్పన, నటులు, దర్శకత్వం వరుసగా పరిచయం చేస్తున్నాను.)

7. రూపకల్పన

ఏ రంగంలో అయినా చేసిన పనికి అత్యుత్తమ స్థాయి గుర్తింపుకి బీజం ఆ పనిలో గుర్తించగలిగే అతి చిన్న వివరాలే అన్న విషయం అందరికీ తెలుసు. సినీరంగంలో కూడా అంతే! కళాపరంగా గొప్ప సినిమాలో దాగిన అతి పెద్ద నిజం అతి చిన్న వివరాల్లో ఉంటుంది. రాయ్‌కి గురుతుల్యుడు లాంటి ఫ్రెంచ్ దర్శకుడు పెన్వార్ సలహా, “నీ సినిమాలో ఎన్నో విషయాలు ఇమిడి ఉండక్కరలేదు. కాకపోతే సరైన విషయాలు, అవీ భావావేశమైన విషయాలు ఉంటే చాలు!” ఇక్కడ రూపకల్పన గురించి మాట్లాడుతున్నాం. అంటే, సెట్లు గానీ, ప్రకృతి సిద్ధమైన దృశ్యంకానీ అన్న మాట. దానికీ జీవం, వ్యక్తిత్వం ఉంటుంది. ఉదాహరణకి, చారులత సినిమాలో ఉపయోగించిన ఇల్లు ఇన్ – డోర్‌లో నిర్మించారు. సినిమా అంతా ఈ ఇంటిలో చిత్రీకరించారు. ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ ఇల్లు. దీనికీ ఒక వ్యక్తిత్వం ఉంది. అందుకనే, ఈ ఇల్లు రూపకల్పనలో రాయ్ అతని బృందం ఎంతో శ్రద్ధగా పని చేసి చాలా వివరాలను నిర్ధారించారు.

సినిమా తియ్యటంలో ఉన్న అన్ని సాంకేతిక విషయాల్లో రాయ్‌దే పైచెయ్యి. రాయ్ మాటే ఆఖరి మాట. పని చేసే ప్రతి టెక్‌నీషియన్ తమ వంతు కృషి చేస్తూ రాయ్‌కి అండదండగా ఉంటారు. ఎందుకంటే, రాయ్ తన తోటి టెక్‌నీషియన్‌లని అతి గౌరవంతో చూస్తాడు. వాళ్లకి కూడా, రాయ్‌కి చాలా విషయాలు తెలుసునని తెలుసు. అందుకే శ్రద్ధగా పనిచేస్తారు. ఉదాహరణకి, కొన్ని సార్లు, అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలని రాయ్ తిరస్కరించటం జరిగింది. ఇది ఎందుకు జరిగిందో తెలియని రాయ్ బృందంలో కొందరు ఈ నిర్ణయం విషయమై ఆశ్చర్యపోయారు. రాయ్ ఉద్దేశ్యంలో అసలు తియ్యదలుచుకున్న సీన్ కంటే, వెనగ్గా కనిపించే ఆ దృశ్యమే బలంగా ఉంటే, చిత్రీకరిస్తున్న సీన్ చూసేదెవరు?

8. నటులు

charulata-iiసినిమా నటులకి – దర్శకులకి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. నటుల నుంచి కావల్సిన మంచి నటన రాబట్టటం దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. మరీ పెద్ద నటులతో పని చెయ్యటం రాయ్‌కి కష్టంగా తోస్తుందేమో! రాయ్ ఎన్నుకున్న నటులంతా పెద్ద నటనానుభవం లేని వాళ్ళే! రాయ్ సినిమాల్లో నటించిన తరవాత వాళ్ళు పెద్ద నటులుగా మారి ఉండవచ్చు. నటులను ఎన్నుకోటంలో కూడా రాయ్ సూక్ష్మ దృష్టిని గమనించకుండా ఉండలేం. నటుల పట్ల రాయ్ అభిప్రాయం – ” చాలాసార్లు నటనానుభవం ఎక్కువ లేనివారితో పనిచెయ్యటం సులభమేమో! నాకు ఇలాంటి విషయాల్లో ఒక ప్రత్యేక పద్ధతి అంటూ లేదు. మంచి నటన రాబట్టటంలో మన పద్ధతి నిరంతరం మార్చుకుంటూ ఉండాలి. కానీ మనకి ఎటువంటి వ్యక్తితో పని చేస్తున్నామో బాగా తెలియాలి. నటుడు (నటి) సామర్ధ్యం, తెలివి తేటలు దర్శకుడికి తప్పకుండా తెలియాలి. నేను అప్పడప్పుడు నటుల్ని కీలుబొమ్మల్లాగా ఉపయోగిస్తాను. నేననుకున్న ప్రత్యేకతలను నటన తీసుకురావటంలో సాధిస్తాము.”

నటించటం మానేసిన తరవాత కూడా, తెర మీద నటుడనే వ్యక్తి ఇంకా జీవం ఉన్న పాత్రగానే మిగిలిపోతాడు అన్న సత్యం గమనిస్తే, వెండి తెరపై నటించే నటులకి (రంగస్థల నటుల కన్న) అంత గ్లామర్ ఎందుకు ఉంటుందో అర్ధమవుతుంది.

రాయ్‌తో పని చేసిన విభిన్న వ్యక్తుల అభిప్రాయాలు రాయ్ గురించి:

sharmilaమొదట తను మాట్లాడతాడు. మాట్లాడుతూ, కళ్ళలోకి గుచ్చి చూస్తాడు. తరవాత ఒక సీన్ చదువుతూ కళ్ళ ఎత్తుకు సరిపోయేట్టు దగ్గరగా వచ్చి, చూపుతో చూపు కలుపుతాడు. అప్పుడు మనల్ని నటించమంటాడు. అది సరిగా వచ్చినట్టయితే, ఇంకా కోంచెం నెమ్మదిగా కదలికలు ఇమ్మని సూచిస్తాడు. అంతేగాని, “ఇంకా ఎక్కువ మోహంతో నటించు”, లేదా “అయిష్టం చూపించు” లాంటి పదాలు ఉపయోగించడు. నాకు నిజంగా తెలియదు కానీ, ఆయన దగ్గర నటించడం చాలా సులభం. తను ఎక్కువ ఏమీ చెప్పడు. ఆయనతో పనిచేస్తుంటే నటన సహజంగా సులభంగా వస్తుంది. – షర్మిలా ఠాగోర్

మట్టి ముద్దగా ఉన్న నన్ను అందమైన బొమ్మగా మలచి, జ్ఞానం బహుమానంగా ఇచ్చాడు – మాధవి ముఖర్జీ

మానిక్‌దా (బెంగాలీ సినీ పరిశ్రమలో రాయ్‌కి ఉన్న నిక్ నేం) ఉత్తమశ్రేణికి చెందిన నటుడు. ఆయన నాకు – భావ వ్యక్తీకరణ, దాన్ని ప్రేక్షకులతో పంచగలిగే శక్తి, సమయాన్ని ఎలా వినియోగించటం – వంటి నటపరమైన ఎన్నో విషయాలు నేర్పాడు. – రవి ఘోష్

9. దర్శకత్వం

ఏ మాత్రం శ్రమ, అట్టహాసమైన కుదుపులు లేకుండా రాయ్ గీసిన చిత్రం ప్రేక్షకుల్లో అంతులేని అలజడి కలిగిస్తుంది. ఇది ఎలా సాధిస్తాడు? ఇందులో అనవసరమైన, అవకతవకలున్న సినిమాటొగ్రఫీ కిటుకులు ఏమీ లేవు. అందులోనే ఉంది రాయ్ పాండిత్య ప్రకర్ష రహస్యం!

ఇక్కడ ఉదాహరించిన ఒక్క విషయం గమనిస్తే రాయ్ దర్శకత్వపు విలువలు బోధపడతాయి. మన దేశంలో ప్రాచీన చిత్రకళకి సంబంధించిన ఎన్నో వివరాలు చెక్కు చెదరకుండా ఈ నాటికీ మనకి మిగిలి ఉన్నాయి కదా! ఉదాహరణకి అజంతా గుహల్లోని చిత్రాలు, మొగల్, రాజపుట్ వర్ణచిత్రాల్లో ఎన్నో వివరాలనుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆకాశం బాక్‌గ్రౌండులో ఏటవాలుగా సమాంతరంగా ఉన్న ఐదారు గీతలు, చుక్కలు పెడితే వర్షం, కప్పుకున్న ముసుగు గాలికి బాగా కదిలిపోతూ ఉన్న స్త్రీని చూపిస్తే భయంకరమైన తుఫాను రాబోతుందన్న సంకేతం, – ప్రేమ, విరహం, ఆనందం, విచారం, కోపం, సిగ్గు, ఈర్ష్య వంటి మొఖంలోని భావాలను ఒక మనిషి శరీరంలోని భంగిమల ద్వారా ఎంతో నేర్పుతో చూపించవచ్చు. సినిమా తీసే దర్శకులు ఇలాంటి వివరాలనుంచి ఎంతో నేర్చుకోవచ్చు!

ముగింపు

సినిమా నిర్మాణంలో అన్ని అంశాలపై రాయ్ సాధికారతను తెలిపే ఈ క్రింది వాక్యానికి ఎంతో భాష్యం చెప్పుకోవచ్చు!.

సినిమాకి సంబంధించిన ప్రతి విషయం క్లిష్టమైనదే!

( ఈ వ్యాస రచనకి రాయ్ సినిమాలు చూట్టంతో పాటు ఎన్నో పుస్తకాలు కూడా ఉపయోగపడ్డాయి. కొన్ని సంగతులు యథాతధంగా ఈ పుస్తకాల్లోంచి వాడుకున్నా. ఆ పుస్తకాలు అందుబాటులో లేని తెలుగు వారికి ఈ విషయాలు తెలియచెయ్యటమే ముఖ్యోద్దేశ్యం. ఇంతకు ముందు రాయ్ సినిమాలు నాలుగు “ఈమాట ‘ వెబ్ పత్రికలో పరిచయం చేసాను. మిగిలినవి కూడా త్వరలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. విజ్ఞులైన తెలుగు సినీ ప్రియులకి ఈ పరిచయాలు సహృదయంతో స్వీకరిస్తారనే భావిస్తున్నాను!)

–ఐపోయింది–

–విష్ణుభొట్ల లక్ష్మన్న

6 Comments
  1. baleandu June 8, 2009 /
      • baleandu June 10, 2009 /
    • baleandu June 10, 2009 /
  2. Srinivas June 8, 2009 /