Menu

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – II

(మొదటి భాగంలో రాయ్ సినిమాలపై మూడు అంశాలను పరిచయం చేసాను. అవి కథా నిర్ణయం, తూర్పు – పశ్చిమ సినిమాల ప్రభావం, ఎడిటింగ్. ఈ రెండవ భాగంలో – సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ అంశాలను పరిచయం చేస్తున్నాను. – రచయిత)

4. సంగీతం
రాయ్ అపు చిత్రత్రయంలోని మూడు సినిమాలకు సంగీతం ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ సమకూర్చాడు. ఆ పై వచ్చిన ఒకటి, రెండు సినిమాలకి తప్ప తరవాత సినిమాలకు రాయ్ స్వయంగా సంగీతం అందించటం మొదలెట్టాడు. ప్రత్యేకంగా, రాయ్‌కి అటు పాశ్చాత్య సంగీతం ఇటు భారతీయ సంగీతం, రెండిటిలో చెప్పుకోతగ్గ ప్రవేశం ఉండటమే కాకుండా, సినిమాలకి ఎటువంటి సంగీతం ఉపయోగించాలో కూడా బాగా తెలుసు.

పాశ్చాత్య సంగీతం పై రాయ్ స్పందన సహజంగా లోతైనది, ధృఢమైనది. దానికి తోడు ఒకటి, రెండు పుస్తకాలు సినిమాల బాగోగులు మీద చదవటం సహాయపడింది. రాయ్ మాటల్లో, “ఎంత ఆశ్చర్యం! సినిమాకి, సంగీతానికి ఎన్ని పోలికలు! రెండూ సమయం గడుస్తున్న కొద్దీ వాటిలోని రహస్యాలను విప్పి చెపుతాయి. రెంటికీ లయ, రసం – అంటే బాధ, ఆనందం, లోతైన ఆలోచనాత్మకం, సందడిగా ఉండటం, విచారం, ఉల్లాసం – ప్రధానమైనవి.”  ఇక్కడ సంగీతం అంటే, పాశ్చాత్య సంగీతానికి మాత్రమే పరిమితమైన పోలికలు ఇవి. ఎందుకంటే, భారతీయ సంగీతంలో అప్పటికప్పుడు సృష్టి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న వ్యవధిలో బాణీలో వైవిధ్యం తీసుకురావటానికి అవకాశం ఎక్కువ. పైగా భారతీయ సంగీతం అలంకార ప్రధానమైనది. ఇందులో నాటకీయత లేదు. అతి నెమ్మదిగా మొదలై వేగమైన ముగింపును ఇస్తుంది. ఈ ప్రయాణంలో అతి సంక్లిష్టమైన లోతుల్ని చూపుతుంది. ఒక రాగంలో ఉన్న స్వరాల ద్వారా అనుభూతుల్ని ప్రేక్షకులకి ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు సంగీతకారుడు. అందుకనే, మన సంగీతం గొప్పతనం అత్యుత్తమ స్థాయికి చేరిన విద్వాంసులు మాత్రమే చూపగలరు. ఈ యాత్రలో సంగీతంలోని అందం, బిగి, ఉద్రేకం చూపిస్తూ సంగీతం ఘనత చూపిస్తాడు విద్వాంసుడు. కానీ, ఇందులో నాటకీయత చూపించలేడు. ఎందుకంటే, మన సంగీతంలో ఘర్షణ లేదు!

ravishankarనిజానికి పాశ్చాత్య, భారతీయ సంగీతాల్ని కలగలిపే అవకాశాలు చారులత సినిమాతో రాయ్‌కి మొదలయ్యాయి. ఆ అనుభవంతో రాయ్ ఈ రెండు సంగీతాలని ఒక్కటిగానే చూసాడు! పూర్తిగా రాగం బద్ధమైన సంగీతం సినిమాకు సరిపోదని రాయ్ గమనించటం ఆలోచింపతగ్గది. ఎందుకంటే, సగటు భారతీయుడికి ఇది అర్ధం కాదు. కానీ, పాశ్చాత్య సంగీతం ధోరణి సులువుగా బోధపడుతుంది. అందుకే ఈ రెండు సంగీతాల్ని కలిపే ప్రయోగాలని తన సినిమాల్లో చేసాడు.

ఏదో మనవాళ్ళని మనం పొగుడుకోటం కాదు. రష్యన్ ప్రముఖ చెల్లో వాయిద్యకారుడు, సంగీత దర్శకుడు రొస్ట్రోపోవిచ్ రాయ్ సినిమా సంగీతంపై తన అభిప్రాయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోటం చాలా అవసరం.

“తన సినిమాల్లో అందించిన సంగీతానికి నేను రాయ్‌కి సర్వదా కృతజ్ఞుణ్ణి. సినిమాలో జరిగే సంఘటనలకి ఏదో ఆసరాగా ఉండే సంగీతం కాదు రాయ్ సమకూర్చింది. సినిమాలోని వ్యక్తుల హృదయాలను, వారి మనోభావాలను అత్యంత ప్రతిభతో సంగీతంతో వ్యక్త పరచటం రాయ్ చేసాడు. ఇంత గొప్ప కళాకారుడికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను.”

mstislav_rostropovich
“షేక్‌స్ఫియర్ వాలా” సినిమాకి రాయ్ సంగీతం అందించినందుకు ప్రముఖ అమెరికన్ చిత్ర దర్శకుడు జేంస్ ఐవరీ ఎంతో సంతోషంగా, ” రాయ్ ఒక్కడే నా ‘షేక్‌స్ఫియర్ వాలా’ సినిమాకి సమర్ధవంతంగా సంగీతం ఇవ్వగలిగినవాడు. ఎందుకంటే, ఈ సినిమాలో ఉన్న వేరు వేరు ప్రపంచాలు – అంగ్లో ఇండియన్ ప్రపంచం, విక్టోరియన్ బ్రిటీష్ ప్రపంచం, నవీన బొంబాయి సినిమా ప్రపంచం, షేక్‌స్ఫియర్ నాటక ప్రపంచం – అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అర్ధం చేసుకొని వాటి ప్రభావాలను ఆశ్చర్యకరంగా మిళితం చేసి సినిమా యొక్క అంతిమ విజయానికి తోడ్పడటం మరెవరితరం?”

5. కెమేరా పనితనం

ఈ క్రింది రాయ్ మాటల్లో ఎంత అర్ధం ఉందో తెలిస్తే, ఛాయాగ్రహణం పై కూడా రాయ్ ఎంత నిశితంగా ఆలోచించాడో తెలుస్తుంది.

“సినిమా తీసే వ్యక్తికి సులభంగా లభించే వాస్తవం, అంటే మన చుట్టూ కనిపించే దృశ్యాలు, ఫిల్మ్ మీద ఎక్కించటానికి వీలుగా దొరకదు. అతని చుట్టూ ఉండేది ముడి సరుకు. ఈ ముడిసరుకు నుంచి మంచి విషయాన్ని ఎంపిక చేయాలి. ఒక చిత్రం ద్వారా లభించే సమాచారం ముద్దలుగా ఉంటుంది సినిమాలో చూపించే ప్రతిబింబం (ఒక సీన్) ఎన్నో వివరాలతో నిండి ఉంటుంది. ఇంకో మాటల్లొ చెప్పాలంటే, తెర మీద కెమేరా ద్వారా చిత్రంలో చూపించే భాష, సంభాషణలలో పదాల ద్వారా చూపించే భాష కన్నా విసృతమైనది. సినిమా చిత్రించే వ్యక్తి అసలైన పనితనం, ప్రేక్షకుల దృష్టిని చెప్పదల్చుకున్న విషయంపై ఏకాగ్రతతో లగ్నం చేయగలగటం.”

కెమేరా పని ముఖ్యంగా ఇంగిత జ్ఞానానికి సంబంధించినది. పనితనం ఉన్న కెమేరామాన్ ఒక దృశ్యాన్ని మామూలుగా అందరూ చూసినట్టు కాకుండా, కెమేరాలోని లెన్సు ద్వారా చూస్తాడు.

రాయ్ సినిమాలకి మొదటి లైటింగ్ కెమేరామాన్‌గా పనిచేసిన సుబ్రత మిత్ర కెమేరా పనితనంపై తన అభిప్రాయాలను ఇలా తెలియచేస్తాడు.

” నిజానికి నాకు అతి చక్కని, కొత్త కెమేరాతో పనిచేయటం చాలా ఇష్టం. సాంకేతికంగా అతి చక్కటి ఫొటోగ్రఫీ ప్రేక్షకులకి అందివ్వటానికి అది అనుమానం లేకుండా ఉపయోగపడుతుంది. కానీ, కళా పరంగా అతి ఎక్కువ విలువలున్న సినిమా చిత్రీకరించటానికి అది అంత అవసరం కాదు. అతి సాధారణ కెమేరాతో కూడా కళా పరంగా అతి చక్కని విలువలున్న సినిమా చిత్రీకరించవచ్చు! ఒక ప్రముఖ కంటి డాక్టర్ అన్నట్టు ‘మనం కళ్ళతో కాదు ప్రపంచాన్ని చూసేది, మన బ్రెయిన్‌తో.’ ఫొటోగ్రఫీ విషయంలో కూడా ఇది చక్కగా వర్తిస్తుంది.”

6. స్క్రిప్ట్

రాయ్ ఎప్పుడూ రెండు సినిమాలపై ఒకేసారి పనిచేయలేదు. ఒకే రకమైన సినిమాలు వెంట వెంటనే తీయటం రాయ్‌కి పడదు. అందుకేనేమో, అపుచిత్రత్రయంలోని పథేర్ పాంచాలి, అపరాజితో సినిమాల వెంటనే అపు సంసార్ సినిమా చిత్రించకుండా, పరాస్ పత్తర్, జల్సాఘర్ సినిమాల తరవాత అపుచిత్రత్రయంలోని మూడో సినిమా మొదలెట్టాడు. ఇందుకు కారణం రాయ్‌లోని అశాంతో, దిశా రాహిత్యమో, లేక తన ధృక్పధంలోని అస్పష్టతో తెలియదు. ఒక విషయం మాత్రం రాయ్‌కి ఖచ్చితంగా తెలుసు. జీవితం అందించే అనేక అందాలు – ఆనందాలు, అనేక కాలాల్లో జరిగిన చరిత్ర, అన్నిటికన్నా సినిమా చిత్రీకరించటంలో ఉన్న అనేక వైవిధ్యాలు రాయ్‌కి ఇష్టం. రాయ్ సినిమాకి కథ రాస్తున్నప్పుడు తన జీవితంలో పరిచయమున్న పాత్రలను ఉపయోగించుకోటం చూస్తాం! తనకి ముఖాముఖి పరిచయం లేని పాత్రలను, మరొకరి సహాయంతో అర్ధం చేసుకోగలనని రాయ్ స్వయంగా చెప్పుకున్నాడు. మనస్తత్వ శాస్త్రం రాయ్ సినిమా నిర్మాణంలో అతి ముఖ్యమైనది అన్న విషయం “చారులత” సినిమాలో స్పష్టంగా తెలుస్తుంది. ఒక పాత్ర మానసిక స్థితి లోని మార్పు – ఆ పాత్ర అంతరంగంలో వచ్చే మానసిక పరిణామం అత్యంత ప్రతిభతో “చారులత” సినిమాలో చిత్రీకరించాడు.

చిత్ర దర్శకులకి చిత్రనిర్మాణంలో తగినంత సృజన లేకపోవటంపై రాయ్ తన అసహనం చూపిస్తాడు. “ఒక రచయిత పదాల కోసం వెతుకుతుంటే, నిఘంటువు సాయపడగలదు. కానీ, చిత్ర నిర్మాణానికి నిఘంటువు లేదే! ఎన్ని సినిమాల్లో ఒక పాత్ర చావు చూపించటానికి వెలుగుతూ ఉన్న దీపాన్ని ఆర్పటం చూపించారో! ఈ ఒక్క విషయంలోనే సృజనకి ఎంతో అవకాశముంది” అని రాయ్ అంటాడు. “అపరాజితొ” సినిమాలో హరిహర్ పాత్ర మరణం నిర్ధారించటానికి రివ్వున గాల్లోకి ఎగిరి వలయాకారంగా తిరిగే పావురాలను చూపటం రాయ్ సృజనకి ఒక ఉదాహరణ. ఇదే సినిమాలో, మరొక ముఖ్య పాత్ర సర్బజయ మరణాన్ని సూచించటానికి, ఆమె ఇంటి పక్కనే ఉన్న చెరువు దగ్గర ముసిరిన మిణుగురు పురుగులను చిత్రీకరిస్తాడు రాయ్.

సినిమాలో సంభాషణలపై రాయ్ ఆలోచనలు ఇలా ఉంటాయి. “సంభాషణలు వింటున్నప్పుడు ఆ రచయితను ఎవ్వరూ స్మరించుకోనివే ఉత్తమ సంభాషణలు!” సంభాషణల పట్ల రాయ్ అభిప్రాయాలు సినిమా రచయితలందరూ తెలుసుకోవాలి. రాయ్ సినిమాల్లో అతి కీలకమైన సన్నివేశాల్లో సంభాషణలు ఉండవు అన్న విషయం సినిమా ప్రియులు గమనించే ఉంటారు!

(ఇంకా ఉంది)

Part-I


2 Comments
  1. Mohan ram prasad July 20, 2011 /