Menu

మహానగర్

ఈ మధ్యనే సత్యజిత్ రాయ్ తీసిన “ఫెలూదా” సినిమాలు రెండు చూసాను. వాటిల్లో ఒక దాని గురించి నా బ్లాగులో రాస్కుంటే, చూసిన వారు ఒకరు “మహానగర్” చిత్రం యూట్యూబ్లో ఉందని తెలిపారు. వారితో నాకు పరిచయం లేదు కానీ, “సంగీత” గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా గురించి నా ఆలోచనలు:

కథ: ఈ కథ యాభైల ప్రాంతానిది అనిపిస్తుంది.  ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం – సంపాదించేది ఒక్కరు. తినేది అయన కాక మరి ఐదుగురు. సుబ్రతో ఒక బ్యాంకులో గుమాస్తా గా పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో అతని తల్లిదండ్రులు, చెల్లెలు, భార్య, కొడుకు -అందరికీ అతని సంపాదనే ఆధారం. రాన్రాను సంసారం గడవడం కష్టం అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అతను ఎవరొ స్నేహితుడి భార్య ఉద్యోగం చేస్తోందని మాటల సందర్భంలో చెప్పడంతో అతని భార్య ఆరతి తను కూడా ఉద్యోగం చేసి సుబ్రోతో భారాన్ని పంచుకోవాలి అనుకుని అతన్ని ఒప్పిస్తుంది. ఈ విషయంలో సుబ్రోతో ఆమెని సమర్థించి ఆమెకి ఉద్యోగం వెదకడంలో సాయం కూడా చేస్తాడు కానీ,  అత్త-మామలు అంత తేలిగ్గా అంగీకరించలేకపోతారు. ఆఖరుకి ఆరతి కొడుకు కూడా అమ్మ బైటకి వెళ్ళిపోతుందని కోపం తెచ్చుకుంటాడు. సరే, ఏదైతేనేం, భర్త సహకారంతో ఆరతి ఉద్యోగంలో చేరుతుంది. ఒక పక్క ఆమె ఉద్యోగంలో ఎదుగుతూ ఉండగా ఉన్నట్లుండి సుబ్రోతో పని చేస్తున్న బ్యాంకు దివాలా తీసి అతని ఉద్యోగం పోతుంది. అప్పటికే సుబ్రోతో లో భార్య ఉద్యోగినిగా ఎదగడంపై అసహనం మొదలై ఉంటుంది. ఒకపక్క ఆరతికి మాత్రం కొత్త  స్నేహాలు, తనపై తనకి నమ్మకం పెరుగుతూ ఉంటుంది. కానీ, సుబ్రోతో ఉద్యోగం పోవడం మూలాన ఇంటి ఆర్ధిక పరిస్థితి అయోమయంలో పడుతుంది. ఈ పరిస్థితుల్లో తోటి ఉద్యోగినికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఒకరోజు ఆరతి తన ఉద్యోగానికి రాజీనామా ఇస్తుంది. తరువాత, చివరికి కథ సుఖాంతం కాకపోయినా, ఆశవహకంగా ముగుస్తుంది.

ఆ కాలం నాటికి ఒక గృహిణి ఉద్యోగంలో చేరడం అన్నది కొంచెం విప్లవాత్మకమైన ఆలోచనే ఏమో అనిపించింది. నేను పెరుగుతున్నప్పుడు (తొంభైలలో) కూడా, గృహిణులు చాలా సాధారణంగా కనిపించేవారు. ఇప్పుడు కూడా వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాంటప్పుడు ఒక యాభై ఏళ్ల క్రితం స్త్రీలు ఉద్యోగంలోకి వెళ్ళడం అన్న ఆలోచనే బహుసా పాప సమానం అనుకుంటూ ఉండొచ్చు చాలామంది చాందసవాదులు. ముప్పైల్లో ఉన్న ఒక స్నేహితుడు ఉద్యోగం చేసే అమ్మాయిల గురించి ఉద్యోగం చేసుకుంటున్న నాతోనే చులకనగా మాట్లాడాడు మరి, దాదాపు ఐదేళ్ళ క్రితం! ఇంత నేపథ్యంలో ఇన్నేళ్ళ తరువాత ౨౦౧౧ లో చూసినా కూడా, ఆ మామగారి ఆలోచన విధానం వింతగా అనిపించలేదు. ఇక, ఆ ఇల్లు , ఇంట్లో వాతావరణం, నటీనటుల మధ్య  సంభాషణలు – అన్నీ చాలా సహజంగా అనిపించాయి. హీరోయిన్ మాధవి ముఖర్జీ ఆ పాత్రకి చక్కగా కుదిరింది. హీరో చెల్లెలుగా వేసిన అమ్మాయి జయబాధురి అంటే ఒక పట్టాన నమ్మలేకపోయాను. కానీ, సినిమాలో నన్ను బాగా ఆలోచింపజేసిన దృశ్యాలు:

౧) ఆడవాళ్ళూ ఉద్యోగం చేయడం నచ్చని ఆ పెద్దాయన తన పాత స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి అడుక్కోవడం
౨) బాస్ గారికి ఆంగ్లో ఇండియన్స్ పై ఉండే భావం
౩) క్లైమాక్స్ దృశ్యం (హీరో నిజం హీరో అనిపించాడు!)
౪) ఉపాధ్యాయుల జీవితాలలో ఉన్న ఐరనీపై  రాసిన సంభాషణలు
౫) ఆరతి ఉద్యోగానికి వెళ్ళడం మొదలయిన కొత్తల్లో ఆ ఇంట్లో వాళ్ళ ప్రవర్తనల్లో మార్పులు…ముఖ్యంగా ఆరతి కొడుకు అలక
– ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. నెమ్మదిగా సాగించడం వెనుక ఇలా ప్రభావం కలిగించే ప్రయత్నం ఉంటుందా? అయినా కూడా, అక్కడక్కడా ఈ సినిమా నాకు మరీ నెమ్మదిగా అనిపించింది. బహుశా, ఆ తరానికి అదే నప్పిందేమో!నా మట్టుకు నాకు, ఆకాలానికి అది కాస్త అభ్యుదయంతో కూడిన కథే. ఒక్కసారిగా, సినిమా ముగిసేసరికి రకరకాల ఆలోచనలు వెల్లువలా ముంచెత్తుతాయి. తీసి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఆ “ఇంపాక్ట్” ఇలా ఉందంటే, అప్పట్లో ఎలా ఉండిందో! అసలు, ఆ క్లైమాక్స్ దృశ్యం కోసమన్నా నేను ఈ సినిమా చూడమని చెబుతాను. మొత్తానికి, సినిమాలకి స్క్రిప్టు ఎలా రాసుకుంటారో? ప్రతి దృశ్యాన్నీ ఎలా ఊహించుకుంటారో? అన్న నా శాశ్వత మీమాంస మళ్ళీ నా ముందుకొచ్చింది.