Menu

మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబ జీవితంలో ఎంతటి పరిణామమో ’మహానగర్’ సినిమా వివరిస్తుంది. కలకత్తా మహానగరాన్ని అందులో నివసించే మధ్య తరగతి జీవుల సామాజిక, ఆర్థిక సంఘర్షనల్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తుంది.పాత తరానికి కొత్త తరానికి మధ్య, సనాతన సంస్కృతికి పురోగామి దృక్పథానికి మధ్య జరిగే సంక్లిష్ట సంఘర్షణ మహానగర్ లో ప్రస్పుటమవుతుంది.సత్యజిత్ రే నిర్మించిన అన్ని చిత్రాల్లాగే మహానగర్ లో కూడా భావనాత్మకమైన ఉద్వేగం ఆవిష్కృతమవుతుంది.సత్యజిత్ రే మాటల్లోనే చెప్పుకోవాలంటే “సాధారణ మానవున్ని, మనకు రోజూ రోడ్లపైన కనిపించే మనిషిని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని చలన చిత్రాత్మకమైన అన్వేషణ చేయడం అంత సులువుకాదు. స్పష్టాస్పష్టంగా కనిపించే వినిపించే సాధారణ జీవన రేఖల్ని సినిమా చేయడం కష్టసాధ్యమే” అలాంటి కష్టాన్నే సత్యజిత్ రే తన ’మహానగర్’లో చిత్రీకరించి చూపారు.

ఓ మధ్య తరగతి కుటుంబంలోని గృహిణి తన భర్త సూచన మేరకు ఆర్థికంగా తన కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు గాను ఉద్యోగానికి వెళ్తుంది.కాని తాను పనిచేసే స్థలంలో ఎదుర్కొనే పరిస్థితులు, బయటి ప్రపంచాన్ని చూసిన అనుభవ పర్యవసానంగా ఆమె వ్యక్తిగా తనని తాను స్థిఈకరించుకుంటుంది.కాని ఆమె వ్యక్తిత్వ వికాసం ఆమె భర్తతో సహా ఇంట్లో అందరిపైనా తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది.అప్పటిదాకా ఆమెను కేవలం గృహిణిగానూ, స్త్రీగానూ చూస్తూ వచ్చిన ఆకుటుంబ సభ్యులు ఆమె వ్యక్తిగా ఎదిగి జీతాలు ఇంక్రిమెంట్లు, కమీషన్లు,అమ్మకాలు అంటూ మాట్లాడ్డం వారికి మింగుడుపడదు. ఆమె మామ ఆమెతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడడు. అత్తకి కూడా ఆమె స్వేచ్ఛ కంటగింపుగా తయారవుతుంది.చిన్నారి కొడుకు కూడా తన తల్లి అధిక సమయం ఉద్యోగం పనిమీడ తనకి దూరంగా ఉండడంతో విచారపడతాడు. ఇక ఆమె భర్త కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆమె ఉద్యోగం చేయడాన్ని మొదట్లో ప్రోత్సహించినా క్రమంగా ఆమె ఎదుగుదలని భరించలేకపోతాడు.అతని మేల్ గేజ్ ఇబ్బందుల్ళో పడుతుంది. ఇలా అమె ఉద్యోగిని కావడం వల్ల ఆమెకు వ్యక్తిత్వం వికసితమై, వ్యక్తిగా తనని తాను వ్యక్తీకరించుకునే స్థితి కలిగితే మరోవైపు ఆమె పూర్ణపరివర్తన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది.ఈ గందరగోళాన్ని సత్యజిత్ రే ’మహానగర్’ చిత్రంలో కళాత్మకంగా చూపిస్తాడు.ఇందులో రే ఇతర సినిమాలకి భిన్నంగా మానసిక అంతర్లోకాలకంటే బహిర్ స్థితినే చర్చించినప్పటికీ నగరమూ, ఉద్యోగమూ, కుటుంబమూ ఓ స్త్రీని ఎంతగా ప్రభావితం చేస్తాయో తనని తాను రూపొందించుకునే దిశలో ఆమె పడే యాతన,ఎదురు తిరిగే స్థితిని మహానగర్లో చూపిస్తాడు.

చిత్ర కథాంశం విషయానికి వస్తే కలకత్తా మహానగరంలో 1950 వ దశకం తొలినాళ్ల కాలమది.రిటైర్ అయిన ఓ సనాతన భావాలుకల స్కూలు టీచర్ కుటుంబ జీవన చిత్రమది. నరేంద్ర మిత్ర రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఓ మూడు గదుల ఇంటిలో తండ్రి, తల్లి, కొడుకు,కోడలు స్కూలుకు వెళ్లే కూతురు, ఓ చిన్నారి మనుమడు కలిసి జీవిస్తూ వుంటారు.ప్రియోగో పాల టీచర్ గా పనిచేసి రిటైర్డ్ జీవితం గడుపుతూంటాడు.అతని కొడుకు సుబ్రతా మజుందార్ ఓ బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే గడవాలి.ప్రియోగోపాల్ కి కళ్లద్దాలు లేకపోవడం వల్ల చూపు సరిగ్గా కనిపించడం లేదని బాధపడుతూ వుంటాడు.చిన్న చెల్లి స్కూలు ఫీజు బకాయి చెల్లించాలి. ఇలా అనేకసమస్యలు ముప్పిరిగొనగా తన జీతం సరిపోని స్థితిలో ఓ మిత్రున్ని అప్పు అడుగుతాడు సుబ్రతో. కాని అప్పు పుట్టదు. అదే విషయాన్ని భార్య ఆరతితో చెబుతాడు. తన మిత్రుడి భార్య కూడా ఉద్యోగం చేస్తుందని ఆమె తో అంటాడు. ఆ రాత్రి ఆరతి తీవ్రంగా ఆలోచిస్తుంది.పెరిగిపోతున్న అవసరాల దృష్ట్యా ఆరతికి ఉద్యోగ ప్రయత్నం ఆరంభిస్తాడు సుబ్రతో.రోజూ పత్రికల్లో వచ్ఛే ప్రకటల్ని చదివి వినిపిస్తూ వుంటాడు. ఓ రోజు కుట్టు మిషన్లు అమ్మే సంస్థలో సేల్స్ గర్ల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగం సంపాదిస్తుంది ఆరతి.ఆమె మామ ప్రియో ఆరతి ఉద్యోగం చేయడానికి అసలు అంగీకరించడు.తీవ్రంగా అభ్యంతరం చెబుతాడు.కాని సుబ్రతో అదేమీ గమనించకుండానే ఆరతిని ఉద్యోగంలో చేరమంటాడు.తల్లి ఏడుస్తుంది. ఆరతి కొడుకు పింటు తలి తనను విడిచి వెళ్లడం చూసి ఏడుస్తాడు. వీటిన్నంటి మధ్యా ఉద్యోగంలో చేరిన ఆరతికి ఆఫీసులో ఎడిత్ ఆనే ఆంగ్లో ఇండియన్ సన్నిహితమవుతుంది. ఎడిత్ స్నేహంగా ఆరతికి లిప్ స్టిక ఉపయోగించడాన్ని నేర్పుతుంది.సేల్స్ ఉమన్ గా మొదట్లో కొంత సిగ్గుతో ఉన్న ఆరతి క్రమంగా పుంజుకుంటుంది.ఎడిత్ తన యజమానితో తమ హక్కుల కోసం ఎదురు తిరుగుతుంది. యజమాని ముఖర్జీ ఎడిత్ ను వదిలించుకోవడానికి ఆరతిని వృత్తిలో అధికంగా ప్రోత్సాహిస్తాడు.

ఆరతి ఇంట్లో పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. సుబ్రతో తన సిగరేట్లకు కూడా ఆరతి పై ఆధారపడాల్సి వుంటుంది. మామ ప్రియోగోపాల్ ఆనారోగ్యం పాలవుతాడు. ఆరతి బ్యాగులో లిప్ స్టిక్ చూసిన సుబ్రతో ఆమె మరో ఆధునికమైపోతుందని భావిస్తాడు. ఓ రోజు ఓ హోటల్ లో ఆరతి మరో పరాయ్ పురుషుడితో మాట్లాడ్డాన్ని పేపరు చాటున గమనిస్తాడు సుబ్రతో. ఆరతి యజమానిని కలిసి తనకీ ఓ ఉద్యోగం ఇప్పించమంటాడు. మరోవైపు ఎడిత్ లేని సమయంలో ఆమె సేల్స్ చూసిన ఆరతి ఆమెను కలవడానికి ఇంటికి వెళ్తుంది. అక్కడా వారి స్థితి చూసి చలించిపోతుంది. మరుసటి రోజు ఆఫీసు టాయిలెట్  గదిలో ఏడుస్తున్న ఎడిత్ ను గమనించి ఆరతి విషయం తెలుసుకుంటుంది. ఎడిత్ ని ఉద్యోగంలోంచి తీసిపారేసారని తెలుసుకొని యజమానిని నిలదీస్తుంది. ఎడిత్ ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అంగీకరించడు ముఖర్జీ. అప్పటికే భర్త వత్తిడి మేరకు ఉద్యోగం వదిలేయాలని రాజీనామాకు సిద్దమైన ఆరతి భర్త కోసం కాకుండా ఎడిత్ ను ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకుంటే తన రాజీనామాను అంగీకరించమంటుంది. ముఖర్జీ ఖంగుతింటాడు. కొంత కాలం క్రితం వరకూ గృహిణిగా తమ ఇంటికే పరిమితమైన ఆరతి తోటి ఉద్యోగిని కోసం, మిత్రురాలి కోసం, హక్కుల కోసం యజమాన్యాన్ని వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా ఇస్తుంది. ఆ పూర్ణ పరిణామాన్ని సత్యజిత్ రే ప్రతిభావంతంగా మన ముందుంచుతాడు. రాజీనామా చేసి బయటకు వచ్చిన ఆరతిని కలిసిన భర్త సుబ్రతో ఈ విశాల కలకత్తా నగరంలో మనకి వేరే ఉద్యోగాలు దొరక్కపోవు అంటూ ఇద్దరూ కలిసి ముందడుగు వేయడం ఈ సినిమా ముగింపు.

ఆశావహమైన రీతిలో చిత్రాన్ని ముగించినప్పటికీ ’మహానగర్’ లో స్త్రీ సంఘర్షణ అందునా ఇంటి బయట అడుగుపెట్టి ఉద్యోగంలోకి వెళ్ళిన స్త్రీ ఎదుర్కొనే అనుభవాల్ని గొప్పగా వివరిస్తుంద. కథ మామూలుదే అయినా సత్యజిత్ రే సమస్య ని డీల్ చేసిన తీరు గొప్పగా ఉంటుంది.

’మహానగర్’ స్త్రీ పూర్ణ వికాసాన్ని జీవన యాత్రని చిత్రబద్దం చేస్తుంది. ఈ చిత్రం భారతీయ సినిమా రంగానికి మాధవి ముఖర్జీ లాంటి గొప్ప నటిని కూడా అందించింది.

3 Comments
  1. Uttara January 2, 2009 /
  2. Sowmya October 17, 2011 /
  3. vinay August 25, 2013 /