Menu

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – I

(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలో మూడవ వంతు కన్నా తక్కువ భాగం మాత్రమే అమెరికాలో ఒక తెలుగు సంఘం 25వ వార్షిక సంచికలో ఈ మధ్యే అచ్చయ్యింది. ఇంటర్‌నెట్ ప్రచురణలలో అటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అది అందుబాటులో ఉండనందువల్ల, మరి కొన్ని విషయాలు జోడించి, ఆ వ్యాసాన్ని పొడిగిస్తూ కొన్ని ఫొటోలతో సహా ఇక్కడ ప్రచురిస్తున్నాను. – రచయిత)

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అన్న వేటూరి సినీగీతం సత్యజిత్ రాయ్‌కి అచ్చంగా వర్తిస్తుంది. సినిమాలు ఇష్టం ఉన్న వారికి ప్రముఖ ప్రపంచ (బెంగాలీ) సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ గురించి తెలియకుండా ఉండదు. నా కాలేజీ రోజుల్లో రాయ్ సినిమాలు చాలా చూసాను కానీ వాటి గురించి ఎక్కువ పట్టించుకునే వాణ్ణి కాదు. ఈ మధ్య “ఈమాట” వెబ్ పత్రికలో రాయ్ సినిమాల మీద (ఒక సినిమా పై ఒక వ్యాసం చొప్పున) సమీక్షలు రాస్తూ, రాయ్ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. చిత్రమైన విషయం ఏమిటంటే రాయ్ సినిమాలపై తెలుగులో వచ్చిన సమీక్షలు, వ్యాసాలు తక్కువే! ప్రపంచ సినిమా రంగంలో గుర్తించబడ్డ తొలి భారతీయుడైన సత్యజిత్ రాయ్ సినిమాలను పరిచయం చేస్తూ తెలుగులో పుస్తకాలు కూడా ఉన్నట్టు లేదు. ఈ నేపధ్యంలో, 1955 సంవత్సరంలో “పథేర్ పాంచాలి” సినిమాతో సినిమారంగేట్రం చేసి, దాదాపు 26 సినిమాలకి దర్శకత్వం వహించిన సత్యజిత్ రాయ్ సినిమాల మీద ఒక సంగ్రహ సమీక్ష రాసే ప్రయత్నమే ఈ వ్యాసం. సత్యజిత్ రాయ్ సినిమాలతో మంచి పరిచయం ఉన్నవారికి, ఈ వ్యాసంలో కొత్త విషయాలు కనపడకపోవచ్చు (అలాంటి వారు, ఈ వ్యాసం చదవకుండా పక్కన పెట్టొచ్చు!). కానీ, ఈ వ్యాసం రాయటానికి ప్రేరణ, రాయ్ సినిమాల గురించి కుతూహలం ఉన్న వారికి ఇక్కడ ఇచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉండొచ్చు అన్న ఆలోచన మాత్రమే!

పరిపూర్ణత్వం

చాలా మంది చిత్ర దర్శకులకి సినిమా తియ్యటంలో ఉన్న ఒకటి, రెండు అంశాలపై సాధికారత ఉంటుందేమో! సత్యజిత్ రాయ్ అలా కాదు. సినిమా నిర్మాణంలో ఉన్న – నటనా దర్శకత్వం, సిన్మాటొగ్రఫీ (కెమేరా పనితనం), ఎడిటింగ్, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, రూపకల్పన (డిజైన్), కళా దర్శకత్వం, కాంతిని దానితో పాటు శబ్దాన్ని ఉపయోగించే తీరు – వంటి విభిన్న అంశాలలో నిష్ణాతుడు కావటంతో రాయ్ సినీప్రపంచంలో ఒక పరిపూర్ణతను సాధించాడనిపిస్తుంది. ఇంత బహుముఖత్వానికి బీజం – సినిమా మాధ్యమాన్ని మథించాలి అన్న పట్టుదలే!

ఈ పెద్ద వ్యాసాన్ని మూడు భాగాలుగా ప్రచురిస్తున్నా. మొదటి భాగంలో కథా నిర్ణయం, తూర్పు పశ్చిమ దేశాల సినిమా ప్రభావం, ఎడిటింగ్ – రెండవ భాగంలో సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ – మూడవ భాగంలో రూపకల్పన, నటులు, దర్శకత్వం వరుసగా పరిచయం చేస్తున్నాను. చివరగా చిన్న ముగింపు.

1. కథా నిర్ణయం

సినిమా విజయానికి ఒక మూలం “కథ” అనుకున్నట్టయితే దాన్ని వెండి తెరపై చూపించే కథనం కూడా ముఖ్యమైనదే! రాయ్ సినిమాలకి ఎన్నుకున్న కథలన్నీ మూసపోసినట్లు కాకుండా చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి, భారతీయ చలనచిత్రాల్లో అంతకు ముందెన్నడూ లేనట్టు ‘అపు చిత్రత్రయం’లో (పథేర్ పాంచాలి, అపరాజితొ, అపు సంసార్) చూపించిన గ్రామీణ వాతావరణం, ఆ వాతావరణంలో పెరిగిన పిల్లల జీవిత చిత్రీకరణల వల్ల – భారతీయ సినిమాలో ఏకైక విజయంగా నిలిచిపోయాయి ఈ సినిమాలు. ఇలా ఒక పక్క గ్రామీణ జీవితాన్ని చూపించిన రాయ్ పట్టణ మధ్య తరగతి జీవితాన్ని చూపించిన సినిమాలు కూడా తీసాడు (కాంచన జంగ, మహానగర్, నాయక్, అరణ్యర్ దిన్ రాత్రి). అలాగే మరో విలక్షణ చిత్రత్రయం ఠాగోర్‌కి నివాళిగా తీసిన తీన్ కన్యా, చారులత, ఘరేభైరే. సాంప్రదాయం పై తిరుగుబాటుగా తీసిన సినిమాలు – దేవి, సద్గతి కూడా చెప్పుకోతగ్గవే! అలాగే చరిత్రలో జరిగిన సంఘటనల పై చిత్రించిన షత్రంజ్ కా ఖిలారి, అశని సంకేత్ సినిమాలు గుర్తు పెట్టుకోతగ్గవి. చాలా మంది మంచి దర్శకులు విస్మరించిన చిన్న పిల్లలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలను రాయ్ ఎన్నుకుని అమోఘమైన విజయాలని సాధించాడు. గోపీ గాయెనె- భాగా బాయెనె, హిరక్ రాజా దేశె, సోనార్ కెల్లా, జై బాబు ఫేలూనాథ్, చిడియా ఖానా సినిమాలు ఈ కోవకు వస్తాయి. ఇవన్నీ ఇక్కడ ఉదాహరించడానికి కారణం రాయ్‌కి ఉన్న బహుముఖ ప్రతిభలోని ఒక కోణాన్ని మీ ముందుంచటమే!

2. తూర్పు – పశ్చిమ దేశాల సినిమా ప్రభావం

రాయ్ సినీవిజయాలకి ఒక కారణం రాయ్‌కి ప్రపంచ సినిమాతో ఉన్న గాఢమైన పరిచయం. ఒక పక్క అకీరా కురొసావా వంటి అతి ప్రతిభావంతుడైన జాపనీయ దర్శకుడు, మరో పక్క రెన్వార్ (ఫ్రెంచ్), బైసికిల్ థీఫ్ సినిమా తీసిన విట్టోరియా డె సికా (ఇటాలియన్) వంటి దర్శకుల ప్రభావం రాయ్ పై బలంగా ఉన్నాయి. సినిమా అన్న మాధ్యమం అర్ధం చేసుకోటానికి ఇలాంటి పరిచయాలు ఎంతో ఉపయోగ పడ్డాయని రాయ్ స్వయంగా చెప్పుకున్నాడు. ఎంతో మంది దర్శకులకి లేని మరొక ప్రతిభ రాయ్‌కి ఉన్న జర్నలిజం అనుభవం. సినిమాల్లోకి రాక ముందు రాయ్ జర్నలిష్టుగా 13 ఏళ్ళు పని చేసాడు. ప్రపంచ సినిమాలపై తన అనుభవాలు “మన సినిమాలు, వాళ్ళ సినిమాలు” అన్న పుస్తకంలో వివరంగా రాస్తాడు. అందువల్ల, రాయ్ ద్వారా సినిమా అన్న మాధ్యం గురించి ఎన్నో వివరాలు తెలుస్తాయి.

1940 దశాబ్దంలో శాంతినికేతన్‌లో లలిత కళలు, గ్రాఫిక్ డిజైనింగ్ అభ్యసించి బయటకు వచ్చిన రాయ్ ని సినిమాలు ఎంతో ఆకర్షించాయి. కానీ, భారతీయ సినిమాల్లో ఎంతసేపూ తీపి వలపుల ప్రేమ పాటలు, మార్మిక పురాణగాథలు రాజ్యమేలటం రాయ్‌ను చికాకు పెట్టాయి. “సినిమాకు జీవితమే ముడిసరుకు కావాలి. సినిమా వంటి జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలల్లో ఉండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన మన దేశం, చిత్ర దర్శకుల్ని కదిలించలేకపోటం విడ్డూరం. వాళ్ళు తమ కళ్ళూ, చెవులూ తెరుచుకుంటే చాలు!” ఈ వేదనే సత్యజిత్ రాయ్ ను సినిమాల వైపు ధృఢ సంకల్పంతో నడిపించింది.

3. ఎడిటింగ్

చిత్ర నిర్మాణంలో తగినంత గుర్తింపు లేని ఒక ముఖ్య అంశం “ఎడిటింగ్”. రాయ్ తన మొదటి సినిమా పథేర్ పంచాలి తీస్తున్నప్పుడే జరిగిన ఎడిటింగ్ అనుభవాన్ని రాయ్ ఆసక్తికరంగా ఇలా వివరిస్తాడు.

“సినిమా తీసే దర్శకులు ఎందుకు సినిమా తీయటంలో ఉండే సాధక బాధకాలు గురించి ఎక్కువగా రాయరు? సినిమా తీస్తున్నప్పుడు ఒక్క రోజులో జరిగే పని రాయాలన్నా కూడా కష్టమే! ఈ సినిమా తీసే ప్రక్రియ అతి సంక్లిష్టమైనది. సినిమా తీసేవాడికి, తీస్తున్న యంత్రాలు, (అంటే కేమేరా) తీయబడుతున్న వస్తువులు (అంటే నటీనటులు కాని, ప్రకృతి సంబంధమైన దృశ్యాలు కాని) మధ్య ఉండే త్రికోణ సంబంధం అర్ధం చేసుకోటం కష్టం. ఎంతటి ప్రతిభాశాలి అయిన దర్శకుడైనా అతని మసులో మెదిలే భావాలు స్పష్టంగా కాగితం మీద పెట్టటానికి భాష చాలదు. పథేర్ పంచాలి సినిమా తీస్తున్న మొదటి రోజే కొన్ని పాఠాలు నేర్చుకున్నా. ఉదాహరణకి, దుర్గ తన తమ్ముడు అపుకి తెలియ కుండా అపుని చూసే దృశ్యం తియ్యాలి. నేను మీడియం క్లోజప్ ఉండేట్లు ఒక మామూలు లెన్సు కెమేరాకు వాడదామనుకున్నా. ఈ దృశ్యంలో, దుర్గను నడుం నుంచి పైభాగం అంతా చూపిస్తూ తియ్యాలనుకొన్నా. ఆ రోజు షూటింగ్‌లో ఫొటోగ్రఫీ వృత్తిగా ఉన్న ఒక స్నేహితుడు షూటింగ్ లొకేషన్‌లో ఉన్నాడు. ఆ సీన్‌లో దుర్గ ఏం చెయ్యాలో నేను చెపుతున్నప్పుడు ఆ స్నేహితుడు నా కెమేరాను సవరించడం చూసా. అతను నేను పెట్టిన మీడియం క్లోజప్ లెన్సు తీసేసి లాంగ్ క్లోజప్ లెన్సు పెట్టి నన్ను కెమేరా నుంచి దుర్గను చూడమన్నాడు. నాకు అంతకు ముందు స్టిల్ కెమేరాతో చాలా అనుభవం ఉన్నా ఎప్పుడూ లాంగ్ ఫోకల్ లెంగ్తు ఉన్న లెన్సుతో పని చెయ్యలా. నిజమే! ఈ లెన్సు వల్ల దుర్గ మొహం నిండుగా కనపడింది. మొత్తం మీద ఆ దృశ్యం అలాగే లాంగ్ క్లోజప్ లెన్సుతో పూర్తి చేసాం. దాంతో దుర్గ మొహం అంతా అతి స్పష్టంగా కనపడుతూ, సూర్య కిరణాలు మొహం పై పడటం వల్ల, వింత వెలుగులతో దుర్గ మొహం ప్రేక్షకులకు కనపడుతుంది. ఈ దృశ్యం చూసిన వాళ్ళెవరైనా ఆ పనితనాన్ని మెచ్చుకు తీరాలి. ఈ సమయానుకూలమైన సలహాకి నా స్నేహితుడ్ని అభినందించి ఆ రోజు కార్యక్రమం పూర్తి చేసాం.

కొన్ని రోజుల తరవాత, ఫిలింని కత్తిరిస్తూ ఎడిట్ చెయ్యబోతూ, ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకు పోయా! ఆ చిన్న షాట్ బాగానే వచ్చింది కాని మిగిలిన షాట్లతో సరిగ్గా ఇమడలా. కొట్టొచ్చినట్టు చాలా తేడాగా ఉంది. ఇది ఎందుకూ పనికి రాదు అన్న విషయం నాకు బోధపడింది.. దీన్నుంచి రెండు విషయాలు నేను నేర్చుకున్నా. మొదటిది – ఒక దృశ్యం, సందర్భానికి తగినట్టు ఎంత అందంగా ఉండాలో అంతే అందంగా తియ్యాలి. ఎక్కువా పనికి రాదు. తక్కువా పనికి రాదు. రెండవది – ఏ వ్యక్తి దగ్గర నుంచి అయినా సరే, తియ్యబోతున్న సినిమా లోని అన్ని అంశాలపై సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప సలహా తీసుకోకు. దర్శకుడికి సినిమా తియ్యటంలోని అన్ని విషయాలపై ఉన్నంత లోతైన అవగాహన మరొకరికి ఉండే అవకాశం తక్కువ.”

సినిమా అన్న ఒకే ఒక మాధ్యమంలో మాత్రమే సహజంగానూ, వాస్తవంగానూ ఉంటూ కూడా కళాత్మకంగా ఉండొచ్చు. చిత్రించిన సినిమా ఫిల్మ్ కత్తిరించి అతికిస్తున్నప్పుడు అసలైన సృష్టి జరుగుతుందన్న విషయం మనం గమనించాలి.

రాయ్‌కి ఎడిటింగ్‌లో ఉన్న ప్రావీణ్యత వల్ల, అసలైన ఎడిటింగ్ సినిమా తీస్తున్నపుడే అయిపోతుంది. ఎందుకంటే, సినిమా చిత్రీకరణలో ఒక సీన్‌లో పరిపక్వతకు చేరుకున్న తరవాత చిత్రీకరించబడే భాగం, ఎడిటింగ్‌లో కత్తిరించబడుతుందని రాయ్‌కి ఎప్పుడనిపిస్తే అప్పుడు షూటింగ్ ఆపేస్తాడు. సినిమాకి అసలైన జీవం వచ్చేది ఎడిటింగ్ వల్ల అన్న రాయ్ అభిప్రాయానికి ఎంతో విలువ ఉంది. ఉదాహరణకి, సంభాషణలు ఉన్న ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని ఐదారు రకాలుగా కత్తిరించి – అతికించి, అందులో ఏది అత్యంత తృప్తికరంగా ఉందో దాన్ని ఎన్నుకోవటంలో ఎడిటింగ్ గొప్పతనం తెలుస్తుంది. రాయ్‌తో అతి ఎక్కువ కాలం సహాయ దర్శకుడిగా పనిచేసిన శాంతి ఛటర్జీ పరిశీలన తెలుసుకోతగ్గది. ” తను తీసిన సినిమాని, ఎవరో తీసిన సినిమా అన్నట్టు ఎడిట్ చేస్తాడు రాయ్.”

ప్రముఖ జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురుసోవా  రాయ్ సినిమాలపై, ముఖ్యంగా ఎడిటింగ్ విషయమై చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోటం సమంజసం.

రాయ్ సినిమాలు అతి నెమ్మదిగా సాగే సినిమాలు కావు. రాయ్ సినిమాల్లో ఒక తాళం, గతి కనపడుతూ అతి ప్రతిభావంతంగా తమలోని రహస్యాలను విప్పి చెపుతాయి. గంభీరంగా సాగే ఈ సినిమాలని ఒక మహానదితో పోల్చవచ్చు!

(ఇంకా ఉంది)

 

–లక్ష్మన్న విష్ణుభొట్ల

 

8 Comments
  1. Murali May 25, 2009 /
    • Hero July 13, 2011 /
  2. శ్రీ May 27, 2009 /
  3. మేడేపల్లి శేషు May 27, 2009 /
  4. viswanath goud May 31, 2009 /