Menu

సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

ఒక నాలుగేళ్ల క్రితమేమో – ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాల గురించి రాయ్ “చైల్డ్ హుడ్ డేస్” అనే పుస్తకంలో రాసారు. చదివిన ఒక సంవత్సరం లోపే, ఆ వ్యాసాన్ని నేను నవతరంగంలో అనువదించాను. అప్పటికి నాకు కథ తెలుసుకానీ, సినిమా చూడలేదు. కథ చదివినప్పుడు పిల్లల సినిమానే అనుకున్నా కానీ, చూస్తూ ఉంటే అర్థమైంది – ఎంత వ్యంగ్యం ఉందో. ఆ ఏటి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుని, సైప్రస్ అంతర్జాతీయ ఫిలం ఫెస్టివల్ కి కూడా వెళ్ళిన “హిరాక్ రాజర్ దేశే” గురించి ఒక చిన్న పరిచయం.

 

కొంచెం నేపథ్యం: ఈ చిత్రం “గోపీ గైనే, బాఘా బైనే” అన్న చిత్రానికి సీక్వెల్. ఆ సినిమాకి సత్యజిత్ రాయ్ తాత అయిన ఉపేంద్ర కిషోర్ రాయ్ రాసిన కథ ఆధారం. పిల్లలకోసం సినిమా తీయమన్న సందీప్ రాయ్ (కొడుకు) అభ్యర్ధన మేరకు సత్యజిత్ ఈసినిమా తీసాడని అంటారు. ఇది తీసిన పుష్కరానికి, తన సొంతకథ తో, “హిరాక్ రాజర్ దేశ” తీసాడు రాయ్. తరువాత మరిన్ని రోజులకి, రాయ్ రాసిన కథ ఆధారంగా వాళ్ళ అబ్బాయి సందీప్ రాయ్ “గూపి బాఘా ఫిరె ఎలో” అని మరో సినిమా తీసాడు.

 

కథ: గూపి, బాఘా ఇద్దరూ శుండి రాజు ఆస్థానంలో రాచమర్యాదలు అనుభవిస్తూ, ఇంటి అల్లుళ్ళ హోదాలో విలాసంగా జీవిస్తూ దాదాపు పదేళ్ళు గడిచాక, వాళ్లకి బోరు కొట్టి, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటారు. శుండి రాజు – వజ్రాల రాజు దేశంలో ఉత్సవాలు జరుగుతున్నాయనీ, అక్కడికి వెళ్లి వీళ్ళ విద్య ప్రదర్శించమని సలహా ఇస్తాడు. గతంలో భూతల రాజు వీళ్ళకి మూడు వరాలు ఇచ్చి ఉంటాడు. అవి – వీళ్ళ దగ్గర ఉన్న మాయ చెప్పులు, అవి వేసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు; ఎప్పుడైనా, ఎక్కడైనా సరే, వీళ్ళకున్న మాయ చెప్పుల సాయంతో వజ్రాల దేశం పొలిమేరలు చేరి, వీళ్ళకి తల్చుకున్న చోట చప్పట్లు కొట్టగానే తిండీ బట్టా అమరిపోతాయి; వీళ్ళు పాట పాడడం మొదలుపెడితే ఎవరైనా శిలప్రతిమల్లా కదలకుండా ఉండిపోవాల్సిందే! – వీటిని వజ్రాల దేశంలో రాజు వద్ద ప్రదర్శిద్దామని బయలుదేరి ఆ రాజ్యం పొలిమేరలు చేరుతూ ఉండగా, ఉదయన్ (సౌమిత్ర చట్టర్జీ) ని కలుస్తారు.

 

ఉదయన్ వీళ్ళకి వజ్రాల రాజు అసలు రూపం తెలియజేస్తాడు. రాజు క్రూరుడు. తనని ఎదిరించే అందరిని తన “సైంటిస్టు” కనిపెట్టిన “బ్రెయిన్ వాషింగ్ మెషీన్” లోకి పంపేసి, వాళ్ళని తన వైపుకి తిప్పెసుకుంటూ ఉంటాడు. ఆ రాజ్యంలో పాఠశాల నడుపుతూ ఉంటాడు ఉదయన్. అతని ధిక్కార స్వరం నచ్చక, అతన్ని కూడా మార్చబోతే, తప్పించుకు వచ్చేసి అలా శివార్లలో తిరుగుతూ ఉంటాడు అనమాట ఉదయన్. గూపీ, బాఘా ఇద్దరూ అతనికి తాము సయం చేస్తాం అని మాట ఇస్తారు. తక్కిన కథ అంతా, వీళ్ళు రాజుని ఎలా ఎదుర్కున్నారు? ఆ రాజ్యాన్ని ఎలా కాపాడారు? అని.

 

కథనం: గొప్ప వ్యంగ్యం ఉంది కథలో. పైగా, రాజు చుట్టూ ఉండే భజన సంఘం వాళ్ళ ప్రాస భజనలు (సబ్టైటిల్స్ లో కూడా ప్రాస పెట్టారు చాలా చోట్ల!) అవన్నీ వింటూ ఉంటే, మూర్ఖ ప్రభుత్వాధినేతలకి తందానా తానా అనే బ్యాచ్ గుర్తొస్తారు మనకి. ఇంత చక్కగా పిల్లల కోసం తీస్తూనే అడుగడుక్కీ వ్యంగ్యం జొప్పించవచ్చని నాకిన్నాళ్ళూ తోచనే లేదు!

 

సంగీతం: ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలలో సంగీతం ఒకటి. చిత్రానికి సంగీతం సమకూర్చినది కూడా సత్యజిత్ రాయే. నాకు భాష వచ్చుంటే ఎంత బాగుండేదో – అని బెంగాలి భాష గురించి నేను అనుకున్న సందర్భాల్లో ఇది సరికొత్తది. సాహిత్యం కూడా రాయ్ రాసినట్లు ఉన్నారు కొన్నింటికి. ఈ సినిమాకి రాయ్ కి ఉత్తమ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా జాతీయ అవార్డులు వచ్చాయట. అలాగే, అనూప్ ఘోషాల్ కు ఉత్తమ గాయకుడిగా కూడా అవార్డు వచ్చిందంట. పాటలే కాదు, నేపథ్యంలో వచ్చే సంగీతం కూడా అలా కథలో భాగం అయిపోయినట్లే ఉండింది నాకు.

 

నటీనటులు: ఈ సినిమాలో సత్యజిత్ రాయ్ సినిమాల్లో కనిపించే రెగ్యులర్ నటులు కొందరు ఉన్నారు. సౌమిత్ర చట్టర్జీ, ఉత్పల్ దత్తులు ఉన్నా కూడా, చూడగానే యిట్టె ఆకర్షించేసి, కనిపించిన ఆ కొద్ది సీన్లలోనే గుర్తుండిపోయిన మనిషి – సంతోష్ దత్తా. రాయ్ ఫెలూదా సినిమాల్లో “జటాయూ” పాత్ర వేసినది ఇతనే. ఈయన పోయినపుడు, జటాయూగా తాను మరొకర్ని ఊహించుకోలేనని, కనుక ఇకపై ఫెలూదా చిత్రాలు తీయననీ ప్రకటించాడట సత్యజిత్ రాయ్. దాన్ని బట్టి అతని ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో సంతోష్ దత్తా ద్విపాత్రాభినయం చేసాడు. శుండీ దేశపు వృద్ధ రాజుగా ఒక ఐదు నిముషాలు కనిపిస్తాడు సినిమా మొదట్లో. “బ్రెయిన్ వాష్” చేసే యంత్రం కనిపెట్టిన సైంటిస్టుగా హిరాక్ రాజ్యంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ సైంటిస్టుగా వేష ధారణా, మేనరిజమ్స్ – ఇవన్నీ ఆయన తప్పిస్తే మరెవరూ చేయలేరేమో అనిపించింది.

 

సరే, ఈయన ప్రభావం నుంచి బయటకు వస్తే, ఇక్కడ నాకు కొత్త ఉత్పల్ దత్ కనిపించాడు. ఇప్పటి దాక నేను చూసిన ఉత్పల్ దత్ సినిమాలు దాదాపు అన్నీ హ్రిషికేశ్ ముఖర్జీ క్లాసిక్స్. ఒకే ఒక్కటి మాత్రం రాయ్ తీసిన “జే బాబా ఫెలూనాథ్”. తక్కిన సినిమాల్లో హాస్యం గానీ, ఆ ఫెలూదా సినిమాలో విలనీ గానీ, అద్భుతంగా పండించాడు ఉత్పల్ దత్. అలా ఆయనకీ నేను అభిమానిని. కానీ, ఈ సినిమాలో క్రూరుడైన (గుమ్మడికాయంత వెర్రి కూడా ఉన్న) హిరాక్ రాజుగా ఒక సరికొత్త ఉత్పల్ దత్ కనబడ్డాడు.ఆయన ఉత్పల్ దత్ అని టైటిల్స్ లో ఉంది కాబట్టి నమ్మాల్సి వచ్చింది. భలే చేసాడు.మిగితా వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పేందుకు ఏమీ లేదు నాకు.

 

ఎలాగన్నా, సత్యజిత్ రాయ్ సినిమాలు ఆల్రెడీ చూసి, మళ్ళీ చూసి, పీల్చి పిప్పి చేసేసిన వారికీ నేను ప్రత్యేకం చెప్పేది ఏమీ లేదు కానీ, సత్యజిత్ రాయ్ సినిమాలంటే ఆర్టు సినిమాలనీ, మనకర్థం కావనీ, దూరంగా ఉండేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన రాయ్ సినిమాల్లో ఇది ముందుంటుంది. “జే బాబా ఫెలూనాథ్”, “సోనార్ ఖిల్లా” కూడా బానే ఉంటాయి కానీ, “ఎక్స్ట్రా ఆర్డినరీ” అనిపించలేదు నాకు. ఇది మాత్రం చాలా నచ్చింది. ఈ సినిమా చూడగానే, వెంటనే “గూపీ గైనే…” అర్జెంటుగా వెదికి దొరకబుచ్చుకున్నాను. అది కూడా నచ్చింది కానీ, దీనంత కాదు. త్వరలో దాని గురించి కూడా వివరంగా రాసేందుకు ప్రయత్నిస్తాను.