Menu

ఆండ్రే వైదా-ఒక పరిచయం

పరిచయం:

అయనకి సినిమా ఒక ఆయుధం.  ఆయనకి సినిమా ఒక సాధనం.  ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ శీర్షికలో దృష్టి సారిస్తున్న సందర్భంగా ఆయన సినిమాల జీవిత విశేషాలతో కూడుకున్న పరిచయవ్యాసం ఇది.

డబ్లిన్ పట్టణం మొత్తం నాశనమైపోయినా  “తన నవలల్లోని సమాచారం ద్వారా తిరిగి అలాగే నిర్మించొచ్చు” అని James Joyce అన్నదాంట్లో ఎంత నిజముందో తెలియదుకానీ వైదా సినిమాల ద్వారా పోలండ్ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలకు దృశ్యరూపమిచ్చి ఆ దేశ చరిత్రను తన సినిమాల ద్వారా పునర్నిర్మించారని ఆయన సినిమాలు చూసిన ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదని వాటి ద్వారా ఎంతో సాధించవచ్చని నమ్మినవారిలో ముఖ్యుడు వైదా. మార్చి 6, 1926 న పోలండ్ లోని సువాల్కి లో జన్మించిన ఆండ్రే వైదా (Andrzej Wajda)  ప్రపంచంలోని అత్యుత్తమ సినిమా దర్శకుల్లో ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆండ్రే వైదా

ఆండ్రే వైదా

బాల్యం:

పోలండ్ లో పరిస్థుతుల కారణంగా వైదా తన బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చిన్నవయసు నుంచే తన బాబాయి షాపు లో పని చేస్తూనే చిత్ర కళనూ అభ్యసించేవాడు.  వైదా పదమూడేళ్ళ వయసులో ఉండగా  1939 లో యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళిన తండ్రి ఇక తిరిగిరాలేదు. ఆయన Katyn లో జరిగిన సామూహిక హత్యాఖాండలో చంపబడ్డా కూడ ప్రభుత్వం ఆ విషయం బయటపెట్టలేదు.ఎక్కడో బతికే ఉంటారన్న ఆశతో దాదాపు పదేళ్ళవరకూ ఆయన కోసం కుటుంబం ఎంతో ఆశగా ఎదురుచూసింది. చివరిగా 1950 లో ఆయన Katyn లో మరణించారన్న నిజం తెలిసింది. అయినప్పటికీ 1989 వరకూ తన తండ్రి సమాధిపై ఆయన ఫలానా చోట మరణించారని లిఖించడానికి కూడా ప్రభుత్వం నిరాకరించింది. ఇలాంటి పరిస్థుతుల్లో అప్పటి వరకూ ఉపాథ్యాయిని గా పని చేస్తున్న తన తల్లి కూలి పని కి వెళ్ళాల్సి వచ్చింది. వైదా కూడా తన తండ్రి లాగే సైన్యం లో చేరాలని నిశ్చయించుకుని ప్రయత్నించి విఫలమయ్యాడు వైదా.

యుక్తవయసు:

బాల్యం నుంచీ చిత్రకళపై ఆసక్తి ఉండడం వల్ల Lodz లోని ఒక అధ్యాపకుని వద్ద చిత్రకళను అభ్యసించాడు వైదా. ఇక్కడే ఆయన చిత్రకళపై ఆసక్తి పెంచుకుని 1946 లో Krakow లోని లలితకళల అకాడెమీ లో విద్యార్థిగా చేరి మూడేళ్ళపాటు అక్కడ చిత్రకళను అభ్యసించారు. రష్యన్ల పరిపాలనలో పోలండ్ ప్రజల జీవితాలు, ఆలోచనలతో పాటు చివరకి కళలు కూడా రష్యన్లకనుగుణంగానే ఉండాలన్న నిజాన్ని జీర్ణించుకోలేక మూడేళ్ళ పాటు అక్కడ నేర్చుకున్నదంతా కూడా వృధా అని నిర్ణయించుకున్నాడు వైదా. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక వార్తా పత్రికలో Lodz  ఫిల్మ్ స్కూల్ గురించి వైదా చూసిన ఒక ప్రకటన ఆయన జీవితాన్ని మార్చివేసింది.

సినిమాలు:

Krakow లోని లలితకళల అకాడెమీ నుంచి బయటడ్డ వైదా 1949 లో Lodz లోని ఫిల్మ్ స్కూల్ లో చేరారు. పోలండ్ లో అదే మొట్టమొదటి ఫిల్మ్ స్కూల్. అప్పటికే లలితకళలపై అవగాహన ఉన్న వైదాకు చలనచిత్రాన్నీ కేవలం వినోద సాధనంగా కాకుండా ఒక కళగా చూడడంతో పాటు, చలనచిత్రం ద్వారా ఎంతో సాధించవచ్చని గ్రహించారు.

1953-1954 సమయంలో లో కొన్ని సినిమాలకు సహాయకుడిగా పనిచేశాక 1955 లో మొట్టమొదటిసారిగా A Generation అనే సినిమాకి దర్శకత్వం వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం యుద్ధ నేథ్యంలో పోలండ్ ప్రజలను ప్రధాన పాత్రధారులిగా చేసి రూపొందించిన ఈ సినిమా అప్పటివరకూ జీవంలేకుండా ఉన్న పోలండ్ సినిమాకు కొత్త జీవంపోసింది. ప్రేక్షకులనూ, విమర్శకులనూ ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఉత్సాహంతో ఆయన తీసన మరో రెండు సినిమాల రెండవ ప్రపంచ యుద్ధత్రయంగా పేరుగాంచాయి. ఈ చిత్రత్రయంలోని Ashes and Diamonds అనే సినిమా వైదా రూపొందించిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. ఈ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ వంద సినిమా లిస్టులో కూడా చోటుచేసుకుంది.

ఈ చిత్రత్రయం తర్వాత వైదా రూపొందించిన The Promised Land, The Maids of Wilko లాంటి చిత్రాలు ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించడమే కాకుండా ఆస్కార్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం తెచ్చిపెట్టాయి. కానీ వైదా సినీ జీవితంలో ఇది కేవలం ఒక ఘట్టం మాత్రమే.

నైతిక విలువల సంబంధిత సినిమా:

1975-80 లలో పోలండ్ లో కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా సంఘీభావ ఉద్యమం ఊపందుకుంది. ఈ సమయంలోనే సినిమాల ద్వారా ఈ ఉద్యమానకి తమ సంఘీభావాన్ని తెలియచేయాలనుకున్నారు వైదా. ఈ నేపథ్యంలో ఆయన రూపొందించిన సినిమాలు అప్పి ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేయగలగడంలోనే కాకుండా ఆ ఉద్యమం విజయవంతం కావడంలోనూ ఉపయోగపడ్డాయి. వైదాతోపాటు మరెంతో మంది పోలిష్ సినిమా దర్శకులు ఈ ఉద్యమంలో భాగం సినిమాలు రూపొందించారు. ఆ సినిమాలనే నైతిక విలువల సంబంధిత సినిమాలు (Cinema of Moral Concern) గా ఖ్యాతి గడించాయి.(గమనిక: Cinema of Moral Concern గురించి వివరణాత్మకమైన వ్యాసాలు త్వరలోనే ప్రపంచ సినీ ఉద్యమాల శీర్షికలో పొందుపరచబడతాయి)

వైదా నిర్మించిన సినిమాల్లో ముఖ్యమైనవి:

రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన చిత్రత్రయం:

 1. A Generation
 2. Kanal
 3. Ashes and Diamonds
1950-1980 ల మధ్య కాలంలో రష్యన్ పరిపాలనలో పోలండ్ లో తలెత్తిన పరిస్థుతులు మరియు 80 లలో పోలండ్ లో ఎగిసిన solidarity ఉద్యమం నేపథ్యంలో వచ్చిన చిత్రత్రయం:
 1. Man of Marble
 2. Rough Treatment
 3. Man of Iron
Man of Iron తో పాటు అస్కార్ కు నామినేట్ అయిన మరో మూడు సినిమాలు
 1. The Promised Land
 2. The Maids of Wilko/Young Girls of Wilko
 3. Katyn

అవార్డులు:

 • వైదా దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు ఉత్తమ చిత్రాలుగా ఆస్కార్ నామినేషన్ పొందాయి.
 • చలనచిత్ర పరిశ్రమకు వైదా అందించిన సేవలకి గానూ 2000 సంవత్సరంలో ఆస్కార్ అవార్డు.
 • 2006 లో బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో Honorary Golden Berlin Bear అవార్డు.
 • 1990 లో ఐరోపా చిత్రోత్సవాల్లో Life Achievement Award
 • ఇవి మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో యాభైకి పైగానే ఇతర అవార్డులు అందుకున్నారు.
ముగింపు:

గత యాభై ఏళ్ళుగా చలనచిత్ర నిర్మాణంతో పాటు నాటకాలకు సినిమాలకూ దర్శకత్వం వహిస్తూ, “Manggha” అనే సంస్థ ద్వారా పోలండ్ లో జపనీయుల కళలూ మరియు సాంకేతికతకలను పరిరక్షిస్తూ,  తను స్థాపించిన ఫిల్మ్ స్కూలు ద్వారా నవ యువ దర్శకులను తీర్చిదిద్దుతూ కూడా ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇంకా చిత్ర నిర్మాణం కొనసాగిస్తూ తన జీవితాన్నే సినిమాకీ, ముఖ్యంగా కళకీ, అంకితం చేసిన మహానుభావుడు వైదా. ఆయనకి నవతరంగం తరుపున శతకోటి వందనాలు.

గమనిక:నవతరంగంలో ఫోకస్ శీర్షికలో పరిచయం చేసిన మరి కొంతమంది దర్శకుల వివరాలు ఇక్కడ చూడండి.

4 Comments
 1. venkat November 7, 2008 /
 2. శంకర్ November 7, 2008 /
 3. ravi November 7, 2008 /