Menu

’పిల్లిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే రచనా విధానం-STC-1

ఔత్సాహిక సినిమా దర్శకులు రచయితలకు వచ్చే మొట్టమొదటి సందేహం “స్క్రీన్ ప్లే రాయడం ఎలా?” అని. అయితే స్క్రీన్ ప్లే రచన గురించి ఇదివరకే చాలా పద్ధతులు ఉన్నాయి. సిడ్ ఫీల్డ్ తన “స్క్రీన్ ప్లే” పుస్తకంలో ఒక రకమైన టెక్నిక్ గురించి చెప్తే, రాబర్ట్ మెకీ తన “స్టోరీ” పుస్తకంలో మరొక విధానాన్ని చెప్పుకొచ్చారు. అలాగే “21 రోజుల్లో స్క్రీన్ ప్లే రాయడం ఎలా?”, “సీక్వెన్స్ బేస్డ్ స్క్రీన్ ప్లే రాయడం ఎలా” అంటూ పలు స్క్రీన్ ప్లే రచనా విధాలున్నాయి. అలాంటి మరో కొత్త పద్ధతే ఈ “పిల్లిని రక్షించుట” అనే స్క్రీన్ ప్లే రచనా విధానం.

పిల్లిని రక్షించడం ఏమిటి? స్క్రీన్ ప్లే రచనకూ దీనికీ సంబంధం ఏమిటి? అని మీరు అనుకోవడంలో తప్పేమీ లేదు. కావలిస్తే మీరు ఈ స్క్రీన్ ప్లే విధానాన్ని పిల్లి బదులు “మహేష్ బాబు పూజారిని రక్షించుట”, “పవన్ కళ్యాణ్ బైక్ మీద నుంచి కిందకి పడబోతున్న పిల్ల ని రక్షించుట“, లేదా “బాలకృష్ణ కొండమీదనుంచి కుందేలు ని రక్షించుట” అని పిలుచుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా? మొదట్లో నేను కూడా Save the Cat కి స్క్రీన్ ప్లే రచనకూ సంబంధం ఏమిటో అనుకున్నాను. ఈ వ్యాసం చదివితే మీ కన్ఫ్యూజన్ తీరిపోతుంది.కాబట్టి ముందుకు సాగిపోండి.

స్క్రిప్ట్ అంటే ఏమిటి?

కథ-కథనం-మాటలు ఇవి మూడు కలిపితే స్క్రిప్ట్ అవుతుంది. ముందుగా సినిమాకి కథ అవసరం. ఆ కథ కొత్తగా ఉందనో లేదా బావుందనో లేదా పాతదైనా ప్రేక్షకులకు నచ్చచ్చొనో అనిపిస్తే ఆ కథ ఆధారంగా కథనం సమకూరుస్తాము. కథనం బావుందనుకుంటే ఆ కథనంలోని సీన్స్ కి సరితగ్గ మాటలు రాసుకోవడంతో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది.

అయితే కథ కి కథనానికి తేడా ఏంటి?

ఏమి జరిగిందో తెలియచెప్పేది కథ. ఎలా జరిగిందో తెలియజేసేది కథనం.

A story is a series of events recorded in their chronological order.

A plot is a series of events deliberately arranged so as to reveal their dramatic, thematic, and emotional significance.

ఉదాహరణకు సమరసింహా రెడ్డి తీసుకోండి.ఈ సినిమా కథ straight గా చెప్పుంటే అంత ఆసక్తి గా ఉండేది కాదు. అందుకే ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ ఉపయోగించారు. అంటే సమరసింహా రెడ్డి కథ ను ఆ విధంగా ప్లాట్ చెయ్యడం జరిగింది. కానీ తొలిప్రేమ సినిమా ని ఇలా ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ లాగా ప్లాట్ చేసుంటే బావుండేది కాదు. అలాగే 100% లవ్ సినిమా కథ ని మరో విధంగా ప్లాట్ చేశారు.

అయితే ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదని నాకు తెలుసు.కాకపోతే ఒక సిస్టమాటికి అప్రోచ్ తో తీయబోయే సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడానికి ఒక ప్లాన్ అవసరం. కాబట్టి ముందు కొంచెం థియరీ చెప్పి నేను చెప్పబోయే సిస్టం గురించి అవగాహన కలుగచేద్దామని నా ప్రయత్నం.

పైన చెప్పిన దాన్ని బట్టి స్క్రిప్ట్ ని మూడు భాగాలుగా విడదియ్యవచ్చని మనకి అర్థమైంది కాబట్టి ముందు మనం కథ గురించి ఆలోచించాలి. నిర్మాత తో రచయిత/దర్శకుడిగా మీరు కలిసి పని చెయ్యాలి కాబట్టి ముందు మనం కథ నచ్చింది అనుకుంటే ఆ తర్వాత మనం రెండో స్టెప్ కి వెళ్లవచ్చు. అయితే ఇక్కడే ఒక పెద్ద vicious circle ఏర్పడే అవకాశం ఉంది. అంటే మనకు నచ్చిన కథ నిర్మాతకు నచ్చక, నిర్మాతకు నచ్చిన కథ మనకు నచ్చక ఇలా ఒక లూప్ లో మనం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది.

ఎలాగంటారా అయితే ఇంకా చదవండి.

ఆ విషయం గురించి చెప్పేముందు బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన హిట్ సినిమాలకు (కంపెనీ,ఖోస్లా కా ఘోస్లా, బంటీ ఔర్ బబ్లీ, చక్ దే ఇండియా) స్క్రీన్ ప్లే అందించిన జైదీప్ సహానీ గురించి మనం ఇక్కడ ఒక్కసారి తెలుసుకోవాలి. జై దీప్ సహానీ చిన్నప్పుడు పెద్దగా సినిమాలు చూసేవాడు కాదట. అతనికి సినిమాలంటే పెద్దగా ఆసక్తి కూడా లేదు. చదివింది కంప్యూటర్ సైన్స్. ఒక రోజు అనుకోకుండా గాంధీ సినిమా స్క్రీన్ ప్లే చదవడంతో అతని జీవితమే మారిపోయింది. గాంధీ సినిమా స్క్రీన్ ప్లే చదువుతుంటే అతనికి సినిమా స్క్రీన్ ప్లే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటిదనే విషయం అర్థమైంది. అతని మాటల్లోనే చెప్పాలంటే ‘‘A script is like a program, it gives you the framework towards an eventuality.’’

ఎవరో సినిమా స్క్రిప్ట్ వ్రాయడం అనేది 20% క్రియేటివ్ ప్రోసెస్ అయితే మిగిలింది టెక్నికల్ ప్రోసెస్. అది నిజం. అందుకే స్క్రీన్ ప్లే ఎలా రాయాలో చెప్పే పుస్తకాలు ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి.

335 BC లోనే అరిస్టాటిల్ “పోయెటిక్స్” అనే గ్రంథంలో డ్రామాటిక్ థియరీ గురించి వ్రాస్తూ డ్రామా అనే ప్రక్రియలో అవలంబించాల్సిన టెక్నికల్ అంశాలను ప్రస్తావించారు. ఆ గ్రంధంలోనే అరిస్టాటిల్ Act 1, Act 2, Act 3 అనే అంశాలను ప్రస్తావించారు. అవే విషయాలను కాస్తా contemporize చేసి Syd Field తన స్క్రీన్ ప్లే పుస్తకంలో వివరించారు.

సిడ్ ఫీల్డ్ లేదా రాబర్ట్ మెకీ లేదా ఇంకెవరైనా స్క్రీన్ ప్లే గురువులు ఎవరూ కూడా స్క్రీన్ ప్లే రాసే విధానాన్ని చెప్పారు కానీ ఎవరూ కూడా ప్రాక్టికల్ గా ఉపయోగపడే ఒక టూల్ ని అందించలేకపోయారు. అయితే జై దీప్ సహానీ పైన చెప్పినట్టు స్క్రిప్ట్ వ్రాయడం అనేది ఒక ప్రోగ్రామ్ లాంటిదే. బహుశా జైదీప్ అలాంటి ఒక ప్రాక్టికల్ టూల్ ని తనే స్వంతంగా డెవలప్ చేసుకుని ఉండొచ్చు. మీరు గనుక రాకెట్ సింగ్, చక్ దే ఇండియా చూస్తే మీకీ టెక్నిక్ గురించి అర్థమవుతుంది. అలాగే జైదీప్ రాసిన స్క్రీన్ ప్లే అన్నింటిలో నాకు బాగా నచ్చింది రాకెట్ సింగ్. నిజానికి జై దీప్ సహానీ రాసిన అన్ని స్క్రిప్ట్స్ లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ అంత పరెఫెక్ట్ స్క్రిప్ట్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెధ్దగా ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఇది చాలా సీరియస్ సినిమా. కానీ పమోషన్స్ మరియు పోస్టర్స్ లో దీన్ని ఒక కామెడీ సినిమా చూపించి wrong expectations సృష్టించడమే ఈ సినిమా పరజయానికి కారణం. జై దీప్ సహానీ రాసిన స్క్రిప్ట్స్ అన్నీ పరిశీలిస్తే అతను తన కథలను ఎలా ప్లాట్ చేస్తాడో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ విషయం. అయినా అదంతా ఇప్పుడు మనకి అనవసరం. అసలు విషయానికి వస్తే…ఒక వేళ మనం కూడా జై దీప్ సహానీ లాగే ఒక టెక్నికల్ ప్రోసెస్ ఉపయోగించి మన స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తే…అలా చెయ్యాలి. చెయ్యొచ్చు. చెయ్యగలం అని చాలా మంది ఇప్పుడు నమ్ముతున్నారు.

ముందుగా మనం మన తెలుగు సినిమా పరిస్థితి గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రస్తుతం తెలుగులో రెండు రకాల సినిమాలు మాత్రమే సక్సెక్ కాగలుగుతున్నాయి. ఒకటి తమిళం డబ్బింగ్ సినిమాలు. రెండవది ఎందుకు హిట్ అయ్యాయో తీసిన వాళ్లకి కూడా పెద్దగా అర్థం కాని సినిమాలు. ఇవి రెండు కాకుండా genuine గా హిట్ అయ్యే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. తమిళ్ సినిమాలు డబ్బింగ్ గురించి మనకి అనవసరం. ఇక ఎందుకు హిట్టయ్యాయో వాళ్ళకే తెలియని సినిమాలు తియ్యడంలో ప్రమాదం మీకు తెలియంది కాదు. ఉదాహరణకు తెలుగు లో పెద్ద హిట్టయిన హ్యాపీడేస్, పోకిరి లాంటి సినిమాలు తీసుకుంటే ఈ సినిమాల స్క్రీన్ ప్లే analyze చేసినట్టయితే ఎటువంటి స్ట్రక్చర్ లేకపోగా ప్లాట్ పరంగా ఏ స్ట్రక్చర్ లోనూ ఇమడవు. కానీ పోకిరి, హ్యాపీడేస్ సూపర్ హిట్ అవ్వడానికి ఇతర కారణాలున్నాయి. పోకిరి కి మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, ఇలియానా, మహేష్ ని కొత్తగా, స్టైలిష్ గా చూపడంలో పూరి సక్సెస్ కావడం, పాటలు, క్లైమాక్స్ ముందు వచ్చే రివిలీషన్ ఇలా అన్నీ కలిసి పోకిరి ని సూపర్ హిట్ చేశాయని నా అభిప్రాయం. అలాగే హ్యాపీడేస్ కి ముందు శేఖర్ కమ్ముల సంపాదించుకున్న పేరు, ప్రీ రిలీజ్ పబ్లిసిటీ, సంగీతం, దిల్ రాజు సినిమా డిస్టిబ్యూట్ చెయ్యడం ఇలా హ్యాపిడేస్ హిట్టవ్వడానికీ చాలా కారణాలున్నాయి. కానీ ఇలాంటి సినిమాలకి మ్యాజికల్ గా ఏదో కలిసొస్తే కానీ హిట్ కావు కాబట్టి మనకి మిగిలిందల్లా మనం genuine గా ఒక మంచి కథ-కథనం-మాటలు కలిగిన ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ ని అంతే పకడ్బందీగా తక్కువ ఖర్చులో తెరకెక్కించగలిగితే నా దృష్టిలో మనం నష్టపోమనే నమ్మకం మాత్రం నాకుంది.

అయితే ఇందాకటి నుంచి చెప్తున్నట్టు మనం మన స్క్రిప్ట్ ని పకడ్బందీగా రూపొందించాలంటే మనకి ఒక టూల్ అవసరం. దీన్నే మనం “పిల్లిని రక్షించుట” అని పిలుచుకుందాం.

అసలేంటీ పిల్లిని రక్షించే విధానం?

Blake Snyder అనే ఒకాయన ఉండేవాడు. ప్రపంచంలో ఇప్పటికే స్క్రీన్ ప్లే రచనా విధానం గురించి ఎన్నో పుస్తకాలున్నాయి. వాటికి తోడుగా ఈయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు “Save the Cat”. పేరే విచిత్రంగా ఉంది కదూ. అయితే ఆయన ఈ పుస్తకానికి ఇచ్చిన కాప్షన్ ఇంకా విచిత్రంగా ఉంటుంది-The Last Book on Screenwriting You’ll Ever Need.

ఎంత ధైర్యముంటే “ఈ పుస్తకముంటే చాలు మీరు మీ స్క్రీన్ ప్లే హాయిగా రాసెయ్యొచ్చు” అని చెప్పగలడు. అలా చెప్పడం వెనుక ధైర్యం కంటే కూడా చాలా సినిమాలను విశ్లషించి అందులో కామన్ గా ఉన్న అంశాలను గ్రహించి ఆయన చేసిన పరిశోధన కనిపిస్తోంది.

Blake Snyder మాటల్లోనే ఈ పిల్లిని రక్షించే విధానం గురించి చెప్పాలంటే, “The “Save the Cat!” beat in any movie, novel, or story is that moment when we meet its hero and he does something “nice” — like save a cat — that makes us like him and want to root for him.”

అంటే సింపుల్ గా చెప్పాలంటే తొలిప్రేమలో హీరో పిల్లని రక్షించడం, అతడు సినిమాలో హీరో పూజారికి డబ్బులిచ్చి రక్షించడం, విజయేంద్ర వర్మ సినిమాలో హీరో కుందేలు ని రక్షించడం లాంటి సన్నివేశాల ద్వారా కథకు పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ మనం మనసులో “చంటీ వీడురా హీరో అంటే” అని అనుకుని అతని కథను మన కథగా ఫీల్ అయిపోయి హీరో తో ఐడెంటిఫై అయిపోతామన్నమాట.

ఈ విధమైన గమ్మతైన పదజాలంతో Blake Snyder తన పుస్తకం Save the Cat లో స్క్రీన్ ప్లే రచనను ముందుగా మనందరికీ తెలిసిన (Setup-Act1, Conflict-Act2, Resolution-Act3) మూడు భాగాలుగా విభజించి, ఆ తర్వాత ప్రతి యాక్ట్ (అంకము) ని మరింతగా విడదీసి మరిన్ని భాగాలుగా విభజించి కథలో ఎక్కడెక్కడ ఏయే సన్నివేశాలు, సందర్భాలు ఉంటే కథ సాఫీగా ముందుకు సాగుతుంది అని వివరిస్తారు.

అయితే ఇది అన్ని సినిమాలకు పనికొస్తుందని నేను చెప్పను కానీ గ్యారెంటీగా కమర్షియల్ గా సక్సెస్ సాధించగలిగే స్క్రిప్ట్స్ వ్రాయడానికి ఒక మంచి స్ట్రక్చరల్ టూల్ గా మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పిల్లిని రక్షించే ఈ స్క్రీన్ ప్లే విధానంలో మొత్తం పదిహేను స్టెప్స్ ఉంటాయి. అవి:

 • Act 1
 • నాంది (Opening Image)
 • సంగతి (Theme Stated)
 • ప్రతిస్థాపన (Set-Up)
 • ఉత్ప్రేరకము (Catalyst)
 • చర్చ (Debate)
 • Act 2
 • ఇక మొదలు (Break into Two)
 • ఉపకథ (B Story )
 • ఆటలు, పాటలు (Fun and Games)
 • ఇంటర్వెల్ బ్యాంగ్ (Midpoint)
 • చీకట్లు ఇరులుకొన్న వేళ (Bad Guys Close In)
 • అంతా పోయింది (All Is Lost )
 • ఏకాకిత్వము (Dark Night of the Soul)
 • Act 3
 • క్లైమాక్స్ కి రెడీ అవ్వండి (Break into Three)
 • తుట్టతుద (Finale)
 • ఉపసంహారము (Final Image)

పైన చెప్పిన ఈ స్క్రీన్ ప్లే రచనా విధానంలో ముందుగానే చెప్పినట్టు మొత్తం స్క్రీన్ ప్లే లో పైన చెప్పిన పది హేను పాయింట్స్ ని Blake Snyder చెప్పుకొచ్చారు. ఈ పదిహేను పాయింట్స్ ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? అసలీ స్క్రీన్ ప్లే రచనా విధానం మనకి పనికొస్తుందా? ఈ విధానాన్ని కొన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు అప్లై చేసి చూస్తే ఈ స్క్రీన్ ప్లే విధానంలో సరిపోతాయా అని విషయాలు రెండో భాగంలో.

8 Comments
 1. Chakri June 19, 2012 /
 2. VENKAT Balusupati June 19, 2012 /
 3. saichandu November 25, 2012 /
 4. saichandu November 25, 2012 /
 5. saichandu November 25, 2012 /
 6. T.S.Kaladhar May 28, 2013 /
 7. Raviteja Danda July 13, 2015 /
 8. Raviteja Danda July 13, 2015 /