Menu

’మహేశ్ బాబు పూజారిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే విధానం-STC-2

ఇంతకు ముందు వ్యాసంలో  ఈ పిల్లిని రక్షించుట లేదా Save the Cat అనే స్క్రీన్ ప్లే విధానం గురించి కొంచెం చర్చించాం.ఈ విధానంలో మొత్తం పదిహేను స్టెప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం.

అయితే ఈ స్క్రీన్ ప్లే విధానం నిజంగానే మన సినిమాలకు పనికొస్తుందా అనే అనుమానం రావొచ్చు కాబట్టి ఈ పదిహేన్ స్టెప్స్ ని ఏదైనా తెలుగు సినిమాకు అన్వయించి చూస్తే ఏలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మనం మహేశ్ బాబు నటించగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అతడు” సినిమాని తీసుకుందాం.

ముందుగా అతడు సినిమా లో Save the Cat మొమెంట్ ఏది?

నా దృష్టిలో మహేశ్ బాబు పూజారి కి తెలియకుండా డబ్బులిచ్చి రక్షించడమే అతడు సినిమాలో “Save the Cat” moment.

ఇక పోతే సేవ్ ది కాట్ లోని ఒక్కొక్క స్టెప్ ని అతడు సినిమా కథ/స్క్రీన్ ప్లే కి apply చేసి చూద్దాం.

Act 1 (మొదటి అంకం)

 • నాంది (Opening Image):సినిమా మొదలయ్యే సమయానికి మనం మహేశ్ బాబుని ఒక అనాథ గా చూస్తాం. టీ కొట్టు లో పని చేస్తున్న మహేష్ బాబుకి డబ్బులిస్తే ఎవరినో చంపేస్తాడు. ఏ స్క్రీన్ ప్లే లోనైనా ఈ ఓపెనింగ్ ఇమేజ్ లేదా నాంది చాలా ముఖ్యం. సినిమా చివర్న వచ్చే క్లోజింగ్ ఇమేజెస్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఈ ఓపెనింగ్ ఇమేజ్ ఉండాలని బ్లేక్ తన పుస్తకంలో చెప్తారు. ఆ విధంగా అతడు సినిమాలో అనాధ+క్రిమినల్ (ఓపెనింగ్ ఇమేజ్) అయితే ఈ సినిమాలో క్లోజింగ్ ఇమేజ్ లో ఒక ఉమ్మడి కుటుంబంలో పరివర్తన చెందిన వ్యక్తిగా (క్లోజింగ్ ఇమేజ్) మహేశ్ ని చూపించడం (అంటే చివర్లో మహేశ్ బాబు నాజర్ ఇంటికి వెళ్లి అందరితో గ్రూప్ ఫోటో దిగడం చూపించకపోయినా జరిగేది అదే అని మనందరికీ తెలుసు) వరకూ అతడు స్క్రీన్ ప్లే perfect గా కుదిరిందనే చెప్పుకోవచ్చు.
 • సంగతి (Theme Stated) :స్క్రీన్ ప్లే రచనలో మొదటి స్టెప్ ఓపెనింగ్ ఇమేజ్ సెట్ చేశాక రెండో స్టెప్ థీమ్ స్టేట్ చెయ్యడం. దానే “సినిమా యొక్క అసలు సంగతేంటో చెప్పడం” అని అనొచ్చు. అతడు సినిమా ఓపెనింగ్ సీన్స్, పాట అయ్యాక బాజి రెడ్డి (కోట) తో మాట్లాడేటప్పుడు మహేష్ ఒక మాటంటాడు-“నాకు మర్డర్ చెయ్యడం వచ్చు కానీ మోసం చెయ్యడం రాదు”. ఈ మాటలోనే త్రివిక్రమ్ చెప్పకుండానే చాలా విషయాలు చెప్తాడు. ముఖ్యంగా అతడు సినిమా స్క్రీన్ ప్లే మీరు గమనించినట్టయితే మొదట్లో మహేశ్ బాబు పాత్ర హీరో కాదు. అతను యాంటీ హీరో. డబ్బులిస్తే ఎవర్నైనా చంపేస్తాడు. కానీ ఎవర్నీ మోసం మాత్రం చెయ్యడు. అతడు సినిమాలో ఆ విధంగా “మనుషులు చెడ్డవాళ్ళు కాదు. పరిస్థుతుల ప్రభావం కారణంగానే మనిషి చెడ్డవాడిగా మారుతాడు. అలాంటి చెడిపోయిన వ్యక్తిని అనుకూల పరిస్థుతులు కల్పిస్తే మంచి వాడిగా మారుతాడు” అనేది థీమ్ అని చెప్పుకోవచ్చు.
 • ప్రతిస్థాపన (Set-Up): ఈ సినిమా మొదట పది నిమిషాల్లోనే మహేశ్ బాబు ఒక కిల్లర్ గా చూపించారు.ఇక్కడే మిగిలిన పాత్రలైన సోనూ సూద్, రాహుల్ దేవ్ ని కూడా పరిచయం చేశారు. అలాగే బ్లేక్ చెప్పినట్టు “Every story has to have a problem”. సెటప్ లేదా ప్రతిస్థాపనలో కథ లోని ఈ ప్రాబ్లం లేదా హీరోకి రాబోయే సమస్యను ఎస్టాబ్లిష్ చెయ్యాలి. అతడు సినిమాలో హీరోకి ఏ సమస్యా ఉండదు. కానీ ఎప్పుడైతే షాయాజీ షిండే పబ్లిసిటీ స్టంట్ కోసం తన మీద తనే కాల్పులు జరపమని కోట శ్రీనివాసరావు కి ప్లాన్ చెప్తాడో అక్కడే హీరోకి సమస్య మొదలైంది.
 • ఉత్ప్రేరకము (Catalyst):కథలో సమస్య మొదలై హీరో ఆ సమస్యనుంచి బయటపడడానికి చేసే హీరోస్ జర్నీ యే సినిమా కథ. అయితే హీరో ని హీరోస్ జర్నీ కి పంపించడానికి ఒక catalyst లేదా ఉత్ప్రేరకము కావాలి. అతడు సినిమాలో ఈ catalyst ఎక్కడొస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కోట చెప్పిన అసైన్ మెంట్ ఒప్పుకుని షాయాజి షిండే మీద కాల్పులు జరపబోతుండగా వేరెవరో షాయాజీ ని కాల్చేస్తారు. దాంతో మహేశ్ వేసిన ప్లానంతా నాశనమై పోలీసులు తరుముతుండగా రైలెక్కి పారిపోతాడు. ఇక్కడే అంతవకూ ప్రశాంతంగా ఉన్న మన హీరో జీవితం హఠాత్తుగా మారిపోతుంది. మనలో మన మాటగా చెప్పాలంటే ఇక్కడే సినిమాలో ఫస్ట్ ట్విస్ట్ వస్తుందన్నమాట.
 • చర్చ (Debate) : ఇక హీరోస్ జర్నీ మొదలైపోయింది.అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. ఏ మనిషికైనా అనుమానాలుంటాయి. ఇప్పుడేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఎప్పుడూ సమస్యే. అలా అతడు సినిమాలో చిన్నప్పుడెప్పుడో ఇంట్లోనుంచి పారిపోయి చాలా ఏళ్ల తర్వాత తన వాళ్లని చూడ్డానికి ఇంటికి బయల్దేరిన రాజీవ్ కనకాల చనిపోగా అతని స్థానంలో మహేశ్ నాజర్ ఇంట్లో అడుగుపెడ్తాడు. ఇక్కడ ఉన్నంత సేపూ మన హీరోకి డిబేటే.చివరకి సునీల్ కి తన గురించి నిజం చెప్పే వరకూ కూడా మన హీరో లో ఈ సంఘర్షణ కనిపిస్తూనే ఉంటుంది.

Act 2 (రెండవ అకం)

 • ఇక మొదలు (Break into Two): మొదటి అంకంలో మన సినిమా హీరో ఎవరు, అతని సమస్య ఏంటి? అతని శత్రువులు ఎవరు? లాంటి విషయాలను సెటప్ చేసి రెండో అంకంలోకి మొదలు పెట్తడమే ఈ “ఇక మొదలు” స్టెప్. అతడు సినిమా కొస్తే మహేశ్ నాజర్ ఇంట్లోకి అడుగుపెట్టడడంతో మనం ప్రేక్షకులుగా కథ “ఇక మొదలు” అనుకుంటామన్నమాట. ఎప్పుడైతే మహేశ్ బాబు రాజీవ్ కనకాల ఇంటికి వచ్చి వాళ్లు తననే పార్థు అనుకుంటూన్నారని తెలిసీ వాళ్లకి నిజం చెప్పకుండా ఉండిపోవడంతో మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం.
 • ఉపకథ (B Story): బ్లేక్ చెప్పిన ప్రకారం ఉపకథ లేదా ఈ బి స్టోరీ అనేది చాలా సార్లు “ప్రేమ కథ” అయ్యుంటుంది. బ్లేక్ చెప్పినట్టుగానే అతడు సినిమాలో ఉప కథ మహేశ్-త్రిష ల మధ్య ప్రేమ కథ. The classic “B Story” usually begins when the hero proactively enters Act Two, turns left, looks across a crowded room, and there she is! She’s not only a guide, but the girl he’ll fall in love with! ఉప కథ అని పేరులో ఉన్నట్టుగానే మన అసలు కథ కు సంబంధం లేని కథ ఇది. అయినా కూడా హీరో పాత్రలో పరివర్తన రావడానికి ఉపయోగపడేది ఈ ఉప కథే! అనాధ గా ఉన్న మహేశ్ బాబు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో అడుగు పెట్టడమే కాకుండా సిటీ లోని క్రూరత్వానికి దూరంగా పల్లెటూరు కి రావడంతో మనం ఉప కథలోకి అడుగుపెట్టేశాం. నిజానికి మనం మొదట అంకంలో ప్రస్తావించిన థీమ్ కీ ఈ ఉపకథకూ ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ ఉప్ కథ ద్వారానే అనాథైన మహేశ్ కి ఫ్యామిలో జీవితంలో ఉన్న ఆనందం తెలిసొస్తుంది.
 • ఆటలు, పాటలు (Fun and Games): దాదాపుగా మనం చూసే అన్ని సినిమాల్లో ఒక హీరో ఉంటాడు. అతను లాస్ట్ ని విలన్ ని తుక్కు రేగ్గొడతాడు. అలాగే ఒక హీరో ఉంటాడు, ఒక హోరోయిన్ ఉంటుంది. వాళ్లిద్దరూ చివరకూ ఎలాగో కలుస్తారు. ఈ విషయాలన్నీ మనకి తెలిసినా మనం సినిమా ఎందుకు చూస్తామంటే ముఖ్యంగా ఈ బి స్టోరీ కోసమే. సినిమాలో వినోదం అంతా ఈ బి స్టోరీ లోనే ఉంటుంది. ఈ ఉప కథను ఎంత బాగా ట్రీట్ చెయ్యగలిగితే సినిమా అంతా బావుంటుందన్నమాట. ఉప కథలో మనం ముఖ్య కథకు కాసేపు ఆనకట్ట వేసేస్తాం. నిజానికి సినిమాలో వినోదాన్ని అందించేది ఈ సమయంలోనే. అంటే కథను కాసేపు పక్కన పెట్టేసి జనాల్ని వినోద పరుస్తూ కథ మెల్లగా ముందుకు సాగుతుంటుంది. ఆ విధంగానే అతడు సినిమాలో మహేశ్ నాజర్ ఇంటికి వచ్చాక అసలు కథ ని వదిలేసి, త్రిష తో సరదాలు, సునీల్ తో కామెడీ సీన్లు, తనెకెళ్ల భరణి, బ్రహ్మాజీతో గొడవలు ఇలా సాగిపోతూ ఉండగా సినిమాలో కీలకమైన నెక్స్ట్ స్టెప్ లోకి మనం అడుగుపెడ్తాం. అదే ఇంటర్వెల్ బ్యాంగ్ లేదా మిడ్ పాయింట్.
 • ఇంటర్వెల్ బ్యాంగ్ (Midpoint): హీరో హీరోయిన్ ఆటలు పాటలు అయ్యాక ఇక్కడ సినిమాలో జరిగే ఒక కీలకమైన ఘట్టం ద్వారా కథ పాకాన పడుతుంది. అంతే కాదు అప్పటివరకూ పక్కన పెట్టిన ముఖ్య కథ లో ఈ ఉప కథ కలుస్తుంది. అదే సినిమాకి మిడ్ పాయింట్. మన తెలుగు సినిమా పరిభాషలో చెప్పాలంటే “ఇంటర్వెల్ బ్యాంగ్” అన్నమాట. ఇక అతడు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సంగతి కొస్తే ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ప్రకాష్ రాజ్ తో మహేశ్ బాబు సీన్ గుర్తుండే ఉంటుంది. పల్లెటూర్లో నాజర్ ఇంట్లో హాయిగా హీరోయిన్ తో ఆటలు పాటలతో కాలక్షేపం చేస్తున్న హీరో జీవితం ప్రకాష్ రాజ్ రాకతో కొత్త మలుపు తిరుగుతుంది. ప్రకాష్ రాజ్ ని తెలివిగా బోల్తా కొట్టించినా అతనిలో అనుమానం రేకిత్తిస్తాడు. అలాగే దర్శకరచయిత త్రివిక్రం కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో రేకెత్తించి విశ్రాంతి కార్డ్ వేస్తాడు.

ఇక్కడితో సినిమా లో సగ భాగం పూర్తవుతుంది. ఇక్కడ వరకూ మన హీరో పిల్లిని రక్షించే విధానం బాగానే ఉంటుంది. సెకండాఫ్ లోనే Blake Snyder చెప్పిన థియరీస్ కి కొంచెం అందకుండా సాగుతుంది అతడు స్క్రీన్ ప్లే. అయినప్పటికీ బ్లేక్ చెప్పిన పాయింట్సన్నీ అతడు స్క్రీన్ ప్లే లో ఉన్నాయి. నిజానికి బ్లేక్ స్నైడర్ కూడా ఫస్టాఫ్ కోసం  స్ట్రక్చర్ సెట్ చేసినంతగా సెకండాఫ్ చెయ్యలేదనే నాకనిపించింది. అయినా కూడా స్క్రీన్ ప్లే రాసే సమయంలో ఈ పిల్లిని రక్షించే విధానం కేవలం ఒక గైడ్ లానే ఉపయోగపడుతుంది కానీ ఇది ఒక రూల్ బుక్ కాదు. ఈ సిస్టం లో ఉన్న లోటు పాట్లు, తెలుగు సినిమాకి దీనిని ఎలా అన్వయించుకోవచ్చో తర్వాత చర్చించుకుందాం. ముందు అతడు సినిమా స్క్రీన్ ప్లే రీ ఇంజనీరింగ్ లో భాగంగా ఇంటర్వెల్ తర్వాత భాగాన్ని విశ్లేషిద్దాం.

 • చీకట్లు ఇరులుకొన్న వేళ (Bad Guys Close In): ఇంటర్వెల్ బ్యాంగ్ లో సెట్ చేసిన momentum, pace ని కంటిన్యూ చేస్తూ హీరోకి మొదలైన కష్టాలను రెట్టింపు చేస్తూ వెళ్లడమే ఈ స్టెప్ లో చెయ్యాల్సిన పని. వీలైతే అతనికి external గా వచ్చే ఇబ్బందులు కన్నా, ఇంటర్నల్ గా కూడా తనతో తానే పోరాడే పరిస్థుతులు ఏర్పరిచినప్పుడు హీరో చివరాఖర్లో తను అనుకున్నది సాధించినప్పుడు, గమ్యం చేరినప్పుడు ప్రేక్షకులు కొట్టే చప్పట్ల సంఖ్య కూడా రెట్టింపవుతుంది. ఆ విధంగానే అతడు సినిమాలో మహేశ్ బాబు మీద అనుమానంతో ప్రకాశ్ రాజ్ మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ ఒక వైపు, అలాగే ఉప కథ లో ఉన్న తనికెళ్ల భరణి లాంటి విలన్స్ ఒక వైపు హీరో కి సమస్యలు సృష్టిస్తారు. అంటే ఇక్కడే హీరోకి చుక్కలు కనిపించడం మొదలవుతుందన్నమాట. కాకపోతే మన సూపర్ స్టార్ మహేశ్ కాబట్టి  అతడులో మరీ అంతగా చుక్కలు కనిపించేంతగా హీరోకి ఏమీ డేంజర్ ఉండదు. కాకపోతే ఇక్కడే హీరో త్రిష ని ప్రేమించాలా వద్దా అనే internal conflict తో కూడా సతమతమవుతూ ఉంటాడు.
 • అంతా పోయింది (All is Lost):  అలా మన హీరో చుట్టూ చీకట్లు కమ్ముకుంటుండగా గత కొన్ని నిమిషాల్లో జరిగిన సన్నివేశాలూ, విలన్ల కుట్రలు కుతంత్రాల కారణంగా హీరోకి నిజంగానే చుక్కలు కనిపించి “వారి నాయనో ఇక నా వల్ల కాదు” అని చేతులెత్తేసే ఒక సమయం వస్తుంది. దానే All is Lost అని అనొచ్చు. అతడు సినిమాలో కూడా ఇలానే జరుగుతుంది. ప్రకాశ్ రాజ్ వచ్చి మహేశ్ బాబు అసలు పార్థు కాదు అని చెప్పాక మహేశ్ అప్పటివరకూ దాచిపెట్టిన నిజం బయటపడిపోతుంది.
 • ఏకాకిత్వము (Dark Night of the Soul): అంతా పోయాక ఏమవుతుంది? ఈ స్టెప్ లో అదే జరుగుతుంది. “దేవుడా నాకే ఎందుకు ఇలా జరగాలి?” అని హీరో భోరున ఏడుస్తాడు.”ఇప్పుడేం చెయ్యాల్రా భగవంతుడా?” అని ప్రార్థిస్తాడు. అతడు సినిమాలో కూడా మహేశ్ బాబు ఇలానే నాజర్ మరియు కుటుంబ సభ్యుల ముందు నిల్చుని ఇలానే బాధపడతాడు. తను అబధ్దమాడాడే తప్ప మోసం చెయ్యలేదని వారి అందరి ముందు ఏకాకిగా తల వంచుతాడు. తనకింక వేరే అవకాశం లేదు అనుకుంటున్న హీరోకి నిజానికి ఒక కొత్త అవకాశం ఉందని తెలియచేసేదే నెక్స్ట్ స్టెప్.  దీంతో సినిమాలో ని రెండవ అంకము పూర్తవుతుంది.
Act 3 (మూడవ అంకం)
 • క్లైమాక్స్ కి రెడీ అవ్వండి (Break into Three): తనున్న కష్టాలనుంచి బయటపడే మార్గమే లేదని చేతులెత్తేసిన హీరోకి అనుకోకుండా ఒక సహాయం దొరుకుతుంది. అది కూడా ఉప కథ లోనుంచి వచ్చిన ఒక పాత్ర ఈ సహాయం చేస్తుంది. “క్లైమాక్స్ కి రెడీ అవ్వండి” అనే ఈ స్టెప్ ని అతడు సినిమాకు అన్వయించి చూసినట్టయితే అది కూడా Blake Snyder చెప్పిన దానికి సరిగ్గా సరిపోతుంది. నిజానికి ఈ అతడు స్క్రీన్ ప్లే రీ ఇంజనీరింగ్ చేస్తుంటే బహుశా త్రివిక్రమ్ కి ఆల్రెడీ పిల్లిని ఎలా రక్షించాలో తెలిసినట్టే ఉంది. సరే ఆ విషయం పక్కనపెడితే అతడు సినిమాలో ఉప కథలో కామిక్ రిలీఫ్ కోసం తప్ప కథ ముందుకు సాగడానికి పెద్దగా ఉపయోగపడని సునీల్ పాత్ర పెళ్లి మండపంలో నాజర్ మరియు అతని కుటుంబ సభ్యులకు మన హీరో గారి గొప్పతనం గురించి విడమరిచి చెప్పబట్టే మహేశ్ బాబు గొప్పతనం అందరికీ తెలిసొస్తుంది. ఆ విధంగా ఉప కథ లో నుంచి వచ్చిన సునీల్ హీరో కి తీగ అందించాడన్నమాట.
 • తుట్టతుద (Finale): ఇంకేముంది.దొరికిన చిన్న తీగ అందుకున్న హీరో డొంకంతా లాగి ఇక నుంచీ విలన్లను తుక్కు రేగ్గొట్టడమే సినిమా క్లైమాక్స్ అన్నమాట. ఆ విధంగా సినిమా తుట్టతద దశకు చే॑రుకోవడమే ఈ స్టెప్ లో ముఖ్యాంశం. ఈ భాగంలోనే హీరో విలన్లను ఎదుర్కోవడానికి ఒక పథకం తయారు చేసుకోవడం, వీలైతే విలన్లతో పోరాడ్డానికి ఒక టీం ని సమకూర్చుకోవడం చేస్తాడు. అతడు సినిమాలో ఈ భాగం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బాజి రెడ్డి కి ఫోన్ చేసి, సోనూ సూద్ చేసిన మోసం కనుక్కుని ఆ విషయాన్ని తెలివిగా టేప్ లో రికార్డ్ చేసి ప్రకాష్ రాజ్ కి ఆ టేప్ అందించి, చివరికి ఒక భీకరమైన పోరాట సన్నివేశంలో సోనూ సూద్ ని చంపడంతో కథ ముగుస్తుంది.
 • ఉపసంహారము (Final Image): నిజానికి సినిమా ముందు జరిగిన క్లైమాక్స్ సీన్ తోనే శుభం కార్డు వేసెయ్యొచ్చు. కానీ దాదాపు 90 శాతం సినిమాల్లో అలా జరగదు. క్లైమాక్స్ లేదా Finale అయిపోయాక ఇంకా ఒకటో రెండో సీన్స్ ఉంటాయి. వాటి ద్వారానే మనం ఓపెనింగ్ ఇమేజ్ లేదా మన కథకు నాంది పలికినప్పటి  ప్రపంచానికి, ఆ ప్రపంచంలో ఉన్న మన హీరో కి, సినిమా అంతా అయిపోయాక ఉన్న ప్రపంచానికి, అలాగే మన హీరోకి కొట్టొచ్చినట్టుగా తేడా ఉంది అని చూపించడమే ఈ ఉపసంహారము లేదా ఫైనల్ ఇమేజ్ యొక్క లక్ష్యం. అంటే Caterpillar లా ఉన్న మన హీరో సినిమా అంతా అయ్యే సరికి సీతాకోకచిలుక అయ్యాడని చూపెట్టకపోతే అసలు కథే దండగ. ఎందుకంటే మార్పు=కథ=మార్పు. All stories are about change. We start with a caterpillar, which, in the course of an adventure, “dies” by becoming a cocoon, and then is “reborn” to become something he never dreamed of! అతడు సినిమాలో పార్థు చితాభస్మం కలుపుతూన్న మహేశ్ బాబు ని చూపించడంతో పాటు, అతని మీద ఉన్న పాత కేసులేమవుతాయి అని ఆకతాయి ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రకాశ్ రాజ్ తో ఒక చిన్న సీన్ తో కథ కు ఉపసంహారం పలికి సినిమా ని ముగించాడు త్రివిక్రమ్.

అదండీ సంగతి. ఈ విధంగా Save the Cat అనేది ఎవరో హాలీవుడ్ వాళ్లు రాసుకున్న స్క్రీన్ ప్లే పుస్తకం కాదు. మన సినిమాకీ పనికొస్తుందని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఇది. నిజానికి అతడు సినిమా అంత perfect స్క్రీన్ ప్లే కాదనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో wafer thin ముఖ్య కథకు చాంతాడంత ఉప కథ ఉంది. అయినా కూడా అప్పటికే “హీరో పట్టణాన్నుంచి పల్లెటూరికి వెళ్లి హీరోయిన్ ఇంట్లోనే ఉంటూ ఆమె తో ప్రేమలో పడడం” అనే కథతో ఎన్నో సినిమాలు రావడం హిట్ కావడం జరిగిపోయి అదొక హిట్ ఫార్ములా అయ్యికూర్చుంది. త్రివిక్రమ్ అదే కథను మనకు మళ్లీ చెబుతూ హీరోయిన్ ఇంటికి హీరో ఎందుకు వచ్చాడనే పాయింట్ ని చాలా కొత్తగా చెప్పుకొచ్చాడు. ఆ విధంగా సినిమా నిడివి పరంగా చూస్తే ముఖ్య కథ కాసేపు, ఉప కథ చాలా సేపూ ఉంటుంది. అలాగే మొదటి భాగంలో అంటే ఇంటర్వెల్ కి ముందే అయిపోవాల్సిన ఉప కథ సినిమా ఆఖరు వరకూ నడుస్తుంది. ఇలా చెప్పుకుంటే కొన్ని వీక్నెస్ లు ఉన్నప్పటికీ మనకున్న స్క్రీన్ ప్లేస్ లో చాలా మంచి స్క్రీన్ ప్లేస్ లో ఒకటి అతడు అని చెప్పుకోవచ్చు.

ఇదంతా చదివాక మీరు కూడా ఏదైనా సినిమాని తీసుకుని ఇలాగే రీ ఇంజనీరింగ్ చేస్తే స్క్రీన్ ప్లే రచన నేర్చుకున్నట్టూ ఉంటుంది; దాంతో పాటు సరదాగా కూడా ఉంటుంది.

ప్రస్తుతానికి ఇంతేనండీ! కాకపోతే ఈ టూల్ ని ఎలా ఉపయోగించాలి? ఈ టూల్ లో ఉన్న ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలు,ఈ టూల్ లో ఉన్న లోటు పాట్లు మరియు కొన్ని చిన్నపాటి మార్పులతో దీనిని మన తెలుగు సినిమాకి ఎలా ఉపయోగించుకోవచ్చు లాంటి గురించి మరి కొన్ని వ్యాసాలు త్వరలోనే ప్రచురిస్తాం.

9 Comments
 1. Vicky M June 19, 2012 /
 2. ramarao peddi June 20, 2012 /
 3. Jeevan June 22, 2012 /
 4. SHASHIPAL REDDY RACHAMALLA June 25, 2012 /
 5. Vamsi June 26, 2012 /
 6. sonu June 28, 2012 /
 7. Durga July 4, 2012 /
 8. Venkat December 24, 2012 /
 9. T.S.Kaladhar December 29, 2012 /